ఏ మహనీయుల జయంతి వేడుకలైనా జరుపుకోవడం కేవలం వారిని స్మరించుకోడానికా? వారి ఆశయాలను అనుసరిస్తూ, మనను మనం ఉన్నతీకరించుకునే ఒక స్ఫూర్తి అవకాశంగా మలచు కోవడానికా? జవాబు మొదటిదే అయితే చర్చే లేదు! రెండోదయితేనే.. ఆత్మపరిశీలన చేసుకోవాలి. యేటా అక్టోబరు 2న మనం జాతిపిత బాపూజీ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. బాపూజీని ఎంతవరకు అనుసరిస్తున్నాము, ఆయన చేసిన కర్తవ్య బోధ, పాటించిన విలువలు, అనుసరించిన జీవనవిధానం మనను ఏ మేరకు ప్రభావితం చేసింది? అని ఎవరికి వారం ప్రశ్నించుకోవాలి. విశాల భారత దేశాన్ని ఏకతాటిపై నడిపి, మానవాళి చరిత్రలోనే అపురూపమైన మహోజ్వల స్వాతంత్య్రో ద్యమాన్ని శీర్షభాగాన నిలిచి నడిపించిన సమరశీలి!
సత్యం, శాంతి, అహింస, సహాయ నిరాకరణ ఆయుధాలుగా నిరసనకు ఓ కొత్త సాంకేతిక నిర్వచనం ఇచ్చి, త్రికరణశుద్ధిగా ఆచరించి చూపిన యోగి! అప్పటికే దక్షిణాఫ్రికాలో సంచలనం సృష్టించి భారత్‌కు తిరిగి వస్తూ, ముంబాయిలో అడుగు పెట్టే నాటికే గాంధీజీ విశ్వనరుడు. ఇక్కడ ఆయనను ఉద్యమ నాయకుణ్ణి చేసినవి నాటి పరిస్థితులు, అంతకుమించి ఆయన నిరాడంబరత–నిబద్ధతలు! భూగోళమంతా విస్తరించి, రవి అస్తమించని సామ్రాజ్యమనే ఖ్యాతి గడించిన బ్రిటీష్ పాలకులను భారత భూభాగం నుంచి బేషరతుగా పంపిం చిన ఘన విజేత! ‘సత్యాగ్రహం’ అనే సరికొత్త బాటలో నడిపారాయన. ఒక పిలుపు ఇస్తే దేశమంతా కదిలి వచ్చేది. ప్రజలు విదేశీ వస్తుబహిష్కరణ చేశారు, స్వదేశీ బట్టగట్టారు, ఉపవాసమున్నారు, లాఠీదెబ్బలు తిన్నారు, నెలల తరబడి జైళ్లలో మగ్గారు.
మధురై ప్రసంగంలో బీహార్ వరద బాధితుల ఆక్రందనల్ని ప్రస్తావించి, ‘వారూ మన సోదరులే... అన్నీ పోగొట్టుకొని నిరాశ్రయులయ్యారు, మనం చేతనైన సాయం చేద్దాం’ అని గాంధీజీ అంటే, అక్కడికక్కడ పౌరులు జేబుల్లో ఉన్న డబ్బుతో పాటు ఒంటిమీదున్న నగలూ, నట్రా కుప్పపోశారు. ఆ రోజుల్లో ఆయన మాట అలా ఒక సమ్మోహన శక్తి అయింది. స్వాతంత్య్రంతో పాటు ఆ క్రమంలో గాంధీజీ సాధించిన ఓ అసాధారణ ఫలితమే మంటే సగటు భారతీయుల వ్యక్తిత్వాన్ని మహోన్నత స్థాయికి పెంచడం! నిజమైన దేశభక్తి, జాతీయ వాదం, నిజాయితీ, మానవత్వం వంటి విలువల్ని ‘జీవన విధానం’ అనే లంకెతో గాంధీజీ సూత్ర బద్దం చేశారు. స్వాతంత్య్రానంతరం ఒకట్రెండు దశాబ్దాల పాటు దాదాపు అన్ని రంగాల్లోనూ అది ప్రతిఫలించింది. రాజకీయ నాయకుల నుంచి సామాజికవేత్తలు, వర్తకులు, వ్యాపారులు, పారి శ్రామికవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు, వకీళ్లు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వోద్యోగులు... ఇలా సమాజంలోని సమస్త వర్గాలవారు విలువలతో పనిచేశారు.
