
ఫిబ్రవరిలో జర్మనీ పార్లమెంట్ ఎన్నికలు
బెర్లిన్: జర్మనీ చాన్సెలర్ ఒలాఫ్ షోల్జ్ సోమవారం పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షలో ఓటమి పాలయ్యారు. యూరప్‌లోనే అత్యధిక జనాభా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీలో ఫిబ్రవరిలోనే ముందస్తు ఎన్నికలకు ఈ పరిణామం దారి తీయనుంది. మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నవంబర్ 6న కుప్పకూలింది. రాజ్యాంగం ప్రకారం సభలో విశ్వాస పరీక్ష చేపట్టాల్సి ఉంటుంది.
మొత్తం 733 మంది సభ్యులుండే దిగువ సభ బుండెస్టాగ్‌లో సోమవారం షోల్జ్‌కు అనుకూలంగా 207 మంది ఓటేశారు. దీంతో, ఆయన సభ విశ్వాసం పొందలేకపోయినట్లు ప్రకటించారు. విశ్వాసంలో గెలవాలంటే మరో 367 ఓట్ల అవసరముంది. ఫిబ్రవరి 23వ తేదీన ఎన్నికలు జరపాలని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సాయమందించేందుకు సిద్ధమని ప్రకటిస్తున్న షోల్జ్ ‘సోషల్ డెమోక్రాట్’పార్టీకి వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు తక్కువని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం యూనియన్ బ్లాక్ ముందంజలో ఉందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment