
ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధిక ఓట్లు సాధించిన సీడీయూ, సీఎస్‌యూ కూటమి
బెర్లిన్: క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ) నేత ఫ్రెడరిక్ మెర్జ్ తదుపరి జర్మనీ చాన్స్‌లర్‌గా అధికార పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. జర్మనీ పార్లమెంట్(బండేస్టాగ్)కు ఆదివారం జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి ముందంజలో నిలిచింది. దీంతో తమ కూటమి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుందని సీడీయూ/సీఎస్‌యూ కూటమి ముఖ్యనేతలు ప్రకటించారు.
జర్మనీ ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ ఏఆర్‌డీ, జెడ్‌డీఎఫ్ పబ్లిక్ టెలివిజన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం సీడీయూ,సీఎస్‌యూ కూటమికి 29 శాతం ఓట్లు పడ్డాయి. ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీకి 19.6 శాతం ఓట్లు పడ్డాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఇన్నాళ్లూ ఒలాఫ్ షోల్జ్ సారథ్యంలో అధికారంలో కొనసాగిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ(ఎస్‌డీపీ) కేవలం 16 శాతం ఓట్లతో మూడోస్థానానికి పరిమితమైంది. దీంతో ఒలాఫ్ షోల్జ్ తన ఓటమిని అధికారికంగా అంగీకరించారు. ‘‘ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలొచ్చాక ప్రభుత్వ ఏర్పాటుకు ఏమాత్రం ఆలస్యం చేయబోం’’ అని ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆదివారం బెర్లిన్‌లో ఫ్రెడరిక్ మెర్జ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment