విజయం: ఆఫీస్ బాయ్... బాసయ్యాడు! | Office boy turns Boss | Sakshi
Sakshi News home page

విజయం: ఆఫీస్ బాయ్... బాసయ్యాడు!

Published Sun, Sep 1 2013 2:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

విజయం: ఆఫీస్ బాయ్... బాసయ్యాడు!

విజయం: ఆఫీస్ బాయ్... బాసయ్యాడు!

కుటుంబాన్ని నడపడానికి సుధీర్ ఇంటర్మీడియట్ చదువును మధ్యలో ఆపేశాడు. ఓ కార్గో సర్వీస్ సంస్థలో పనికి కుదిరాడు. ఐతే చిన్ననాటి నుంచి ఏవైనా కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త పనులు చేయడం సుధీర్‌కు అలవాటు. ఈ అలవాటే అతని జీవితాన్ని మలుపు తిప్పింది.
 
 ఒక్క ముక్క చదువు రాకున్నా ఏదో ఒక వ్యాపారం చేసి కోటీశ్వరులైన వాళ్లు చాలామందే ఉండొచ్చు.. కానీ ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయని ఓ అబ్బాయి.. కార్గో సర్వీస్‌లో సరకులు ఎక్కించే పనికి కుదిరిన కుర్రాడు.. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఎదిగి.. సొంత సంస్థను నెలకొల్పి కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే స్థాయికి తీసుకెళ్తే మాత్రం అది ఆశ్చర్యపరిచే విషయమే కదా! ముంబయికి చెందిన సుధీర్ నాయర్ అదే సాధించాడు! ఇతని విజయగాథేంటో తెలుసుకుందాం రండి!
 
 సుధీర్‌ది ముంబయిలోని ఓ దిగువ మధ్య తరగతి కుటుంబం. అసలే అంతంత మాత్రంగా ఉన్న అతని కుటుంబ పరిస్థితి.. తండ్రి అకాలమరణంతో మరింత కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో కుటుంబాన్ని నడపడానికి సుధీర్ ఇంటర్మీడియట్ చదువును మధ్యలో ఆపేశాడు. ఓ కార్గో సర్వీస్ సంస్థలో పనికి కుదిరాడు. ఐతే చిన్ననాటి నుంచి ఏవైనా కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త పనులు చేయడం సుధీర్‌కు అలవాటు.
 
 ఈ అలవాటే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. కొన్నాళ్లు సరకులు ఎక్కించే పనిలో కొనసాగిన సుధీర్‌కు ఓసారి బిల్లింగ్ వ్యవహారాలు చూడాల్సిన అవసరం వచ్చింది. అందులో చురుగ్గా కనిపించడంతో అతడికి ఆ పనే అప్పగించారు. తర్వాత టైపిస్టుగా మారాడు. ఆ తర్వాత సుధీర్ కళ్లు కంప్యూటర్ మీద పడ్డాయి. ఆఫీసులోనే కూర్చుని కంప్యూటర్‌పై పట్టు సాధించాడు. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్‌గా మారాడు. రోజూ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి రోజువారీ ప్రోగ్రామర్‌గా మారాడు. కొన్ని రోజులకు కంపెనీకి స్వయంగా సాఫ్ట్‌వేర్ కోడ్‌లు తయారు చేసే స్థితికి చేరాడు. దీంతో అతని కెరీర్లో కొత్త దశ ఆరంభమైంది. మిత్రుల సూచన మేరకు సాఫ్ట్‌వేర్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు సుధీర్. దుబాయ్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ 15 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాడు. ఈ అనుభవంతో సొంతంగా వ్యాపారం ఆరంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. అతని దృష్టి ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్‌పీ)పై పడింది. ఈ రంగంలో భవిష్యత్తును ముందే ఊహించిన సుధీర్.. సొంతంగా కంపెనీ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు.
 
 మిత్రుల సహకారం తోడవడంతో 2006లో అతను ఈ రిసోర్స్ ఇన్ఫోటెక్ సంస్థను ఆరంభించాడు. మొదట ఐదారుగురితో మొదలైన ఈ రిసోర్స్ ప్రస్తుతం 100 మంది ఉద్యోగులతో పని చేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం సంస్థ టర్నోవర్ రూ.8 కోట్లకు పైమాటే. దేశవిదేశాల్లో ఆ సంస్థకు 300 మంది క్లైంట్లు ఉన్నారు. 25 వేల మంది యూజర్లు ఈ రిసోర్స్ ఈఆర్‌పీని ఉపయోగిస్తున్నారు. ఐతే ఈ స్థాయికి చేరడానికి సుధీర్ బృందం పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదు. మొదట్లో కస్టమర్ల నమ్మకం గెలుచుకోవడానికి రేయింబవళ్లు పని చేశారు వాళ్లు. మార్కెట్లో తామేంటో తెలియడానికి, ఆదాయం రావడానికి కొంత సమయం పట్టింది కానీ.. పునాది పడ్డాక మాత్రం సుధీర్ బృందానికి ఎదురులేకపోయింది.
 
  సుధీర్ కష్టానికి జాతీయ స్థాయి గుర్తింపు కూడా లభించింది. అతనికి ఉద్యోగ్ రతన్ పురస్కారం దక్కింది. ఇటీవలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలెప్‌మెంట్.. బిజినెస్ లీడర్‌షిప్ అవార్డు ఇచ్చి సత్కరించింది. దేవుడు మనకు కనిపించడం ఇష్టం లేక అవకాశం రూపంలో వస్తాడంటారు. కార్గో కాంప్లెక్స్‌లో ఓసారి నన్ను బిల్ చేయమని చెప్పడం నాకు దేవుడిచ్చిన అవకాశంగా అనుకుంటా. మనం ఎక్కడో ఓ చోట ఆరంభించాలి. అబ్దుల్ కలాం పేపర్‌బాయ్‌గా తన ప్రస్థానాన్ని ఆరంభించాడు. అలాగే నేను కూడా. ఏదో సాధించాలన్న తపన ఉండటం అన్నింటికంటే ముఖ్యం. జీవితం నదీ ప్రవాహం లాంటిది. ఈ సూత్రాన్ని నమ్ముకునే నేను ప్రయాణం సాగిస్తున్నా’’ అంటూ తన ప్రస్థానం గురించి చెబుతుంటాడు సుధీర్.
 -  ప్రకాష్ చిమ్మల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement