Prakash chimmala
-
ఎత్తు తక్కువని దిగులేలనోయి!
ఎత్తయిన మగాడికి ఒనగూరుతున్న ప్రయోజనాలు, పొడుగు తక్కువున్న పురుషులు పొందుతున్న లాభాలను పోల్చి చూస్తే పొట్టి వారికి ప్రయోజనాలు ఎక్కువున్నట్లూ, వారి కాపురాలు బాగున్నట్లూ ఓ తాజా సర్వేను బట్టి తెలుస్తోంది. మగాడిని మొగుడిగా చేసుకోవడానికి ఆడవారు ఎక్కువగా చూస్తున్న ప్రధాన లక్షణాల్లో ఎత్తు ఒకటి. ఎత్తుగా ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఇదమిత్థంగా ఆడవారు చెప్పలేకపోయినా కూడా దాన్ని నమ్ముతూ వచ్చారు. కానీ, వారి నమ్మకాన్ని ఇప్పుడు పరిశోధకులు పటాపంచలు చేశారు. పొట్టివాడు గట్టివాడు మాత్రమే కాదు, మంచివాడని కూడా తేల్చారు! పొడుగాటి మొగుడి వల్ల స్త్రీలు ఆశిస్తున్న ప్రయోజనాలు అనేకం. పొడుగాటి భర్త వల్ల సామాజిక గుర్తింపు మాత్రమే కాక, వారి వల్ల భద్రత పరంగా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతూ వచ్చారు. కానీ, నిజానికి అలాంటి భద్రతాపరమైన ఉపయోగాలు వందమందిలో ఆరేడు మంది స్త్రీలకు కూడా కలగడం లేదట. అంటే, పొడుగాటి భర్త వల్ల భార్యలు ఆశిస్తున్న ప్రధాన ప్రయోజనం నిజంగా నెరవేరడం లేదని తేలిపోయింది. చాప్మాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ ఫ్రెడరిక్, న్యూయార్క్ విశ్వవిద్యాలయం సోషియాలజిస్ట్ డాల్టన్ కోన్లీ, పరిశోధక విద్యార్థి వెయిజ్ మెన్ వేర్వేరుగా జరిపిన పరిశోధనలు, అధ్యయనాల ఫలితాలు మరో సంగతి కూడా తెలిపాయి. ఈ ఫలితాల క్రోడీకరణ అనంతరం ఎత్తయిన మగాడికి జరుగుతున్న ఒనగూరుతున్న ప్రయోజనాలు, పొడుగు తక్కువున్న పురుషులు పొందుతున్న లాభాలను పోల్చిచూస్తే పొట్టివారికి ప్రయోజనాలు ఎక్కువున్నట్లూ వారి కాపురాలు బాగున్నట్లూ తెలుస్తోంది.ఎత్తయిన వారికి త్వరగా పెళ్లి సంబంధాలు కుదరడం, బాగా చదువుకున్నవారి సంబంధాలు రావడం, మెరుగైన సంబంధాలు రావడం జరుగుతుంటుంది. అయితే వీరికి రిస్కులు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. కాస్త చైతన్యం ఉన్నవారు, దూకుడుగా ఉన్నవారు వీరికి భార్యలుగా వస్తున్నారట. దీనివల్ల ఈ పొడుగాటి మగాళ్ళలో విడాకుల రేటు కూడా ఎక్కువగా ఉంటోందట. ఎక్కువగా చదువుకున్న వారు సాధారణంగా ఉన్నత ఉద్యోగాలు చేస్తూ భర్తతో హోదా పోలికలు పెట్టుకోవడం కూడా ఈ విడాకుల రేటు పెరగడానికి కారణమట. అంతమాత్రాన పొడుగ్గా ఉన్న వారి కాపురాలన్నీ కూలుతున్నాయని ఈ సర్వే చెప్పడం లేదు. ఇతరులతో పోలిస్తే ఈ వర్గంలో విడాకుల రేటు ఎక్కువ అన్నది వారు ప్రస్తావిస్తున్న విషయం. ఇక తక్కువ ఎత్తున్న పురుషులకు పరోక్షంగా కొన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి. చాలామంది ఎత్తును లోపంగా చూడడం వల్ల వీరికి పైపై ఆర్భాటాలకు ప్రాధాన్యమిచ్చే సంబంధాలు తప్పిపోయి ఒక రకంగా వీరికి మేలు చేస్తున్నాయి. ఎత్తు తక్కువున్నవాళ్ళు నిజంగా తమ బలహీనత అనుకుంటున్న విషయమే, వారికి ఎక్కువ మేలు చేస్తోంది. ఎత్తు కన్నా ముఖ్యమైన లక్షణాలను తమలో పెంపొందించుకోవడంలో భాగంగా వీరు ఆదాయం, ఇతర విషయాల్లో తమ జీవితాలను మెరుగుపరుచుకుంటున్నారు. దీంతో పెళ్లిళ్లు కొంత ఆలస్యం అయినప్పటికీ, కాబోయే భార్యాభర్తలిద్దరూ తమ వివరాలను చెప్పుకోవడం వల్ల చాలా విషయాల్లో పెళ్లికి ముందే స్పష్టత వస్తోంది. దీంతో వీరి కాపురాలు నిలబడటానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఎత్తును తమ బలహీనతగా భావించే పురుషులు భార్య ప్రేమను పొందడానికి ఇంటిపనులోనూ బాగా సాయమందుకుంటారు. దీనివల్ల కూడా దంపతుల మధ్య బంధాలు మరింత బలపడుతూ దాంపత్యాలు ఎక్కువ కాలం నిలుస్తున్నాయట. 23-45 ఏళ్ళ మధ్య వారిపైనే జరిగిన ఈ సర్వేలో 5 వేల మందికి పైగా మగాళ్లు పాల్గొన్నారు. దాన్నిబట్టి ఐదున్నర అడుగుల కంటే తక్కువ ఎత్తున్న వారి కాపురాలు మరింత సంతృప్తిగా ఉన్న విషయం తేలింది! అన్నట్లు... ఈ సమాచారం మిమ్మల్ని ఆలోచనలో పడేస్తే వెంటనే న్యూయార్క్ యూనివర్సిటీని సంప్రదించండి గానీ మాకు మాత్రం ఏం సంబంధం లేదండోయ్! - ప్రకాష్ చిమ్మల -
ప్రతి అబద్ధమూ మోసం కాదు!!
అబద్ధం మంచిది... అబద్ధం చెడ్డది... మన పూర్విక తాత్వికులకూ తెలుసు అందుకే వారన్నారు... సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. న బ్రూయాత్ సత్యమప్రియమ్. అంటే... ఎదుటివాళ్లకు ప్రియంగా ఉంటేనే సత్యం చెప్పమన్నారు. లేకపోతే వద్దన్నారు. అంతమాత్రాన వాళ్లు మోసం చేయమని చెప్పలేదు కదా! అబద్ధం మంచిది... అబద్ధం చెడ్డది... ఈ రెండు స్టేట్మెంట్లలో ఏది కరెక్టు? రెండూ కరెక్టే. అందుకే ప్రతి ఇంట్లో ముగ్గురు కచ్చితంగా ఉంటారు... భార్య, భర్త, ఒక అబద్ధం! ఒక మనిషి అన్నీ నిజాలే చెప్పి బతకడం చాలా కష్టం. దాన్ని కొందరు మూర్ఖత్వం అంటారు. అలా నిత్యం నిజాలు మాట్లాడే వ్యక్తి అంటే ఈ సమాజం భయపడుతుంది కూడా. నిజం ఎంత ప్రమాదమో అబద్ధాలు అంతే ప్రమాదం. కాపురాలు నిలబెట్టే అబద్ధాలుంటాయి, కాపురాలు కూల్చే అబద్ధాలుంటాయి. పెళ్లికి ముందు ముగిసిపోయిన ప్రేమకథ దాచితే అబద్ధం గాని పెళ్లయ్యాక నెరపే అక్రమ సంబంధం దాయడం అబద్ధం కాదు మోసం. వెయ్యి అబద్ధాలు చెప్పి అయినా ఒక పెళ్లి చేయమన్నారు. దాని అంతరార్థం మోసం చేసి పెళ్లి చేసుకోమని కాదు. జీవితంలో సంతోషం సర్దుకుపోవడంలోనే ఉంది. ప్రతి మనిషిలో లోపాలుంటాయి. వాటినే వెతుక్కుంటూ ఉంటే ఎవరికీ పెళ్లిళ్లు కావు. పైగా పెళ్లపుడు చెప్పే చాలా అబద్ధాలు దాగవు. అయితే, తెలిసినా ఇరువైపులా సర్దుకుపోవాలి. అలా సర్దుకుపోగలిగిన అబద్ధాలే చెప్పాలి. జీతం ఓ ఐదు వేలు ఎక్కువ చెప్పి పెళ్లి చేసుకుంటే సర్దుకుపోవచ్చు కానీ ఉద్యోగమే అబద్ధం అయితే సర్దుకుపోయేదేమీ ఉండదు. అంటే, ఈ అబద్ధాలు మంచి చేసేవి కావాలి గాని హాని చేసేవి కాకూడదు అన్నది పెద్దల సిద్ధాంతం. ఇలాంటిదే పాశ్చాత్య దేశాల్లో కాస్త పద్ధతిగా ఉంటుంది. అదే ‘వైట్లైస్ థియరీ’. దీని ప్రకారం కాపురం కాపాడుకోవడానికి చెప్పే ప్రతి అబద్ధమూ మంచిదే. ‘అతడు’ సినిమా చూసి ఉంటే మీకు ఓ డైలాగు గుర్తుండే ఉంటుంది... ‘నిజం దాచాలనుకోవడం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం’. అంటే కాపురంలో అబద్ధాలు ఉండొచ్చు గాని మోసాలు ఉండకూడదు. సమస్య ఎక్కడ వస్తుందంటే... భర్త చెప్పే ప్రతి అబద్ధమూ మోసమే అనే భావన భార్యలో ఉంటుంది. అది నిజం కాదు. ఎందుకంటే భర్త చెప్పే అబద్ధాల్లో కొన్ని భాగస్వామిని బాధ పెట్టకూడదని చెప్పేవి ఉంటాయి. కొన్ని కాపురంలో కలతలను నివారించడానికి అయి ఉంటాయి. ఇంకొన్ని మోసం చేయడానికే చెప్పి ఉండొచ్చు. నిజాలు తెలియకుండా/తెలుసుకోకుండా మనిషిని అపార్థం చేసుకోవడం వల్ల జీవితం ముళ్ల బాట అవుతుంది. ఈ విషయం మన పూర్విక తాత్వికులకూ తెలుసు అందుకే వారన్నారు... సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. న బ్రూయాత్ సత్యమప్రియమ్. అంటే... ఎదుటివాళ్లకు ప్రియంగా ఉంటేనే సత్యం చెప్పమన్నారు. లేకపోతే వద్దన్నారు. అంతమాత్రాన వాళ్లు మోసం చేయమని చెప్పలేదు కదా. అందుకే ప్రతి అబద్ధమూ మోసం కాదు. ప్రాణ, మాన, విత్త భంగంలో ముందు బొంకే ప్రతి అబద్ధమూ ఆపద్ధర్మమే. ఆమోదయోగ్యమే. అది మోసం కానే కాదు. ఈ విషయం గ్రహిస్తే అబద్ధానికీ, మోసానికీ తేడా తెలుస్తుంది. అది ప్రతి జీవిత భాగస్వామీ తెలుసుకుంటే వాళ్లదిక పండంటి కాపురమే. అయితే కొన్ని విషయాలు గ్రహించాలి సాధారణంగా భారతీయ పురుషులు తల్లీపెళ్లాల గొడవలు తగ్గించడానికి, భార్యకోపం నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెబుతారట. కొన్నిసార్లు నొప్పించకూడదన్న మంచి కారణంతో చెప్పిన అబద్ధాలు కూడా పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుంటాయట. అబద్ధం చెప్పిన విషయం కన్నా భర్త అబద్ధమాడాడన్న బాధే మహిళలను ఎక్కువగా బాధిస్తుందట. హద్దుల్లో ఉండే అబద్ధాల గురించి తెలిసినా కారణాలు అడిగి ఒకరినొకరు క్షమించుకుంటే కాపురం పండుతుంది. - ప్రకాష్ చిమ్మల -
విజయం: ఆమె ఆలోచనే ఒక బ్రాండ్!
వ్యాపారంలో విజయవంతం అయిన ప్రతి ఒక్కరి వెనుక ఒక వైవిధ్యభరితమైన మార్కెటింగ్ ఐడియా ఉంటుంది. రొటీన్‌గా పడే కష్టాలుంటాయి. ఈ రెండు మిళితమైతే అద్భుతమైన సక్సెస్‌ను సాధించి పెడతాయి. అలా ఎనిమిది వేల రూపాయలతో మొదలు పెట్టిన వ్యాపారాన్ని పాతికేళ్లలో ఆరు వందల కోట్ల రూపాయల స్థాయికి చేర్చిన మహిళ మీనా బింద్రా. బ్యాంక్లోన్తో మొదలుపెట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన సాధారణ గృహిణి ఈమె. ‘బిబా’ బ్రాండ్ గురించి తెలియని అర్బన్ ఆడపిల్లలు దాదాపుగా ఉండరు. టాప్స్, కుర్తా, లెగ్గింగ్స్లలో బిబా బ్రాండ్ చాలా మంది అమ్మాయిల ఫేవరెట్. ఈ డిజైనర్ వేర్ సృష్టికర్త మీనా బింద్రా. ఆమె ఆలోచన, కష్టం, అదృష్టం బిబా కు ప్రాణం పోశాయి. ఒక బ్రాండ్‌గా ఎదిగేలా చేశాయి. ‘కష్టాలు, కడగండ్లు ఎదురైనప్పుడు సహనం, పట్టుదలలు మంత్రాల్లాంటివి. వీటిని ఆయుధంగా చేసుకుంటే ఎటువంటి పరిస్థితులతోనైనా పోరాడవచ్చు...’ అంటారు మీనా బింద్రా. ఎనిమిది వేలతో మొదలైంది... బ్యాంక్ వాళ్లు లోన్‌గా ఇచ్చిన ఎనిమిది వేల రూపాయలతో ముంబై లోని ఒక ఏరియాలో 1986లో మీనా బింద్రా ఫ్యాబ్రిక్ వేర్ మొదలైంది. చిన్నపిల్లలకు, అమ్మాయిలకు డ్రస్‌ల అమ్మకం జరిగేదక్కడ. సరుకును తెచ్చుకోవడం, అమ్మడం.. లాభాలు మొదటి వారం నుంచే కళ్ల ముందు కనిపించేవి. ఆ ఉత్సాహంతో మీనాలోని డిజైనర్ నిద్రలేచింది. అమ్మాయిలను ఆకట్టుకొనేలా చుడీదార్లను డిజైన్చేయడం మొదలైంది. అనతి కాలంలోనే ఆ ఏరియాలో మీనా వాళ్ల షాప్ ఫేమస్ అయ్యింది. షాప్‌లోకి సేల్స్‌గర్ల్స్ వచ్చారు. మీనా తన డిజైన్లతో డీలర్ స్థాయికి ఎదిగారు. మొత్తంగా ఎనిమిది సంవత్సరాల్లో ముంబైలోని చాలా షాప్‌లలో మీనా డిజైనర్ వేర్ లభించడం మొదలయ్యింది. ప్రతిబంధకాలూ... ఉన్నాయి 80వ దశకం దాటి 90 వ దశకం వచ్చింది అంతలోనే ఒక కుదుపు. డిజైనింగ్ వచ్చింది మీనాకు మాత్రమే కాదు. అనేక షాప్‌ల వారు సొంతంగా డిజైనర్లను పెట్టుకొని డ్రస్సులను డిజైన్ చేయించుకోవడం మొదలుపెట్టారు. మీనాకు భయం మొదలైంది. తను కొత్త ప్రయోగాలు చేస్తున్నా డిమాండ్ తగ్గిపోయింది. ఈ సమయంలోనే మీనా ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో షాప్‌ల వారి దగ్గరకు వెళ్లారు. ఆ వైవిధ్యమైన ఆలోచనే ‘ఎథికల్ వేర్’. అమ్మాయిల ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతున్న ఆ సమయంలో, ఆడపిల్లల డ్రస్సుల్లో అసభ్యత తొంగి చూస్తున్న సమయంలో... భారతీయతను ప్రతిబింబించే నిండైన డిజైన్లతో మీనా ‘బిబా’ను మొదలుపెట్టింది. పంజాబీలో చిన్న పిల్లను బిబా అని పిలుస్తారు. ఆ విధంగా బిబా అనే పేరు ను తన బ్రాండ్‌కు పెట్టుకున్నారు మీనా. టైమ్ కలిసొచ్చింది... 28 యేళ్ల క్రితం మన దేశంలో రెడీ మేడ్ దుస్తులు అప్పుడప్పుడే వినియోగంలోకి వస్తున్న రోజుల్లో నా ప్రయత్నం మొదలుపెట్టాను. ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి అది వందశాతం కచ్చితమైన సమయం. దాంతో నాకు బాగా కలిసొచ్చింది. ఇక తమ పిల్లలు చూడచక్కని బట్టలు వేసుకోవాలని అందరు తల్లిదండ్రులూ అనుకొంటారు. అయితే ఫ్యాషన్ పేరుతో అసభ్యకరమైన డ్రస్సింగ్‌ను మాత్రం ఒప్పుకోరు. అలాంటి వారికి సౌలభ్యంగా ఉండేందుకు ఎథికల్ వేర్‌ను మొదలుపెట్టాను. ఇది బాగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా స్టోర్స్ ఉన్నాయి. కొత్తగా నెలకు నాలుగైదు కొత్త స్టోర్లు ప్రారంభిస్తున్నాం. ప్రత్యేకమైన డిజైనింగ్ టీమ్ ఉంది. మొదట బట్టలషాప్ పెట్టిన రోజు ఈ స్థాయికి ఎదుగుతామని ఊహించలేదు. ఇపుడు అంతర్జాతీయ స్థాయికి కూడా ఎదగగలమనే నమ్మకం ఉంది. వందల కోట్ల టర్నోవర్ సాధించాం. వేల కోట్లకు సులభంగానే చేరుకొంటామనే విశ్వసిస్తున్నాను. ఈ విషయంలో నా భర్త, నా పిల్లలు, నా టీమ్ సహకారం మాత్రం అద్వితీయమైనది...’ అని మీనా బింద్రా అంటారు. - ప్రకాష్ చిమ్మల -
విజయం: చుంబక్... చమక్!
వ్యాపారాలు అందరూ చేస్తారు... కానీ అందులో కాస్త కిక్కుండాలి, క్రియేటివిటీకి చోటుండాలి అంటుంది శుభ్ర. పెళ్లికి ఓ గిఫ్టు కొనాలి.. షాపులోకి వెళ్లగానే అద్దాల గదిలో తాజ్‌మహల్ చూపిస్తారు లేదంటే ఓ బెడ్ ల్యాంప్ తీసుకొచ్చి ముందు పెడతారు! పిల్లాడి పుట్టిన రోజుకు ఏదైనా బహుమతి ఇద్దామని చూస్తే టెడ్డీబేర్లు తప్ప ఇంకేం కనిపించవు! సందర్భాలు ఇంకా ఎన్నెన్నో.. కానీ వాటికి తగ్గ బహుమతులు దొరికితేగా..! ఏం చేస్తాంలే.. అని ఓ నిట్టూర్పు విడిచి, ఉన్నదేదో పట్టుకొచ్చేస్తాం! కానీ శుభ్ర చద్దా అందరిలా నిట్టూర్చి ఊరుకోలేదు. ఈ అవసరాన్నే అవకాశంగా మార్చుకుంది. తన సృజనాత్మకతకు పదును పెట్టి సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే కంపెనీకి అధిపతి అయింది! అదెలాగో చూద్దాం రండి! వ్యాపారాలు అందరూ చేస్తారు.. కానీ అందులో కాస్త కిక్కుండాలి, క్రియేటివిటీకి చోటుండాలి అంటుంది శుభ్ర. ఓసారి గూగుల్‌లో ‘చుంబక్’ అని కొట్టి చూడండి. దాని తాలూకు వెబ్సైట్లోకి వెళ్లండి. శుభ్ర చేస్తున్న వ్యాపారంలో ఎంత సృజనాత్మకమైందో అర్థమవుతుంది. పిల్లలు వాడే ఆట బొమ్మలు కావచ్చు.. కుర్రాళ్లు వాడే కీచైన్లు కావచ్చు.. సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాడే ల్యాప్‌టాప్ స్లీవ్స్ కావచ్చు.. ఏ సందర్భానికైనా ఉపయోగపడే అందమైన బొమ్మలు కావచ్చు.. ఏదైనా ప్రత్యేకమే అక్కడ. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా.. అత్యంత ఆకర్షణీయమైన రీతిలో, సరికొత్తగా డిజైన్ చేసి ఉంటాయి. కాఫీ కప్పులు, సెల్‌ఫోన్ కేస్లు, టీషర్టులు, స్టోరేజ్ టిన్స్.. ఇలా ఎన్నో విభిన్నమైన వస్తువులు దొరుకుతాయి. కానీ ప్రతి వస్తువులోనూ ‘చుంబక్’ ముద్ర ఉంటుంది. చుంబక్ ఆరంభం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. అందరిలాగే ఎంబీఏ చేసి ఓ కంపెనీలో చేరిన శుభ్ర.. ఓసారి తన బాస్‌కు వ్యాపారానికి సంబంధించి కొన్ని వినూత్నమైన ఆలోచనలు చెప్పింది. కానీ అవి బుట్టదాఖలయ్యాయి. ఇది జరిగిన రెండేళ్లకు శుభ్ర ఉద్యోగానికి దూరం కావాల్సి వచ్చింది. కారణం కడుపులో పాప. తల్లయ్యాక ఏడాది తర్వాత మళ్లీ ఉద్యోగంలోకి వెళ్లడానికి మనసొప్పలేదు. అప్పటికే శుభ్ర ఆలోచనలు తెలిసిన భర్త ప్రభాకరన్ నువ్వే ఎందుకు సొంతంగా వ్యాపారం చేయకూడదన్నాడు. అప్పుడు వచ్చింది ‘చుంబక్’ ఆలోచన. తను విదేశాలకు వెళ్లినపుడల్లా వినూత్నమైన బొమ్మలు, వస్తువులు తేవడం.. అలాంటివి ఇండియాలో లేవని బాధపడటం గుర్తు తెచ్చుకుంది. ఏడాది పాటు ఒక్కతే కష్టపడి రకరకాల బొమ్మల్ని డిజైన్ చేసింది. భర్తతో కలిసి అన్నీ చర్చించాక బెంగళూరులోని తన ఇంటిని అమ్మేసి వ్యాపారం ఆరంభించింది. ముందుగా కొన్ని స్టోర్లకు తిరిగి తమ ఉత్పత్తుల్ని అమ్మిన శుభ్ర 2010లో బెంగళూరు, చెన్నై, పుణె నగరాల్లో దుకాణాలు ఆరంభించింది. మొదట్లోనే తన ఉత్పత్తులకు మంచి పేరు రావడంతో శుభ్ర వెనుదిరిగి చూడలేదు. తనలా సృజనాత్మకంగా ఆలోచించే వ్యక్తుల్ని నియమించుకుని సాధారణమైన వస్తువుల్నే సరికొత్త డిజైన్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్ది మార్కెట్లోకి తెచ్చింది. క్రమంగా వ్యాపారం విస్తరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150 స్టోర్లలో చుంబక్ ఉత్పత్తులు అమ్ముతున్నారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్‌లలో ఈ స్టోర్లు నెలకొల్పడానికి వీరు ఆసక్తి చూపుతారు. అమెరికా దుబాయ్, యూకేలకు కూడా ఇక్కడి నుంచి వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. జపాన్‌లో అయితే ఏకంగా 70 దుకాణాలు చుంబక్ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటున్నాయి. మన హైదరాబాద్‌లోనూ చుంబక్ వస్తువులు దొరుకుతున్నాయి. ప్రస్తుతం ‘చుంబక్’ టర్నోవర్ కోట్లలో సాగుతోంది. దేశవ్యాప్తంగా మరిన్ని ఎక్స్‌క్లూజివ్ ‘చుంబక్’ స్టోర్లను ఆరంభించి వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రయత్నంలో ఉంది శుభ్ర. ‘‘విదేశాలకు వెళ్లినపుడు భిన్నరకాలైన జ్ఞాపికలు తెస్తుంటాం. కానీ మన దేశంలో ఇలాంటివి దొరకవేంటన్న ఆలోచన నుంచి మా వ్యాపారం మొదలైంది. ఫేస్బుక్ లాంటి నెట్వర్కింగ్ సైట్ల ద్వారానే చుంబక్కు మంచి ప్రచారం లభించింది. 10 రకాల ఉత్పత్తులతో మొదలైన చుంబక్ ఇప్పుడు 30కి పైగా విభిన్న రకాల వస్తువులతో నడుస్తోంది’’ అని చెప్పింది శుభ్ర. - ప్రకాష్ చిమ్మల -
విజయం: వి ఫర్ విక్టరీ, వినీత!
రస్నా, క్యాడ్బరీ, కోకాకోలా, బ్రిటానియా.. వీటిల్లో ఒకదానితో మరొకదానికి సంబంధం లేకపోవచ్చు! కానీ ‘వినీత బాలి’ అనే పేరుకు మాత్రం వీటన్నింటితోనూ సంబంధముంది! వినీత ఓ ఉద్యోగిగా చేరి రస్నాలో కెరీర్‌కు శ్రీకారం చుట్టారు. క్యాడ్బరీ అధినేత క్యాడ్బరీనీ మెప్పించారు. కోకాకోలాకు ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశారు. కష్టాల్లో ఉన్న బ్రిటానియాను పట్టాలపైకి తెచ్చి ఆదాయంలో అనూహ్య వృద్ధి సాధించేలా చేశారు. సాధారణ కుటుంబంలో పుట్టి అసామాన్యంగా ఎదిగిన ఈ ధీర వనిత జీవితం.. ఓ స్ఫూర్తి పాఠం! ‘‘ఆడా, మగా అన్న తేడాల గురించి మాట్లాడితే నాకు నచ్చదు. ఇక్కడ సామర్థ్యమే ముఖ్యం. ఆడవాళ్లకు అవకాశాలు రాకపోవడమే సమస్య. వస్తే ఏమైనా సాధించగలరు.’’ - వినీత బ్రిటానియా సంస్థ కష్టాల్లో ఉన్న కాలమది. ఆ సంస్థకు దీర్ఘకాలం మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేసిన సునీల్ అలగ్ను పదవి నుంచి తప్పించాక బ్రిటానియా గాడి తప్పింది. ఆ స్థితిలో వినీత బాలి బ్రిటానియా ఎండీగా బాధ్యతలందుకున్నారు. ఎనిమిదేళ్లు గడిచాయి. సమస్యలన్నీ సర్దుకున్నాయి. బ్రిటానియా అనేక కొత్త ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టింది. సంస్థ ఆదాయం మూడింతలు పెరిగింది. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద ఫుడ్ కంపెనీల్లో బ్రిటానియా ఒకటి. ఏమంత గొప్ప నేపథ్యం లేని ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన వినీత.. కార్పొరేట్ సంస్థల్ని విజయవంతంగా నడిపించడం, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం మామూలు విషయం కాదు. బెంగళూరుకు చెందిన వినీత ఢిల్లీలోని శ్రీరాం కళాశాలలో ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ముంబయిలో ఎంబీఏ చేసి ఫారిన్ సర్వీస్‌లో చేరాలన్నది ఆమె లక్ష్యం. కానీ ఎంబీఏ చేస్తుండగానే వోల్టాస్ సంస్థ పిలిచి మరీ ఉద్యోగమిచ్చింది. అక్కడికెళ్లి అందరిలా ఉద్యోగం చేసుకోకుండా ‘రస్నా’ను మార్కెట్లోకి తెచ్చారు వినీత. అంతే. దెబ్బకు జీవితం మారిపోయింది. వెంటనే దిగ్గజ చాక్లెట్ సంస్థ ‘క్యాడ్బరీ’ నుంచి ఆహ్వానం! అక్కడ పనితీరుకు సంస్థ అధినేత అడ్రియన్ క్యాడ్బరీ నుంచి ప్రశంసలు. ఉద్యోగ జీవితం సాగుతుండగానే రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి విదేశాల్లో చదివేందుకు వినీతకు స్కాలర్షిప్ వచ్చింది. అవకాశాన్ని వదులుకోకుండా వెళ్లి యుఎస్‌లో చదువుకుని మరింత రాటుదేలారామె. ఆ తర్వాత ఆమె మరో కంపెనీ వైపు చూడలేదు. యూకేలో సీనియర్ బ్రాండ్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చింది క్యాడ్బరీ. అక్కడ వినీత ప్రవేశపెట్టిన ‘విస్పా’ చాక్లెట్ మార్కెట్లో ఓ సంచలనం! క్యాడ్బరీ నుంచి వినీత తదుపరి ప్రయాణం శీతలపానీయాల దిగ్గజ సంస్థ కోకాకోలాలోకి. ఆ సంస్థకు ఆమె వరల్డ్‌వైడ్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశారు. ఈ బాధ్యతల్లో ఆమె ఎన్నో దేశాలు తిరిగారు. ఈ క్రమంలో ఆమె 45 దేశాలు చూశారు. ఆరు దేశాల్లో నివాసమున్నారు. తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో 2005లో తప్పనిసరి పరిస్థితుల్లో బెంగుళూరుకి వచ్చేశారు వినీత. ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి రావడంతో అప్పటికే నష్టాలలో ఉన్న బ్రిటానియాలో చేరారు. ఓవైపు తల్లి అనారోగ్యం, మరోవైపు సంస్థ కష్టాలు. సాధారణంగా స్త్రీలు చాలా బంధాల్లో చాలా ఎమోషనల్ అంటారు. నిజమే.. ఆమెకు తల్లితో ఉన్న బంధమే సంస్థతో కూడా ఉంది. అంత ఎమోషన్ ఉంది కాబట్టే తల్లినీ చూసుకున్నారు, సంస్థనూ నిలబెట్టారు. బ్రిటానియా తరఫున ఆమె నెలకొల్పిన న్యూట్రిషన్ ఫౌండేషన్ చిన్నపిల్లల్లో పోషకాహార లోపాల్ని నివారించేందుకు కృషి చేస్తోంది. అంతేకాకుండా ఫౌండేషన్ ద్వారా సమాజానికి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇండియాలోని బిస్కెట్ కంపెనీల్లో అతి సామాన్యులకు-సంపన్నులకు ఇరువురికి నచ్చే ఉత్పత్తులను తేగలిగిన సత్తాకి సంస్థను వృద్ధి చేశారు. అందుకే 2011లో ఫోర్బ్స్.. వినీతను ఆసియాలోని 50 మంది అత్యుత్తమ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా గుర్తించింది. అంతేనా.. మరెన్నో పురస్కారాలు వినీత సొంతమయ్యాయి. - ప్రకాష్ చిమ్మల -
దక్షిణం: ప్రకటనలకు ఎక్కిన మగబుద్ధి !
స్త్రీలపై జోకులకు వయసెక్కువ. మగాళ్లపై సెటైర్లకు ప్రచారమెక్కువ. స్త్రీలైపై జోకులే ముందుగా పుట్టాయి. ముందుగా ప్రచారం పొందాయి. ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ మధ్యనే మగాళ్లపై కూడా బాగా ఎక్కువగా సెటైర్లు పడుతున్నాయి. అంతేకాదు ముందొచ్చిన చెవుల కొంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు పురుషుల మీద వస్తున్నవి (ముఖ్యంగా మగబుద్ధికి సంబంధించినవి) ఈ మధ్య ప్రముఖ కంపెనీల ప్రచారానికి ఉపయోగపడుతున్నాయి. నిజానికి ఆ ప్రకటనలకు - వాటికి సంబంధం లేకపోయినా క్రేజు కోసం వాడేస్తున్నారు. నిజానికి అవి మగజాతి సహజ లక్షణాలు ! ఎంత బిజీగా ఉన్నా అందాన్ని ఆస్వాదిస్తాడు: మగాడికి సౌందర్యారాధన ఎక్కువ. దానిని ఎంత శ్రద్ధగా చేస్తాడంటే ఎంత టెన్షన్లో, బిజీగా ఉన్నా మానడు. దీని ఆధారంగా ఓ మందు కంపెనీ ఈ ప్రకటన తయారుచేసింది. ఓ వృద్ధ జంట ఆపమని పరుగెత్తుకు వస్తున్నా బాగా బిజీగా ఉండటం వల్లే లిఫ్టును ఆపకుండా పద్దెనిమిదో ఫ్లోరుకు అర్జెంటు పనిమీద వెళ్లిపోతాడు. అక్కడో అందమైన యువతిని చూడగానే పనంతా మరిచిపోయి మళ్లీ ఆమెతోపాటు పద్దెనిమిది ఫ్లోర్లు దిగుతాడు. సెలక్టెవ్ మెమొరీ సిండ్రోమ్: సాధారణంగా చాలామంది భర్తలకు పెళ్లి రోజు, భార్య పుట్టిన రోజు గుర్తుండవు. పాపం ఇందులో వాళ్ల తప్పేం లేదట. అదొక వ్యాధి అట. దానికి సెలక్టెవ్ మొమరీ సిండ్రోమ్ అని పేరుపెట్టారు. కాకపోతే చికిత్సే కాస్త ఖరీదు. పెళ్లయిన మూడు-నాలుగేళ్లకు ఇది సోకే అవకాశం ఉంటుంది. ఏడాదికి రెండు మూడు సార్లు డిప్రెషన్ కలిగించే ఈ వ్యాధికి చీరలు, బంగారం, వజ్రాలతో చికిత్స చేయించొచ్చు. దీనిపై ఓ ప్రకటన వచ్చింది. ‘ఆఫీసు పార్టీ హడావుడిలో పెళ్లిరోజును మరిచిన ఓ మగాడు వజ్రాల దుకాణానికి వెళ్తాడు. పెళ్లిరోజు డైమండ్ రింగ్ అడిగితే 1 క్యారెట్, 2 క్యారెట్ డైమండ్ చూపించినా మెప్పడు. పెళ్లిరోజు నిన్న అని తెలియడంతో షాపువాడు ఏకంగా ఐదు క్యారెట్ల డైమండ్ చూపిస్తాడు. అపుడు కానీ ఆ మొహం వెలగదు’. ఇది ఓ మద్యం ప్రకటన. అందమైన అమ్మాయి అడిగితే కాదంటారా? పడవ నిండా కుర్చీలు రవాణా చేస్తుంటాడొకతను. ఓ గట్టు మీద చక్కటి యువతి. నేను రానా అని సైగ చేయగానే కొన్ని కుర్చీలు పడేస్తాడు. ఆమె మేకపిల్ల కోసం మరికొన్ని, దాని మేత కోసం ఇంకొన్ని... కుర్చీలు నీళ్లలో. ఆ యువతి, ఆమె సంత పడవలో. ఇది ఫెవికాల్ యాడ్. అబ్బాయిల హృదయం సున్నితం, అందమైన అమ్మాయి అడిగినపుడు మంచులా కరుగుతుంది నష్టమైనా, కష్టమైనా అని చెప్తోందీ ప్రకటన! టీవీల్లో రోజుకు పదుల సార్లు వస్తున్న ఈ ప్రకటనలు ఆయా కంపెనీలకు ప్రచారాన్ని, ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాకపోతే మన గురించి మరీ అలా బహిరంగంగా తెలిస్తే ప్లస్‌లూ ఉన్నాయి. మైనస్లూ ఉన్నాయి. కొన్ని ఘాటు నిజాలు అన్నిసార్లు రాజ్యం మనదే కాదండోయ్. ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవడం అంటే ఏంటో మగాళ్ల విషయంలోనూ అపుడపుడు అర్థమవుతోంది. మచ్చుకు కొన్ని. - 1950 కి ముందు అమెరికాలో 80 శాతం మంది మగాళ్లకు ఉద్యోగాలుంటే ఇపుడు 60 శాతం మందికే ఉన్నాయట. - ఉద్యోగాలున్న మగాళ్లకంటే నిరుద్యోగంతో బాధపడే మగాళ్లకి డైవర్స్ అవకాశాలు మూడు రెట్లు ఎక్కువట. - ఆధునిక సేవా రంగాల్లో మగాళ్లు మిడిల్ మేనేజ్మెంట్లో ఎక్కువ ఉద్యోగాలు కోల్పోతున్నారట. వాటిని స్త్రీలు చేజిక్కించుకుంటున్నారు. - ఇపుడు మనదేశంలోని ఐదుకు పైగా రాష్ట్రాల్లో వధువుల కొరత పెరిగింది. - శృంగారం విషయంలో స్త్రీల అభిప్రాయానికి భారతీయులు తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. - ప్రకాష్ చిమ్మల -
విజయం: గెలవడమూ, గెలిపించడమూ తెలుసు!
ప్రకాష్ చంద్ర ముర్ము.. ఈ కుర్రాడికి స్కూలుకెళ్లి చదువుకోవడమే ఓ కల. అలాంటిది అతనికి చదువుతో పాటు.. లండన్‌కు వెళ్లి రగ్బీ ఆడే అవకాశం కూడా దక్కింది. స్కూలు చదువైనా పూర్తి చేస్తానా అని అనుమానమున్న సీమా హన్స్డా ఎంబీబీఎస్ చదువుతోంది. సౌదాగర్ హన్స్డా లా చేస్తున్నాడు. సంజుక్త రాణి హెంబ్రమ్ ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేయబోతోంది. వీళ్ల పేర్లు గమనిస్తే.. అందరూ గిరిజనులే అని అర్థమైపోతోంది. వీళ్లందరికీ సుదూర స్వప్నంలా కనిపించిన ‘ఉన్నత చదువు’ను చేరువ చేసిన ఉన్నతుడు డాక్టర్ అచ్యుత సమంత. పేద కుటుంబంలో పుట్టి, చదువుకోవడానికి అష్టకష్టాలు పడిన ఈ సామాన్యుడు.. దేశంలోనే ఒకానొక డీమ్డ్ యూనివర్శిటీకి అధిపతి అయ్యే స్థితికి చేరిన వైనం స్ఫూర్తిదాయకం! ఒడిషాలో ‘కిస్’ అంటే తెలియని వారుండరు. ఇందులో దురర్థమేమీ లేదు. కిస్ అనేది గిరిజనుల కోసం వెలసిన యూనివర్శిటీ. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌కు సంక్షిప్త రూపమే కిస్. ఒక సక్సెస్ నుంచి మరెన్నో సక్సెస్‌లకు వేదికైన గొప్ప విద్యాలయం ఇది. దేశంలో అతి పెద్ద డీమ్డ్ యూనివర్శిటీల్లో ఇదొకటి. 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ యూనివర్శిటీ ఇప్పటిదాకా 20 వేల మందికి పైగా గిరిజన విద్యార్థులకు గూడునిచ్చి, కడుపు నింపి, విద్యాబుద్ధులు చెప్పి వారికి జీవితాన్నిచ్చింది. దీని వ్యవస్థాపకుడు అచ్యుత సమంత. గిరిజనుల కోసం ఇంత చేస్తున్నాడు కాబట్టి.. సమంత కూడా గిరిజనుడే అనుకుంటే పొరబాటే. ఆయన కులం, మతం గురించి ప్రస్తావన అనవసరం. కానీ ఆయన గిరిజనుడు మాత్రం కాదు. కానీ పేదరికం గురించి మాత్రం బాగా తెలిసిన, అనుభవించిన వ్యక్తి. చిన్నప్పుడే తండ్రి చనిపోతే.. తల్లి చిన్నచిన్న పనులు చేసి అచ్యుతను చదివించింది. అతను కూడా చదువుకుంటూనే రకరకాల పనులు చేశాడు. కానీ ఏనాడూ చదువును నిర్లక్ష్యం చేయలేదు. పట్టుదలతో చదివి రసాయన శాస్త్రంలో పీజీ చేశాడు. అనంతరం పదేళ్ల పాటు వివిధ కళాశాలల్లో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఐతే జీవితంలో స్థిరపడినా సమంత మనసు మాత్రం స్థిమితంగా లేదు. ఇంకా ఏదో సాధించాలని 1992లో తన దగ్గరున్న రూ.5 వేల పెట్టుబడితో రెండు గదులు అద్దెకు తీసుకుని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ మొదలు పెట్టాడు. గిరిజన పిల్లల్ని అందులో చేర్చుకుని వారికి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. అదే తర్వాత కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ (కేఐఐటీ)గా మారింది. తర్వాత ‘కిస్’ కూడా శ్రీకారం చుట్టుకుంది. ఐతే ఈ క్రమంలో సమంత పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తన విద్యా సంస్థల్ని తీర్చిదిద్దే క్రమంలో ఆయన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. మొదట్లోనే ఆయన వడ్డీ వ్యాపారులకు రూ.15 లక్షలు బాకీ పడ్డారు. ఐతే ఓ జాతీయ బ్యాంకు ఆయనకు లోన్ ఇచ్చి ఆదుకుంది. ఈ డబ్బులతో తన విద్యా సంస్థను అభివృద్ధి చేసి తన కష్టాలన్నింటికీ చెక్ పెట్టేశారు సమంత. ప్రస్తుతం ‘కిస్’లో లేని కోర్సంటూ లేదు. కేజీ నుంచి పీజీ వరకు ఏ చదువైనా దొరుకుతుందిక్కడ. ఐతే ప్రవేశం గిరిజనులకు మాత్రమే. యూనివర్శిటీకి వెళ్లో.. లేక ఆన్లైన్లోనే అప్లికేషన్ సమర్పిస్తే చాలు.. వారి పరిస్థితిని బట్టి ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజులతో భోజనం, వసతి కల్పించి చదువు చెప్పిస్తారు. గత పదేళ్లుగా ‘కిస్’లో డ్రాపౌట్ ఒక్కరూ లేరు. వంద శాతం ఫలితాలతో దూసుకెళ్తోంది కిస్. ఈ యూనివర్శిటీ కోసం సమంత చేసిన త్యాగాలు అసామాన్యమైనవి. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ‘కిస్’కు స్వయంగా విచ్చేసి సమంతను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు జవహర్లాల్ నెహ్రూ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆయన నిస్వార్థ కృషికి జాతీయంగా, అంతర్జాతీయంగా మరెన్నో అవార్డులు దక్కాయి. - ప్రకాష్ చిమ్మల -
దక్షిణం: కామన్‌సెన్స్‌కు మించిన సలహా లేదు!
ఆలస్యం అమృతం విషం - నిదానమే ప్రధానం... ఈ రెండు సామెతలు ఒకేసారి వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇందులో ఏదో ఒకటి తప్పనిపిస్తుంది. కానీ...రెండూ కరెక్టే. ముందు మనిషికి ఓ కామన్ సెన్స్ అంటూ ఉంటుంది కదా... దాన్ని వాడితే ఈ రెండు సామెతల్లో ఏది ఎపుడు కరెక్టో తెలుస్తుంది. స్త్రీ విషయంలో కూడా ఇంతకుమించి ఎన్నోరెట్లు కామన్సెన్స్ పనిచేయాలి. ప్రపంచంలో అబ్బాయిలు మహా అయితే పది పదిహేను రకాలు ఉంటారు. అమ్మాయిలు... ఎంత మంది ఉంటే అన్నిరకాలుగా ఆలోచిస్తారు. ఒకరి ఆలోచనా తీరు ఉన్నట్లు ఇంకొకరి ప్రవర్తన ఉండదు. అందుకే ఏ అమ్మాయి ప్రేమలో పడినా, ఏ అమ్మాయిని ప్రేమలో పడేయాలన్నా ఆ అమ్మాయి ఆలోచనా తీరుబట్టే ఉండాలి. అమ్మాయిలు అర్థం కారురా బాబూ... అనే బెంగ అక్కర్లేదు. వారు అర్థమవుతారు. కాకపోతే ఎవరికి వారు యునిక్ కాబట్టి మీక్కావల్సిన వారిని మాత్రమే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అందరూ కొన్ని కామన్ టిప్స్ చెబుతుంటారు. అవి అన్నిసార్లూ చెల్లవు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. క్రేజీగా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారు... ఇది అబ్బాయిలు నమ్మే ఒక కామన్ సూత్రం. ఇది కొంతవరకే నిజం! ఏ బొమ్మరిల్లు సినిమానో చూసి ప్రతి అమ్మాయి మిడ్నైట్ ఐస్‌క్రీం తినడం ఇష్టపడుతుందనుకుంటే పొరపాటు. అలానే మిగతా విషయాలూ. నిజాయితీగా ఉంటే ఇష్టం... ఎందులో నిజాయితీ అన్నది పెద్ద సమస్య. నిజాయితీగా పాత గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్న చనువునంతా చెప్పేస్తే ఏ అమ్మాయి భరించగలదు? సెన్సాఫ్ హ్యూమర్ అమ్మాయిలకు ఇష్టం... అవును, కానీ అందరికీ సెటైర్లు అర్థం చేసుకునేటంత చిలిపి మనసు ఉండదు. అవి బూమ్రాంగ్లు అవ్వొచ్చు. మీ జోకులు సులువుగా క్యాచ్ చేసేటంత షార్ప్‌నెస్ ఉంటుందనే గ్యారంటీ ఏమిటి? అది కొందరమ్మాయిలకు కిక్ ఇస్తే, ఇంకొందరు దానివల్లే మనల్ని కిక్ చేయొచ్చు! ఆ వ్యక్తిని బట్టి మోతాదుండాలి. స్టేటస్‌కు పడిపోతారు... కాస్ట్లీ బైకు, కారు అందరు అమ్మాయిలను పడగొట్టలేవు. అదేనిజమైతే ఈ ప్రపంచం ఓ నెల కూడా నడవదు. కాలం మారినా... కాలం మారింది అమ్మాయిలు ఫాస్ట్ అయిపోయారు. రొమాంటిక్‌గా మాట్లాడాల్సిందే అనుకుంటున్నారా? సినిమాలు చూసి చెడిపోకండి. అందరూ అలా మారాలంటే కనీసం ఒక రెండు మూడు తరాలు మారాలి. ఇంకా మనం మొదటి తరంలోనే ఉన్నాం. కొసమెరుపు: ఇలాంటి సూత్రాలు చాలానే ఉన్నాయి. ఎన్నున్నా ఒకటి మాత్రం కామన్‌గా పనిచేస్తుంది. ఎంత శుభ్రంగా, క్రమశిక్షణగా డ్రెస్ చేస్తారు. శరీర సౌష్టవాన్ని ఎంత చక్కగా కాపాడుకుంటారన్నది మాత్రం మగాడిలో ప్రతి అమ్మాయికీ కామన్‌గా నచ్చే అంశం. ‘ఆ ముద్దు’... చాలా పాతది ఇది 2013. కానీ... ఇప్పటికీ సినిమాలో లిప్‌కిస్ పెట్టడం ఒక వార్త. రొమాంటిజమ్లో అధిక మార్కులు కొట్టేసే ఈ చర్య పాశ్చాత్యులకే కాదు, భారతీయులకీ పాతదే అంటే నమ్ముతారా. ఎనైభె సంవత్సరాల క్రితమే ఇది భారతీయ సినిమాల్లో ఉంది. అంటే భారతీయ సినిమా పుట్టిన 20 ఏళ్లకే మన వాళ్లు లిప్‌కిస్ పరిచయం చేసేశారు. 1933లో తీసిన కర్మ సినిమాలో హిమాంశు రాయి, దేవికా రాణిల ఈ మద్య ఈ ముద్దు సీను నడిచింది. బాలీవుడ్లో ఇదే తొలి రొమాంటిక్ సీన్. సామాజిక స్వాతంత్య్రం కంటే ముందుగానే భారతీయులు రొమాంటిక్ స్వాతంత్య్రం సంపాదించేశారా? - ప్రకాష్ చిమ్మల -
విజయం: వన్ అండ్ ఓన్లీ అలీషా
అలీషాకు చిన్నప్పటి నుంచే బైకులపై మక్కువ కలిగింది. ఆమె ఆసక్తిని చూసి సరదాగా డ్రైవింగ్ నేర్పించాడు అబ్దుల్లా. కానీ ఆమె సరదా కోసం డ్రైవింగ్ నేర్చుకోలేదని కొన్నాళ్ల తర్వాత అర్థమైంది అబ్దుల్లాకు. డాక్టర్ కూతురు డాక్టర్ కావచ్చు.. యాక్టర్ కూతురు యాక్టర్ కావచ్చు.. ఇంజినీర్ కూతురు ఇంజినీర్ కావచ్చు.. వ్యాపారవేత్త కూతురు వ్యాపార వేత్త కావచ్చు.. కానీ ఓ బైక్ రేసర్ కూతురు బైక్ రేసర్ కావచ్చా..? ఊహూ.. సమాజం ఒప్పుకోదు! అందునా భారతీయ సమాజం అస్సలు ఒప్పుకోదు! కానీ అలీషా అబ్దుల్లా.. మగ రేసర్ల మీదే కాదు, సమాజం మీద కూడా గెలిచింది. అందుకే దేశంలో ‘తొలి, ఏకైక మహిళా సూపర్ బైక్ రేసర్’గా ఆమె చరిత్రకెక్కింది. ఆడా మగా సమానమంటారు.. ఆడవాళ్లకు తిరుగులేదంటారు.. వాళ్లకేం తక్కువంటారు.. ఇలాంటి కబుర్లకు లోటేం ఉండదు. అయినా.. కొన్ని రంగాల్లో ఆడాళ్లకు అవకాశముండదు.. అలాంటి రంగాల్ని ఆడవాళ్లు ఎదుర్కొంటే అదోలా చూస్తారు.. మగరాయుడంటారు.. నీకిది అవసరమా అంటారు.. ఇలాంటి అనుమానాల్ని, అవమానాల్ని చాలానే ఎదుర్కొంది అలీషా. అయినా వెనక్కి తగ్గలేదు. చెన్నైకి చెందిన ఈ అమ్మాయి రక్తంలోనే ‘రేసింగ్’ ఉంది. అలీషా తండ్రి ఆర్ఏ అబ్దుల్లా ప్రముఖ బైక్ రేసర్, ఏడుసార్లు జాతీయ ఛాంపియన్. తండ్రి రేసుల్ని చూడటానికి వెళ్లే అలీషాకు చిన్నప్పటి నుంచే బైకులపై మక్కువ కలిగింది. ఆమె ఆసక్తిని చూసి సరదాగా డ్రైవింగ్ నేర్పించాడు అబ్దుల్లా. కానీ ఆమె సరదా కోసం డ్రైవింగ్ నేర్చుకోలేదని కొన్నాళ్ల తర్వాత అర్థమైంది అబ్దుల్లాకు. తానూ రేసర్ అవుతానని అలీషా అన్నపుడు నవ్వి ఊరుకున్న ఆయన.. ఆమె మొండి పట్టు పట్టడంతో పచ్చ జెండా ఊపారు. అప్పటిదాకా ఇండియాలో ఎక్కడా మహిళా రేసర్లను చూసిన అనుభవం అబ్దుల్లాకు కూడా లేకపోవడంతో అందరిలాగే ఆయనకూ అలీషాపై లోలోన అనుమానమే. ఐతే తొమ్మిదేళ్ల వయసులోనే గోకార్టింగ్లోకి అడుగుపెట్టింది అలీషా. రెండేళ్లకే అబ్బాయిలందరినీ వెనక్కి నెడుతూ రేసులు గెలవడం మొదలుపెట్టింది. 13 ఏళ్ల వయసులో ఎంఆర్ఎఫ్ జాతీయ గోకార్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో ఆమె పేరు మార్మోగిపోయింది. తర్వాత తన రంగంలో తానే ప్రమోషన్ ఇచ్చుకుని ఫార్ములా కార్ రేసింగ్‌లోకి అడుగుపెట్టింది అలీషా. అక్కడా సంచలనాలే. తన ప్రతిభకు అనేక విజయాలు, పురస్కారాలు దక్కాయి. 2004లో జాతీయ ఫార్ములా కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో 25 మంది అగ్రశ్రేణి పురుష రేసర్లతో పోటీపడి ఐదో స్థానంలో నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఏడాది ఆమెకు బెస్ట్ నొవైస్ పురస్కారం కూడా దక్కింది. ఐతే ఫార్ములా కార్ రేసింగ్ బాగా ఖర్చుతో కూడుకున్నది కావడంతో అలీషాను అందులోంచి తప్పించి.. సూపర్ బైక్ రేసింగ్‌లోకి మార్పించారు తండ్రి అబ్దుల్లా. ఉన్నట్లుండి కార్లు వదిలి బైకులకు మారినా.. త్వరగానే సర్దుకుందామె. ఏడాదిలోనే పురుష రేసర్లకు గట్టి పోటీనిచ్చే స్థాయికి చేరింది. 2007లో ఓ రేసు మధ్యలో యాక్సిడెంట్ అయినా.. రేసు ఆపకుండా మూడో స్థానంలో నిలవడం ఆమె పట్టుదలకు నిదర్శనం. అలీషా ఎవరూ నడవని దారిని ఎంచుకుని అందులో విజయాలు సాధించినా.. మరో అమ్మాయి ఎవరూ ఆవైపు చూడట్లేదంటే.. ఆమె ఎంచుకున్న మార్గం ఎంత కఠినమైందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆమె దేశంలో తొలి సూపర్‌బైక్ రేసరే కాదు. ఏకైక మహిళా రేసర్ కూడా. 200 కిలోలకు పైగా బరువుండే బైకును 150 కిలోమీటర్లకు పైగా వేగంతో ఓ అమ్మాయి నడపడమంటే మామూలు విషయం కాదు. అందుకు ఎంత ఫిట్నెస్ కావాలి? అందుకే రోజుకు ఆరేడు గంటల పాటు ఫిట్నెస్ కసరత్తులు చేస్తుందామె. క్రీడాకారులు సాధారణంగా ఓ స్థాయికి రాగానే చదువును వదిలేస్తారు. అందునా గంటల తరబడి సాధన చేస్తూ, రేసుల కోసం నగరాలు తిరుగుతూ ఉండే రేసర్లకు అసలే తీరిక ఉండదు. కానీ అలీషా చదువును నిర్లక్ష్యం చేయలేదు. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే కాదు.. హ్యూమన్ రిసోర్స్లో పీజీ చదివింది. రేసింగ్‌లో తనకు ఎదురైన అతి పెద్ద సవాల్.. పురుషాహంకారమే అంటుంది అలీషా. ‘‘ఓ ఆడది మమ్మల్ని దాటి వెళ్లడమేంటనే అహం మగాళ్లకుంటుంది. ఏ రేసుకు వెళ్లినా పురుషులంతా ఒకవైపు. నేనో వైపు. వాళ్లంతా ఒక్కటై నన్ను వెనక్కి నెట్టాలనుకుంటారు. నీకెందుకీ రేసులని తోటి రేసర్లే నాపై కామెంట్లు చేస్తుంటారు. కానీ నేనే వేటికీ లొంగలేదు. అంతర్జాతీయ స్థాయిలో రేసులు గెలవాలని.. గొప్ప రేసర్‌గా పేరు తెచ్చుకోవాలన్నది నా లక్ష్యం’’ అని చెప్పిందామె. - ప్రకాష్ చిమ్మల -
దక్షిణం: అప్పుడప్పుడు మౌనవ్రతమే ఆయుధం
మగాడి కోపం వెనుక కారణం ఉంటుంది, భార్య కోపం వెనుక భావోద్వేగం ఉంటుంది. భార్య ముందు ఏ సాక్ష్యాలు పనిచేయవు. అది ప్రజాకోర్టు వంటిది. పూర్వాపరాలతో సంబంధం లేకుండా వర్తమాన సాక్ష్యాధారాలపైనే న్యాయాన్యాయాల విచారణ, శిక్ష విధింపు జరుగుతుంటుంది. కాబట్టి... భార్యను మేనేజ్ చేయడం వచ్చిందంటే మీలో ఐఐఎంలో ఎంబీఏ చేసేంతటి పరిజ్ఞానం, తెలివితేటలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అవును, బంధాల మధ్య మేనేజ్ చేయడం ఉంటుందా అని మీరడిగారనుకోండి ‘మేనేజ్ చేయడం’ అనే విషయాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టు. మేనేజ్ అంటే గారడీలు చేసి వాస్తవాలను తారుమారుచేయడం కాదు... పరిస్థితిని చాణక్యంతో అదుపులో ఉంచడం. సంబంధాలు బలహీన పడకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం. మీరు తప్పు చేసినపుడు ఆమెకు కోపం రావచ్చు, ఏడుపు రావచ్చు... లేదా మీరు దురదృష్టవంతులైతే రెండూ కలిసి రావచ్చు. ఒక వేళ మీరు నిజంగా తప్పు చేసిఉంటే, దానికి ఆమె వద్ద ప్రత్యక్ష సాక్ష్యం ఉంటే అపుడు మీ ముందున్న అత్యుత్తమ మార్గం మౌనవృతం చేస్తూ ఆమె ఆరోపణలు, తిట్లు, విమర్శలు అన్నీ భరించడం. మీరు పెద్ద తప్పేం చేయలేదనుకోండి.. కేవలం ఆమె అపార్థం చేసుకుని మిమ్మల్ని నిందిస్తుంటే వాస్తవాల్ని వివరించి సర్దిచెప్పే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత నీ ఇష్టం అని మూడీగా మారిపోవాలి. ఆమె అర్థం చేసుకోకపోతే (సాధారణంగా జరగదు) రేపు మరోసారి మళ్లీ నెమ్మదిగా ఆ పనిచేయాలి గాని ఇరిటేషన్ తెచ్చుకుని, విసుక్కుని వాదులాటకు దిగకూడదు. మీరు చేసిన తప్పుకన్నా ఆ విసుగే పెద్ద తప్పుగా పరిగణిస్తారు. ఎందుకంటే కొందరికి కోపంలో నోరు, మనసు తప్ప ఇంకేం (మెదడు లాంటివి) పనిచేయవు. ఇంకో అత్యంత ముఖ్యమైన సూత్రం ఏంటంటే... మీ తప్పు గురించి గొడవ జరుగుతున్నపుడు ఆమె పాత తప్పులు వెతికి చూపే ప్రయత్నం చేస్తే గొడవకు ఆజ్యం పోయడం తప్ప మరోటి కాదు. ఫైనల్‌గా ఓ మాట... తెగేదాకా లాగొద్దు, విడిపోవాలనుకుంటే తప్ప! బంధాలు ఫెవిక్విక్తో అతుక్కోవు. ప్రియురాలు వర్సెస్ భార్య ప్రియురాలు తన కోసం ఖర్చుపెట్టమంటుంది. భార్య మనకోసం దాచిపెట్టమంటుంది. ప్రియురాలి కోసం మనం అన్నీ సర్దాలి. భార్య సర్దితే భర్త ఆస్వాదిస్తాడు. బాగుంటే ప్రియురాలు చూస్తుంది, బాగోకపోయినా భార్య చూస్తుంది. ప్రియురాలు ప్రెజెంట్ టెన్స్, భార్య కంటిన్యూయస్ టెన్స్. మనం ఆమెకు నచ్చేవి చేస్తుంటే ఆమె ప్రియురాలని అర్థం. మనకు నచ్చేవి ఆమె చేస్తుంటే ఆమె భార్య అని అర్థం. ప్రియురాలిని మనం తరచుగా నవ్వించాలి.. భార్య మనల్ని అపుడపుడు ఏడిపిస్తుంటుంది! భార్య కోసం పని చేస్తాం. ప్రియురాలి కోసం చేస్తున్న పనీ ఆపేస్తాం! కొసమెరుపు: రెండు విషయాల్లో మాత్రం ఇద్దరికీ పోలికలు ఉంటాయి... అది జెండర్ అండ్ డేంజర్. చూశారా రెండు పదాలకు కాస్త అటుఇటుగా అక్షరాలు సేమ్! - ప్రకాష్ చిమ్మల -
విజయం: చెప్పులమ్మిన చోటే... ‘ప్రపంచ సినిమా’ అమ్ముతున్నాడు!
అకిరా కురసోవా, చార్లీచాప్లిన్, బస్టర్ కీటన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు తీసిన ఆణిముత్యాల్లాంటి సినిమాల్ని భారతీయ ప్రేక్షకులకు అందించాలన్న గౌతమ్ సదాశయం అతణ్ని గొప్ప వ్యాపారవేత్తను కూడా చేసింది. విజేతగా నిలవడానికి ఎవరెన్ని మార్గాలైనా చెప్పొచ్చు! కానీ ముంబయికి చెందిన గౌతమ్ షిక్నిస్కు తెలిసిన గెలుపు సూత్రం మాత్రం ఒక్కటే.. అదే ప్రయత్నం..! మన నేపథ్యం ఎలాంటిదైనా.. జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా.. మన ఆలోచనలకు ప్రోత్సాహం కరవైనా.. స్వశక్తిపై నమ్మకంతో ప్రయత్నం చేస్తూ పోతే ఏదో రోజు ప్రపంచమంతా మనవైపు చూసేటటువంటి విజయం సాధ్యమవుతుందంటాడు గౌతమ్. చిన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చెప్పులు అమ్ముతూ కనిపించిన ఇతగాడు.. నేడు వేల కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలను నడిపించే స్థితికి చేరడానికి అతను చేసిన ప్రయత్నమే కారణం. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలుంటాయి. కానీ తన అభిరుచినే వ్యాపారంగా మార్చుకుని వందల కోట్లు ఆర్జించే స్థితికి చేరిన ఘనత గౌతమ్ షిక్నిస్ది. అకిరా కురసోవా, చార్లీచాప్లిన్, బస్టర్ కీటన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు తీసిన ఆణిముత్యాల్లాంటి సినిమాల్ని భారతీయ ప్రేక్షకులకు అందించాలన్న గౌతమ్ సదాశయం అతణ్ని గొప్ప వ్యాపారవేత్తను కూడా చేసింది. ‘పాలడార్ పిక్చర్స్’ సంస్థ గురించి తెలిసింది కొద్దిమందికే. విమర్శకుల ప్రశంసలు పొందిన, ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న వెయ్యి సినిమాల హక్కులున్న సంస్థ ఇది. డీవీడీల ద్వారా, ప్రత్యేక ప్రదర్శనల ద్వారా భారతీయ ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాల్ని చూసే అవకాశం కల్పిస్తున్న ఈ సంస్థకు శ్రీకారం చుట్టిన గౌతమ్ ఓ మామూలు వ్యక్తి. అతనిది చాలా సాధారణమైన నేపథ్యం. సీఈఓలందరూ గోల్డెన్ స్పూన్‌తో పుడతారనుకుంటే పొరబాటే. గౌతమ్ అందుకు ఉదాహరణ. ముంబయిలో ఓ పేద కుటుంబానికి చెందిన గౌతమ్ నాలుగేళ్ల వయసులో ట్రాఫిక్ సిగ్నల్స్‌లో చెప్పులు అమ్మేవాడు. ఇది రెండేళ్ల పాటు సాగింది. ఆరేళ్ల వయసులో అతని తల్లి ఓ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో గౌతమ్‌ను పాఠశాలలో చేర్పించింది. అప్పటికే చదువుపై ఎంతో మక్కువ ఉన్న గౌతమ్.. చదువులో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. స్కాలర్షిప్పులతో చదువు సాగించి ముంబయిలోని ఎన్ఎంఐఎంఎస్ నుంచి ఎంబీఏ పట్టా పొందాక సాచి అండ్ సాచి అనే ప్రకటనల సంస్థలో చేరాడు. అక్కడ శరవేగంగా ఎదిగి నాలుగేళ్ల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి.. ‘థియరీ ఎం’ అనే సంస్థను నెలకొల్పాడు. ఇండియాలో తొలి మొబైల్ కస్టమర్ సేవల సంస్థ ఇది. 90ల చివర్లోనే వివిధ కార్పొరేట్ సంస్థల తరఫున ‘థియరీ ఎం’ మొబైల్ సందేశాలు పంపించడం మొదలుపెట్టింది. తర్వాత గౌతమ్ మరో వినూత్న ప్రయత్నం చేశాడు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ఆరంభించాడు. అప్పటికి షాది.కాం కూడా మొదలు కాలేదు. ఐతే నెట్ ద్వారా సంబంధాలు కుదుర్చుకునే సంస్కృతి అప్పటికి లేకపోవడంతో ఈ ప్రయోగం విఫలమైంది. తర్వాత ఇ-కామర్స్ వెబ్సైట్ మొదలుపెట్టాడు. కానీ గౌతమ్ ఆలోచనలన్నీ అప్పటి కాలం కంటే ముందే ఉండటంతో అతనికి పెద్దగా ప్రోత్సాహం లభించలేదు. అతని వ్యాపారాలు పెద్దగా లాభాలివ్వలేదు. కానీ ప్రయత్నం మానలేదు. ఓసారి ఆండ్రియా టర్కోవ్స్కీ రూపొందించిన ‘స్టాల్కర్’ సినిమా అతనిలో ఆలోచన రేకెత్తించింది. ఇలాంటి సినిమాల్ని మన ప్రేక్షకులకు ఎందుకు అందించకూడదనిపించింది. అలా మొదలైందే ‘పాలడార్ పిక్చర్స్’. చిత్రోత్సవాలకు హాజరై అక్కడ మంచి సినిమాలు ఎంచుకుని వాటిని భారత్‌లో ప్రదర్శించేందుకు హక్కులు కొనడం మొదలుపెట్టాడు. ‘ప్రపంచ సినిమా’ పేరుతో తమ దగ్గరున్న చిత్రాల్ని డీవీడీలుగా విడుదల చేయడం.. థియేటర్లలో ప్రదర్శించడం.. టీవీ ఛానెళ్లతో ఒప్పందాలు చేసుకోవడం.. ఇలా అంచెలంచెలుగా సంస్థను అభివృద్ధి చేసి వెయ్యి కోట్లకు పైగా టర్నోవర్ సాధించే స్థితికి చేర్చాడు. ఇది కాక ‘ఎంచెక్’ అనే మొబైల్ సేవల సంస్థను నెలకొల్పి దాన్నీ వందల కోట్ల స్థాయికి చేర్చాడు. ప్రస్తుతం గౌతమ్ తాను చదివిన యూనివర్శిటీలో విజిటింగ్ ఫ్యాకల్టీగానూ పనిచేస్తున్నాడు. ‘‘మనమీద మనకు నమ్మకముండటం చాలా ముఖ్యం. నా ఐడియాలు చూసి.. అందరూ నవ్వారు. కానీ ప్రోత్సాహం లేకున్నా, అపజయాలు ఎదురైనా ప్రయత్నం మానలేదు. అందుకే ఈ స్థితిలో ఉన్నా’’ అంటాడు గౌతమ్. - ప్రకాష్ చిమ్మల -
దక్షిణం: ఫ్రెండ్ సర్కిల్లో మెరవాల్సిందే!
పద్ధతిగా ఉండటం అంటే అందంగా ఉండటం కూడా. ప్రతి మనిషికి రెండు సర్కిల్స్ ఉంటాయి. ఒకటి రిలేషన్ సర్కిల్...రెండోది ఫ్రెండ్ సర్కిల్. రిలేషన్ సర్కిల్లో మనకు గుర్తింపు ఉంటుంది... ఫ్రెండ్ సర్కిల్లో మనతో పాటు మన ఆహార్యానికి, మన స్టైల్‌కు కూడా గుర్తింపు ఉంటుంది. మన తాపత్రయాలన్నీ నెరవేరేది ఆ సర్కిల్లోనే. అందుకే మీరు వస్తున్నారంటే గుంపులో గోవిందయ్యలా ‘రమేష్ అంటే ప్రెజెంట్ సార్’ అన్నట్టు ఉండకూడదు. నిరాడంబర జీవితం వేరు, సాదాసీదా జీవితం వేరు. రెండింటికీ తేడా ఉంది. అంతా సమకూర్చుకోగలిగిన అవకాశం, ఓపిక, శ్రద్ధ ఉండి... మామూలుగా ఉండటం నిరాడంబరత. సాదాసీదా అంటే అవకాశం లేకపోవచ్చు, ఓపిక లేకపోవచ్చు, ఆసక్తి లేకపోవచ్చు... కాబట్టి అలాంటి ఎందుకూ పనికిరాని పద్ధతిని ట్రాష్‌లో పడేయండి. సందర్భాలు వాడుకోండి. మీకోసం జనం ఆరాతీసేలా ఉండండి. మీ రాకను కోరేలా ఉండండి. అందుకు కావల్సింది... మీకంటూ డ్రెస్ సెలెక్షన్లో ఓ టేస్ట్ ఉండాలి. పార్టీ డ్రెస్సింగ్, పిక్నిక్ డ్రెస్సింగ్, ఆఫీస్ డ్రెస్సింగ్ వేరుండాలి. డ్రెస్సే కాదు.. ఇతర అలంకరణలూ అంటే అవసరాన్ని బట్టి షూలు, పెర్ఫ్యూమ్లు వంటివి మారడం కూడా అవసరమే. కొనేది కొన్నే అయినా పురుషులు స్టైలింగ్ పై అవగాహన పెంచుకోవాలి. ఇవన్నీ ఎవరు చెబుతారు అని ఆందోళన అక్కర్లేదు. అన్నిటికీ సమాధానం గూగుల్ ఉంది. ఇంటర్నెట్లో సినిమాల తర్వాత అత్యధిక సమాచారం దొరికేది ఈ స్టైలింగ్ గురించే. శోధించండి, సాధించండి... మెరవండి. ఎప్పుడు, ఏమి, ఎలా వేయాలనే మీ అన్ని ప్రశ్నలకూ అక్కడే సమాధానాలున్నాయి. అనుభవం నేర్పని పాఠమా ఇది? అనుభవం అన్నీ నేర్పుతుందంటారు. మరి భార్యను మెప్పించడం నేర్పలేదా? ఈ ప్రశ్న అడిగారంటే మీరు బ్యాచిలరైనా కావాలి, కొత్తగా పెళ్లయినా అయి ఉండాలి. ఎందుకంటే అనుభవం భార్యను మెప్పించడం కూడా నేర్పుతుంది... సమస్యంతా దాన్ని ఫాలో అవడంలోనే ఉంది. ఇదిగో కొన్ని సాక్ష్యాలు చూడండి.. వండి వార్చితే ఏ శ్రీమతి అయినా శ్రీవారికి ‘ముద్దు’ ఇవ్వకుండా ఉండగలదా! మరెందుకు చేయట్లేదు? మనకేం వంట రాకనా. రెజ్యూమె కంటే రెసిపె తయారుచేయడం సులువు. కానీ చేయలేం. ఆ విద్య మనకు వచ్చనే విషయం పెళ్లాం ఊరెళితే గానీ గుర్తుకురాదు. ఒక వేళ గుర్తుకువచ్చినా... ‘మగ’ అనే అంతరాత్మ ఒప్పుకోదు. అడిగినన్ని కొనిపెడితే... భార్య ఫ్లాటైపోదా! పోతుంది. కానీ కొనిపెట్టలేం... ఆ డబ్బులకోసం పడేకష్టం, భార్య మెప్పు తూచినపుడు మన కష్టమే ఎక్కువ తూగుతుంది. అయినా కొనిపెట్ట్టకపోతే కొత్తగా వచ్చిన నష్టమేంటి... ఓ నింద అంతేకదా. ఏదో టీనేజీలో అదో మోజు కాబట్టి...ఆదాయం లేకున్నా ఖరీదైనవి కొని నచ్చిన సుందరికి గిఫ్టులు ఇస్తాం కానీ తాళికట్టి తెచ్చుకున్న భార్యను మళ్లీ మళ్లీ ఫ్లాట్ చేయాలంటే కుదురుతుందా!!? ఆదివారం ఆడవాళ్లకు సెలవు... అనే నియమం మీ ఇంట్లోనూ పాటిస్తే ‘నా భర్త..పూజ్యనీయుడు’ అనే బిరుదు సంపాదించుకోవచ్చు. కానీ బోడి బిరుదు కోసం బద్ధకాన్ని, దాని వల్ల వచ్చే సుఖాన్ని వదులుకుంటామా..! అంటే... భార్య మెప్పు పొందడానికి ఇలాంటి చాలా మార్గాలున్నాయి. కానీ పెళ్లయ్యి ఏడాది గడిచాక భార్యను మెప్పించడం వల్లే ఎక్కువ నష్టాలున్నాయని గ్రహించడం వల్ల మనం వాటిని పట్టించుకోవట్లేదు. ఏతావాతా చెప్పొచ్చేదంటంటే... అన్నీ కన్వీనియెంట్గా మరిచిపోవాలని మగాళ్ల జేఏసీ తీర్మానించింది. - ప్రకాష్ చిమ్మల -
విజయం: సెలెబ్రిటీలు మెచ్చిన చెఫ్!
పూజ వ్యాపారం 200 శాతం వృద్ధి సాధించింది. అక్కడ సగం ఉత్పత్తులు ముంబై టాప్ సెలబ్రిటీల ఇళ్లకే వెళ్లిపోతాయి. వ్యాపారాన్ని మరింత విస్తరించడంతో పాటు ఫుడ్ రైటింగ్, ఫుడ్ ఫొటోగ్రఫీ మీద కోర్సులతో స్టూడియో 15 అనే సంస్థను కూడా ఆరంభించే ప్రయత్నంలో ఉంది పూజ. మాంద్యం రానివ్వండి. అన్ని రంగాలూ కూలిపోనివ్వండి. ఉద్యోగాలు పోనివ్వండి! కానీ ఉపాధికి, ఆదాయానికి ఢోకా లేని అంశాలు రెండుంటాయి. ఒకటి వైద్యం, ఇంకోటి తిండి! కాకపోతే మొదటి రంగం అందరినీ ఎంచుకోదు. రెండో రంగాన్ని అందరూ ఎంచుకోరు! కానీ ముంబైకి చెందిన పూజ ఢింగ్రా... సామాన్యులకు ఆసక్తి లేని రంగాన్నే ఎంచుకుంది. వండి పెట్టే నైపుణ్యం కోసం దేశాలు తిరిగింది. ప్రయోగాలు చేసింది. చివరికి విజేతగా నిలిచింది. స్ఫూర్తినిచ్చే ఈ యువ వ్యాపారవేత్త విజయగాథను తెలుసుకుందాం రండి! వస్తువుకు లగ్జరీ ఉంటుంది. మరి తిండికి లగ్జరీ ఉంటుందా? ఉంటుంది. ముంబయిలోని ‘లీ 15 ప్యాటిసెరీ’కి వెళ్తే తెలుస్తుంది దీనికి సమాధానం. అసలా పేరు చెబితేనే చాలామందికి నోరూరిపోతుంది. ఇంతకీ అదేంటో తెలుసా... ఓ లగ్జరీ బేకరీ. అందులోని ఐటమ్స్‌కు యమా గిరాకీ. అందులోనూ మాకరాన్స్ (క్రీమ్ బిస్కెట్లు) గురించి చెప్పనవసరం లేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకెళ్తుంటారు. ఎందుకంత డిమాండ్? అది తెలుసుకోవాలంటే ఆ డిమాండును సృష్టించిన పూజ ఢింగ్రా గురించి తెలుసుకోవాలి. పూజ వాళ్లమ్మ కొన్నాళ్లు చాకొలేట్ వ్యాపారం చేసింది. నాన్న కూడా రెస్టారెంట్ నడిపేవారు. అందుకే ఆమెకు ఫుడ్ ఇండస్ట్రీ మీదే ఆసక్తి ఏర్పడింది. అయితే పనిని ఉపాధిలా కాకుండా వృత్తిలా చూసే గుణం ఆమెను విజేతగా నిలిపింది. డబ్బు అనేది ఆమెకు ‘బై ప్రొడక్ట్’గా వచ్చి పడింది. ఐతే ఈ స్థాయికి చేరే క్రమంలో పూజ తన రాతను తనే రాసుకుంది. ఇంటర్మీడియట్ తర్వాత తల్లిదండ్రులు పూజను న్యాయవాది కమ్మన్నారు. ఆ కోర్సులో చేరింది కూడా. కానీ వారం రోజులు గడిచాక తన గమ్యం ఇది కాదని ఆమెకర్థమైంది. లా పుస్తకాలు తలకు మించిన భారంలా కనిపించాయి. చెఫ్ కావాలని కోరుకుంది. ఆ కోరికనే తల్లిదండ్రుల ముందు పెట్టింది. అంతే, స్విట్జర్లాండ్ ఫ్లైట్ ఎక్కించేశారు వాళ్లు. అక్కడ ఓ ప్రముఖ ఇన్స్టిట్యూట్లో హాస్పిటాలిటీ కోర్సులో చేరింది. మొదట అక్కడి వారి మధ్య తనను తానో ఏలియన్లా భావించిన పూజ... మెల్లగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రయత్నించింది. ఆమె తొలి ఇంటర్న్‌షిప్ ఓ కుటుంబం నడుపుతోన్న రెస్టారెంట్లో. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనే. పొద్దున బ్రేక్ ఫాస్ట్ చేయడంతో మొదలు.. పొద్దు పోయే వరకూ పనే పని. రెండో ఇంటర్న్‌షిప్ ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో. అక్కడ ఫ్లోర్లు, టాయిలెట్లు శుభ్రం చేయడం ఆమె పని. నామోషీ పడకుండా అన్ని పనులూ చేసింది. కోర్సు పూర్తయ్యేసరికి అంతర్జాతీయ డెలిగేట్స్ సెమినార్లు నిర్వహించే స్థాయికి చేరుకుంది. స్విస్ నుంచి తిరిగొచ్చాక ప్యారిస్ వెళ్లి అక్కడ మరో హాస్పిటాలిటీ కోర్సు చేసింది. తర్వాత ఏం చేయాలి? వ్యాపారంలోకి ఎలా దిగాలో తెలియక.. తన ఇంటి కిచెన్‌నే ప్రయోగశాలగా మార్చుకుంది పూజ. తాను నేర్చుకున్న వంటలు ఇక్కడ ప్రయత్నించబోతే.. అన్నీ దెబ్బకొట్టేశాయి. విదేశాల్లో దొరికే పదార్థాలు ఇక్కడ దొరకలేదు. దాంతో ఇక్కడ దొరికే పదార్థాలతో బేకరీ ఐటమ్స్‌ను తయారు చేయడం మొదలుపెట్టింది. తాను తయారు చేసిన పదార్థాలతో ఫుడ్ ఎగ్జిబిషన్లకు తిరిగింది. దాంతో ఆర్డర్లు వచ్చాయి. పూర్తిగా విశ్వాసం లభించాక ‘లీ 15 ప్యాటిసెరీ’ని ఆరంభించిందామె. కొన్నాళ్లకే ముంబయిలోని విశిష్టమైన బేకరీల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. మరో రెండు శాఖలు కూడా వెలిశాయి. తనలా షెఫ్ కావాలనుకునేవారికి పాఠాలు కూడా చెబుతోంది పూజ. ఆమె క్లాసులకు వెళ్లాలనుకుంటే, www.le15.co.in/classes.php లో వివరాలున్నాయి. - ప్రకాష్ చిమ్మల -
విజయం: ఆఫీస్ బాయ్... బాసయ్యాడు!
కుటుంబాన్ని నడపడానికి సుధీర్ ఇంటర్మీడియట్ చదువును మధ్యలో ఆపేశాడు. ఓ కార్గో సర్వీస్ సంస్థలో పనికి కుదిరాడు. ఐతే చిన్ననాటి నుంచి ఏవైనా కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త పనులు చేయడం సుధీర్‌కు అలవాటు. ఈ అలవాటే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఒక్క ముక్క చదువు రాకున్నా ఏదో ఒక వ్యాపారం చేసి కోటీశ్వరులైన వాళ్లు చాలామందే ఉండొచ్చు.. కానీ ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయని ఓ అబ్బాయి.. కార్గో సర్వీస్‌లో సరకులు ఎక్కించే పనికి కుదిరిన కుర్రాడు.. సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ఎదిగి.. సొంత సంస్థను నెలకొల్పి కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే స్థాయికి తీసుకెళ్తే మాత్రం అది ఆశ్చర్యపరిచే విషయమే కదా! ముంబయికి చెందిన సుధీర్ నాయర్ అదే సాధించాడు! ఇతని విజయగాథేంటో తెలుసుకుందాం రండి! సుధీర్‌ది ముంబయిలోని ఓ దిగువ మధ్య తరగతి కుటుంబం. అసలే అంతంత మాత్రంగా ఉన్న అతని కుటుంబ పరిస్థితి.. తండ్రి అకాలమరణంతో మరింత కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో కుటుంబాన్ని నడపడానికి సుధీర్ ఇంటర్మీడియట్ చదువును మధ్యలో ఆపేశాడు. ఓ కార్గో సర్వీస్ సంస్థలో పనికి కుదిరాడు. ఐతే చిన్ననాటి నుంచి ఏవైనా కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త పనులు చేయడం సుధీర్‌కు అలవాటు. ఈ అలవాటే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. కొన్నాళ్లు సరకులు ఎక్కించే పనిలో కొనసాగిన సుధీర్‌కు ఓసారి బిల్లింగ్ వ్యవహారాలు చూడాల్సిన అవసరం వచ్చింది. అందులో చురుగ్గా కనిపించడంతో అతడికి ఆ పనే అప్పగించారు. తర్వాత టైపిస్టుగా మారాడు. ఆ తర్వాత సుధీర్ కళ్లు కంప్యూటర్ మీద పడ్డాయి. ఆఫీసులోనే కూర్చుని కంప్యూటర్‌పై పట్టు సాధించాడు. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్‌గా మారాడు. రోజూ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి రోజువారీ ప్రోగ్రామర్‌గా మారాడు. కొన్ని రోజులకు కంపెనీకి స్వయంగా సాఫ్ట్వేర్ కోడ్లు తయారు చేసే స్థితికి చేరాడు. దీంతో అతని కెరీర్లో కొత్త దశ ఆరంభమైంది. మిత్రుల సూచన మేరకు సాఫ్ట్వేర్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు సుధీర్. దుబాయ్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ 15 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాడు. ఈ అనుభవంతో సొంతంగా వ్యాపారం ఆరంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. అతని దృష్టి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ)పై పడింది. ఈ రంగంలో భవిష్యత్తును ముందే ఊహించిన సుధీర్.. సొంతంగా కంపెనీ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు. మిత్రుల సహకారం తోడవడంతో 2006లో అతను ఈ రిసోర్స్ ఇన్ఫోటెక్ సంస్థను ఆరంభించాడు. మొదట ఐదారుగురితో మొదలైన ఈ రిసోర్స్ ప్రస్తుతం 100 మంది ఉద్యోగులతో పని చేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం సంస్థ టర్నోవర్ రూ.8 కోట్లకు పైమాటే. దేశవిదేశాల్లో ఆ సంస్థకు 300 మంది క్లైంట్లు ఉన్నారు. 25 వేల మంది యూజర్లు ఈ రిసోర్స్ ఈఆర్పీని ఉపయోగిస్తున్నారు. ఐతే ఈ స్థాయికి చేరడానికి సుధీర్ బృందం పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదు. మొదట్లో కస్టమర్ల నమ్మకం గెలుచుకోవడానికి రేయింబవళ్లు పని చేశారు వాళ్లు. మార్కెట్లో తామేంటో తెలియడానికి, ఆదాయం రావడానికి కొంత సమయం పట్టింది కానీ.. పునాది పడ్డాక మాత్రం సుధీర్ బృందానికి ఎదురులేకపోయింది. సుధీర్ కష్టానికి జాతీయ స్థాయి గుర్తింపు కూడా లభించింది. అతనికి ఉద్యోగ్ రతన్ పురస్కారం దక్కింది. ఇటీవలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలెప్మెంట్.. బిజినెస్ లీడర్షిప్ అవార్డు ఇచ్చి సత్కరించింది. దేవుడు మనకు కనిపించడం ఇష్టం లేక అవకాశం రూపంలో వస్తాడంటారు. కార్గో కాంప్లెక్స్‌లో ఓసారి నన్ను బిల్ చేయమని చెప్పడం నాకు దేవుడిచ్చిన అవకాశంగా అనుకుంటా. మనం ఎక్కడో ఓ చోట ఆరంభించాలి. అబ్దుల్ కలాం పేపర్‌బాయ్‌గా తన ప్రస్థానాన్ని ఆరంభించాడు. అలాగే నేను కూడా. ఏదో సాధించాలన్న తపన ఉండటం అన్నింటికంటే ముఖ్యం. జీవితం నదీ ప్రవాహం లాంటిది. ఈ సూత్రాన్ని నమ్ముకునే నేను ప్రయాణం సాగిస్తున్నా’’ అంటూ తన ప్రస్థానం గురించి చెబుతుంటాడు సుధీర్. - ప్రకాష్ చిమ్మల -
విజయం: ఆమె పుస్తకం ఖరీదే లక్ష!
కాన్స ఫెస్టివల్లో రీతూ డిజైన్ చేసిన దుస్తుల్లో విద్యాబాలన్ మీ దగ్గర బోలెడంత డబ్బుంది. చక్కటి క్రికెట్ కిట్ ఉంది. శిక్షణ ఇచ్చే కోచ్‌లున్నారు. అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు సచిన్ టెండూల్కర్ అయిపోగలరా? కష్టం కదా! అంటే డబ్బు అన్నది ఓ సౌలభ్యం మాత్రమే. ఏ రంగంలోకి వెళ్లాలన్నా అది ‘ఎంట్రీ ఫీజు’గా ఉపయోగపడుతుందంతే. ఆ తర్వాత మనల్ని నిలబెట్టేది మన సామర్థ్యమే! రీతూ బేరి... ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఫేమస్ పేరు! ఈమెకు కూడా డబ్బుంది. ఆ డబ్బు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో కోర్సు ఫీజు కట్టడానికి మాత్రమే ఉపయోగపడింది. కానీ రీతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ డిజైనర్‌గా పేరు తెచ్చుకోవడానికి ఉపయోగపడింది మాత్రం అసాధారణమైన ఆమె సామర్థ్యమే! రీతూ గొప్పదనమేంటో తెలియాలంటే ఆమె క్లయింట్లు ఎవరో చూస్తే సరిపోతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్, ప్రముఖ హాలీవుడ్ నటి నికోల్ కిడ్మన్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిజైనర్ దుస్తుల తయారీ సంస్థ మౌలిన్ రౌష్. అసలీ స్థాయికి రీతూ ఎలా చేరగలిగింది! ఢిల్లీలో పుట్టిన రీతూ తండ్రి బల్బీర్‌సింగ్ బేరి సైన్యంలో అధికారి. రీతూకి చిన్నప్పట్నుంచీ ఫ్యాషన్ డిజైనింగ్ మీదే ఆసక్తి. అందుకే ఢిల్లీలో ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆమె అడుగులు నిఫ్ట్ వైపు పడ్డాయి. ఐతే ఇప్పట్లా నిఫ్ట్ అప్పుడు పేరు మోసిన ఇన్స్టిట్యూట్ కాదు. రీతూ తొలి బ్యాచ్ లోని 25 మంది విద్యార్థుల్లో ఒకరు. స్వతహాగా ఉన్న ఆసక్తికి శిక్షణ తోడవడంతో నిఫ్ట్‌లో ఉండగానే డిజైనర్‌గా మంచి పేరుతెచ్చుకుంది. కోర్సు చివర్లో ‘లావణ్య’ పేరుతో రూపొందించిన డ్రెస్ కలెక్షన్ పాపులర్ అయ్యింది. ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫ్యాషన్ ప్రపంచం ఆమెకు రెడ్ కార్పెట్ పరిచిందనే చెప్పాలి. 1990లో ఆమె తన తొలి డిజైనర్ దుస్తుల్ని మార్కెట్లోకి తెచ్చారు. ఆపైన అంచెలంచెలుగా ఎదుగుతూ ఎనిమిదేళ్ల తర్వాత ప్యారిస్‌లో షో నిర్వహించి, తన తొలి ‘ల్యూక్స్‘ కలెక్షన్‌ను విడుదల చేశారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ డిజైనర్ ఆమే. దీంతో ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘ప్రోమోస్టైల్’లో చోటు సంపాదించిన ఏకైక భారత డిజైనర్‌గానూ రీతు ఖ్యాతి సంపాదించారు. టైమ్ మ్యాగజైన్ ప్రపంచ వ్యాప్తంగా అంతర్జ్జాతీయ వ్యాపారంలో టాప్-100 చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో ఒకరిగా రీతును గుర్తించింది. అంతర్జాతీయంగా పేరు సంపాదించిన తర్వాత రీతూ రాసిన ’101 వేస్ టు లుక్ గుడ్’ పుస్తకం మంచి ఆదరణ పొందింది. తర్వాత ‘ఫైర్‌ఫ్లై-ఎ ఫెయిరీ టేల్’ పుస్తకం రాశారు. దీని ధర అక్షరాలా లక్ష రూపాయలు. ఆర్కిటెక్చర్, చరిత్ర, మహిళలు-వారి సౌందర్యం వంటి అంశాలను స్పృశిస్తూ సాగే ఈ పుస్తకాన్ని భారత్‌తో పాటు ప్యారిస్‌లోనూ తఅమ్మకానికి పెట్టారు. మొదట చెప్పుకున్న ప్రముఖులతో పాటు హాలీవుడ్ నటి ఆండీ మెక్‌డోవెల్, సూపర్ మోడల్ లేటిటియా కాస్టాలకు దుస్తులు డిజైన్ చేస్తున్నారు. ఇండియాలో మాధురి దీక్షిత్, రాణీ ముఖర్జీ, ప్రీతి జింతా, శోభా డే వంటి సెలబ్రిటీలకు డిజైనర్‌గా పనిచేసింది రీతూ. జర్మనీ, ఫ్రాన్స్, ఢిల్లీలలో ఆమె బొటీక్లు నడుపుతున్నారు. వాటిలో దుస్తులు కొనడం ప్రతిష్టాత్మకంగా భావిస్తారు ఫ్యాషన్ ప్రియులు. ‘నిఫ్ట్’లో ప్రస్తుతం రీతు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో ఒకరు. భారతీయ మహిళల ఉన్నతి కోసం ఆమె ‘సవేరా’ అని స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. 2000లో రీతు రాష్ట్రీయ శిరోమణి అవార్డుల్లో భాగంగా ‘మిలీనియం అచీవర్’ పురస్కారం అందుకున్నారు. 2004లో గ్లోబల్ ఎక్స్‌లెన్స్, 2007లో కల్పనా చావ్లా ఎక్స్‌లెన్స్ అవార్డులు ఆమెను వరించాయి. - ప్రకాష్ చిమ్మల -
దక్షిణం: కొంగుపట్టుకు తిరుగుతారా... మ్యాన్లీగా ఉంటారా?
ప్రతి స్త్రీ తన భర్త తనంటే పడి చచ్చిపోవాలని, తన కొంగు పట్టుకు తిరగాలని కోరుకుంటుంది! నిజానికి స్త్రీలు ఇలాంటి వారితో సంతోషంగా ఉంటారా? ఇలాంటి వారినే ఇష్టపడతారా? అంటే...అదేం కాదు. అలా అనిపిస్తుంది గాని... అలా ఉంటే ఏ స్త్రీకీ నచ్చదు. మగాడు ఎప్పుడూ మగాడిగా ఉండాలి. మ్యాన్లీగా నడుచుకోవాలి. పెళ్లాం తను చెబితే వినాలని కోరుకుంటుందే గాని... అప్పుడప్పుడు తనను ఆదేశించడాన్నీ ఇష్టపడుతుంది. కాకపోతే... కొన్ని విషయాల్లో ఆమె కోరుకున్నది జరగాలనుకుంటుంది. ఆమెకు భయపడుతూ బతకడమూ ఇష్టపడదు, ఆమెను భయపెడుతూ బతకడం మంచిది కాదు. ప్రతి విషయం భార్యకు చెప్పడం కాదు నమ్మకమంటే... ఆమె ఉన్నప్పుడు, లేనపుడు భర్త ప్రవర్తన తీరులో మార్పు లేకపోవడం. అందరూ బాస్‌లను ఎపుడూ ఎందుకు ఇష్టపడరు?... ఎల్లప్పుడూ అజమాయిషీ వారిదే కాబట్టి! మరి ఇంట్లో అలాగే ఉంటే ఇల్లూ ఆఫీసు ఒకటే అవుతుంది. ఒక్కోసారి పెళ్లాంకు బాస్‌లాగా ఉండాలి, మరోసారి బానిసలాగానూ ఉండటం తెలియాలి. అప్పుడే బ్యాలెన్స్ బాగుంటుంది. జీవితాంతం ఒకరిదే పైచేయిగా ఉంటే అది అవాంఛనీయం. ఈ పరిస్థితి జీవితంలో చాలా క్లిష్టమైన సందర్భాల్లో మనల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఒకరికి ఒకరు... రాజు రాణి! ఆమెకు బాగా తెలిసిన విషయాల్లో తనను గౌరవించాలనుకుంటుంది. భర్త కూడా తాను సిద్ధహస్తుడైన విషయాల్లో తన మాటే చెల్లాలనుకుంటాడు. నిజానికి మెజారిటీ స్త్రీలు... భర్త సరసానికి కొంగుపట్టుకుతిరిగేవాడుగా, సంసారానికి రథసారథిగా, సౌభాగ్యంలో స్నేహితుడిగా.. ఓదార్పులో తండ్రిగా, పనిలో సైనికుడిగా, సమర్థతలో రాజుగా ఉండాలని కోరుకుంటారు. అంటే... కార్యేషు దాసి, కరణేషు మంత్రి వంటి సూక్తులు స్త్రీకే కాదు, మగాడికీ ఉన్నాయి. అమ్మాయిల మనసు నొప్పించే విషయాలు! - చనువు ఉందని ‘డర్టీ’ విషయాలు మాట్లాడటం. - సమస్యలో ఉన్నపుడు మీకు పని కారణంగా ఆమెకు తోడు లేకపోవడం. - వారి కొత్త డ్రెస్‌ను ఏమాత్రం పట్టించుకోకపోవడం.. అది బాలేకున్నా! - ఆమెకు సంబంధించిన దేనిపైనైనా వ్యతిరేకతను నేరుగా వ్యక్తంచేయడం. - ఆమె అందం గురించి ప్రతికూల అంశాలను నేరుగా చెప్పడం - ఇతర అమ్మాయి అందచందాలను మరో అమ్మాయి ముందు పొగడటం. - మీరు ఊహించని కొన్ని విషయాలకు కూడా వారు హర్ట్ అవుతుంటారు. అమ్మాయిల మనసు మెప్పించే విషయాలు! - వీలైనన్ని ఎక్కువ సార్లు మీరు ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయడాన్ని కోరుకుంటారు. - అమ్మాయిలే గ్రహించగలిగిన బహుమతులు వారికి నచ్చేలా ఇవ్వగలగడం(గాజులు, లిప్‌స్టిక్, పర్ఫ్యూమ్) ఆమె తప్పులను కూడా పొరపాట్లు అని చిత్రీకరించి చెప్పగలిగే మీ స్కిల్! - కాంప్లిమెంట్స్... అది కూడా అందంగా ఎక్స్‌ప్రెస్ చేయాలి. - ఆమె ప్రైవేట్ టైం, ప్రైవేట్ విషయాలు ఎప్పుడూ అడగకపోవడం (పూర్తిగా చనువు రాకముందు). - ఇతరుల గురించి ఆమె వద్ద ఎప్పుడూ తిట్టకపోవడం. - మీరిచ్చే బహుమతుల కన్నా, వాటిలో మీ సృజన, టైమింగ్! - ప్రకాష్ చిమ్మల