
వలసలు, ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెడతానన్న కాబోయే చాన్స్‌లర్ మెర్జ్
బెర్లిన్: ఒలాఫ్ ష్కోల్జ్ సారథ్యంలోని మైనారిటీ ప్రభుత్వం కూలిపోవడంతో అనివార్యమైన జర్మనీ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్ (సీడీయూ), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి ఘన విజయం సాధించింది. కడపటి వార్తలు అందేసరికి సీడీయూ,సీఎస్‌యూ కూటమికి 28.6 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో సీడీయూ పార్టీ చీఫ్ ఫ్రెడరిక్ మెర్జ్ తదుపరి ఛాన్స్‌లర్ కావడం ఖాయమైంది. వలసలను తీవ్రంగా వ్యతిరేకించే అతివాద ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీకి 20.8 శాతం ఓట్లు పడ్డాయి.
గత మూడేళ్లుగా అధికారం చలాయించిన ఒలాఫ్ షోల్జ్ సారథ్యంలోని సోషల్ డెమొక్రటిక్ పార్టీ(ఎస్‌డీపీ) ఈసారి మూడోస్థానానికి పరిమితమైంది. ఈ పార్టీకి కేవలం 16.4 శాతం ఓట్లు పడ్డాయి. పర్యావరణ పరిరక్షణ ఉద్యమం నుంచి పురుడపోసుకుని పార్టీగా అవతరించిన ది గ్రీన్స్ పా ర్టీకి కేవలం 11.6 శాతం వచ్చాయి. ది సారా వాగెన్ కనెక్ట్–రీజన్ అండ్ జస్టిస్ పార్టీ (బీఎస్ డబ్ల్యూ) 4.97 శాతం ఓట్లు సాధించింది. 630 సీట్లున్న బండేస్టాగ్( జర్మనీ పార్లమెంట్)లో సీడీయూ, సీఎస్‌యూ కూటమి అత్యధికంగా 208 చోట్ల విజయం సాధించింది. ‘‘ అతివాద ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీకి ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బహిరంగంగానే మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో అమెరికా, రష్యాల నుంచి ఏవైనా సవాళ్లు ఎదురైతే వాటిని ఎదుర్కొని యూరప్‌ను ఐక్యంగా ఉంచేందుకు పోరాడతా’’ అని మెర్జ్ అన్నారు.
సంకీర్ణ ప్రభుత్వం దిశగా..
ఏ కూటమి/పార్టీకి స్పష్టమైన మెజారిటీరాని కారణంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. అధిక సీట్లు సాధించిన సీడీయూ, సీఎస్‌యూ కూటమి మూడో స్థానంలో వచ్చిన ఎస్‌డీపీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే వీలుంది. రెండోస్థానంలో వచ్చిన ఏఎఫ్‌డీ పార్టీకి సీడీయూ,సీఎస్‌యూ కూటమికి మధ్య బద్ధ శత్రుత్వం ఉంది.
ఈ నేపథ్యంలో ఒలాఫ్ షోల్జ్‌కు చెందిన ఎస్‌డీపీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనుందని వార్తలొచ్చాయి. అవస రమైతే నాలుగోస్థానంలో వచ్చిన గ్రీన్స్ పార్టీని ప్రభు త్వంలో కలుపుకోవాలని సీడీయూ, సీఎస్‌యూ కూటమి భావిస్తోంది. పెద్దపెద్ద షరతు లు పెట్టకుండా ఎస్‌డీపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కు కలిస్తే అంతా సవ్యంగా సాగుతుంది. లేదంటే ఏఎఫ్‌డీ పార్టీలోని నేతల కు ఎరవేసి తమ కూటమి లో కలుపుకునే ప్రయత్నా లను సీడీయూ, సీఎస్ యూ కూటమి ముమ్మరం చేయొచ్చు. గత మూడేళ్లుగా గ్రీన్స్, ఫ్రీ డెమొక్రటిక్ పార్టీతో కలిసి ఎస్‌డీపీ ప్రభుత్వాన్ని షోల్జ్ నడిపించారు.
బలపడనున్న అమెరికాతో మైత్రి
రష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తున్న సీడీయూ కూటమి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఉక్రెయిన్‌కు ఒక రకంగా సానుకూలమైన వార్త. మెర్జ్ సారథ్యంలోని సర్కార్ ఇకమీదటా ఉక్రెయిన్‌కు తగు రీతిలో ఆయుధ, ఆర్థిక సాయం చేసే వీలుంది. మరోవైపు జర్మనీ, అమెరికా సత్సంబంధాలను మరింత పటిష్టం చేస్తానని మెర్జ్ సోమవారం స్పష్టంచేశారు.
‘‘ అమెరికా మాత్రమే ఎదగాలనే ‘అమెరికా ఫస్ట్’ నినాదం వాస్తవరూపం దాల్చితే అమెరికా ఒంటరి అయిపోతుంది. అలాకాకుండా ఇరుపక్షాలు లాభపడేలా జర్మనీ, అమెరికా బంధాన్ని బలపరుస్తా. అమెరికా సత్సంబంధాలను తెంచుకుంటే యూరప్ దేశాలు మాత్రమే దెబ్బతినవు. దాని విపరిణామాలను అమెరికా కూడా అనుభవించాల్సి ఉంటుంది’’ అని ఎన్నికల ముందస్తు ఫలితా లొచ్చాక తొలి మీడియా సమావేశంలో మెర్జ్ వ్యాఖ్యా నించారు. యూరప్ దేశాల కంటే దేశ స్వీయ ప్రయో జనాలకే ట్రంప్ పెద్దపీట వేస్తున్న వేళ మెర్జ్ ఈ అంశంపై మాట్లాడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment