
అరెస్ట్‌నాటి ఫొటోనే ఫ్రేమ్ కట్టి మరీ వైట్‌హౌస్‌లో తగిలించుకున్న వైనం
ఏదైనా కేసులో ఒక నేత అరెస్ట్ అయితే ఆ విషయాన్ని పత్రికా సమావేశంలోనో, మరే సందర్భంలోనో ప్రస్తావిస్తే ఆ నేతకు అస్సలు నచ్చదు. అసలు తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని అంతెత్తున లేచి ఖండిస్తారు. అరెస్ట్‌నాటి ఫొటోలను ఒకవేళ మళ్లీ ఆయన ముందే పెడితే ఉగ్రరూపం దాల్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అలాంటిది తెంపరితనానికి మారుపేరుగా నిలిచిపోయిన అగ్రరాజ్యానికి అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇంకెలా స్పందిస్తారో అని చాలా మంది భావించడం సహజం.
కానీ అలాంటి ఆలోచనలకు పటాపంచలు చేస్తూ, విభిన్నంగా ట్రంప్ తన అరెస్ట్ నాటి ఫొటోను పెద్ద సైజులో తీయించి చక్కగా బంగారు రంగు ఫ్రేమ్ కట్టి ఏకంగా అధ్యక్షభవనంలోనే తగిలించారు. అది కూడా ఎక్కడో కనిపించనట్లు ఓ మూలన కాకుండా నేరుగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసే ఓవల్ ఆఫీస్ గోడకే తగిలించారు. రెండ్రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ వైట్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అక్కడి మీడియా కెమెరామెన్‌లు ఓవల్ ఆఫీస్ అంతటినీ తమ కెమెరాల్లో బంధించిన వేళ ఈ మగ్‌షాట్ ఫొటోఫ్రేమ్ విషయం వెలుగులోకి వచ్చింది.
ఏమిటీ మగ్‌షాట్ ?
2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జార్జియా రాష్ట్రంలో ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై నాటి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌ను అరెస్ట్‌చేశారు. ఆ సందర్భంగా 2023 ఆగస్ట్‌లో జార్జియా రాష్ట్రంలోని పుల్టన్ కౌంటీ జైలుకు వచ్చి ట్రంప్ లొంగిపోయారు. కస్టడీలోకి తీసుకునే ముందు అరెస్ట్ అయిన నిందితుడి ముఖం స్పష్టంగా తెలిసేలా దగ్గరి ఫొటో అంటే మగ్ షాట్‌ను నిబంధనల ప్రకారం తీసుకుంటారు.
ట్రంప్ ఫొటో సైతం అలాగే తీశారు. మాజీ అధ్యక్షుడిని ఇలా మగ్‌షాట్ తీయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో ట్రంప్ మగ్‌షాట్ ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ అయింది. ఆ ఫొటోను ఆనాడు ప్రఖ్యాత న్యూయార్క్ పోస్ట్ సైతం ఫ్రంట్‌పేజీలో ప్రచురించింది. ఆ ఫ్రంట్‌పేజీ కటౌట్‌నే ట్రంప్ ఫ్రేమ్ కట్టించారు. మగ్‌షాట్‌పై నాటి అధికార డెమొక్రాట్లు, నాటి అధ్యక్షుడు జో బైడెన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్‌కు మద్దతుగా ఇదే మగ్‌షాట్ ఫొటోలను ఆన్‌లైన్‌లో ప్రచారానికి రిపబ్లికన్ నేతలు వాడుకున్నారు.
తాజాగా మగ్‌షాట్‌ను వైట్‌హౌస్‌లో ఫ్రేమ్ కట్టిన విషయం అందరికీ తెలియడంతో వైట్‌హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో ఒక పోస్ట్‌చేశారు. ‘‘హ్యాపీ వేలంటైన్ డే. అందమైన ఓవల్ ఆఫీస్‌లోకి మీకందరికీ స్వాగతం’’అని ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. ఈ ఫొటోఫ్రేమ్‌ను మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌ల ఫొటోల సమీపంలో తగిలించారు. ఆనాడు అరెస్ట్ అయిన వెంటనే పూచీకత్తు మీద ట్రంప్ విడుదలయ్యారు. ఎలాగూ ఫొటో వైరల్‌గా మారడంతో దీనిని వ్యాపారవస్తువుగా ట్రంప్ మార్చేశారు. స్వయంగా ఆయన తన మగ్‌షాట్ ఫొటోల విక్రయం ద్వారా దాదాపు రూ.61 కోట్లు ఆర్జించారు. టీ–షర్ట్‌లు మొదలు డిజిటల్ ట్రేడింగ్ కార్డుల దాకా అన్నింటిపైనా ఈ మగ్‌షాట్‌నే ముద్రించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment