వాషింగ్టన్ : ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వైఖరిలో అనూహ్యంగా కాస్త మార్పు రావటంతో.. శాంతి చర్చలకు త్వరపడాలని అగ్రరాజ్యం అమెరికాకు పలు ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే పొరుగు దేశం దక్షిణ కొరియాతో చర్చలకు కిమ్ సిద్ధమౌతున్న విషయం తెలిసిందే. జనవరి 1న కొత్త సంవత్సరం సందర్భంగా ఇచ్చిన సందేశంలో కిమ్ శాంతి ప్రస్తావన తేవటం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.
‘‘ఉత్తర కొరియా ప్రజలు కోరుకునేది ఒక్కటే.. శాంతి. ఒంటరిగా ఓ దేశం అభివృద్ధి సాధించటం జరిగే పని కాదు. అందుకు పొరుగు దేశాల సహకారం చాలా అవసరం. దక్షిణ కొరియాతో దౌత్యానికి ఉత్తర కొరియా ఎల్లప్పుడూ సిద్ధం’’ అన్న కిమ్ సందేశాన్ని ప్యోంగ్యాంగ్, సియోల్ లోని అన్ని ప్రముఖ పత్రికలు ప్రచురించాయి. దౌత్యపరమైన సంబంధాల ద్వారానే అది సాధ్యమంటూ అందులో కిమ్ పేర్కొన్నట్లు ఆయా కథనాలు ఉటంకించాయి. ఇక చర్చల ప్రతిపాదనను సియోల్(దక్షిణ కొరియా) వర్గాలు కూడా ధృవీకరించాయి. అయితే అమెరికా మాత్రం ఆ విషయంలో షరా మాములుగా అనుమానాలనే వ్యక్తం చేస్తోంది.
కిమ్‌ను నమ్మలేం : అమెరికా
కిమ్ వైఖరిలో మార్పును అంత తేలికగా నమ్మటం మంచిది కాదన్న భావనలో అమెరికా ఉంది. ‘‘ఉత్తర కొరియా ప్రకటను తక్షణమే స్వాగతించలేం. అణ్వాయుధాల నిషేధం అమలు.. కవ్వింపు చర్యలను పూర్తిగా నిలిపివేశాకే చర్చల గురించి ఆలోచించటం ఉత్తమం. దక్షిణ కొరియాకు మేం సూచించేది కూడా అదే.’’ అని అమెరికా తరపున ఐక్యరాజ్యసమితి రాయబారి నిక్కీ హలే చెబుతున్నారు. మరి అమెరికా శాంతి చర్చలకు ముందుకు వస్తుందా? అన్న ప్రశ్నకు మాత్రం ఆమె దాటవేత ధోరణిని ప్రదర్శించారు.
తెరపైకి ‘ఫ్రీజ్ ఫర్ ఫ్రీజ్’ అగ్రిమెంట్...
ఉత్తర కొరియా వైపు నుంచి కవ్వింపు చర్యలు తగ్గినట్లు కనిపిస్తుండటంతో స్వచ్ఛందంగా దౌత్యానికి అమెరికానే ముందుకు రావటమే మంచిదని సీనియర్ రక్షణ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు మాటల యుద్ధానికి తెరదించి ఆపై ఇరు దేశాలు తటస్థ వేదికగా చర్చలు జరపటం ఉత్తమమని.. ఈ మేరకు రష్యా, చైనాలు చొరవతో గతంలో ప్రతిపాదించిన ‘ఫ్రీజ్ ఫర్ ఫ్రీజ్ ఒప్పందం’ అమలు చేయటం పెద్ద కష్టమైన పనేం కాదని వారంటున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఉత్తర కొరియాపై ఉన్న ఆంక్షలన్నింటిని అమెరికా తక్షణమే ఎత్తివేయాల్సి ఉంటుంది. అదే సమయంలో దశల వారీగా అణు క్షిపణుల విషయంలో ఉత్తర కొరియా నియంత్రణ పాటిస్తూ నిషేధం దిశగా అడుగులు వేయాలి. తద్వారానే శాంతి చర్చలు దశల వారీగా ముందుకు కొనసాగుతుంటాయి.
ఇది కూడా చదవండి... కిమ్.. నీ కంటే నాది పెద్దది : ట్రంప్
Comments
Please login to add a commentAdd a comment