presidential building
-
శ్వేతసౌధంలో ట్రంప్ మగ్‌షాట్
ఏదైనా కేసులో ఒక నేత అరెస్ట్ అయితే ఆ విషయాన్ని పత్రికా సమావేశంలోనో, మరే సందర్భంలోనో ప్రస్తావిస్తే ఆ నేతకు అస్సలు నచ్చదు. అసలు తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని అంతెత్తున లేచి ఖండిస్తారు. అరెస్ట్నాటి ఫొటోలను ఒకవేళ మళ్లీ ఆయన ముందే పెడితే ఉగ్రరూపం దాల్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అలాంటిది తెంపరితనానికి మారుపేరుగా నిలిచిపోయిన అగ్రరాజ్యానికి అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇంకెలా స్పందిస్తారో అని చాలా మంది భావించడం సహజం. కానీ అలాంటి ఆలోచనలకు పటాపంచలు చేస్తూ, విభిన్నంగా ట్రంప్ తన అరెస్ట్ నాటి ఫొటోను పెద్ద సైజులో తీయించి చక్కగా బంగారు రంగు ఫ్రేమ్ కట్టి ఏకంగా అధ్యక్షభవనంలోనే తగిలించారు. అది కూడా ఎక్కడో కనిపించనట్లు ఓ మూలన కాకుండా నేరుగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసే ఓవల్ ఆఫీస్ గోడకే తగిలించారు. రెండ్రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ వైట్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అక్కడి మీడియా కెమెరామెన్లు ఓవల్ ఆఫీస్ అంతటినీ తమ కెమెరాల్లో బంధించిన వేళ ఈ మగ్‌షాట్ ఫొటోఫ్రేమ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఏమిటీ మగ్‌షాట్ ? 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జార్జియా రాష్ట్రంలో ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై నాటి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌ను అరెస్ట్‌చేశారు. ఆ సందర్భంగా 2023 ఆగస్ట్‌లో జార్జియా రాష్ట్రంలోని పుల్టన్ కౌంటీ జైలుకు వచ్చి ట్రంప్ లొంగిపోయారు. కస్టడీలోకి తీసుకునే ముందు అరెస్ట్ అయిన నిందితుడి ముఖం స్పష్టంగా తెలిసేలా దగ్గరి ఫొటో అంటే మగ్ షాట్‌ను నిబంధనల ప్రకారం తీసుకుంటారు. ట్రంప్ ఫొటో సైతం అలాగే తీశారు. మాజీ అధ్యక్షుడిని ఇలా మగ్‌షాట్ తీయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో ట్రంప్ మగ్‌షాట్ ఆన్లైన్లో విపరీతంగా వైరల్ అయింది. ఆ ఫొటోను ఆనాడు ప్రఖ్యాత న్యూయార్క్ పోస్ట్ సైతం ఫ్రంట్‌పేజీలో ప్రచురించింది. ఆ ఫ్రంట్‌పేజీ కటౌట్నే ట్రంప్ ఫ్రేమ్ కట్టించారు. మగ్షాట్పై నాటి అధికార డెమొక్రాట్లు, నాటి అధ్యక్షుడు జో బైడెన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్‌కు మద్దతుగా ఇదే మగ్‌షాట్ ఫొటోలను ఆన్లైన్లో ప్రచారానికి రిపబ్లికన్ నేతలు వాడుకున్నారు. తాజాగా మగ్‌షాట్‌ను వైట్‌హౌస్‌లో ఫ్రేమ్ కట్టిన విషయం అందరికీ తెలియడంతో వైట్‌హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో ఒక పోస్ట్‌చేశారు. ‘‘హ్యాపీ వేలంటైన్ డే. అందమైన ఓవల్ ఆఫీస్‌లోకి మీకందరికీ స్వాగతం’’అని ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. ఈ ఫొటోఫ్రేమ్‌ను మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌ల ఫొటోల సమీపంలో తగిలించారు. ఆనాడు అరెస్ట్ అయిన వెంటనే పూచీకత్తు మీద ట్రంప్ విడుదలయ్యారు. ఎలాగూ ఫొటో వైరల్‌గా మారడంతో దీనిని వ్యాపారవస్తువుగా ట్రంప్ మార్చేశారు. స్వయంగా ఆయన తన మగ్‌షాట్ ఫొటోల విక్రయం ద్వారా దాదాపు రూ.61 కోట్లు ఆర్జించారు. టీ–షర్ట్లు మొదలు డిజిటల్ ట్రేడింగ్ కార్డుల దాకా అన్నింటిపైనా ఈ మగ్షాట్నే ముద్రించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వైట్ హౌస్‌లో ఏపీ విద్యా ప్రభ
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్య సమితిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బుధవారం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను సందర్శించారు. ఇప్పటి వరకు వైట్‌హౌస్‌ను బయటి ప్రాంతాలను చూసేందుకు మాత్రమే అనుమతినిచ్చే ఆ దేశ అధికారులు.. తొలిసారి మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భవనం లోపలి ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం కల్పించారు. విద్యార్థులను వైట్ హౌస్ భద్రత సిబ్బంది శ్వేత సౌధం మొత్తం తిప్పారు. భవనంలో ప్రతి ఒక్క విభాగం పని విధానాన్ని అర్థమయ్యేలా వివరించారు. విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తిగా భవనంలో కలియదిరిగారు. అక్కడి విభాగాలు, సిబ్బంది పనితీరు, సెక్యూరిటీ సిస్టం, అధ్యక్షుడు నివసించే భవనం, కార్యాలయం పని విధానాలను తెలుసుకున్నారు.ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై అంతర్జాతీయ వేదికపై వివరించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10 మంది విద్యార్థులను ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని లబ్ధిపొందిన వారే చెప్పడం సమంజసమని భావించిన ప్రభుత్వం.. పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. ఇలా దేశ చరిత్రలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మన రాష్ట్రం నుంచే ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో యునైటెడ్ నేషన్స్‌లోని స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ సమన్వయంతో, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ పర్యవేక్షణలో విద్యార్థుల బృందం ఈనెల 14న అమెరికాకు వెళ్లింది. ఈ బృందంలో మాల శివలింగమ్మ, (తండ్రి సోమనాథ్ రైతు కూలీ, తల్లి గంగమ్మ), మోతుకూరి చంద్రలేఖ (ఏఎస్ఆర్ జిల్లా,తండ్రి రామారావు ఆటో డ్రైవర్), గుండుమోగుల గణేష్ అంజన సాయి (పశ్చిమ గోదావరి జిల్లా, తండ్రి గోపీ, కౌలు రైతు), దడాల జ్యోత్స్న (కాకినాడ జిల్లా, తండ్రి సింహాచలం సెక్యూరిటీ గార్డు), చాకలి రాజేశ్వరి (నంద్యాల జిల్లా, తండ్రి దస్తగిరి లారీ డ్రైవర్), పసుపులేటి గాయత్రి (ఏలూరు జిల్లా, తండ్రి రమేష్, తల్లి కూలీలు), అల్లం రిషితారెడ్డి (విజయనగరం జిల్లా, తండ్రి రామకృష్ణారెడ్డి మెకానిక్), వంజివాకు యోగేశ్వర్ (తిరుపతి జిల్లా, తండ్రి నాగరాజు కేబుల్ ఆపరేటర్), షేక్ అమ్మాజన్(శ్రీ సత్యసాయి జిల్లా, తల్లి షేక్ ఫాతిమా వ్యవసాయ కూలీ), సామల మనస్విని (పార్వతీపురం మన్యం జిల్లా, తల్లి కృష్ణవేణి) ఉన్నారు. ఈ నెల 15 నుంచి ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలిలో జరిగే సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజీ) సదస్సుతో పాటు కొలంబియా యూనివర్సిటీలో జరిగిన గ్లోబల్ స్కూల్స్ సమ్మిట్‌లో రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘నాడు–నేడు’, విద్యా సంస్కరణలపై వీరు ప్రసంగించారు. న్యూయార్క్‌లోని జాన్ జే కాలేజ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్‌లో నిర్వహించిన ఎస్డీఎస్ సర్విస్ సదస్సు, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో సైతం పాలుపంచుకున్నారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్‌లో ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా, సంక్షేమ పథకాలను వివరించారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయాలను సందర్శించి భారత్‌కు తిరుగుపయనమయ్యారు. సీఎంకు విద్యార్థుల కృతజ్ఞతలు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్య సమితి సదస్సు కోసం రాష్ట్రం తరఫున బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికైనందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తాము నేర్చుకున్న అంశాలను రాష్ట్రంలోని విద్యార్థులకు తెలియజేస్తామని చెప్పారు. పేద కుటుంబాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న తమను ఎంపిక చేసినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్‌కుమార్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. -
సంచలన వీడియో విడుదల చేసిన ఉత్తర కొరియా
ప్యాంగ్యాంగ్: జగడాలమారి ఉత్తర కొరియా మరోసారి వివాదానికి తెరలేపింది. తాము తలుచుకుంటే దక్షిణ కొరియాను భస్మం చేస్తామని బెదిరిస్తున్నట్లుగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేసింది. ఈ వీడియో ఎంత భయంకరంగా ఉందటే ఏక కాలంలో వందల సంఖ్యలో క్షిపణులు దక్షిణ కొరియాలోని ప్రధాన భవంతులన్నింటిని నామరూపాల్లేకుండా నేలమట్టం చేశాయి. జనవరి 6న అణుపరీక్ష నిర్వహించినప్పటి నుంచి ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి దక్షిణ కొరియా, మరోపక్క వాషింగ్టన్ పరోక్షంగా ఉత్తర కొరియాను హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ వాటిన్నంటిని భేఖాతరు చేస్తూ తాజాగా రెచ్చగొట్టేలాగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేసింది. తక్కువ బడ్జెట్ ఎక్కువ గ్రాఫిక్స్‌తో రూపొందించిన ఈ వీడియోలో ఏం ఉందటే.. ఉత్తర కొరియా సైనికులంతా కూడా అప్రమత్తమై సరిహద్దు ప్రాంతానికి వేల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా చేరగా.. క్షిపణులన్నింటిని దక్షిణ కొరియావైపు లక్ష్యంగా పెట్టారు. ముఖ్యంగా సియోల్‌ను టార్గెట్ చేశారు. అంతా సిద్ధమై ఉండగానే సైనిక ప్రధాన అధికారి ఫైర్ అంటూ సిగ్నల్ ఇవ్వగానే ఏక కాలంలో వందల ఫిరంగులు పేల్చడంతో వాయు వేగంతో దూసుకెళ్లిన క్షిపణులు నేరుగా సియోల్‌లోని అధ్యక్ష భవనాన్ని, ఇతర ముఖ్య కార్యాలయాలను ధ్వంసం చేశాయి. అంతేకాదు, ఈ వీడియోలో తాము తలుచుకుంటే సర్వం బూడిదే అంటూ వాక్యాలను కూడా చేర్చారు.