
లలిత్ మోదీ(PC: IPL)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ చైర్మన్ లలిత్ మోదీ(Lalit Modi) తన భారత పాస్‌పోర్ట్‌ను అప్పగించేందుకు లండన్‌లోని భారత హైకమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం వివరాలు వెల్లడించింది.
ఐపీఎల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ... 2010లో భారత్‌ను వదిలి వెళ్లిపోయాడు.
అప్పటి నుంచి లండన్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో పసిఫిక్ దీవుల్లోని వనువాతు(Vanuatu) దేశం పౌరసత్వం కూడా పొందాడు. నిధుల దుర్వినియోగం అంశంలో భారత దర్యాప్తు సంస్థలు చాన్నాళ్లుగా లలిత్ మోదీ కోసం గాలిస్తున్నాయి. ‘లండన్‌లోని భారత హైకమిషన్‌లో లలిత్ మోదీ తన పాస్‌పోర్ట్ అప్పగించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు.
నిబంధనల ప్రకారం లలిత్ దరఖాస్తును పరిశీలిస్తాం. వనువాతు పౌరసత్వం పొందాడనే విషయాన్ని కూడా అర్థం చేసుకున్నాం. చట్ట ప్రకారం అతడిపై కేసులు కొనసాగుతున్నాయి’ అని భారత విదేశంగా మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ వెల్లడించారు.
టీ20 ఫార్మాట్, సినీ గ్లామర్‌తో 2008లో భారత్‌లో ఐపీఎల్ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సంపన్న లీగ్‌గా కొనసాగుతున్న ఈ మెగా టోర్నీ సృష్టికర్తగా లలిత్ మోదీకి పేరుంది. అయితే, ఎంత వేగంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో అంతే వేగంగా పతనాన్ని చూశాడు లలిత్. 2010 ఫైనల్ తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అతడిని సస్పెండ్ చేసింది.
పుణె, కొచ్చి ఫ్రాంఛైజీల బిడ్ల విషయంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డాడని, క్రమశిక్షణారాహిత్యం, ఆర్థిక అవకతవల నేపథ్యంలో అతడిపై బోర్డు వేటు వేసి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో విచారణ కమిటి అతడిపై వచ్చిన అభియోగాలు నిజమేనని తేల్చడంతో 2013లో లలిత్ మోదీపై జీవితకాల నిషేధం విధించింది. అనంతరం అతడు లండన్‌కు పారిపోయి.. బీసీసీఐపై అనేక ఆరోపణలు చేశాడు. తాను అయాకుడినని చెప్పుకునే ప్రయత్నం చేశాడు.