సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ జోన్ ఉన్ ఆరోగ్యం విషమంగా ఉందన్న వార్తలపై దక్షిణ కొరియా ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. కిమ్ ఆరోగ్యం క్షీణించలేదని పేర్కొన్నాయి. కిమ్ గురించి వస్తున్న వార్తలు నిజం కాదని కొట్టిపడేశాయి. ఇందుకు సంబంధించి ఉత్తర కొరియా నుంచి ఎటువంటి అసాధారణ సంకేతాలు వెలువడటం లేదని ది ప్రెసిడెన్షియల్ బ్లూ హౌజ్(దక్షిణ కొరియా అధ్యక్షుడి అధికార భవనం) పేర్కొంది. కాగా గుండె కండరాల నొప్పితో ఆస్పత్రిలో చేరిన కిమ్ శస్త్ర చికిత్స చేయించుకున్నారని.. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారిందని, బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెలువరించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సియోల్ కేంద్రంగా పనిచేసే వెబ్‌సైట్... ఏప్రిల్ 12న శస్త్రచికిత్స తర్వాత కిమ్ ప్రస్తుతం హ్యాంగ్‌సాన్‌లోని మౌంట్ కుమ్‌గాంగ్ రిసార్టులోని విల్లాలో ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు తెలిపింది. కాగా ఉత్తర కొరియా వ్యవస్థాపక ప్రీమియర్, తన తాత కిమ్ II సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరుకాని విషయం తెలిసిందే. అన్నింటా తానే ముందుండి కార్యక్రమాలు నిర్వహించే కిమ్ ఈ విధంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటంతో అనారోగ్యమే ఇందుకు కారణమంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి.(విషమంగా కిమ్ జోంగ్ ఆరోగ్యం..!)
Comments
Please login to add a commentAdd a comment