Charlie Chaplin
-
Naba Natesh: లెజెండ్రీ నటుడికి నివాళిగా.. నబా నటేష్ ఇలా మారిపోయింది! (ఫోటోలు)
-
సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రభుదేవా కొత్త సినిమా!
ఇంతకు ముందు ప్రభుదేవా కథానాయకుడిగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన చార్లీ చాప్లిన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రం తెలుగు, ములయాళం, కన్నడం, హిందీ భాషల్లో రీమేక్ అయ్యి హిట్ అయ్యింది. కాగా ఇదే కాంబినేషన్లో నూతన చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ప్రభుదేవా సరసన మడోనా సెబాస్టియన్ నటించగా, యాషిక ఆనంద్, అభిరామి, యోగిబాబు, రెడిన్ కింగ్స్ లీ, వైజీ.మహేంద్రన్, ఆడుగళం నరేన్, జాన్ విజయ్, మధుసూదన్ రావ్, రోబో శంకర్, సాయి దీనా, ఎంఎస్ భాస్కర్, డాక్టర్ శివ, కల్లూరి వినోద్, కోదండం, ఆదిత్యా కదీర్, ఆదవన్, తెలుగు నటుడు రఘుబాబు, పూజిత పొన్నాడ, మరియా, అభి భార్గవన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ట్రాన్సిండియా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎం.రాజేంద్ర రాజన్ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. ఈయన ఇంతకు ముందు నాగేశ్ తిరిగి అరంగం చిత్రంతో పాటు ఒక మరాఠీ చిత్రాన్ని నిర్మించారు. కాగా తాజా చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ తెన్‌కాశీ, కొడైక్కానల్ పరిసర ప్రాంతాల్లోని సుందరమైన ప్రదేశాల్లో షూటింగ్‌ను నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడనటువంటి సన్నివేశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. చిత్రంలో స్క్రీన్ ప్లే, సంగీతం హైలైట్ గా ఉంటాయన్నారు. త్వరలోనే టైటిల్‌ను ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తామన్నారు. దీనికి గణేష్ చంద్ర ఛాయాగ్రహణం, అశ్విన్ వినాయక మూర్తి సంగీతాన్ని అందించారు. -
చార్లీ చాప్లిన్ కూతురు మృతి.. ప్రకటనపై పలు అనుమానాలు
యావత్ ప్రపంచాన్ని తన నటనతో కట్టిపడేసిన హాస్యనటుడు చార్లీ చాప్లిన్ తెలియని వారు ప్రపంచంలో ఎవరూ ఉండరు. తన కూతురు నటి జోసెఫిన్ చాప్లిన్ మరణించారని వారి కుటుంబసభ్యులు ప్రకటించారు. ఆమె వయస్సు 74. కుటుంబ సభ్యులు తెలుపుతున్న ప్రకారం.. జూలై 13న పారిస్‌లో మరణించారని పేర్కొన్నారు. ఆమె మృతి వెనుక కారణం ఇంకా వారు వెల్లడించలేదు. సుమారు 10రోజులు క్రితమే ఆమె చనిపోతే ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచారని తెలియాల్సి ఉంది. ఆమె హాలీవుడ్లో ది కాంటర్బరీ టేల్స్ , డౌన్ టౌన్,ది బే బాయ్ వంటి పదికి పైగా చిత్రాల్లో నటించారు. జోసెఫిన్ చాప్లిన్ మార్చి 28, 1949న కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో చార్లీ చాప్లిన్, ఊనా ఓ'నీల్లకు జన్మించిన ఎనిమిది మంది సంతానంలో మూడవ వ్యక్తి. (ఇదీ చదవండి: అక్కా పిల్లల్ని ఎప్పుడు కంటారంటూ శివ జ్యోతి భర్తపై దారుణమైన కామెంట్లు) ఆమె తన తండ్రి చార్లీ చాప్లిన్ 1952 లైమ్‌లైట్‌లో కొనసాగుతున్న సమయంలోనే సినీరంగ ప్రవేశం చేసింది. 1969లో నికోలస్‌ను పెళ్లి చేసుకుని 1977లో అతని నుంచి విడాకులు తీసుకున్నారు. తర్వాత తను పలు సినిమాలతో బిజీగా ఉంటూ.. సుమారు పదేళ్ల తర్వాత 1989లో జీన్ క్లూడ్ గార్డెన్‌ను వివాహం చేసుకుంది. అతను 2013లో అనారోగ్యంతో మరణించారు. ఆమెకు ముగ్గురు కుమారులు చార్లీ, ఆర్థర్, జూలియన్ రోనెట్లు ఉన్నారు. -
‘స్వేచ్ఛ’యను రెండక్షరములు...
‘స్వేచ్ఛ’ అంటే కేవలం రెండక్షరాలు కాదు, దిగంతాలను కొలిచే పక్షికి రెండు రెక్కలు;భూమండలాన్ని చుట్టే మనిషికి రెండు పాదాలు; స్వేచ్ఛ అంటే ఒక నిర్నిబంధమైన మాట; ఒక స్వతంత్రమైన చేత. హద్దులేని ఆకాశమూ, అంతులేని భూమండలమూ స్వేచ్ఛాసంచారానికి ప్రకృతి చేసిన ఏర్పాట్లు. ప్రకృతి నిఘంటువులో మొదటి మాటా, చివరి మాటా స్వేచ్ఛే! ఎగిరే పక్షిని ఏ వేటగాడి బాణమో పడగొట్టినప్పుడూ, నడిచే మనిషి కాళ్ళకు ఏ నిరంకుశపు సంకెళ్ళో పడినప్పుడూ, ఏ నిషేధాల కత్తుల బోనులోనో మాట బందీ అయినప్పుడూ అది అక్షరాలా ప్రకృతి మీద జులుము, ప్రకృతి ఏర్పాటు మీద దాడి. స్వేచ్ఛ రెక్క విరిచిన రోజు వచ్చి వెడుతూ, దాని విలువను మరోసారి గుచ్చి చెప్పింది. చెరబడ్డప్పుడు తప్ప సాధారణ పరిస్థితుల్లో పూర్తిగా గుర్తించలేని విలువ స్వేచ్ఛ. అడవుల పాలైన ధర్మరాజుకు ఆ విలువ తెలుసు. మనిషికి ఆనందమిచ్చేది ఏదని యక్షుడు అడిగినప్పుడు ప్రవాసంలో కాకుండా స్వవాసంలో ఉండడమేనంటాడు. పరాయి పాలనలో వ్యధార్త జీవితాలు గడిపిన నిన్నమొన్నటి మన స్వాతంత్య్ర సమరయోధులకు, ఇతర బుద్ధిజీవులకే కాదు; సామాన్య జనానికి సైతం స్వేచ్ఛ విలువ తెలుసు. ‘స్వేచ్ఛ మన ఊపిరి’ అంటాడు మహాత్మాగాంధీ. ఊపిరి నిలుపుకోవడానికి ఎంత మూల్యమైనా చెల్లించవలసిందే. ‘ఎక్కడ మనసు నిర్భయమవుతుందో, ఎక్కడ తలెత్తుకుని ఉండగలమో, ఎక్కడ జ్ఞానం శృంఖలాబద్ధం కాదో, ఎక్కడ సంకుచితపు గోడలతో ప్రపంచం ముక్కముక్కలు కాదో, ఎక్కడ మాట సత్యపు లోతుల్లోంచి జాలువారుతుందో, ఎక్కడ శ్రమించే చేతులు పరిపూర్ణత వైపు బారలు చాచగలవో, ఎక్కడ హేతుత్వమనే స్వచ్ఛ స్రవంతి దారి తప్పకుండా ఉంటుందో...’ అలాంటి స్వేచ్ఛాయుత ప్రపంచం కోసం విశ్వకవి టాగోర్ పరితపిస్తాడు. మానసిక స్వేచ్ఛనే నిజమైన స్వేచ్ఛగా బాబా సాహెబ్ అంబేడ్కర్ అభివర్ణిస్తాడు. సంకెళ్లలో లేకపోయినా స్వేచ్ఛాయుత చింతన లేనివాడు బానిసే తప్ప స్వతంత్రజీవి కాడనీ, జీవన్మృతుడనీ అంటాడు. ‘మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవి, కానీ ప్రతిచోటా సంకెళ్ళలో చిక్కుకున్నా’డన్న రూసో నిర్వచనం ఎంతైనా నిజం. స్వేచ్ఛా, మనిషీ కలిసే పుట్టారు. ఆధిపత్యాలు, అంకుశాలు, అణచివేతలు తర్వాత వచ్చాయి. దేశాల హద్దులూ, వీసాల నిర్బంధాలూ లేని కాలంలో మనిషి స్వేచ్ఛగా భూమండలమంతా కలయదిరిగాడు. అందుకే ప్రపంచంలోని ప్రతి తావూ అతని చిరునామా అయింది. సంస్కృతీ, నాగరికతలను సంతరించుకున్న తర్వాతా; భాషాభేదాలూ, ప్రాంతాల తేడాలూ, జాతీయతా వాదాలూ పొటమరించిన తర్వాతా అతని స్వేచ్ఛాగమనానికి అడ్డుగోడలు లేచాయి. అదొక విచిత్ర వైరుద్ధ్యం. వేల సంవత్సరాల క్రితం జరిగిన జన్యుపరివర్తన కారణంగా గొంతుముడి వీడి మనిషి మాట్లాడగలిగిన దశకు చేరాడంటారు. అప్పుడు తన ఆనందోద్వేగాలను ఎంత స్వేచ్ఛగా గొంతెత్తి ప్రకటించుకుని ఉంటాడో! క్రమంగా తన మాటను రకరకాల నిషేధాలూ, నిర్బంధాల కత్తివేటూ భయపెట్టినప్పుడు స్వేచ్ఛనుడిగి మూగవోయిన దుఃఖచరిత్ర అతనిది. పురాణకాలం నుంచి నవీనకాలం వరకూ ఏ ఘట్టంలోనూ స్వేచ్ఛారాహిత్యంతో రాజీపడని ధిక్కారచరిత్రా అతనికుంది. తన సహజస్వేచ్ఛపై అత్యాచారం శ్రుతిమించిన ప్రతిసారీ అగ్గిరవ్వ అయ్యాడు. చండశాసనం ఉన్నచోట దాని అతిక్రమణా ఉండితీరుతుందనడానికి రామాయణమే సాక్ష్యం. హనుమంతుడు సీతను చూసొచ్చిన తర్వాత సంబరం పట్టలేకపోయిన వానర సమూహం కిష్కింధలోని మధువనంలోకి జొరబడి అక్కడి తేనెతో విందు చేసుకుని, మత్తిల్లి వనాన్ని ధ్వంసం చేస్తారు. ఆ క్షణంలో వారిలో పురివిప్పిన స్వేచ్ఛాసహజాతం చండశాసనుడైన తమ ఏలిక సుగ్రీవుడు దండిస్తాడన్న భయాన్ని కూడా జయించింది. పీడనకూ, పెత్తనానికీ గురవుతున్నాసరే తమ సహజసిద్ధమైన స్వేచ్ఛాదాహాన్ని తీర్చుకునేందుకు మనిషి అవకాశాలు వెతుక్కుంటూనే ఉంటాడు. ఆ మేరకు పెత్తందార్లకూ, పీడితులకూ మధ్య రాజీ ఏర్పాట్లు కూడా ఉండేవి. ఈ సందర్భంలో ప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత రాంభట్ల కృష్ణమూర్తి తన ‘సొంతకథ’లో ‘వాలకం’ అనే ప్రదర్శన రూపాన్ని ప్రస్తావిస్తారు. గౌరమ్మ సంబరాలప్పుడు కొంతమంది గ్రామస్తులు ఊళ్ళోని మోతుబరుల వేషంకట్టి వారి నడకను, నడవడిని అనుకరిస్తూ పాటల రూపంలో వారిపై ఆక్షేపణను చాటుకోవడమే ‘వాలకం’. ఒక్కోసారి ఆగ్రహించి మోతుబరులు దేహశుద్ధి చేయడం గురించీ ఆయన రాస్తారు. ఈ శతాబ్ది ప్రారంభంలో ఇలాంటి ప్రదర్శన అమెరికాలోనూ ఉండేదనీ, దానిని వాడెవిల్ అంటారనీ, చార్లీ చాప్లిన్ ఇందులో ప్రసిద్ధుడనీ ఆయన అంటారు. పురాతన సుమేరు సమాజంలో జనం ఎలాంటి నిర్బంధాలూ, నిబంధనలూ లేని స్వేచ్ఛను అనుభవించడానికి ఏటా వారం రోజులు కేటాయించేవారు. అలాగని స్వేచ్ఛ అంటే ఎలాంటి అదుపాజ్ఞలూ లేని ఇచ్ఛావిహారం కాదు. సమష్టి శ్రేయస్సు కోసం స్వీయ నియంత్రణలో ఉంచుకోవలసిన బాధ్యత కూడా! పాలకులు, పాలితుల వ్యవహరణలో ఎక్కడ తూకం తప్పినా దెబ్బతగిలేది స్వేచ్ఛకే! నిరంతర అప్రమత్తతే స్వేచ్ఛకు చెల్లించే మూల్యం. -
Gandhi Jayanti: జాతిపిత ముచ్చట్లు
‘ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతో మొదలు కానీ’ అన్నారు గాంధీజీ. ఏవైతే ఎదుటివారిలో వద్దు అనుకుంటామో వాటిని ముందు మనం పరిహరించుకోవాలి. ‘చెడు అనవద్దు వినవద్దు కనవద్దు’ అన్నాడాయన. అసత్యం, అబద్ధం, ద్వేషం, మోసం, ద్రోహం, నేరం... ఇవి ఇప్పుడు పూర్తి చెడుకు కారణం అవుతున్నాయి. స్నేహం, త్యాగం, సమభావన, సహ జీవనం ఇవి విలువైనవిగా మారాయి. విలువలే మనుషుల్ని మహనీయులని చేస్తాయి. గాంధీజీని గౌరవించడం అంటే విలువల్ని కాపాడుకోవడమే. గాంధీ జయంతి వస్తే తెలిసిన విషయాలు మళ్లీ తెలుస్తూ ఉంటాయి. కాని అంతగా తెలియని విషయాలు కొన్ని తెలుసుకుందాం. గాంధీజీకి ప్రపంచ మహనీయులతో గాఢస్నేహం ఉండేది. రష్యన్ రచయిత టాల్‌స్టాయ్ రచనలతో గాంధీజీ ప్రభావితం అయ్యారు. సౌత్ ఆఫ్రికాలో ‘టాల్‌స్టాయ్ ఫామ్’ పేరుతో వ్యవసాయ క్షేత్రాన్ని నడిపారు. చార్లిచాప్లిన్, గాంధీజీ ఉత్తరాలు రాసుకునేవారు. లండన్ వెళ్లినప్పుడు గాంధీజీని చార్లిచాప్లిన్ ప్రత్యేకంగా కలిశారు. గాంధీజీ ప్రభావంతో చాప్లిన్ ‘మోడరన్ టైమ్స్’ సినిమా తీశారని అంటారు. ఐన్‌స్టీన్ గాంధీజీ గురించి అన్నమాట తెలిసిందే– ‘ఈ భూమి మీద ఇలాంటి మానవుడు నడయాడాడని తెలుసుకుని భావితరాలు ఆశ్చర్యపోతాయి’. ఇక విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్తో గాంధీకి ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. గాంధీజీకి ‘మహాత్మ’ అనే సంబోధనా గౌరవం ఇచ్చింది టాగోర్ అంటారు. ఆ తర్వాత గాంధీ పేరు ముందు మహాత్మ ఒక ఇంటి పేరులా మారిపోయింది. ► గాంధీజీ ఫుట్‌బాల్ ప్రియుడు. ఆయన ఎప్పుడూ ఆ ఆట ఆడకపోయినా సౌత్ ఆఫ్రికాలో ఉండగా వర్ణవివక్ష వ్యతిరేక స్ఫూర్తిని కలిగించేలా జొహన్నాస్బర్గ్లో, ప్రెటోరియాలో రెండు ఫుట్‌బాల్ టీమ్‌లను స్థాపించాడు. ► గాంధీజీ ప్రకృతి వైద్యాన్ని విశ్వసించేవారు. ఒకసారి గోపాలకృష్ణ గోఖలే అనారోగ్యం పాలైతే గాంధీ ఆయనకు చాలా తేలికపాటి ఆహారం ఇవ్వసాగారు. గోఖలే దీనిని వ్యతిరేకించినా ఆయన వినలేదు. అంతేనా... ఇద్దరూ ఎక్కడికైనా ఆతిథ్యానికి వెళితే ‘గోఖలే ఏమీ తినడు’ అని ముందే ప్రకటించేసేవారు గాంధీజీ. అదే వరుసలో ఒక ఇంటికి ఆతిథ్యానికి వెళితే గోఖలే సత్యాగ్రహానికి కూచున్నారు. ‘నాకు నచ్చినవి తిననిస్తేనే కదులుతాను’ అన్నారు. గాంధీజీకి ఒప్పుకోక తప్పలేదు. అప్పుడు గోఖలే నవ్వుతూ అన్నారట ‘చూశారా.. సత్యాగ్రాహిని సత్యాగ్రహంతోనే ఓడించాను’ అని. గాంధీజీ సుభాష్‌చంద్రబోస్‌కు కూడా డైట్ చార్ట్ ఇచ్చారు. ‘ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. పచ్చి వెల్లుల్లి రక్తపోటుకు మంచిది. ఖర్జూరాలు తిను. కాని ఎండు ద్రాక్షను మర్చిపోకు. టీ, కాఫీలు ఆరోగ్యానికి అవసరం అని నేను భావించను’ అని బోస్‌కు రాశాడాయన. ► గాంధీజీ ప్రతిపాదించిన అహింసా సిద్ధాంతం ప్రపంచాన్ని గొప్పగా ప్రభావితం చేసింది. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా హక్కుల కోసం పోరాడాల్సిందేనన్న గాంధీజీ స్ఫూర్తితో 12 దేశాలలో కాలక్రమంలో హక్కుల ఉద్యమాలు జరిగాయి. ► గాంధీజీకి నివాళిగా చిన్న చిన్న బస్తీలకు, వీధులకు ఆయన పేరు పెట్టడం ఆనవాయితీ. వాటి లెక్కను మినహాయిస్తే మన మొత్తం దేశంలో 53 రోడ్లకు ఆయన పేరు ఉంది. అది విశేషం కాదు. విదేశాలలో 48 రోడ్లకు ఆయన పేరు ఉంది. ► అహింసను ఆయుధంగా స్వీకరించిన గాంధీజీకి నోబెల్ బహుమతి రాలేదు. ఆయన పేరు 1937, 1938, 1939, 1947లలో నామినేట్ అయ్యింది. చివరకు ఆయన మరణించిన 1948లో ఆఖరుసారి నామినేట్ అయ్యింది. అయినా సరే నోబెల్ బహుమతి ఆయనకు రాలేదు. అన్నట్టు గాంధీజీ అంతిమయాత్ర 8 కిలోమీటర్లు సాగింది. ► 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి జవహర్లాల్ నెహ్రు దేశ స్వాతంత్య్ర ప్రకటన సందర్భంగా చేసిన చరిత్రాత్మక ప్రసంగ సమయంలో గాంధీజీ ఆయన పక్కన లేరు. ► ఒకసారి గాంధీజీ ఒక మీటింగ్‌లో ఉంటే ఒక పసివాడు ఆయనను చూడటానికి వచ్చాడు. ‘నీకు చొక్కా లేదా’ అని ఆశ్చర్యపోయాడు. ‘నా దగ్గర అన్ని డబ్బులు లేవు నాయనా’ అన్నాడు గాంధీజీ. పసివాడికి జాలి పుట్టింది. ‘మా అమ్మ నా బట్టలు కుడుతుంది. నీకు కుట్టి తెస్తాలే’ అన్నాడు. ‘మీ అమ్మ ఎన్ని కుడుతుంది. నువ్వు ఎన్ని తేగలవు. నాలా చొక్కాలు, ఒంటి నిండా బట్టలు లేనివారు 40 కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. వారు తొడుక్కోకుండా నేను తొడుక్కుంటే ఏం బాగుంటుంది’ అన్నారు గాంధీజీ ఆ పసివాడితో. ► కంప్యూటర్ దిగ్గజం స్టీవ్‌జాబ్స్ గాంధీజీ అభిమాని. వృత్తాకార కళ్లద్దాలు గాంధీ కళ్లద్దాలుగా పేరు పొందడం తెలిసిందే. గాంధీజీ మీద గౌరవంతో స్టీవ్‌జాబ్స్ అలాంటి కళ్లద్దాలనే ధరించాడు. ► గాంధీజీ డార్జిలింగ్‌లో టాయ్‌ట్రైన్‌లో వెళుతున్నప్పుడు ఇంజన్లో సమస్య వచ్చింది. ట్రైన్ వెనక్కు నడవసాగింది. అందరూ భయభ్రాంతం అవుతుంటే గాంధీజీ తన సెక్రెట్రీకి ఉత్తరాలు డిక్టేట్ చేయసాగారు. అప్పుడు సెక్రెటరీ ‘బాపూ... మనం ఏ నిమిషం అయినా పోయేలా ఉన్నాం తెలుసా?’... దానికి గాంధీజీ జవాబు ‘పోతే పోతాం. కాని బతికితే పోతామేమో అని ఆందోళన పడిన సమయం అంతా వృధా చేసిన వాళ్లం అవుతాం. కనుక డిక్టేషన్ తీసుకో’. అన్నాడు. కాలం విలువ తెలియ చేసిన మహనీయుడు ఆయన. -
చార్లీ చాప్లిన్‌లా 'ఇస్మార్ట్ బ్యూటీ'
‘నవ్వు లేని రోజు వృథా అయినట్లే’... తన హాస్యంతో ఎందరో ప్రేక్షకులను నవ్వించిన దివంగత ప్రముఖ నటుడు చార్లీ చాప్లిన్ అన్న మాట ఇది. వ్యక్తిగత జీవితంలో బాధలున్నప్పటికీ అవేమీ కనపడనివ్వకుండా నటుడిగా నవ్వించిన ఘనత చార్లీది. చదవండి: బాధగా ఉంది, నువ్వు రీ ఎంట్రీ ఇవ్వాల్సిందే: కౌశల్ ఆయన జీవితం నుంచి నభా నటేశ్ ఏమైనా స్ఫూర్తి పొందారేమో చార్లీ గెటప్ వేసుకుని, ఫొటోషూట్ చేయించుకున్నారు.‘నవ్వు లేని రోజు వృథా అయినట్లే’ అనే క్యాప్షన్‌తో పాటు చార్లీ చెప్పిన మరికొన్ని కొటేషన్స్‌ని జోడించి, ఆ ఫొటోలను, చార్లీలా అభినయించిన వీడియోను షేర్ చేశారామె. చదవండి: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ మామూలుగా లేదుగా.. -
పాత బంగారం.. కొత్త సింగారం
చార్లీ చాప్లిన్‌ను సొంతం చేసుకోవడానికి ప్రాంతాలు, భాషతో పనిలేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారైనా ఆయన ప్రపంచంలోకి వెళ్లి హాయిగా నవ్వుకోవచ్చు. చాప్లిన్ నటించి, దర్శకత్వం వహించిన ‘ది కిడ్’ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసిద్ధ ఫ్రెంచ్ ఫిల్మ్ కంపెనీ ఎంకే2 ‘ది కిడ్’తో సహా ప్రపంచ ప్రసిద్ధి పొందిన చాప్లిన్ చిత్రాల రిస్టోరేషన్ ప్రక్రియ చేపట్టింది. ‘ది గోల్డ్ రష్’ ‘సిటీ లైట్స్’ ‘ది సర్కస్’ ‘మోడ్రన్ టైమ్స్’ ‘ది గ్రేట్ డిక్టేటర్’ చిత్రాలను 4కె రిస్టోరేషన్ చేస్తున్నారు. ‘చార్లి చాప్లిన్ స్టార్డమ్, అద్భుత నటనకు అద్దం పట్టే చిత్రం ది కిడ్. ఈతరం ప్రేక్షకులు కూడా ఆనాటి భావాలు, భావోద్వేగాలతో మమేకం అవుతారు’ అంటున్నాడు ఎంకే 2 సీయివో కర్మిడ్జ్. ఆధునీకరించిన చాప్లిన్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పోస్టర్లు. ట్రైలర్లు రెడీ చేస్తున్నారు. -
చార్లీ చాప్లిన్ తొలి సినిమాకు వందేళ్ళు!
చార్లీ చాప్లిన్‌ను సొంతం చేసుకోవడానికి ప్రాంతాలు, భాషతో పనిలేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారైనా ఆయన ప్రపంచంలోకి వెళ్లి హాయిగా నవ్వుకోవచ్చు. చాప్లిన్ నటించి, దర్శకత్వం వహించిన ‘ది కిడ్’ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసిద్ధ ఫ్రెంచ్ ఫిల్మ్ కంపెనీ ఎంకే2 ‘ది కిడ్’తో సహా ప్రపంచ ప్రసిద్ధి పొందిన చాప్లిన్ చిత్రాల రిస్టోరేషన్ ప్రక్రియ చేపట్టింది. ‘ది గోల్డ్ రష్’ ‘సిటీ లైట్స్’ ‘ది సర్కస్’ ‘మోడ్రన్ టైమ్స్’ ‘ది గ్రేట్ డిక్టేటర్’ చిత్రాలను 4కె రిస్టోరేషన్ చేస్తున్నారు. ‘చార్లి చాప్లిన్ స్టార్డమ్, అద్భుత నటనకు అద్దం పట్టే చిత్రం ది కిడ్. ఈతరం ప్రేక్షకులు కూడా ఆనాటి భావాలు, భావోద్వేగాలతో మమేకం అవుతారు’ అంటున్నాడు ఎంకే 2 సీయివో కర్మిడ్జ్. ఆధునీకరించిన చాప్లిన్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పోస్టర్లు. ట్రైలర్లు రెడీ చేస్తున్నారు. -
బతుకుదాం వీళ్ల స్ఫూర్తితో
అలాస్కా మంచుదిబ్బలు. ఘోరమైన తెల్లతుఫాను. తినడానికి తిండి లేదు. ఆత్మహత్య చేసుకోవచ్చు. కాని వేడివేడి నీళ్లలో షూ ఉడకబెట్టుకుని తింటాడు చార్లీచాప్లిన్ ‘గోల్డ్ రష్’ సినిమాలో. కుటుంబంతో బతికే వ్యక్తిని తీసుకెళ్లి అమెరికా దక్షణాది రాష్ట్రాల్లో బానిసగా అమ్మేస్తారు కొందరు. ఆత్మహత్య చేసుకోవచ్చు. కాని అతను స్వేచ్ఛ కోసం 12 ఏళ్ల పాటు ప్రయత్నించి పొందుతాడు ‘12 ఇయర్స్ ఏ స్లేవ్’ సినిమాలో. చనిపోవడానికి ఉండే కారణాలు ఎప్పుడూ స్వల్పమే. బతికేందుకు దొరికే దారులు వేయి. బతుకుదాం వీరి స్ఫూర్తితో. 1890ల చివరలో అలాస్కా– కెనెడా సరిహద్దు ప్రాంతంలో బంగారం బయటపడింది. అమెరికా లో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ముఖ్యంగా సియాటిల్, శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఆ బంగారం కోసం లక్ష మంది వేటగాళ్లు బయలుదేరారు. కాని దారి సులువు కాదు. అలాస్కా మీదుగా కెనెడాలో ప్రవేశించి బంగారం దొరికే ప్రాంతానికి చేరుకోవాలి. దాదాపు మూడు నాలుగు వందల కిలోమీటర్ల దూరం అలస్కా నుంచి. అలస్కా అంటే శరీరాన్ని క్షణాల్లో కట్టెగా మార్చేంత శీతల ప్రాంతం. కాని వేటగాళ్లు ప్రాణాలకు తెగించి బయలుదేరారు. లక్షమంది వెళితే కేవలం 30 వేల మంది తిరిగి వచ్చారు. అందరూ వెళ్లే దారిలో లేదా తిరిగి వచ్చేదారిలో మరణించారు. చార్లి చాప్లిన్ ఈ చారిత్రక ఘటన మీద ‘గోల్డ్ రష్’ సినిమా తీశాడు. బంగారం వేటకు వెళ్లి అలాస్కా మంచు తుఫానులో చిక్కుకుంటాడు చాప్లిన్. అతడికి ఆసరా ఒక చెక్కముక్కల గది. తోడుగా మరో వేటగాడు. తెచ్చుకున్న ఆహారం అయిపోతుంది. బయట తుఫాను ఎన్నిరోజులు గడిచినా ఆగదు. భయంకరమైన ఆకలి. తోటి వేటగాడు ఆకలితో భ్రాంతికి గురై చాప్లిన్నే తిందామన్నంత పిచ్చివాడైపోతాడు. చేతిలో తుపాకీ ఉంది. ఆత్మహత్య చేసుకోవడం చిటికెలో పని. కాని చాప్లిన్ బతకాలని నిర్ణయించుకుంటాడు. తిరిగి ఇంటికి చేరుకోవాలని నిశ్చయించుకుంటాడు. అందుకే తన కాలి షూ తీసి నీళ్లలో బాగా ఉడకబెడతాడు. తర్వాత దానిని తెచ్చి టేబుల్ మీద పెట్టి రెండు సగాలుగా కోస్తాడు. ఒక సగం తన పార్టనర్‌కు ఇచ్చి మరో సగం తీరిగ్గా భుజిస్తాడు. చచ్చిపోవడం కంటే షూ తిని ప్రాణాలు కాపాడుకోవడం బెటర్. బతికి ఉంటే ఆ తర్వాత బిరియాని దొరకొచ్చు. ఈ కష్టాలకు ఓర్చుకున్నాడు కనుకనే సినిమాలో చాప్లిన్‌కు బంగారం దొరుకుతుంది. కోటీశ్వరుడు అవుతాడు. ‘పాపియాన్’ (1969) ప్రఖ్యాత ఫ్రెంచ్ నవల. నిజ జీవిత ఘటనల ఆధారంగా రాసింది. సినిమాలూ వచ్చాయి. అందులో ‘పాపియాన్’ (అంటే సీతాకోకచిలుక) అనే చిల్లర దొంగను హత్యానేరం కింద ఇరికించి అతి భయంకరమైన ఫ్రెంచ్ గయానా దీవుల్లోని జైలుకు పంపుతారు. ఇది ఇంకో రకమైన మరణశిక్షలాంటిది. ఎందుకంటే అక్కడికి వెళ్లినవారు తిరిగి రావడం కల్ల. హత్యకు అయినా గురవుతారు. ఆత్మహత్య అయినా చేసుకుంటారు. కాని పాపియాన్ బతకాలని నిశ్చయించుకుంటాడు. ఎలాగైనా బతికి తీరాలని పదే పదే పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అతన్ని తీసుకొచ్చి ఏకాంత శిక్ష వేసినా ఆకలితో మాడ్చినా బతికే తీరుతాడు. 1931 నుంచి 1945 వరకు అతడు జైల్లో గడిపిన జీవితమే ఆ నవల. కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన నవల ఇది. ఇస్తున్న నవల. పాపియాన్ కంటే పెద్ద కష్టం ఎవరికీ రాకపోవచ్చు. మరి ఎందుకు చనిపోవడం? 1841లో సోలమన్ నార్తప్ అనే ఆఫ్రికన్–అమెరికన్‌ను బానిసల వ్యవస్థ లేని న్యూయార్క్ నుంచి పట్టుకెళ్లి బానిసల వ్యవస్థ ఉండే దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మేస్తారు. అతని భార్యకు, పిల్లలకు ఈ విషయం తెలియనే తెలియదు. అమ్ముడుపోయిన బానిసలు పత్తి, చెరకు చేలలో బండ చాకిరి చేయాలి. రాక్షస హింసను ఎదుర్కోవాలి. దానిని భరించలేక చాలామంది చచ్చిపోతారు. లేదా ఆత్మహత్య చేసుకుంటారు. కాని నార్తప్ తాను బతికి తిరిగి కుటుంబానికి చేరుకోవాలనుకుంటాడు. తాను బతికే ఉన్నానని చెప్పి ఒక లేఖ రాయడానికి కావలసిన కాగితం కోసం అతడు 12 ఏళ్ల పాటు ఓపిగ్గా ఎదురు చూస్తాడు. కాగితం దొరికాక అతడు రాసిన లేఖ చూసి అధికారులు వచ్చి విడిపిస్తారు. నార్తప్ జీవితంపై వచ్చిన బయోపిక్ ‘12 ఇయర్స్ అండ్ స్లేవ్’. ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు ఇలాంటి సినిమా చూడాలి. ‘మలావి’ అనే దేశం ఆఫ్రికా ఖండంలో ఉన్నట్టు చాలామందికి తెలియకపోవచ్చు. ఆ దేశంలోని కసుంగు అనే ఊళ్లో ఒక 15 ఏళ్ల కుర్రాడి పేరు విలియమ్ కమ్క్వాంబ. తల్లి, తండ్రి, అక్క, ఒక పెంపుడు కుక్క, బడి ఇదీ అతని జీవితం. తండ్రి వ్యవసాయం చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. కొద్దిగా పొలం, ఒక సైకిల్ వారి ఆస్తి. కాని ఆ పొలం పండదు. దాని కారణం వానలు ముందే వచ్చి పోతాయి. విత్తు నాటే సమయానికి ఉత్త ఎండ. దేశమంతా కరువు వచ్చేస్తుంది. అందరి పొలాల్లో కొద్దిగా మొక్కజొన్న పండితే ఒకరి పంటను మరొకరు దొంగిలించేంత ఆకలి. ఈ పేదరికం భరించలేక అక్క పారిపోతుంది. గుప్పెడు తిండి కూడా పెట్టకపోవడంతో కుక్క చనిపోతుంది. అమ్మా నాన్న జీవచ్ఛవాలు అయినట్టే. ఆ కుర్రాడు ఒక్కడు. కాని పారిపోడు. పోయి ఏట్లో దూకడు. కరెంటు లేని ఆ ఊళ్లో బావిలోని నీటిని పొలానికి తీసుకురావడానికి విండ్మిల్ తయారు చేస్తాడు. చనిపోయే దారి ఉన్నా బతికే మార్గం వెతికే ఉపాయమిది. ఆ పిల్లవాడికి ఆ తర్వాత అమెరికా యూనివర్సిటీలు సీటిచ్చాయి. అతడి జీవితం ఆధారంగా ‘ద బాయ్ హూ హార్వెస్ట్ విండ్’ సినిమా వచ్చింది. ఈ సినిమాలే కాదు ఇలాంటి సినిమాలు ఎన్నో నెట్లో ఉన్నాయి. బతుకు మీద ఆశ కలిగించే సాహిత్యం ఉంది. విలోమ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని పారదోలేందుకు సాయపడే హెల్ప్లైన్లు ఉన్నాయి. స్నేహితులు ఉంటారు. కుటుంబం ఎప్పుడూ ఉంటుంది. మరైతే చనిపోవడం ఎందుకు? ప్రకృతి మనిషికి బుద్ధి, చేతన, ఆలోచన ఇచ్చింది పాజిటివ్‌గా ఆలోచించేందుకు. వెలుతురు వైపు చూసేందుకు. చీకటి పడితే నిద్రపోయి (దానిని భరించి) వెలుతురులో మేల్కోవాలి. అదీ జీవితం. కష్టాలు ఇంతకుముందు లేవని కాదు. ఇక ముందు ఉండవనీ కాదు. మన పూర్వికులు కోట్లాది మంది కష్టాలకు తట్టుకుని నిలబడ్డారు. కనుక మనం ఇవాళ ఉన్నాం. మనం తట్టుకుని నిలబడి తర్వాతి తరాలకు ఆశ కల్పించాలి. ఇది నిరాశ ఉన్న కాలం నిజమే. ‘కరోనా’ మహమ్మారి మనల్ని ఆందోళనలో, నైరాశ్యంలో ముంచుతోంది నిజమే. కాని మరో మూడూ లేదా ఆరు నెలలు ఓపిక చేసుకోలేమా. ఇతర మన కష్టాలకు విరుగుడులను వెతుక్కోలేమా. ఆత్మీయులతో మన భారాన్ని పంచుకుని బతుకును పెంచుకోలేమా? బతుకుదాం. శతమానం భవతి. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చాప్లిన్ ది గ్రేట్
-
అపహాస్యమే హాస్యమాయెను
చార్లీ చాప్లిన్ జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన ఇది. ఇంగ్లండ్‌లోని వాడెవిక్ మ్యూజిక్ హాల్ వేదిక మీద రంగస్థల నటి అయిన చాప్లిన్ తల్లి పాడుతుండగా– పాట మధ్యలో ఆమె గొంతు బొంగురు పోయింది. దాంతో ఆమె వేదిక మీద నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. నిర్వాహకులు పిల్లాడైన చాప్లిన్‌ను ఏదో ఒకటి పాడమని పైకి ఎక్కించడంతో, ఏం పాడాలో తెలియక తనకు వచ్చిన రీతిలో పాడుతుంటే ప్రేక్షకులు నవ్వడం ప్రారంభించారు. దాన్ని అపహాస్యంగా భావించిన చాప్లిన్ మరింత బిగ్గరగా పాడటంతో ప్రేక్షకులు నవ్వును ఆపుకోలేక నాణేల్ని వేదిక మీదకు విసరడం మొదలుపెట్టారు. చాప్లిన్ ఆ డబ్బుని ఏరుకోవడానికి ప్రయత్నిస్తుంటే, నిర్వాహకులు తామే ఏరి పెడతామనీ, చాప్లిన్‌ను పాట కొనసాగించమనీ చెప్పారు. ఆ ఘటన చాప్లిన్‌లోని హాస్యనటుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. సరికొత్త హాస్యాన్ని వెలుగులోకి తెచ్చింది. - చందన రవీంద్ర -
ప్రేమికుడి వినోదం
ప్రభుదేవా హీరోగా, అదాశర్మ, నిక్కీగల్రాని హీరోయిన్లుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్’. ఈ చిత్రాన్ని ఎమ్.వి. కృష్ణ సమర్పణలో శ్రీ తారకరామ పిక్చర్స్ పతాకంపై వి.శ్రీనివాసరావు తెలుగులోకి ‘మిస్టర్ ప్రేమికుడు’ పేరుతో అనువదిస్తున్నారు. వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ప్రభుదేవా హీరోగా నటించిన సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఆయన నటించిన లేటెస్ట్ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాం. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. పాటలు, సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయి. తెలుగు అనువాద కార్యక్రమాలు ఫైనల్ దశలో ఉన్నాయి. త్వరలో ఆడియోను, ఈ నెలలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్; కెమెరా: సౌందర్ రాజన్, సహ నిర్మాతలు: మహేష్ చౌదరి గుర్రం, శంకరరావు సారికి. -
తను చాలా నచ్చింది!
‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’... ప్రభుదేవాని అభిమానులు ముద్దుగా ఇలానే పిలుచుకుంటారు. తన డ్యాన్స్‌తో ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు హీరోల చేత కూడా తనదైన శైలిలో స్టెప్పులేయించి, ప్రేక్షకులు, అభిమానుల చేత ఈలకొట్టించి గోల చేయించగలరు. ప్రభుదేవా బహుముఖ ప్రజ్ఞాశాలి అనే సంగతి తెలిసిందే. డ్యాన్స్ మాస్టర్‌గా, యాక్టర్‌గా, డైరెక్టర్‌గా అందరికీ సుపరిచితులే. తాజాగా పాటల రచయితగా మరో అవతారం ఎత్తారాయన. ప్రభుదేవా, నిక్కీగల్రానీ, అదా శర్మ ముఖ్య తారలుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చార్లీ చాప్లిన్ 2’. 2002లో విడుదలై ఘన విజయం సాధించిన ‘చార్లీ చాప్లిన్’ చిత్రానికి ఇది రీమేక్. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ‘ఇవళ ఇవళ రొంబ పిడిచిరుక్కు...’ (తను తను చాలా నచ్చింది) అనే పాటను ప్రభుదేవా రాశారు. ఈ పాటకి అమ్రిష్ చక్కని స్వరాలు అందించారు. హీరోగా మారిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఈ పాటని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. ప్రభుదేవా రాసిన తొలి పాట వినేస్తే పోలా! -
తుది దశలో చార్లీచాప్లిన్–2
తమిళసినిమా: ఇంతకుముందు ప్రభు, ప్రభుదేవా కలిసి నటించిన పూర్తి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టెయినర్ చిత్రం మంచి విజయం సాధించింది. దీంతో తాజాగా ఆ చిత్ర దర్శకుడు శక్తి చిదంబరంనే దానికి సీక్వెల్‌గా చార్లీచాప్లిన్–2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెంకట్‌ప్రభు దర్వకత్వంలో పార్టీ అనే కలర్‌ఫుల్ చిత్రాన్ని నిర్మిస్తున్న అమ్మా క్రియేషన్స్ శివనే ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోనూ ప్రభుదేవా, ప్రభు కలిసి నటిస్తుండడం విశేషం. ఇక హీరోయిన్లుగా గ్లామర్ డాల్స్ నిక్కీగల్రాణి, బాలీవుడ్ భామ ఆదాశర్మ నటిస్తున్నారు. ఆదాశర్మకు ఇదే తోలి తమిళ చిత్రం అవుతుంది. ఇతర ముఖ్య పాత్రల్లో రవిమరియ, సెంథిల్, ఆకాశ్, వివేక్ ప్రసన్న,శామ్స్, శాంత, కావ్య, మగధీర చిత్ర ఫేమ్ దేవ్‌సింగ్, ముంబై విలన్ సమీర్ కోచ్, కోవమల్శర్మ, అమీత్, నట్పుకాగ వైభన్ నటిస్తున్నారు. అమ్రేశ్ సంగీతాన్ని, సౌందర్‌రాజన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దీనికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను అందిస్తున్న శక్తిచిదంబరం చిత్ర వివరాలను తెలుపుతూ చార్లీచాప్లిన్–2 పూర్తిగా కమర్శియల్ కామెడీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం తుది ఘట్ట చిత్రీకరణ జరుపుకుంటోందదని తెలిపారు. -
చార్లీ చాప్లినా.. ఆయనెవరు?
హాలీవుడ్ దిగ్గజ నటుడు చార్లీ చాప్లిన్ తనను కలవాలని అనుకున్నప్పుడు మహాత్మా గాంధీ అడిగిన ప్రశ్న ఇదే.. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు గడించిన చార్లీ చాప్లిన్ గురించి నిజంగానే గాంధీజీకి తెలియదట. దాంతో అతని సహచరులు.. చాప్లిన్ ప్రఖ్యాత నటుడని.. పీడిత ప్రజల బాధలను తన చిత్రాల ద్వారా తెలియజెప్పుతుంటారని చెప్పినప్పుడు ఆయన్ను కలవడానికి అంగీకరించారు. 1931, సెప్టెంబర్ 22న లండన్‌లో వారిరువురూ కలిశారు. దానికి సంబంధించిన చిత్రమే ఇదీ. అయితే.. వారి సమావేశం ఫొటోలో కనిపిస్తున్నంత ఆహ్లాదంగా ఏమీ జరగలేదు. ఓ విషయంపై వాగ్వాదంతో వారి మీటింగ్ ముగిసింది. యాంత్రీకరణ సమస్త మానవాళి మనుగడకు, అభివృద్ధికి ఎంతో ఉపయోగకరమని చాప్లిన్ వాదిస్తే.. మెషినరీకి బదులు మానవ వనరుల వినియోగమే కరెక్టని.. ఉపాధి కల్పించినట్టూ అవుతుందని గాంధీజీ వాదించారు. ఇద్దరూ దిగ్గజాలే.. ఇద్దరూ వారివారి వాదనకు కట్టుబడ్డారు. దీంతో వారి సమావేశం అలా వాదోపవాదాల మధ్య ముగిసిందట.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర వివరాలు, ఫొటోలను ‘రోలీ బుక్స్’పబ్లిషర్ ప్రమోద్ కపూర్ తన పుస్తకంnn ‘గాంధీ–యాన్ ఇలస్ట్రేటెడ్ బయోగ్రఫీ’లో పొందుపరిచారు. వీటిల్లో సలాడ్లు తినాలంటూ గాంధీజీ సుభాష్ చంద్రబోస్‌కు పంపించిన శాకాహార డైట్ ప్లాన్ కూడా ఉంది. ఇందులో ఏ కాయగూరను ఎలా తినాలి.. ఉల్లి, వెల్లుల్లి ఉపయోగాలను మహాత్ముడు విపులంగా వివరించారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
రారండోయ్ వేడుక చేద్దాం
పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. శుభలేఖలు పంచారు. తిరుపతిలో పెళ్లి మండపం బుక్ చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లికూతురి కుటుంబాలు రారండోయ్ వేడుక చేద్దాం అని తిరుపతికి బయల్దేరాయి. అలకలు, బుజ్జగింపులు, సరదాలతో పెళ్లిసందడి మొదలైంది. అంతలో సడన్‌గా ఓ ట్విస్ట్. అంతే పెళ్లాగిపోయే పరిస్థితులు వచ్చాయట. ఆ ట్విస్ట్ ఏంటి? అసలు పెళ్లి జరిగిందా? అన్న ప్రశ్నలకు ఆన్సర్ కావాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శకులు శక్తీ చిదంబరం. ప్రభుదేవా, నిక్కీ గల్రానీ, అదా శర్మ ముఖ్యపాత్రల్లో ఆయన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. 15ఏళ్ల క్రితం చిదంబరం డైరెక్ట్ చేసిన ‘చార్లీ చాప్లీన్’ కు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారన్నది కోలీవుడ్ సమాచారమ్. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. సాంగ్స్ షూట్ చేస్తున్నారు. ‘‘చార్లీ చాప్లీన్ 2’ సినిమాలో ప్రభుదేవాతో డ్యాన్స్ చేస్తున్నాను. ఆయన ఎక్స్ప్రెషన్స్ సూపర్. ఇక్కడ మరికొన్ని సాంగ్స్‌ను షూట్ చేసిన తర్వాత చెన్నైలో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నాం’’అని పేర్కొన్నారు అదా శర్మ. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
రియల్ పెళ్లి కాదండోయ్.. రీల్ పెళ్లి తతంగం !
తిరుపతిలో ప్రభుదేవా, నిక్కీగల్రాణిల పెళ్లి జరగనుందట. ఏమిటీ నమ్మశక్యంగా లేదా ? ప్రభుదేవా, నయనతారల ప్రేమ పెళ్లి వరకూ ఆగిపోయిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివతో ప్రేమలో పడి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారనే ప్రచారం కూడా చాలా కాలంగానే జరుగుతోంది. అయితే ప్రభుదేవా మాత్రం ఒంటరిగానే జీవిస్తున్నారు. తాజాగా నిక్కీగల్రాణితో పెళ్లికి సిద్ధం అయ్యారనే ప్రచారం జోరందుకుంది. తిరుపతిలో బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇది రియల్ పెళ్లి కాదండోయ్. రీల్ పెళ్లి తతంగం. ఇదన్నా సవ్యంగా జరుగుతుందా? ఏమో చెప్పలేం ఎందుకంటే ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఆదాశర్మ కూడా నటిస్తోంది. ఇంతకు ముందు ప్రభు, ప్రభుదేవా కలిసి నటించిన చార్లీచాప్లిన్‌కు స్వీకెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిక్కీగల్రాణి, ఆదాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమ్మా క్రియేషన్స్ టి. శివ నిస్తున్న ఈ చిత్రానికి శక్తి చిదంబరం దర్శకుడు. ఈయన చిత్రాలంటే హాస్యంతో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయి. చార్లీచాప్లిన్-2 గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ప్రభుదేవా, నిక్కీగల్రాణి పెళ్లి కోసం ఇద్దరి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లేటప్పుడు, ఆ తర్వాత జరిగే సంఘటనలే చార్లీచాప్లిన్-2 చిత్రం అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం అమ్నేశ్, ఛాయాగ్రహణను సౌందర్‌రాజన్‌లు అందిస్తున్నారు. -
చార్లీ చాప్లిన్తో స్టెప్పులు.. ప్రేమలు!
ఇప్పుడు చార్లీ చాప్లిన్ లేరు. కానీ, ఆయన పంచిన నవ్వులు ఈ లోకంలో ఉన్నాయి. చాప్లిన్‌లా పీపుల్ని ఫుల్లుగా నవ్వించడానికి తమిళంలో ఓ సిన్మా రూపొందుతోంది. శక్తీ చిదంబరం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభుదేవాకి జోడీగా ‘హార్ట్ ఎటాక్’ ఫేమ్ అదా శర్మ నటిస్తున్నారు. 2002లో ప్రభు, ప్రభుదేవా హీరోలుగా వచ్చిన ‘చార్లీ చాప్లిన్’కి సీక్వెల్ ఇది. గురువారం గోవాలో చిత్రీకరణ మొదలైంది. ఆల్రెడీ అదా శర్మ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్‌డే ప్రభుదేవా, అదాలపై కొన్ని సీన్స్ తీశారు. ప్రభుదేవా అంటే జస్ట్ కామెడీ మాత్రమేనా? సాంగుల్లో స్టెప్పులు ఇరగదీసేస్తారు కదా! అండ్ రొమాంటిక్ లవ్ ట్రాక్ తప్పకుండా ఉంటుంది.సో, చార్లీ చాప్లిన్గా రాబోతున్న ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాతో అదా ఏ విధంగా స్టెప్పులు వేస్తారో! ప్రేమలు పండిస్తారో! అన్నట్టు... ఫస్ట్ పార్ట్ ‘చార్లీ చాప్లిన్’ని తెలుగులో శ్రీకాంత్, వేణు హీరోలుగా ‘పెళ్లాం ఊరెళితే’ పేరుతో రీమేక్ చేశారు. మరి, ఈ సీక్వెల్‌ని రీమేక్ చేస్తారో? లేదా ప్రభుదేవా, అదా శర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు కావడంతో డబ్ చేస్తారో? వెయిట్ అండ్ సీ!! తమిళ్లో అదాకి హీరోయిన్గా ఇదే మొదటి సినిమా. అంతకు ముందు శింబు ‘ఇదు నమ్మ ఆళు’లో అతిథి పాత్ర చేశారు. -
హిట్లర్ మీసం వెనుక...
అదన్న మాట! ముక్కుకు దిగువ గుబురుగా టూత్‌బ్రష్‌ను తలపించే మీసం కనిపిస్తే ఠక్కున గుర్తుకొచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు అడాల్ఫ్ హిట్లర్, మరొకరు చార్లీ చాప్లిన్. ఒకరు కరడు కట్టిన నియంతృత్వానికి, మరొకరు కడుపుబ్బ నవ్వించే హాస్యానికీ ప్రతీక. ఇంతకీ ఈ మీసం కథేమిటిటంటే... చార్లీ చాప్లిన్ అయితే జగమెరిగిన హాస్యనటచక్రవర్తి, అందువల్ల జనాలకు నవ్వు తెప్పించే ఉద్దేశంతో అలాంటి మీసం పెంచుకున్నాడనుకోవచ్చు. మరి ప్రపంచాన్ని గడగడలాడించిన జర్మన్ నియంత హిట్లర్ కూడా అలాంటి కామెడీ మీసాన్ని ఎందుకు పెంచుకున్నాడు? నియంతగా ముదరక ముందు సైన్యంలో పనిచేసే కాలంలో హిట్లర్‌కు తెగబారెడు మెలితిరిగిన మీసాలుండేవి. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం శత్రుసేనలపై మస్టర్డ్ గ్యాస్‌తో దాడులు ప్రారంభించింది. మస్టర్డ్ గ్యాస్ దాడి నుంచి రక్షణ పొందేందుకు బ్రిటన్‌కు వ్యతిరేకంగా పోరాడిన సైనికులు గ్యాస్ మాస్క్‌లను తయారు చేసుకున్నారు. ఆ మాస్క్‌లు తొడుక్కోవడానికి అనుగుణంగా మీసాల పొడవును కుదించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా హిట్లర్ మీసాలు ఇలా మారాయి. -
సినీ జీవిత నిష్ఠూరాలపై ఫోకస్ లైట్
అందుకే... అంత బాగుంది! లెమ్ లైట్ (1952) తారాగణం: చార్లీ చాప్లిన్, క్లెయిర్ బ్లూమ్, నిగెల్ బ్రూస్, బిస్టర్ కీటన్, సిడ్నీ ఎర్ల్ చాప్లిన్, వీలర్ డ్రైడెన్, నార్మన్ లాయిడ్, సంగీతం: చార్లీ చాప్లిన్, రచన-నిర్మాత-దర్శకుడు: చార్లీ చాప్లిన్, విడుదల: 1952, ఛాయాగ్రహణం: కార్ల్ స్ట్రస్, సినిమా నిడివి: 137 నిమిషాలు, నిర్మాణ వ్యయం: 9 లక్షల డాలర్లు (ఇప్పటి లెక్కలో దాదాపు 5 కోట్ల 40 లక్షల రూపాయలు), వసూళ్లు: 80 లక్షల డాలర్లు (48 కోట్ల రూపాయలు) చార్లీ చాప్లిన్! కామెడీ కింగ్... కాదు విషాద కథానాయకుడు... మానవాళికి ఓ దివ్య వరం! ఒక సినిమా... ఒక కళాకారుడూ మానవ జీవితం మీద, ఆ మాటకొస్తే యావత్ భూగోళంలో ఉన్న మానవజాతి మీద ఇంత ప్రభావం చూపించడం సాధ్యమా... అనిపిస్తుంది! అరవై ఏళ్ల క్రితం... అంటే ఇంచుమించు నేను పుట్టక ముందు తీసిన సినిమా... ఇంకా నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటే... ఆ కళారూపానికి సాష్టాంగ పడడం తప్ప మరేం చేయగలం... లైమ్లైట్!... 1952లో వచ్చిన చిత్రం... అప్పటి దాకా మూకీ యుగాన్ని శాసించిన చాప్లిన్, సినిమాకి మాట వచ్చాక చేసిన మహోన్నత చిత్రం - ఓ కళాకారుడి జీవిత కథ... ఓ రకంగా ఇది చాప్లిన్ కథే కావచ్చు గూడా. టూకీగా ‘కాల్వెరో’ అనే కమెడియన్ అవసానదశలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటూ... నానా రకాలుగా మానసికంగా కుంగిపోయి... ఒకసారి హార్ట్ అటాక్‌కి కూడా గురై ఏదో జీవితం లాగిస్తున్న వాడల్లా.. ఆత్మహత్యకు పాల్పడబోయిన ‘టెర్రీ’ అనే కళాకారిణిని కాపాడడం ... తర్వాత ఆమెకు ధైర్యం నూరిపోసి... మళ్లీ ఆమె చేత అర్థవంతంగా డాన్స్ చేయించడం... కృతజ్ఞతగా... ఆ పిల్ల వయస్సులో తనకన్నా పెద్దవాడైన కాల్వెరోని గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకుందామని చెప్తే... వయస్సులో ఉన్న ఆ పిల్లను సముదాయించలేక మరో గత్యంతరం లేక... ఆ పిల్ల జీవితంలో నుంచి తానే పారిపోవడం... చివరికి మళ్లీ కలిసి... జాయింట్‌గా ప్రదర్శనలిచ్చి... ఏ ప్రేక్షకులైతే తనను నిరాదరించారో, వాళ్లతో నీరాజనాలు పట్టించుకుని... తృప్తిగా వెళ్లిపోవడం... జీవితం కొనసాగించడం... స్థూలంగా ఇదే కథైనా... జనరల్‌గా చాప్లిన్ మూకీ చిత్రాల్లో ఉండే.. బాడీ లాంగ్వేజ్ ఇందులో ఉండదు. అసలు చాలాసేపటి వరకూ మనం చాప్లిన్ని గుర్తుపట్టం! తెల్లటి జుట్టుతో... క్లీన్ షేవ్‌తో చాలా డిగ్నిఫైడ్‌గా... కొన్నిచోట్ల చాలా సీరియస్‌గా కనిపిస్తాడు. జీవితంలో నుంచి బలవంతంగా పారిపోదామనుకుంటున్న టెర్రీకి... జీవిత ధర్మాన్ని చెబుతున్నప్పుడు కౌరవ సేన మధ్య గాండీవం, గుండె రెండూ జారిపోయిన అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేసిన కృష్ణుడిలా అనిపించాడు చాప్లిన్. ఓ వైపు జీవితంలో అన్ని రకాలుగా చితికి పోయినా, జీవిత మాధుర్యాన్ని బొట్టుబొట్టుగా గ్రోలుతూ ‘లైఫ్ ఈజ్ నో మీనింగ్, ఇట్స్ ఓన్లీ డిజైర్’ (ఔజీజ్ఛ జీట ౌ ఝ్ఛ్చజీజ, ఐ్ట’ట ౌడ ఈ్ఛటజీట్ఛ) అని చెప్పే చాప్లిన్ని చూస్తే... జీవితం మీద ఆశ పుడుతుంది. ఎంతటి మహానటుడైనా... ‘లైమ్లైట్’లో ఉన్నంత కాలమే!... తర్వాత పట్టించుకునే నాథుడుండడు అనే కర్కశమైన సత్యానికి బొమ్మకట్టాడు చాప్లిన్. అవును ‘లైమ్‌లైట్‌లో’ ఉంటే నీకు నీరాజనాలు... నీ నెత్తి మీద నుంచి లైట్ వెళ్లిపోతే నిన్ను గుర్తించలేదని నువ్వు ఏడవడం ఎందుకు? అసలు నువ్వు కనపడితే కదా! సిన్మా చూస్తున్నంతసేపూ... మన కళ్ల ముందు సావిత్రులూ... నాగయ్యలూ... రాజనాలలూ... కాంతారావులూ... శివరామ్లూ... కదలాడుతూనే ఉంటారు. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అని కదూ... దీపం ఉండగా గుండె నిండా వెలుగులు నింపుకో... ఆ వెలుగులు పదిమందికీ పంచు... ఇదీ లైమ్లైట్ సారాంశం! సినిమా చూస్తున్నప్పుడు చాప్లిన్... నట విశ్వరూపా నికి మనం హారతులు పట్టాల్సిందే! నవరసాల్నీ క్షణాల మీద కురిపించిన ఆ నటరాజు అభినయానికి మనం అవాక్కయిపోతాం. అలాగే... మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుందామనుకున్న లిల్లీ లాంటి పిల్ల మీద కాల్వెరో కరుణ చిలకరించేటప్పటికి లిల్లీలా విరిసిన తీరు... టెర్రీ పాత్రలో క్లెయిర్ బ్లూమ్ నవ్వినప్పుడల్లా... ప్రేక్షకుడి గుండె గిలక్కాయలా కొట్టుకుంటుంది... ఎంత అందమైన నవ్వు... అలాగే బ్లాక్ అండ్ వైట్‌లో... లైట్ అండ్ షేడ్స్‌లో చిత్రీకరించిన విధానం... ప్రతీ షాటూ కథ చెబుతుంది! చాలాసార్లు చాప్లిన్ బాధను తనలో దిగమింగుకుంటాడు. ఆ సీన్లలో గుక్కెట్టి ఏడుస్తాం. సినిమాలు నాటకాలైపోతున్న ఈ రోజుల్లో కళ్ల ముందు, ఓ కళాకారుడి జీవితాన్ని కిటికీ తెరిచి చూస్తున్నట్టనిపించే ‘లైమ్లైట్’ చిరస్మరణీయ చిత్రం. ఇంకోళ్లకి సాయపడ్డానికి కాల్వరో పడుతున్న తాపత్రయం చూస్తే మనలోంచి మనిషి... మంచి మనిషి మళ్లీ పుట్టుకొచ్చి, తోటివాణ్ణి పట్టించుకోని ప్రస్తుత పరిస్థితికి సిగ్గుపడతాం. మన మీద మనం జాలి పడతాం. మూడో కంటికి తెలియకుండా మనల్ని మనం అసహ్యించుకుంటాం. అలాగే... తనకు సాయం చేసి... తనకి కొత్త బతుకిచ్చిన కాల్వెరో పట్ల టెర్రీ కృతజ్ఞతాభావంతో లొంగిపోవడం... ఆమె కళ్లల్లో అతని పట్ల ఆరాధన చూస్తే మనకు సిగ్గేసి, కృతఘు్నలకి ఓ నమస్కారం చేస్తాం. మనసు కరిగించే కథ.. వజ్రాలు పొదిగినట్లు డైలాగులు... నటనంటే ఇదిరా అనిపించే అభినయం... ఓ కమ్మటి కల కని... కన్నీళ్లు తుడుచుకున్నట్లనిపించే ‘లైమ్లైట్’ చూడకపోతే వెంటనే చూడండి! కుదిరితే డీవీడీ కొని ఇంట్లో అపురూప నిధిగా దాచుకోండి! మీకు సంతోషం కలిగినప్పుడూ... కోపం వచ్చినప్పుడూ... హృదయం ద్రవించినప్పుడూ... గుండె రాయైనప్పుడూ... చూడండి! మళ్లీ... మన జీవితాల మీద కొత్త కాంతి ప్రసరించి తమాషాగా మళ్లీ మనుషులమవుతాం... ప్రపంచ సినిమాలో చిరంజీవి జగత్ప్రసిద్ధ ఇంగ్లీషు హాస్య నటుడు, చలనచిత్ర రూపకర్త చార్లీ చాప్లిన్ (1889 - 1977). మూకీ సినిమా యుగంలో ప్రేక్షకులను ఊపేసి, తన సినిమాలతో ప్రపంచాన్ని జయించిన కళాకారుడు. చిన్నవయసులోనే నటించడం మొదలుపెట్టి 88 ఏళ్ళ వయసులో మరణించడానికి ఏడాది ముందు దాకా విస్తరించిన 75 ఏళ్ళ సుదీర్ఘమైన కెరీర్ ఆయనది. కష్టాలు, కన్నీళ్ళు, దుర్భర దారిద్య్రం నుంచి కష్టపడి పైకొచ్చి తన ట్రేడ్ మార్క్ టోపీ, టూత్‌బ్రష్ లాంటి మీసం, చిత్రమైన వేషధారణతో అందరినీ ఆకట్టుకున్న చాప్లిన్ మొదట్లో తన లఘు చిత్రాల దర్శకులకు సలహాలు చెప్పి, వారి కోపానికి గురవుతుండేవారు. అయితే, ఆ లఘుచిత్రాలకు లభించిన ఆదరణ కారణంగా మరిన్ని చిత్రాలు కావాలంటూ డిస్ట్రిబ్యూటర్లు దర్శకులను కోరడంతో చాప్లిన్ దర్శకుడయ్యారు. ‘కాట్ ఇన్ ది రెయిన్’ (1914) అనే 16 నిమిషాల లఘుచిత్రంతో ఆయన దర్శకుడి అవతారమెత్తారు. ‘ది ట్రామ్ప్’ (1915) చిత్రం దర్శకుడిగా ఆయన తీసిన పూర్తి నిడివి సినిమా. అది బ్రహ్మాండమైన విజయం సాధించడంతో ఇటు నటుడిగా, అటు దర్శకుడిగా ఆయన హవా మొదలైంది. అక్కడ నుంచి ఆయన రూపుదిద్దిన కళాఖండాలెన్నో! ఫెల్లినీ దగ్గర నుంచి ట్రూఫాట్ దాకా పలువురు ప్రముఖ దర్శకులను తనదైన ‘చాప్లిన్ తరహా’ చిత్రీకరణతో ప్రభావితం చేసిన ఘనత ఆయనది. తనికెళ్ల భరణి ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు -
హాలీవుడ్లో చార్లీ చాప్లిన్..టాలీవుడ్లో
‘‘నవ్వించడం అంత సులువైన పని కాదు. తను నవ్వకుండా సమయం చూసి చలోక్తులు విసిరి ఎదుటి వ్యక్తిని నవ్వించడానికి చాలా నేర్పు కావాలి. అంత క్లిష్టమైన హాస్యరసంలో నేను మంచి పేరు తెచ్చుకోగలగడం నా అదృష్టం’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. కామెడీ హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ, దూసుకెళుతున్న నరేశ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘జంప్ జిలానీ’ ఒకటి. ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, హాస్యం గురించి పలు విశేషాలు చెప్పడంతో పాటు తన సినిమాల గురించి కూడా నరేశ్ ఈ విధంగా చెప్పారు. నవ్వు నాలుగు విధాల చేటు అనేది పాత మాట. నవ్వు ఆరోగ్యానికి మేలు అనేది నేటి మాట. రోజుకో పది సార్లు హాయిగా నవ్వుకుంటే ఆరోగ్యం బాగుంటుందని అనుభవజ్ఞులు కూడా అంటారు. మనిషి జీవితంలో అంత ప్రాధాన్యం ఉన్న హాస్యాన్ని నా సినిమాల్లో పండించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కామెడీపరంగా నాకు హాలీవుడ్లో చార్లీ చాప్లిన్, టాలీవుడ్లో రాజేంద్రప్రసాద్ అంటే ఇష్టం. డైలాగ్స్ చెప్పకుండా చాప్లిన్ నవ్విస్తే, తనదైన శైలిలో డైలాగ్స్ చెప్పి నవ్విస్తూ, తిరుగు లేని హాస్య చిత్రాల హీరో అనిపించుకున్నారు రాజేంద్రప్రసాద్. అందుకే వాళ్లిద్దరూ నాకు ఆదర్శం. ఆ అభిమానంతోనే నవ్వుల దినోత్సవాన్ని ఆ ఇద్దరికీ అంకితమిస్తున్నా. నేను కామెడీ చేస్తేనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అయితే, నటుడిగా నా ఆత్మసంతృప్తి కోసం ‘నేను’ అనే సీరియస్ మూవీ చేశాను. నా నుంచి వినోదాన్ని ఎదురు చూసే ప్రేక్షకులు ఆ సినిమాని ఇష్టపడలేదు. తాజాగా, ‘లడ్డూబాబు’లో కూడా హాస్యం తక్కువ ఉండటంతో నిరాశపడ్డారు. కానీ, ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించాననే తృప్తి నాకు ఉంది. వెండితెరపై ఈ ‘లడ్డూబాబు’ సక్సెస్ కాలేదు కానీ.. బుల్లితెరపై వచ్చినప్పుడు మాత్రం ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటాడనే నమ్మకం ఉంది. ప్రస్తుతం ‘జంప్ జిలానీ’లో నటిస్తున్నా. సత్తిబాబు దర్శకుడు. అంబికా కృష్ణ సమర్పణలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అంబికా నా సొంత సంస్థ లాంటిది. తమిళ సినిమా ‘కలగలప్పు’ ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాం. అందులో విమల్, శివ హీరోలుగా నటించారు.ఒకరు క్లాస్.. మరొకరు మాస్ అన్నమాట. మాస్‌గా సాగే రాంబాబు పాత్రను నేను చేయాలనుకున్నాను. క్లాస్‌గా సాగే సత్తిబాబు పాత్రకు వేరే హీరోని తీసుకోవాలనుకున్నాం. చివరకు ఈ రెండు పాత్రలనూ నేనే చేస్తున్నాను. పూర్తి స్థాయి ద్విపాత్రల్లో నేను కనిపించనున్న సినిమా ఇదే. రాంబాబు, సత్తిబాబు పాత్రలకు వ్యత్యాసం చూపించడానికి కృషి చేస్తున్నాను. రెండు పాత్రలకు శారీరక భాష వేరుగా ఉండేలా చూసుకుంటున్నా. ఇటీవల ఈ సినిమా కోసం ఒక సన్నివేశం తీశాం. నేను చేస్తున్న రెండు పాత్రలకు సంబంధించిన ఆ సీన్‌కి రెండు పేజీల డైలాగ్స్ ఉన్నాయి. ఈ సన్నివేశానికి మూడు గంటల సమయం పట్టింది. నాన్న దర్శకత్వంలో తొమ్మిది సినిమాలు చేశాను. నాన్నగారి కామెడీ సినిమాలు ఎంత బాగుంటాయో తెలిసిందే. మా నాన్నగారిలా నేను కూడా ఇలా వినోద ప్రధానంగా సాగే సినిమాలు చేసి నవ్వించడం చాలా ఆనందంగా ఉంది. త్వరలో మా సొంత సంస్థలో మా అన్నయ్య రాజేష్ ఆధ్వర్యంలో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇందులో నేనే కథానాయకునిగా నటించబోతున్నా. నాన్నగారి జయంతి రోజైన జూన్ 10న ఈ సినిమా ప్రారంభమవుతుంది. -
దిమ్మరి చార్లీ!
సత్వం పుడుతూనే నడకతోపాటుగా నటన నేర్చుకున్నవాడు... చార్లీ చాప్లిన్! వేదిక మీద ఆగిపోయిన తల్లి పాటను అందుకుని గొంతెత్తి పాడితే, దానికి ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందిస్తుంటే, తనుమాత్రం మీదకు విసిరిన చిల్లరడబ్బుల్ని ఏరుకోవడంలో మునిగిపోయాడు. చప్పట్లు ఆకలి తీర్చుతాయా! ఆకలికి మాడినవాడు కాబట్టే, ‘బూట్లను ఉడికించి, తినాల్సివచ్చిన’ సన్నివేశాన్ని(గోల్డ్ రష్) సృజించగలిగాడు. తాగుబోతు తండ్రి, మతిస్థిమితం తప్పిన తల్లి, అనాధాశ్రమాల్లో గడపాల్సిన పరిస్థితి, రెండేళ్లు మాత్రమే చదివిన చదువు... ఖరీదైనదిగానే తప్ప మరోలా మన ఊహకు అందని లండన్ నగరంలోని అతిపేదరికాన్ని చిరు చాప్లిన్ అనుభవించాడు. అందుకేనేమో, ‘‘నేనెప్పుడూ వాననీటిలో నడవడానికి ఇష్టపడతాను, నా కన్నీళ్లు ఎవరికీ కనబడకుండా’’ అన్నాడు. పూర్తిస్థాయి నటుడిగా స్థిరపడకముందు చాప్లిన్ చాలాపనులు చేశాడు. స్టేషనరీ స్టోరులో, డాక్టర్ ఆఫీసులో, గ్లాసు ఫ్యాక్టరీలో, షాండ్లియర్ షాపులో, ప్రింటింగ్ ప్లాంటులో. అయినా అదంతా జీవితం ఇవ్వగలిగే అనుభవంగానే లెక్కించాడు. అసలంటూ బతక్కపోవడంకంటే అది మేలే కదా! ‘‘జీవితంలో ట్రాజెడీ ఒక భాగం. కానీ దాన్ని ఎదుర్కోవడానికి పుట్టిందే కామెడీ’’ అన్నాడు చాప్లిన్. కానీ ఆ కామెడీ ఎలా ఉండాలి? ‘‘నా బాధ ఒకరి నవ్వుకు కారణమైతే కావొచ్చుగాక, కానీ నా నవ్వుకు మాత్రం మరొకరి బాధ కారణం కారాదు’’. ‘‘ఒక వృద్ధుడు అరటితొక్క మీద కాలువేసి జారి పడితే- దానికి మనం నవ్వం. అదే కొంచెం అతిశయంతో నడుస్తున్న వ్యక్తి పడితే మాత్రం నవ్వుతాం’’. ఇదీ చాప్లిన్ హాస్యం! ప్రపంచంలో ఇంతమందికి బుగ్గల్లో సొట్టలు పడేలా చేసిన నటుడు మరొకరు లేరు. కానీ ఆయన సినిమా అంటే హాస్యమొక్కటేనా? నలుపు తెలుపు చిత్రాల్లోనే జీవితంలోని అన్ని రంగుల్నీ చూపించాడు; నిశ్శబ్ద సినిమాల్లోనే జీవితపు అన్ని పార్శ్యాల్నీ వ్యాఖ్యానించాడు. పార్కు, ఓ అమ్మాయి, ఒక పోలీసు ఉంటే చాలు, సినిమా తీసేస్తాననేవాడు చాప్లిన్. మిగతా నటులందరికీ భిన్నంగా అందమైన ముఖాన్ని మేకప్ చాటున దాచిన ఏకైక నటుడు చాప్లిన్. బ్యాగీప్యాంటు, టైటుకోటు, పెద్ద తల, చిన్న టోపీ, వెలిసిపోయిన బట్టలు, అయినా హుందాతనాన్ని కాపాడుకునే యత్నంగా చేతికర్ర, చేసేది కామెడీయే అయినా సీరియస్‌నెస్ తేవడానికి చిన్నమీసాలు, పెద్దబూట్లు, పెంగ్విన్ లాంటి నడక... ఆయన నిజంగా దిమ్మరిగా గడిపినప్పుడు ఆదరణ లేదు; కానీ దిమ్మరి వేషానికి (ట్రాంప్) మాత్రం జేబుల్నిండా డబ్బులు కుక్కింది హాలీవుడ్. ద కిడ్, ద గోల్డ్ రష్, ద సర్కస్, సిటీ లైట్స్, మోడర్న్ టైమ్స్, ద గ్రేట్ డిక్టేటర్(టాకీ), లైమ్లైట్(టాకీ)... ఆయన సినిమాల్లోని సన్నివేశాల్లోంచీ, ఆయన కూర్చిన సంగీతంలోంచీ ఎన్నో సినిమాల్లో ఏదో ఒక రిఫరెన్సు లేకుండా ఉండదు! చాప్లిన్ లాంటివాళ్లకు తప్ప, కాలాతీతం అనేది ఊరికే వాడగలిగే మాటకాదు. అయినా ఒరిజినాలిటీ అనేదాన్ని చాప్లిన్ అంగీకరించలేదు. ‘‘జీవితం మొత్తం స్టీరియోటైపే. మనం ఏ ఒరిజినాలిటీతోనూ నిద్ర లేవం. మనందరమూ మూడు పూటల భోజనం, ప్రేమలో పడి లేవడమనే సాధారణ వ్యవహారాలతోనే పుట్టి చచ్చిపోతాం. కాకపోతే దాన్ని మలచడంలోనే ఆసక్తి పుట్టించగలగాలి’’ అనేవాడు. తొలుత ఆదరణ చూపిన అమెరికా చివరిదశలో వామపక్ష ముద్రతో తనను ఎంత వేధించినా, మనుషుల మీద ఆయన పూర్తి నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చినా, ‘‘అద్దం నా మంచి స్నేహితుడు; నేను ఏడ్చినప్పుడు అది నవ్వదు’’ అనేంతగా ఒంటరితనాన్ని అనుభవించినా, ‘‘జనం నిన్ను ఏకాంతంగా వదిలేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది’’ అనేంత పరాయితనాన్ని అనుభవించినా, ఆయన అందరికీ నవ్వునీ, ప్రేమనూ పంచాడు; ‘‘చిట్టచివరికి జీవితం ఒక ప్రాక్టికల్ జోక్’’ అని జీవితాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. -
అప్పటి చాప్లిన్ నవల ఇప్పుడు!
ఘనస్మృతి చార్లీ చాప్లిన్‌పై లెక్కలేనన్ని పుస్తకాలు వచ్చాయి. అందులో నవలలు కూడా ఉన్నాయి. విశేషం ఏమిటంటే ‘ఫుట్‌లైట్స్’ పేరుతో చాప్లిన్ స్వయంగా ఒక నవల రాశారు. 1948లో ఈ నవల రాశారు. నవలలో ప్రధాన పాత్ర...చాప్లిన్ సొంత అనుభవాల నుంచి పుట్టిందే. సినిమాల్లో పాత్రలు తగ్గి, ఆదరణ కోల్పోతున్న దశలో ఒక హాస్యనటుడి వేదనను ఈ నవల చిత్రించింది. ‘అరవై ఆరేళ్ళ క్రితం నాటి చాప్లిన్ నవల ఇప్పటి దాకా ఎందుకు ప్రచురించబడలేదు?’అనే సందేహం సహజంగానే వస్తుంది. దీనికి చాప్లిన్ జీవిత చరిత్రకారుడు డేవిడ్ రాబిన్సన్ చెప్పిన సమాధానం... ‘‘ప్రచురణ కోసం కాకుండా చాప్లిన్ తన కోసం తాను రాసుకున్న నవల ఇది. కాబట్టి ఆయన ఎప్పుడూ ప్రచురించే ప్రయత్నం చేయలేదు. ఈ నవలను ప్రజల్లోకి తేవడం వల్ల లేని పోని ఇబ్బందులు తలెత్తవచ్చని చాప్లిన్ కుటుంబసభ్యులు భావించి వారు కూడా ప్రచురణకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆ భయాల నుంచి బయటకు వచ్చారు.’’ చాప్లిన్ చదువుకున్నది తక్కువ. కేవలం ఆరునెలలు మాత్రమే స్కూల్లో చదువుకున్నాడు. నవల చదివిన వారికి మాత్రం పెద్ద చదువులు చదువుకున్న చేయి తిరిగిన రచయిత రాసిన అనుభూతి కలుగుతుందట. -
విజయం: చెప్పులమ్మిన చోటే... ‘ప్రపంచ సినిమా’ అమ్ముతున్నాడు!
అకిరా కురసోవా, చార్లీచాప్లిన్, బస్టర్ కీటన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు తీసిన ఆణిముత్యాల్లాంటి సినిమాల్ని భారతీయ ప్రేక్షకులకు అందించాలన్న గౌతమ్ సదాశయం అతణ్ని గొప్ప వ్యాపారవేత్తను కూడా చేసింది. విజేతగా నిలవడానికి ఎవరెన్ని మార్గాలైనా చెప్పొచ్చు! కానీ ముంబయికి చెందిన గౌతమ్ షిక్నిస్కు తెలిసిన గెలుపు సూత్రం మాత్రం ఒక్కటే.. అదే ప్రయత్నం..! మన నేపథ్యం ఎలాంటిదైనా.. జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా.. మన ఆలోచనలకు ప్రోత్సాహం కరవైనా.. స్వశక్తిపై నమ్మకంతో ప్రయత్నం చేస్తూ పోతే ఏదో రోజు ప్రపంచమంతా మనవైపు చూసేటటువంటి విజయం సాధ్యమవుతుందంటాడు గౌతమ్. చిన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చెప్పులు అమ్ముతూ కనిపించిన ఇతగాడు.. నేడు వేల కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలను నడిపించే స్థితికి చేరడానికి అతను చేసిన ప్రయత్నమే కారణం. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలుంటాయి. కానీ తన అభిరుచినే వ్యాపారంగా మార్చుకుని వందల కోట్లు ఆర్జించే స్థితికి చేరిన ఘనత గౌతమ్ షిక్నిస్ది. అకిరా కురసోవా, చార్లీచాప్లిన్, బస్టర్ కీటన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు తీసిన ఆణిముత్యాల్లాంటి సినిమాల్ని భారతీయ ప్రేక్షకులకు అందించాలన్న గౌతమ్ సదాశయం అతణ్ని గొప్ప వ్యాపారవేత్తను కూడా చేసింది. ‘పాలడార్ పిక్చర్స్’ సంస్థ గురించి తెలిసింది కొద్దిమందికే. విమర్శకుల ప్రశంసలు పొందిన, ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న వెయ్యి సినిమాల హక్కులున్న సంస్థ ఇది. డీవీడీల ద్వారా, ప్రత్యేక ప్రదర్శనల ద్వారా భారతీయ ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాల్ని చూసే అవకాశం కల్పిస్తున్న ఈ సంస్థకు శ్రీకారం చుట్టిన గౌతమ్ ఓ మామూలు వ్యక్తి. అతనిది చాలా సాధారణమైన నేపథ్యం. సీఈఓలందరూ గోల్డెన్ స్పూన్‌తో పుడతారనుకుంటే పొరబాటే. గౌతమ్ అందుకు ఉదాహరణ. ముంబయిలో ఓ పేద కుటుంబానికి చెందిన గౌతమ్ నాలుగేళ్ల వయసులో ట్రాఫిక్ సిగ్నల్స్‌లో చెప్పులు అమ్మేవాడు. ఇది రెండేళ్ల పాటు సాగింది. ఆరేళ్ల వయసులో అతని తల్లి ఓ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో గౌతమ్‌ను పాఠశాలలో చేర్పించింది. అప్పటికే చదువుపై ఎంతో మక్కువ ఉన్న గౌతమ్.. చదువులో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. స్కాలర్షిప్పులతో చదువు సాగించి ముంబయిలోని ఎన్ఎంఐఎంఎస్ నుంచి ఎంబీఏ పట్టా పొందాక సాచి అండ్ సాచి అనే ప్రకటనల సంస్థలో చేరాడు. అక్కడ శరవేగంగా ఎదిగి నాలుగేళ్ల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి.. ‘థియరీ ఎం’ అనే సంస్థను నెలకొల్పాడు. ఇండియాలో తొలి మొబైల్ కస్టమర్ సేవల సంస్థ ఇది. 90ల చివర్లోనే వివిధ కార్పొరేట్ సంస్థల తరఫున ‘థియరీ ఎం’ మొబైల్ సందేశాలు పంపించడం మొదలుపెట్టింది. తర్వాత గౌతమ్ మరో వినూత్న ప్రయత్నం చేశాడు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ఆరంభించాడు. అప్పటికి షాది.కాం కూడా మొదలు కాలేదు. ఐతే నెట్ ద్వారా సంబంధాలు కుదుర్చుకునే సంస్కృతి అప్పటికి లేకపోవడంతో ఈ ప్రయోగం విఫలమైంది. తర్వాత ఇ-కామర్స్ వెబ్సైట్ మొదలుపెట్టాడు. కానీ గౌతమ్ ఆలోచనలన్నీ అప్పటి కాలం కంటే ముందే ఉండటంతో అతనికి పెద్దగా ప్రోత్సాహం లభించలేదు. అతని వ్యాపారాలు పెద్దగా లాభాలివ్వలేదు. కానీ ప్రయత్నం మానలేదు. ఓసారి ఆండ్రియా టర్కోవ్స్కీ రూపొందించిన ‘స్టాల్కర్’ సినిమా అతనిలో ఆలోచన రేకెత్తించింది. ఇలాంటి సినిమాల్ని మన ప్రేక్షకులకు ఎందుకు అందించకూడదనిపించింది. అలా మొదలైందే ‘పాలడార్ పిక్చర్స్’. చిత్రోత్సవాలకు హాజరై అక్కడ మంచి సినిమాలు ఎంచుకుని వాటిని భారత్‌లో ప్రదర్శించేందుకు హక్కులు కొనడం మొదలుపెట్టాడు. ‘ప్రపంచ సినిమా’ పేరుతో తమ దగ్గరున్న చిత్రాల్ని డీవీడీలుగా విడుదల చేయడం.. థియేటర్లలో ప్రదర్శించడం.. టీవీ ఛానెళ్లతో ఒప్పందాలు చేసుకోవడం.. ఇలా అంచెలంచెలుగా సంస్థను అభివృద్ధి చేసి వెయ్యి కోట్లకు పైగా టర్నోవర్ సాధించే స్థితికి చేర్చాడు. ఇది కాక ‘ఎంచెక్’ అనే మొబైల్ సేవల సంస్థను నెలకొల్పి దాన్నీ వందల కోట్ల స్థాయికి చేర్చాడు. ప్రస్తుతం గౌతమ్ తాను చదివిన యూనివర్శిటీలో విజిటింగ్ ఫ్యాకల్టీగానూ పనిచేస్తున్నాడు. ‘‘మనమీద మనకు నమ్మకముండటం చాలా ముఖ్యం. నా ఐడియాలు చూసి.. అందరూ నవ్వారు. కానీ ప్రోత్సాహం లేకున్నా, అపజయాలు ఎదురైనా ప్రయత్నం మానలేదు. అందుకే ఈ స్థితిలో ఉన్నా’’ అంటాడు గౌతమ్. - ప్రకాష్ చిమ్మల