‘స్వేచ్ఛ’ అంటే కేవలం రెండక్షరాలు కాదు, దిగంతాలను కొలిచే పక్షికి రెండు రెక్కలు;భూమండలాన్ని చుట్టే మనిషికి రెండు పాదాలు; స్వేచ్ఛ అంటే ఒక నిర్నిబంధమైన మాట; ఒక స్వతంత్రమైన చేత. హద్దులేని ఆకాశమూ, అంతులేని భూమండలమూ స్వేచ్ఛాసంచారానికి ప్రకృతి చేసిన ఏర్పాట్లు. ప్రకృతి నిఘంటువులో మొదటి మాటా, చివరి మాటా స్వేచ్ఛే! ఎగిరే పక్షిని ఏ వేటగాడి బాణమో పడగొట్టినప్పుడూ, నడిచే మనిషి కాళ్ళకు ఏ నిరంకుశపు సంకెళ్ళో పడినప్పుడూ, ఏ నిషేధాల కత్తుల బోనులోనో మాట బందీ అయినప్పుడూ అది అక్షరాలా ప్రకృతి మీద జులుము, ప్రకృతి ఏర్పాటు మీద దాడి. స్వేచ్ఛ రెక్క విరిచిన రోజు వచ్చి వెడుతూ, దాని విలువను మరోసారి గుచ్చి చెప్పింది.
చెరబడ్డప్పుడు తప్ప సాధారణ పరిస్థితుల్లో పూర్తిగా గుర్తించలేని విలువ స్వేచ్ఛ. అడవుల పాలైన ధర్మరాజుకు ఆ విలువ తెలుసు. మనిషికి ఆనందమిచ్చేది ఏదని యక్షుడు అడిగినప్పుడు ప్రవాసంలో కాకుండా స్వవాసంలో ఉండడమేనంటాడు. పరాయి పాలనలో వ్యధార్త జీవితాలు గడిపిన నిన్నమొన్నటి మన స్వాతంత్య్ర సమరయోధులకు, ఇతర బుద్ధిజీవులకే కాదు; సామాన్య జనానికి సైతం స్వేచ్ఛ విలువ తెలుసు. ‘స్వేచ్ఛ మన ఊపిరి’ అంటాడు మహాత్మాగాంధీ. ఊపిరి నిలుపుకోవడానికి ఎంత మూల్యమైనా చెల్లించవలసిందే.
‘ఎక్కడ మనసు నిర్భయమవుతుందో, ఎక్కడ తలెత్తుకుని ఉండగలమో, ఎక్కడ జ్ఞానం శృంఖలాబద్ధం కాదో, ఎక్కడ సంకుచితపు గోడలతో ప్రపంచం ముక్కముక్కలు కాదో, ఎక్కడ మాట సత్యపు లోతుల్లోంచి జాలువారుతుందో, ఎక్కడ శ్రమించే చేతులు పరిపూర్ణత వైపు బారలు చాచగలవో, ఎక్కడ హేతుత్వమనే స్వచ్ఛ స్రవంతి దారి తప్పకుండా ఉంటుందో...’ అలాంటి స్వేచ్ఛాయుత ప్రపంచం కోసం విశ్వకవి టాగోర్ పరితపిస్తాడు. మానసిక స్వేచ్ఛనే నిజమైన స్వేచ్ఛగా బాబా సాహెబ్ అంబేడ్కర్ అభివర్ణిస్తాడు. సంకెళ్లలో లేకపోయినా స్వేచ్ఛాయుత చింతన లేనివాడు బానిసే తప్ప స్వతంత్రజీవి కాడనీ, జీవన్మృతుడనీ అంటాడు.
‘మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవి, కానీ ప్రతిచోటా సంకెళ్ళలో చిక్కుకున్నా’డన్న రూసో నిర్వచనం ఎంతైనా నిజం. స్వేచ్ఛా, మనిషీ కలిసే పుట్టారు. ఆధిపత్యాలు, అంకుశాలు, అణచివేతలు తర్వాత వచ్చాయి. దేశాల హద్దులూ, వీసాల నిర్బంధాలూ లేని కాలంలో మనిషి స్వేచ్ఛగా భూమండలమంతా కలయదిరిగాడు. అందుకే ప్రపంచంలోని ప్రతి తావూ అతని చిరునామా అయింది. సంస్కృతీ, నాగరికతలను సంతరించుకున్న తర్వాతా; భాషాభేదాలూ, ప్రాంతాల తేడాలూ, జాతీయతా వాదాలూ పొటమరించిన తర్వాతా అతని స్వేచ్ఛాగమనానికి అడ్డుగోడలు లేచాయి.
అదొక విచిత్ర వైరుద్ధ్యం. వేల సంవత్సరాల క్రితం జరిగిన జన్యుపరివర్తన కారణంగా గొంతుముడి వీడి మనిషి మాట్లాడగలిగిన దశకు చేరాడంటారు. అప్పుడు తన ఆనందోద్వేగాలను ఎంత స్వేచ్ఛగా గొంతెత్తి ప్రకటించుకుని ఉంటాడో! క్రమంగా తన మాటను రకరకాల నిషేధాలూ, నిర్బంధాల కత్తివేటూ భయపెట్టినప్పుడు స్వేచ్ఛనుడిగి మూగవోయిన దుఃఖచరిత్ర అతనిది.
పురాణకాలం నుంచి నవీనకాలం వరకూ ఏ ఘట్టంలోనూ స్వేచ్ఛారాహిత్యంతో రాజీపడని ధిక్కారచరిత్రా అతనికుంది. తన సహజస్వేచ్ఛపై అత్యాచారం శ్రుతిమించిన ప్రతిసారీ అగ్గిరవ్వ అయ్యాడు. చండశాసనం ఉన్నచోట దాని అతిక్రమణా ఉండితీరుతుందనడానికి రామాయణమే సాక్ష్యం. హనుమంతుడు సీతను చూసొచ్చిన తర్వాత సంబరం పట్టలేకపోయిన వానర సమూహం కిష్కింధలోని మధువనంలోకి జొరబడి అక్కడి తేనెతో విందు చేసుకుని, మత్తిల్లి వనాన్ని ధ్వంసం చేస్తారు. ఆ క్షణంలో వారిలో పురివిప్పిన స్వేచ్ఛాసహజాతం చండశాసనుడైన తమ ఏలిక సుగ్రీవుడు దండిస్తాడన్న భయాన్ని కూడా జయించింది.
పీడనకూ, పెత్తనానికీ గురవుతున్నాసరే తమ సహజసిద్ధమైన స్వేచ్ఛాదాహాన్ని తీర్చుకునేందుకు మనిషి అవకాశాలు వెతుక్కుంటూనే ఉంటాడు. ఆ మేరకు పెత్తందార్లకూ, పీడితులకూ మధ్య రాజీ ఏర్పాట్లు కూడా ఉండేవి. ఈ సందర్భంలో ప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత రాంభట్ల కృష్ణమూర్తి తన ‘సొంతకథ’లో ‘వాలకం’ అనే ప్రదర్శన రూపాన్ని ప్రస్తావిస్తారు.
గౌరమ్మ సంబరాలప్పుడు కొంతమంది గ్రామస్తులు ఊళ్ళోని మోతుబరుల వేషంకట్టి వారి నడకను, నడవడిని అనుకరిస్తూ పాటల రూపంలో వారిపై ఆక్షేపణను చాటుకోవడమే ‘వాలకం’. ఒక్కోసారి ఆగ్రహించి మోతుబరులు దేహశుద్ధి చేయడం గురించీ ఆయన రాస్తారు. ఈ శతాబ్ది ప్రారంభంలో ఇలాంటి ప్రదర్శన అమెరికాలోనూ ఉండేదనీ, దానిని వాడెవిల్ అంటారనీ, చార్లీ చాప్లిన్ ఇందులో ప్రసిద్ధుడనీ ఆయన అంటారు. పురాతన సుమేరు సమాజంలో జనం ఎలాంటి నిర్బంధాలూ, నిబంధనలూ లేని స్వేచ్ఛను అనుభవించడానికి ఏటా వారం రోజులు కేటాయించేవారు.
అలాగని స్వేచ్ఛ అంటే ఎలాంటి అదుపాజ్ఞలూ లేని ఇచ్ఛావిహారం కాదు. సమష్టి శ్రేయస్సు కోసం స్వీయ నియంత్రణలో ఉంచుకోవలసిన బాధ్యత కూడా! పాలకులు, పాలితుల వ్యవహరణలో ఎక్కడ తూకం తప్పినా దెబ్బతగిలేది స్వేచ్ఛకే! నిరంతర అప్రమత్తతే స్వేచ్ఛకు చెల్లించే మూల్యం.
‘స్వేచ్ఛ’యను రెండక్షరములు...
Published Mon, Jun 26 2023 3:05 AM | Last Updated on Mon, Jun 26 2023 3:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment