ఉదయం ఎనిమిదిన్నర తర్వాత మీరు టాయిలెట్‌లో ఫ్లష్ చేయకూడదు. తల్లితో ముద్దుగా పోట్లాడకూడదు. నడిచి వెళ్లి తండ్రి ఒళ్లో కూర్చోకూడదు. చిన్న బొమ్మకారు ఉంటే దానిని నేల మీద జూయ్ జూయ్‌మని వదలకూడదు. మాట పలక్కూడదు. శ్వాస బలంగా తీయకూడదు. మీరు బతికే ఉంటారు. కానీ మీరు బతికి ఉన్నట్టుగా తెలియకూడదు. గాలి, వెలుతురు రాని చిన్న గదుల్లో దాక్కుని ఉంటారు. కిటికీలో నుంచి తొంగి చూసే స్వేచ్ఛను కోల్పోయి ఉంటారు.
బయట ఏమి జరుగుతున్నదో మీకు తెలియనే తెలియదు. రాత్రిళ్లు ఉండి ఉండి బాంబులు దద్దరిల్లుతాయి. సైరన్లు వికృతంగా మోగుతాయి. మర ఫిరంగులు విరేచనాలు చేసుకుంటాయి. ఎవరో ఎప్పటికీ కనిపించని కొందరు మనుషులు బాధగా కేకలు వేస్తారు. మీరు అనుక్షణం భయంలో ఉంటారు. తలుపును ఎవరైనా తడితే ఉలిక్కి పడతారు. చావు దాపునే గుసగుసలాడుతూ ఉంటుంది. ఇలాంటి నిర్బంధంలో మీరు ఎన్ని గంటలు ఉండగలరు? ఎన్ని నిమిషాలు ఉండగలరు? ఎన్ని సెకన్లు జీవనకాంక్షతో బతకగలరు?
కాని ఒక పద్నాలుగేళ్ల బాలిక ఎన్నాళ్లు అలా ఉందో తెలుసా? 761 రోజులు. మనుషుల మీద ఎంత విశ్వాసం ఉంచుకుందో తెలుసా? 714 పేజీలు. ‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’గా జగద్విఖ్యాతమైన ‘ఆనా ఫ్రాంక్ డైరీ’ హిట్లర్ నరమేధకాలంలో రెండేళ్ల పాటు లిఖించబడి నేటికీ ప్రపంచం మొత్తాన్ని కదిలిస్తూనే ఉంది. కన్నీరు కార్చేలా చేస్తూనే ఉంది. మానవత్వం కోసం ప్రాధేయపడుతూనే ఉంది.
‘నేను నా చుట్టూ ఉన్న వాళ్లనే కాదు... ఎప్పుడూ ఎరగని వాళ్లను కూడా సంతోషంగా ఉంచదలుచుకున్నాను’ అని రాసుకుంది ఆనా ఫ్రాంక్ తన డైరీలో. జూన్ 12, 1942న ఆనా ఫ్రాంక్ 13వ జన్మదినాన ఆమె తండ్రి ఎర్ర రంగు చెక్స్ ఉన్న డైరీని బహూకరిస్తాడు. ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి వలస వచ్చి ఆమ్‌స్టర్‌డామ్‌లో స్థిరపడ్డ ఆ యూదు కుటుంబంలో ఆనా కుదురులేని పిల్ల. ఆకాశాన్ని గాలిపటంగా ఎగరేద్దామనుకనే గడుగ్గాయి.
గెంతులేసే గొర్రెపిల్ల కనిపించినా, కొమ్మలూపే చెట్టు కనిపించినా, హాయిగా నవ్వే మనిషి కనిపించినా పులకించిపోయే అమలిన శిశువు. కానీ రెండో ప్రపంచ యుద్ధం మొదలైన మూడేళ్లకు నాజీ సేన నెదర్లాండ్స్‌ను హస్తగతం చేసుకుంది. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న యూదులకు నరకలోక ద్వారాలు తెరిచింది. ఆనా ఫ్రాంక్ అక్క 16 ఏళ్ల మార్గోట్‌కు జర్మనీలోని నాజీ క్యాంప్‌లో రిపోర్ట్ చేయమని జూలై 5, 1942న తాఖీదు ఇవ్వబడినది. అంటే ఏమిటో ఆ యూదు కుటుంబానికి తెలుసు.
ఆ రాత్రే తండ్రి ఆనా ఫ్రాంక్‌ను పిలిచి ‘మనం ఇల్లు విడుస్తున్నాం. నీ స్కూల్ బ్యాగ్‌లో పట్టేన్ని వస్తువులే పెట్టుకో’ అంటాడు. ఆ మరుసటి తెల్లవారుజామున చినుకులు పడుతూ ఉండగా కట్టుబట్టలతో తల్లిదండ్రులు, అక్క, డైరీని దాచుకున్న స్కూల్ బ్యాగ్‌తో ఆనా బెదురు అడుగులు వేస్తూ అదే ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఒక దినుసుల కర్మాగారంలో రహస్య గదుల్లోకి చేరుతారు. ఆ భవంతిలో బుక్‌ర్యాక్‌లా కనిపించే తలుపు వెనుక రెండు రహస్య గదులు ఉంటాయి. మళ్లీ నాజీ పోలీసులకు పట్టుబడే– ఆగస్టు 4, 1944 వరకూ అంటే రెండేళ్ల 35 రోజులు వాటిలో ఉండిపోతారు. ఆ మొత్తం రోజులకు ఆ బాలిక ఆనా ఫ్రాంక్‌కు తోడుగా నిలిచింది ఆ డైరీ. ఆమె గుర్తుగా ప్రపంచానికి మిగిలింది ఆ డైరీ.
‘ఇంత చేస్తున్నా, ఇంత చూస్తున్నా మనిషి మంచివాడనే నేను నమ్ముతాను’ అని రాసుకుంది ఆనా తన డైరీలో. అవును. మనిషి మంచివాడే. కానీ ప్రమాదకరమైన ప్రభావాలకు బానిస. మూక మనస్తత్వానికి సాధనం. పాలనాపరమైన సమర్ధింపు ఉందని భావిస్తే చెలరేగే క్రూరమృగం. హిట్లర్, అతని విద్వేష ప్రభావానికి లోనైన నాజీలు 1941–1945 మధ్య 60 లక్షల మంది యూదులను జాతిహననం చేసి ఆ మాటే నిరూపించారు.
కోటిన్నర మంది యూదులు తమ కుదుళ్లు, కుటుంబాలు, విశ్వాసాలు, ఆశలు – సమస్తం కోల్పోయి జీవచ్ఛవాలుగా మిగిలారు. ఆ సమయంలోనే ఏనాటికైనా స్వేచ్ఛను పొందుతామేమోనని పిచ్చెక్కకుండా, ఆత్మహత్య చేసుకోకుండా, లొంగిపోకుండా బతికిన ఆనా ఫ్రాంక్ కుటుంబం చివరకు పోలీసుల కంట పడనే పడింది.
పాపం బంగారు తల్లి ఆనా, తన కలలూ ఆకాంక్షలూ మనుషులను చూసి పొందిన అచ్చెరువులూ అరెస్టు వేళ పోలీసులు నేలన పారేసిన డైరీలో నిక్షిప్తం చేసి నవంబర్ 1, 1944న కాన్సన్‌ట్రేషన్ క్యాంపుకు తరలించబడింది. మొదట తల్లి మరణించగా, తర్వాత సోదరి మరణించగా, బురదమయమైన తినడానికి తిండి లేని, చలి నుంచి రక్షించడానికి గుడ్డపేలిక లేని కాన్సన్‌ట్రేషన్ క్యాంపులో 1945 ఫిబ్రవరి–మార్చిల మధ్యన విష జ్వరంతో మరణించింది. ఆ క్షణాన ఆమె తన మనసులో ఏమి రాసుకున్నదో తెలియదు. ఆ రాయని డైరీ చదివితే మనిషి జన్మ ఎత్తినందుకు మనం ఎంత సిగ్గుపడతామో ఏమో!
1947లో ఆనా ఫ్రాంక్ డైరీ మొదటిసారిగా డచ్ భాషలో ప్రచురితమైంది. నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచమంతా ఆ మనోహరమైన బాలికను తలుచుకుంటూ ఉంది. ఇన్నేళ్లలో 70 భాషల్లో అనువాదమయ్యి లక్షల కాపీలు అమ్ముడుపోయిన ఆ డైరీ సారమంతా ఒక్కటే – మానవత్వం! ఈ కాలం మళ్లీ రాకూడదు. ఇలాంటిది ఏ నేలనా సంభవించకూడదు. ఇలాంటి బతుకు భయం ఎప్పటికీ కలగకూడదు. మాటిమాటికీ వీధుల్లోకి తొంగి చూసి మనుషులకు స్నేహంగా చేయి ఊపాలనుకునే ఏ చిన్నారీ ఇలాంటి డైరీ రాయకూడదు. ఎప్పటికీ ఇలాంటి డైరీ వద్దే వద్దు!
మళ్లీ రాయకూడని డైరీ
Published Mon, Jun 27 2022 12:27 AM | Last Updated on Mon, Jun 27 2022 12:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment