సంచలన వీడియో విడుదల చేసిన ఉత్తర కొరియా
ప్యాంగ్యాంగ్: జగడాలమారి ఉత్తర కొరియా మరోసారి వివాదానికి తెరలేపింది. తాము తలుచుకుంటే దక్షిణ కొరియాను భస్మం చేస్తామని బెదిరిస్తున్నట్లుగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేసింది. ఈ వీడియో ఎంత భయంకరంగా ఉందటే ఏక కాలంలో వందల సంఖ్యలో క్షిపణులు దక్షిణ కొరియాలోని ప్రధాన భవంతులన్నింటిని నామరూపాల్లేకుండా నేలమట్టం చేశాయి.
జనవరి 6న అణుపరీక్ష నిర్వహించినప్పటి నుంచి ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి దక్షిణ కొరియా, మరోపక్క వాషింగ్టన్ పరోక్షంగా ఉత్తర కొరియాను హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ వాటిన్నంటిని భేఖాతరు చేస్తూ తాజాగా రెచ్చగొట్టేలాగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేసింది. తక్కువ బడ్జెట్ ఎక్కువ గ్రాఫిక్స్తో రూపొందించిన ఈ వీడియోలో ఏం ఉందటే..
ఉత్తర కొరియా సైనికులంతా కూడా అప్రమత్తమై సరిహద్దు ప్రాంతానికి వేల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా చేరగా.. క్షిపణులన్నింటిని దక్షిణ కొరియావైపు లక్ష్యంగా పెట్టారు. ముఖ్యంగా సియోల్ను టార్గెట్ చేశారు. అంతా సిద్ధమై ఉండగానే సైనిక ప్రధాన అధికారి ఫైర్ అంటూ సిగ్నల్ ఇవ్వగానే ఏక కాలంలో వందల ఫిరంగులు పేల్చడంతో వాయు వేగంతో దూసుకెళ్లిన క్షిపణులు నేరుగా సియోల్లోని అధ్యక్ష భవనాన్ని, ఇతర ముఖ్య కార్యాలయాలను ధ్వంసం చేశాయి. అంతేకాదు, ఈ వీడియోలో తాము తలుచుకుంటే సర్వం బూడిదే అంటూ వాక్యాలను కూడా చేర్చారు.