విజయం: చెప్పులమ్మిన చోటే... ‘ప్రపంచ సినిమా’ అమ్ముతున్నాడు!
అకిరా కురసోవా, చార్లీచాప్లిన్, బస్టర్ కీటన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు తీసిన ఆణిముత్యాల్లాంటి సినిమాల్ని భారతీయ ప్రేక్షకులకు అందించాలన్న గౌతమ్ సదాశయం అతణ్ని గొప్ప వ్యాపారవేత్తను కూడా చేసింది.
విజేతగా నిలవడానికి ఎవరెన్ని మార్గాలైనా చెప్పొచ్చు! కానీ ముంబయికి చెందిన గౌతమ్ షిక్నిస్‌కు తెలిసిన గెలుపు సూత్రం మాత్రం ఒక్కటే.. అదే ప్రయత్నం..! మన నేపథ్యం ఎలాంటిదైనా.. జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా.. మన ఆలోచనలకు ప్రోత్సాహం కరవైనా.. స్వశక్తిపై నమ్మకంతో ప్రయత్నం చేస్తూ పోతే ఏదో రోజు ప్రపంచమంతా మనవైపు చూసేటటువంటి విజయం సాధ్యమవుతుందంటాడు గౌతమ్. చిన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చెప్పులు అమ్ముతూ కనిపించిన ఇతగాడు.. నేడు వేల కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలను నడిపించే స్థితికి చేరడానికి అతను చేసిన ప్రయత్నమే కారణం.
డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలుంటాయి. కానీ తన అభిరుచినే వ్యాపారంగా మార్చుకుని వందల కోట్లు ఆర్జించే స్థితికి చేరిన ఘనత గౌతమ్ షిక్నిస్‌ది. అకిరా కురసోవా, చార్లీచాప్లిన్, బస్టర్ కీటన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు తీసిన ఆణిముత్యాల్లాంటి సినిమాల్ని భారతీయ ప్రేక్షకులకు అందించాలన్న గౌతమ్ సదాశయం అతణ్ని గొప్ప వ్యాపారవేత్తను కూడా చేసింది. ‘పాలడార్ పిక్చర్స్’ సంస్థ గురించి తెలిసింది కొద్దిమందికే. విమర్శకుల ప్రశంసలు పొందిన, ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న వెయ్యి సినిమాల హక్కులున్న సంస్థ ఇది. డీవీడీల ద్వారా, ప్రత్యేక ప్రదర్శనల ద్వారా భారతీయ ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాల్ని చూసే అవకాశం కల్పిస్తున్న ఈ సంస్థకు శ్రీకారం చుట్టిన గౌతమ్ ఓ మామూలు వ్యక్తి. అతనిది చాలా సాధారణమైన నేపథ్యం.
సీఈఓలందరూ గోల్డెన్ స్పూన్‌తో పుడతారనుకుంటే పొరబాటే. గౌతమ్ అందుకు ఉదాహరణ. ముంబయిలో ఓ పేద కుటుంబానికి చెందిన గౌతమ్ నాలుగేళ్ల వయసులో ట్రాఫిక్ సిగ్నల్స్‌లో చెప్పులు అమ్మేవాడు. ఇది రెండేళ్ల పాటు సాగింది. ఆరేళ్ల వయసులో అతని తల్లి ఓ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో గౌతమ్‌ను పాఠశాలలో చేర్పించింది. అప్పటికే చదువుపై ఎంతో మక్కువ ఉన్న గౌతమ్.. చదువులో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. స్కాలర్‌షిప్పులతో చదువు సాగించి ముంబయిలోని ఎన్‌ఎంఐఎంఎస్ నుంచి ఎంబీఏ పట్టా పొందాక సాచి అండ్ సాచి అనే ప్రకటనల సంస్థలో చేరాడు. అక్కడ శరవేగంగా ఎదిగి నాలుగేళ్ల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి.. ‘థియరీ ఎం’ అనే సంస్థను నెలకొల్పాడు. ఇండియాలో తొలి మొబైల్ కస్టమర్ సేవల సంస్థ ఇది. 90ల చివర్లోనే వివిధ కార్పొరేట్ సంస్థల తరఫున ‘థియరీ ఎం’ మొబైల్ సందేశాలు పంపించడం మొదలుపెట్టింది. తర్వాత గౌతమ్ మరో వినూత్న ప్రయత్నం చేశాడు. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ఆరంభించాడు.
అప్పటికి షాది.కాం కూడా మొదలు కాలేదు. ఐతే నెట్ ద్వారా సంబంధాలు కుదుర్చుకునే సంస్కృతి అప్పటికి లేకపోవడంతో ఈ ప్రయోగం విఫలమైంది. తర్వాత ఇ-కామర్స్ వెబ్‌సైట్ మొదలుపెట్టాడు. కానీ గౌతమ్ ఆలోచనలన్నీ అప్పటి కాలం కంటే ముందే ఉండటంతో అతనికి పెద్దగా ప్రోత్సాహం లభించలేదు. అతని వ్యాపారాలు పెద్దగా లాభాలివ్వలేదు. కానీ ప్రయత్నం మానలేదు. ఓసారి ఆండ్రియా టర్కోవ్‌స్కీ రూపొందించిన ‘స్టాల్కర్’ సినిమా అతనిలో ఆలోచన రేకెత్తించింది. ఇలాంటి సినిమాల్ని మన ప్రేక్షకులకు ఎందుకు అందించకూడదనిపించింది.
అలా మొదలైందే ‘పాలడార్ పిక్చర్స్’. చిత్రోత్సవాలకు హాజరై అక్కడ మంచి సినిమాలు ఎంచుకుని వాటిని భారత్‌లో ప్రదర్శించేందుకు హక్కులు కొనడం మొదలుపెట్టాడు. ‘ప్రపంచ సినిమా’ పేరుతో తమ దగ్గరున్న చిత్రాల్ని డీవీడీలుగా విడుదల చేయడం.. థియేటర్లలో ప్రదర్శించడం.. టీవీ ఛానెళ్లతో ఒప్పందాలు చేసుకోవడం.. ఇలా అంచెలంచెలుగా సంస్థను అభివృద్ధి చేసి వెయ్యి కోట్లకు పైగా టర్నోవర్ సాధించే స్థితికి చేర్చాడు. ఇది కాక ‘ఎంచెక్’ అనే మొబైల్ సేవల సంస్థను నెలకొల్పి దాన్నీ వందల కోట్ల స్థాయికి చేర్చాడు. ప్రస్తుతం గౌతమ్ తాను చదివిన యూనివర్శిటీలో విజిటింగ్ ఫ్యాకల్టీగానూ పనిచేస్తున్నాడు. ‘‘మనమీద మనకు నమ్మకముండటం చాలా ముఖ్యం. నా ఐడియాలు చూసి.. అందరూ నవ్వారు. కానీ ప్రోత్సాహం లేకున్నా, అపజయాలు ఎదురైనా ప్రయత్నం మానలేదు. అందుకే ఈ స్థితిలో ఉన్నా’’ అంటాడు గౌతమ్.
- ప్రకాష్ చిమ్మల