సియోల్: ఉభయ కొరియాల మధ్య చర్చలకు వేదికగా నిలిచిన అనుసంధాన కార్యాలయాన్ని ఉత్తర కొరియా పేల్చివేసింది. సైనిక చర్యకు దిగుతామని ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో మంగళవారం ఈ ఘటనకు పాల్పడింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా యూనిఫికేషన్ మినిస్ట్రీ(ఏకీకరణ మంత్రిత్వ శాఖ- కొరియా పునర్‌కలయికను ప్రోత్సహించేందుకు నెలకొల్పబడింది) శాఖ ధ్రువీకరించింది. ఈ మేరకు.. ‘‘కేసంగ్ అనుసంధాన కార్యాలయాన్ని ఉత్తర కొరియా పేల్చివేసింది’’ అని ప్రకటన విడుదల చేసింది. ఘటన జరిగిన సమయంలో పార్లమెంటులో ఉన్న దక్షిణ కొరియా యూనిషికేషన్ మినిస్టర్ కిమ్ యోన్- చౌల్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఊహించిందే జరిగింది. పరిస్థితులను సమీక్షిస్తున్నాం’’ అని తెలిపారు.(అమెరికా తీరుపై ఉత్తర కొరియా అసహనం!)
ఇక ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్‌ను వ్యతిరేకిస్తూ దక్షిణ కొరియా నిరసనకారులు సరిహద్దులో బుడగలు ఎగురవేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా అణ్వాయుధాలపై కిమ్ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో దాయాది దేశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిమ్ సోదరి, వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ప్రత్యామ్నాయ పొలిట్ సభ్యురాలు కిమ్ యో జాంగ్.. దక్షిణ కొరియాపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతేగాక గత కొన్నిరోజులుగా శత్రు దేశ చర్యల(అమెరికాతో సంబంధాల)ను గమనిస్తున్నామన్న ఆమె.. తదుపరి చర్యలకు సిద్ధమవ్వాల్సిందిగా సైన్యాన్ని ఆదేశించానని శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేగాక.. ఉత్తర- దక్షిణ కొరియాల బంధానికి వేదికైన అనుసంధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసం చేసేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాజాగా ఈ మేరకు తన నిర్ణయాన్ని అమలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.(దక్షిణ కొరియాకు కిమ్ సోదరి హెచ్చరికలు)
చైనా స్పందన..
ఇరు దేశాల ఉమ్మడి భాగస్వామ్యంతో సరిహద్దులో నెలకొల్పిన కేసంగ్ పారిశ్రామిక ప్రాంతంలో పేలుడు సంభవించిందని యోనప్ న్యూస్ ఏజెన్సీ కథనాలు ప్రసారం చేసింది. నిమిషాల వ్యవధిలోనే ప్రాంతమంతా దట్టమైన పొగతో అలుముకుందని తెలిపింది. అదే విధంగా.. దాయాది దేశంతో విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో నిస్సైనిక ప్రాంతంలో సైనిక బలగాలను మోహరించాలని నార్త్ కొరియా భావిస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇక కొరియా సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జావో లిజియన్ తాజాగా స్పందించారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కాగా దక్షిణ కొరియాకు అమెరికా మద్దతుగా నిలవగా.. ఉత్తర కొరియా మిత్రదేశంగా చైనా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment