విజయం: చుంబక్... చమక్! | Creativity is need to success in Business, says Subra | Sakshi
Sakshi News home page

విజయం: చుంబక్... చమక్!

Published Sun, Nov 24 2013 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM

విజయం: చుంబక్... చమక్!

విజయం: చుంబక్... చమక్!

 వ్యాపారాలు అందరూ చేస్తారు... కానీ అందులో కాస్త కిక్కుండాలి, క్రియేటివిటీకి చోటుండాలి అంటుంది శుభ్ర.   పెళ్లికి ఓ గిఫ్టు కొనాలి.. షాపులోకి వెళ్లగానే అద్దాల గదిలో తాజ్‌మహల్ చూపిస్తారు లేదంటే ఓ బెడ్ ల్యాంప్ తీసుకొచ్చి ముందు పెడతారు! పిల్లాడి పుట్టిన రోజుకు ఏదైనా బహుమతి ఇద్దామని చూస్తే టెడ్డీబేర్‌లు తప్ప ఇంకేం కనిపించవు! సందర్భాలు ఇంకా ఎన్నెన్నో.. కానీ వాటికి తగ్గ బహుమతులు దొరికితేగా..! ఏం చేస్తాంలే.. అని ఓ నిట్టూర్పు విడిచి, ఉన్నదేదో పట్టుకొచ్చేస్తాం! కానీ శుభ్ర చద్దా అందరిలా నిట్టూర్చి ఊరుకోలేదు. ఈ అవసరాన్నే అవకాశంగా మార్చుకుంది. తన సృజనాత్మకతకు పదును పెట్టి సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే కంపెనీకి అధిపతి అయింది! అదెలాగో చూద్దాం రండి!
 
 వ్యాపారాలు అందరూ చేస్తారు.. కానీ అందులో కాస్త కిక్కుండాలి, క్రియేటివిటీకి చోటుండాలి అంటుంది శుభ్ర. ఓసారి గూగుల్‌లో ‘చుంబక్’ అని కొట్టి చూడండి. దాని తాలూకు వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. శుభ్ర చేస్తున్న వ్యాపారంలో ఎంత సృజనాత్మకమైందో అర్థమవుతుంది. పిల్లలు వాడే ఆట బొమ్మలు కావచ్చు.. కుర్రాళ్లు వాడే కీచైన్‌లు కావచ్చు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వాడే ల్యాప్‌టాప్ స్లీవ్స్ కావచ్చు.. ఏ సందర్భానికైనా ఉపయోగపడే అందమైన బొమ్మలు కావచ్చు.. ఏదైనా ప్రత్యేకమే అక్కడ. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా.. అత్యంత ఆకర్షణీయమైన రీతిలో, సరికొత్తగా డిజైన్ చేసి ఉంటాయి. కాఫీ కప్పులు, సెల్‌ఫోన్ కేస్‌లు, టీషర్టులు, స్టోరేజ్ టిన్స్.. ఇలా ఎన్నో విభిన్నమైన వస్తువులు దొరుకుతాయి. కానీ ప్రతి వస్తువులోనూ ‘చుంబక్’ ముద్ర ఉంటుంది.
 
 చుంబక్ ఆరంభం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. అందరిలాగే ఎంబీఏ చేసి ఓ కంపెనీలో చేరిన శుభ్ర.. ఓసారి తన బాస్‌కు వ్యాపారానికి సంబంధించి కొన్ని వినూత్నమైన ఆలోచనలు చెప్పింది. కానీ అవి బుట్టదాఖలయ్యాయి. ఇది జరిగిన రెండేళ్లకు శుభ్ర ఉద్యోగానికి దూరం కావాల్సి వచ్చింది. కారణం కడుపులో పాప. తల్లయ్యాక ఏడాది తర్వాత మళ్లీ ఉద్యోగంలోకి వెళ్లడానికి మనసొప్పలేదు. అప్పటికే శుభ్ర ఆలోచనలు తెలిసిన భర్త ప్రభాకరన్ నువ్వే ఎందుకు సొంతంగా వ్యాపారం చేయకూడదన్నాడు. అప్పుడు వచ్చింది ‘చుంబక్’ ఆలోచన.
 
 తను విదేశాలకు వెళ్లినపుడల్లా వినూత్నమైన బొమ్మలు, వస్తువులు తేవడం.. అలాంటివి ఇండియాలో లేవని బాధపడటం గుర్తు తెచ్చుకుంది. ఏడాది పాటు ఒక్కతే కష్టపడి రకరకాల బొమ్మల్ని డిజైన్ చేసింది. భర్తతో కలిసి అన్నీ చర్చించాక బెంగళూరులోని తన ఇంటిని అమ్మేసి వ్యాపారం ఆరంభించింది. ముందుగా కొన్ని స్టోర్లకు తిరిగి తమ ఉత్పత్తుల్ని అమ్మిన శుభ్ర 2010లో బెంగళూరు, చెన్నై, పుణె నగరాల్లో దుకాణాలు ఆరంభించింది. మొదట్లోనే తన ఉత్పత్తులకు మంచి పేరు రావడంతో శుభ్ర వెనుదిరిగి చూడలేదు. తనలా సృజనాత్మకంగా ఆలోచించే వ్యక్తుల్ని నియమించుకుని సాధారణమైన వస్తువుల్నే సరికొత్త డిజైన్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్ది మార్కెట్లోకి తెచ్చింది. క్రమంగా వ్యాపారం విస్తరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150 స్టోర్లలో చుంబక్ ఉత్పత్తులు అమ్ముతున్నారు.
 
  ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్‌లలో ఈ స్టోర్లు నెలకొల్పడానికి వీరు ఆసక్తి చూపుతారు. అమెరికా దుబాయ్, యూకేలకు కూడా ఇక్కడి నుంచి వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. జపాన్‌లో అయితే ఏకంగా 70 దుకాణాలు చుంబక్ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటున్నాయి. మన హైదరాబాద్‌లోనూ చుంబక్ వస్తువులు దొరుకుతున్నాయి. ప్రస్తుతం ‘చుంబక్’ టర్నోవర్ కోట్లలో సాగుతోంది. దేశవ్యాప్తంగా మరిన్ని ఎక్స్‌క్లూజివ్ ‘చుంబక్’ స్టోర్లను ఆరంభించి వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రయత్నంలో ఉంది శుభ్ర. ‘‘విదేశాలకు వెళ్లినపుడు భిన్నరకాలైన జ్ఞాపికలు తెస్తుంటాం. కానీ మన దేశంలో ఇలాంటివి దొరకవేంటన్న ఆలోచన నుంచి మా వ్యాపారం మొదలైంది. ఫేస్‌బుక్ లాంటి నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారానే చుంబక్‌కు మంచి ప్రచారం లభించింది. 10 రకాల ఉత్పత్తులతో మొదలైన చుంబక్ ఇప్పుడు 30కి పైగా విభిన్న రకాల వస్తువులతో నడుస్తోంది’’ అని చెప్పింది శుభ్ర.
 - ప్రకాష్ చిమ్మల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement