
మరో 5 రోజుల్లో ఎన్నికలు
జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో అనివార్యమైన ఎన్నికలు ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి ఈసారి హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. ఈసారి ఈ కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలొచ్చాయి.
మరోవైపు 2010 దశకంలో జర్మనీలోకి వలసలు పోటెత్తడంతో ఉద్యమంగా మొదలై ఇప్పుడు అతివాద పార్టీగా ఎదిగిన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీ సైతం మళ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. జర్మనీలోకి పోటెత్తుతున్న అక్రమ వలసలకు అడ్డుకట్టవేయడం, ఆర్థికవ్యవస్థను పరుగులెత్తించే సత్తా ఉన్న పార్టీకే ఈసారి ఓటర్లు పట్టంకట్టనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీన జరగనున్న ఎన్నికల్లో వలసలు, ఆర్థిక వ్యవస్థ మాత్రమే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. బండేస్టాగ్(జర్మనీ పార్లమెంట్)లో అధికార పీఠంపై కూర్చునేది ఎవరనే అంశం ఇప్పుడు జర్మనీ అంతటా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎన్నడూలేనంతగా జర్మనీలో జనసమ్మర్థ ప్రదేశాల్లో దాడి ఘటనలు ఎక్కువయ్యాయి. అక్రమ వలసదారులే ఈ దాడులకు పాల్పడుతున్నారన్న ఆగ్రహావేశాలు స్థానికుల్లో పెరిగాయి. దీంతో అక్రమ వలసదారుల కట్టడి, శరణార్థులుగా గుర్తింపునకు సంబంధించిన నిబంధనలు కఠినతరం చేయడం వంటి డిమాండ్లు ఓటర్లలో ఎక్కువయ్యాయి. మాన్‌హైమ్, జోలింగన్, మాగ్‌డీబర్గ్, అషాఫన్‌బర్గ్ నగరాల్లో దాడి ఘటనలతో అక్రమవలస ఇప్పుడు∙కీలకాంశమైంది. ఇటీవల మ్యూనిక్‌లో అఫ్గాన్ పౌరుడు వేగంగా కారు పోనివ్వడంతో జర్మనీ జాతీయురాలు, ఆమె రెండేళ్ల కూతురు తీవ్రంగా గాయపడిన ఘటనతో అక్రమ వలసదారుల కట్టడి అంశాన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నాయి. ఈసారి ఐదుగురు ఛాన్స్‌లర్ పదవి కోసం పోటీపడుతున్నారు.
ఫ్రిడిష్ మెర్జ్..
క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ) అధినేత ఫ్రిడిష్ మెర్జ్ వైపు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గుచూపే వీలుంది. ఆరున్నర అడుగుల ఎత్తు 69 ఏళ్ల వయస్సున్న మెర్జ్ 2002 ఏడాదిలో ఏంజెలా మెర్కల్ ప్రభుత్వంలో పనిచేశారు. తర్వాత రాజకీయాలు వదిలేసి పలు పెట్టుబడుల బ్యాంకుల బోర్డుల్లో సేవలందించారు. తర్వాత మళ్లీ సీడీయూ పార్టీలో చేరి పార్టీ నాయకత్వ పోరులో 2018లో మెర్కెల్, 2021లో ఆర్మిన్ లాషెట్ చేతిలో ఓటమిని చవిచూశారు. ఈసారి ‘‘ జర్మనీలో ఉన్నందుకు మరోసారి గర్వపడదాం’’ నినాదంతో సీడీయూ చీఫ్‌గా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ‘‘దేశ సరిహద్దులను పటిష్టంచేస్తా. వలసలను కట్టడిచేసేలా శరణార్థి నిబంధనలను కఠినతరం చేస్తా. పన్నులు తగ్గిస్తా. సంక్షేమ పథకాల కోసం 50 బిలియన్ యూరోలను ఖర్చుచేస్తా’’ అని హామీలు గుప్పించారు.
ఒలాఫ్ షోల్జ్..
సోషల్ డెమొక్రటిక్ పార్టీ నేత అయిన ఒలాఫ్ షోల్జ్ ఇప్పటికే మూడేళ్లకు పైగా దేశ చాన్స్‌లర్‌గా సేవలందించారు. అయితే కూటమి సర్కార్‌ను నిలబెట్టుకోలేకపోయారు. రెండు నెలల క్రితం బలపరీక్షలో ఓడిపోయారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రత్యక్షంగా జర్మనీ ఆర్థికవ్యవస్థపై విపరిణామాలు చూపడంతో ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింది. అది చివరకు ప్రభుత్వం కూలడానికి కారణమైంది. గత ఏడాది జరిగిన విశ్వాస పరీక్షలో 733 మంది సభ్యులున్న సభలో కేవలం 207 ఓట్లు సాధించడం తెల్సిందే. దీంతో అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ పార్లమెంట్‌ను రద్దుచేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు.
ఎలీస్ వీడెల్..
2013లో ఏఎఫ్‌డీ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి పార్టీ తరఫున చాన్స్‌లర్ పదవి కోసం 46 ఏళ్ల నాయ కురాలు ఎలీస్ వీడెల్ పోటీపడుతున్నారు. ఈమెకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల మ్యూనిక్‌కు వచ్చిన ప్పుడు ఈమెతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈమె కు యువతలో పెద్ద క్రేజ్ ఉంది. ‘‘వలసలు.. ఇమ్మిగేషన్‌కు విరుగుడుగా రిమిగ్రేషన్(తిరిగి పంపేయడం) తీసుకొస్తా. జర్మనీపై రష్యా ఆంక్షలను ఎత్తేసేలా కృషిచేస్తా. ధ్వంసమైన నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్‌ను పునరుద్ధరిస్తా’’ అని ఎలీస్ పలు ఎన్నికల హామీ గుప్పించారు.
రాబర్ట్ హబెక్..
మూడు దశాబ్దాల క్రితం పర్యావరణ ఉద్యమంగా మొదలైన రాజకీయ పార్టీగా అవతరించిన ‘ది గ్రీన్స్/అలయన్స్ 90’ పార్టీకి సారథ్యం వహిస్తున్న 55 ఏళ్ల రాబర్ట్ హబెక్ సైతం చాన్స్‌లర్ రేసులో నిలిచారు. షోల్జ్ ప్రభుత్వంలో ఈయన వైస్ ఛాన్స్‌లర్‌గా, ఆర్థికశాఖ మంత్రిగా సేవలందించారు. ‘‘పునరుత్పాదక ఇంధన విధానాలకు పట్టం కడతా. అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌కు సాయం కొనసాగిస్తా. అణువిద్యుత్ శక్తి ఉత్పత్తిని తగ్గిస్తా. పవన విద్యుత్‌కు పాతరేస్తా’’ అని ఎన్నికల హామీ ఇచ్చారు.
సారా వాగెన్ కనెక్ట్
రష్యాకు మద్దతు పలుకుతూ తూర్పు జర్మనీలో బలమైన ఓటు బ్యాంక్‌ను సాధించిన ‘ది సారా వాగెన్ కనెక్ట్ –రీజన్ అండ్ జస్టిస్ పార్టీ(బీఎస్‌డబ్ల్యూ)’ సైతం చాన్స్‌లర్ పదవిపై కన్నేసింది. బీఎస్‌డబ్ల్యూ సహ వ్యవస్థాపకురాలు సారా వాగెన్ కనెక్ట్ తమ పార్టీ.. ఏఎఫ్‌డీకి అసలైన ప్రత్యామ్నాయ పార్టీ అని చెబుతున్నారు. ఏఎఫ్‌డీ తరహాలోనే అక్రమ వలసలపై బీఎస్‌డబ్ల్యూ పార్టీ ఉద్యమిస్తోంది. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు అనుకూలంగా మాట్లాడుతుండటంతో ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కష్టమని అంచనాలు వెలువడ్డాయి.
ఓటింగ్
ఎలా చేపడతారు?18 ఏళ్లు దాటిన వారంతా ఓటేయొచ్చు. అయితే ప్రతి ఒక్కరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 299 పార్లమెంట్ నియోజకవర్గాల కోసం ఒక ఓటు వేయాలి. దేశంలో 16 రాష్ట్రాలు ఉండగా ఓటరు తన సొంత రాష్ట్రం కోసం మరో ఓటు వేయాల్సి ఉంటుంది. రెండో ఓటులో కనీసం 5 శాతం ఓట్లను సాధించిన పార్టీ సభ్యులకు నేరుగా పార్లమెంట్‌లో సభ్యత్వం కోరే అర్హత ఉంటుంది. సంస్కరించిన పోలింగ్ విధానాన్ని తొలిసారిగా ఈ ఏడాది నుంచే అమలుచేయనున్నారు. దీంతో పార్లమెంట్‌లో ఇన్నాళ్లూ ఉన్న 733 సీట్లు తగ్గిపోయి 630కి చేరుకోనున్నాయి. అత్యధిక సీట్లను సాధించిన పార్టీ లేదా కూటమి నుంచి చాన్స్‌లర్‌ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం తాత్కాలికంగా అధికారంలో ఉంది. ఈసారి సీడీయూ, సీఎస్‌యూ కూటమి విజయం సాధించవచ్చని ఎన్నికల పండితులు విశ్లేషిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment