దిమ్మరి చార్లీ!
సత్వం
పుడుతూనే నడకతోపాటుగా నటన నేర్చుకున్నవాడు... చార్లీ చాప్లిన్! వేదిక మీద ఆగిపోయిన తల్లి పాటను అందుకుని గొంతెత్తి పాడితే, దానికి ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందిస్తుంటే, తనుమాత్రం మీదకు విసిరిన చిల్లరడబ్బుల్ని ఏరుకోవడంలో మునిగిపోయాడు. చప్పట్లు ఆకలి తీర్చుతాయా! ఆకలికి మాడినవాడు కాబట్టే, ‘బూట్లను ఉడికించి, తినాల్సివచ్చిన’ సన్నివేశాన్ని(గోల్డ్ రష్) సృజించగలిగాడు.
తాగుబోతు తండ్రి, మతిస్థిమితం తప్పిన తల్లి, అనాధాశ్రమాల్లో గడపాల్సిన పరిస్థితి, రెండేళ్లు మాత్రమే చదివిన చదువు... ఖరీదైనదిగానే తప్ప మరోలా మన ఊహకు అందని లండన్ నగరంలోని అతిపేదరికాన్ని చిరు చాప్లిన్ అనుభవించాడు. అందుకేనేమో, ‘‘నేనెప్పుడూ వాననీటిలో నడవడానికి ఇష్టపడతాను, నా కన్నీళ్లు ఎవరికీ కనబడకుండా’’ అన్నాడు.
పూర్తిస్థాయి నటుడిగా స్థిరపడకముందు చాప్లిన్ చాలాపనులు చేశాడు. స్టేషనరీ స్టోరులో, డాక్టర్ ఆఫీసులో, గ్లాసు ఫ్యాక్టరీలో, షాండ్లియర్ షాపులో, ప్రింటింగ్ ప్లాంటులో. అయినా అదంతా జీవితం ఇవ్వగలిగే అనుభవంగానే లెక్కించాడు. అసలంటూ బతక్కపోవడంకంటే అది మేలే కదా!
‘‘జీవితంలో ట్రాజెడీ ఒక భాగం. కానీ దాన్ని ఎదుర్కోవడానికి పుట్టిందే కామెడీ’’ అన్నాడు చాప్లిన్. కానీ ఆ కామెడీ ఎలా ఉండాలి? ‘‘నా బాధ ఒకరి నవ్వుకు కారణమైతే కావొచ్చుగాక, కానీ నా నవ్వుకు మాత్రం మరొకరి బాధ కారణం కారాదు’’. ‘‘ఒక వృద్ధుడు అరటితొక్క మీద కాలువేసి జారి పడితే- దానికి మనం నవ్వం. అదే కొంచెం అతిశయంతో నడుస్తున్న వ్యక్తి పడితే మాత్రం నవ్వుతాం’’. ఇదీ చాప్లిన్ హాస్యం! ప్రపంచంలో ఇంతమందికి బుగ్గల్లో సొట్టలు పడేలా చేసిన నటుడు మరొకరు లేరు.
కానీ ఆయన సినిమా అంటే హాస్యమొక్కటేనా? నలుపు తెలుపు చిత్రాల్లోనే జీవితంలోని అన్ని రంగుల్నీ చూపించాడు; నిశ్శబ్ద సినిమాల్లోనే జీవితపు అన్ని పార్శ్యాల్నీ వ్యాఖ్యానించాడు.
పార్కు, ఓ అమ్మాయి, ఒక పోలీసు ఉంటే చాలు, సినిమా తీసేస్తాననేవాడు చాప్లిన్. మిగతా నటులందరికీ భిన్నంగా అందమైన ముఖాన్ని మేకప్ చాటున దాచిన ఏకైక నటుడు చాప్లిన్. బ్యాగీప్యాంటు, టైటుకోటు, పెద్ద తల, చిన్న టోపీ, వెలిసిపోయిన బట్టలు, అయినా హుందాతనాన్ని కాపాడుకునే యత్నంగా చేతికర్ర, చేసేది కామెడీయే అయినా సీరియస్‌నెస్ తేవడానికి చిన్నమీసాలు, పెద్దబూట్లు, పెంగ్విన్ లాంటి నడక... ఆయన నిజంగా దిమ్మరిగా గడిపినప్పుడు ఆదరణ లేదు; కానీ దిమ్మరి వేషానికి (ట్రాంప్) మాత్రం జేబుల్నిండా డబ్బులు కుక్కింది హాలీవుడ్. ద కిడ్, ద గోల్డ్ రష్, ద సర్కస్, సిటీ లైట్స్, మోడర్న్ టైమ్స్, ద గ్రేట్ డిక్టేటర్(టాకీ), లైమ్‌లైట్(టాకీ)... ఆయన సినిమాల్లోని సన్నివేశాల్లోంచీ, ఆయన కూర్చిన సంగీతంలోంచీ ఎన్నో సినిమాల్లో ఏదో ఒక రిఫరెన్సు లేకుండా ఉండదు! చాప్లిన్ లాంటివాళ్లకు తప్ప, కాలాతీతం అనేది ఊరికే వాడగలిగే మాటకాదు.
అయినా ఒరిజినాలిటీ అనేదాన్ని చాప్లిన్ అంగీకరించలేదు. ‘‘జీవితం మొత్తం స్టీరియోటైపే. మనం ఏ ఒరిజినాలిటీతోనూ నిద్ర లేవం. మనందరమూ మూడు పూటల భోజనం, ప్రేమలో పడి లేవడమనే సాధారణ వ్యవహారాలతోనే పుట్టి చచ్చిపోతాం. కాకపోతే దాన్ని మలచడంలోనే ఆసక్తి పుట్టించగలగాలి’’ అనేవాడు.
తొలుత ఆదరణ చూపిన అమెరికా చివరిదశలో వామపక్ష ముద్రతో తనను ఎంత వేధించినా, మనుషుల మీద ఆయన పూర్తి నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చినా, ‘‘అద్దం నా మంచి స్నేహితుడు; నేను ఏడ్చినప్పుడు అది నవ్వదు’’ అనేంతగా ఒంటరితనాన్ని అనుభవించినా, ‘‘జనం నిన్ను ఏకాంతంగా వదిలేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది’’ అనేంత పరాయితనాన్ని అనుభవించినా, ఆయన అందరికీ నవ్వునీ, ప్రేమనూ పంచాడు; ‘‘చిట్టచివరికి జీవితం ఒక ప్రాక్టికల్ జోక్’’ అని జీవితాన్ని తేలిగ్గా తీసుకున్నాడు.