‘మేం వెళ్లిన మరుక్షణం మీ దేశం నిలువదు, ముక్క చెక్కలవుతుంది’ అన్న బ్రిటిష్‌వాడి మాటల్ని వమ్ము చేసి, భారత్ ఎదగడమన్నది గాంధీజీ సాధించిన ఒంటిచేతి విజయఫలం! కానీ, ఇవాల్టి పరిస్థితి.. అందుకు పూర్తి భిన్నంగా, ఎంతో దయనీయంగా ఉంది. కారణం, మనం గాంధేయవాదానికి ఆచరణలో తిలోదకాలిచ్చాం. అందుకే, గాంధీజీ– ఆయన విధానాల అవసరం ఆయన కాలంలో కన్నా నేడే ఎక్కువ! స్వప్రయోజనాలకో, లోతైన అవగాహన లేకో... గాంధీజీని, ఆయన విధానాల్ని విమర్శిస్తూ, వివాదాస్పదం చేసే వ్యక్తులు, గుంపులు తర్వాత్తర్వాత మొదలయ్యాయి. ఏ విషయంపైనా ఇంచ్‌కి మించిన లోతు అవగాహన లేని అల్లరి, అజ్ఞానపు మూకల్ని మాత్రమే వారు ప్రభావితం చేయగలరు. ‘రక్తమాంసాలతో ఇలాంటి ఒక మనిషి నేలపై నడయాడాడు అంటే భవిష్యత్తరాలు నమ్మవు’ అని గాంధీజీ జీవన విధానాల్ని కీర్తించిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మాటల ముందు ఈ పిల్లచేష్టలు చల్లబడతాయి. ‘గాంధీ జీయే నాకు స్ఫూర్తి’ అన్న మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) విశ్వాసం ముందు విమర్శలు వీగి పోతాయి.
‘ప్రజాస్వామ్య పోరాటాలకు ప్రతీక గాంధీ, తరతరాల మానవాళికి మార్గదర్శి’ అన్న నెల్సన్ మండేలా ప్రశంస విమర్శకుల నోళ్లు మూయిస్తుంది. ఈ కాలపు అమెరికా ప్రొఫెసర్ జెనె షార్ప్ ‘డిక్టేటర్‌షిప్ టు డెమాక్రసీ’ అనే పుస్తక ప్రభావం పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలె న్నింట్లోనో ప్రజాస్వామ్య నవ వసంత వీచికలకు కారణమైంది. బలోపేతంగా కనిపించే నియంతృత్వ ప్రభుత్వాలు కూడా, సరైన పంథాలో ఉద్యమాలు నడిపితే... ‘ఒక ఇటుక లాగితే కుప్పకూలే భవ నాల్లా’ కూలి నేలమట్టమవుతాయని రాసిన జెనెషార్ప్, గాంధేయవాదంలో ఆ సత్తావుందని పుస్త కంలో పలుమార్లు ఉటంకించారు.
గాంధీజీ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని, మనమంతా గాంధేయవాదాన్ని అలవర్చుకోవాలి. ముఖ్యంగా యువ రాజకీయ నాయకత్వం ఆయన బాటలో సాగితే అద్భుతమైన ఫలితాలుంటా యనడానికి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ వ్యవస్థ కళ్లెదుటి సాక్ష్యం. గాంధీజీ కలలు కన్న ‘గ్రామస్వరాజ్యం’ సాకారమౌతున్న జాడలు రెండేళ్లలోనే మొదలయ్యాయి. ఏ ఏడు సామాజిక పాపాలు గాంధీజీ వద్దన్నాడో, అవే ఇపుడు దేశమంతా బలపడుతున్నాయి.
శ్రమలేకుండా గడించే సంపద, అంతరాత్మ ఒప్పని విలాసాలు, వ్యక్తిత్వం ఇవ్వని జ్ఞానం, విలువల్లేని వ్యాపారం, మానవత చూపని విజ్ఞానం, త్యాగం లేని మతం, సిద్దాంతాలకు లోబడని రాజకీయాలు వద్దంటే వద్దన్నాడా యన. ఆ పాపాలే రాజ్యమేలుతున్న దుష్టకాలమిది. దీన్నుంచి బయటపడటానికి మళ్లీ గాంధీ, గాంధేయ విధానాలే మనకు మార్గం. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో అక్షరాలా గాంధేయ వాదముంది. వ్యక్తి క్రమశిక్షణ ప్రధానమని గాంధీ నొక్కి చెప్పారు. ఎవరి స్థాయిలో వారం పాటిం చాలి. ఆయనే చెప్పినట్టు ‘మనం ఆశించే మార్పు, మననుంచే మొదలవ్వాలి’!
Comments
Please login to add a commentAdd a comment