ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దుల్లో ఇదీ పరిస్థితి
ఇరువైపులా భారీగా బలగాల మోహరింపు
డీఎంజెడ్ ప్రాంతంలో మాత్రమే కాస్త ప్రశాంతత
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేకప్రతినిధి) ఉత్తరకొరియా, దక్షిణకొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంటుంది. అలాంటిది ఇరుదేశాల సరిహద్దులో పరిస్థితులు ఎలా ఉంటాయి.. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అన్ని దేశాల మధ్య సరిహద్దుల్లా కాకుండా ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు కాస్త భిన్నంగా ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం.
సియోల్ పర్యటనలో ఉన్న మీడియా ప్రతినిధులు సరిహద్దు డీమిలిటరైజ్డ్ జోన్ (డీఎంజెడ్)ను సందర్శించారు. అక్కడి పరిస్థితులను నేరుగా పరిశీలించారు. సందర్శన సమయంలోనే అక్కడ బాంబుల మోత మోగింది. ప్రతిక్షణం ఇరు దేశాల సైనికులు కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారని, అది సర్వసాధారణమని అక్కడి సైనికాధికారులు పేర్కొంటున్నారు.
రెండు దేశాలను వేరు పరిచేదే డీఎంజెడ్..
ఇరు దేశాలను సమానంగా ఈ డీఎంజెడ్ వేరుపరుస్తుంది. 4 కిలోమీటర్ల వెడల్పు, 258 కిలోమీటర్ల పొడవుతో ఈ సరిహద్దు ప్రాంతం విస్తరించి ఉంది. ఇరువైపులా భారీస్థాయిలో విద్యుత్ కంచెలు ఏర్పాటు చేశారు. ఈ డీఎంజెడ్‌కు రెండువైపులా ప్రపంచంలోకెల్లా అత్యంత భారీ స్థాయిలో సైనికులను మోహరించారు. డీఎంజెడ్‌లో మాత్రం సైనికులెవరూ ఉండరు. ఎలాంటి సైనిక కార్యకలాపాలు మాత్రం జరగవు. 1953లో ఇక్కడ సైనిక తటస్థ ప్రాంతం (డీఎంజెడ్) ఏర్పాటు చేశారు.
ప్రచ్ఛన్నయుద్ధం జరిగిన సమయంలోనే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య సరిహద్దుగా ఉండేది. అయితే 1953లో ఇరుదేశాల మధ్య అమెరికా, చైనా కలిసి శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నించాయి. రెండుదేశాలు ఇప్పటికీ అంగీకరించలేదు. కానీ డీఎంజెడ్ ప్రాంతంలో మాత్రం ఎలాంటి సైనిక చర్య ఉండదు. ఇదే ప్రదేశంలో 1635 మీటర్ల పొడవు, 1.95 మీటర్ల ఎత్తు, 2.1 మీటర్ల వెడల్పుతో ఓ టన్నెల్ కూడా ఉంది.
ఈ సొరంగాన్ని ఉత్తర కొరియా సైనికులు సియోల్‌పై దాడి చేసేందుకు తవ్వారని చెబుతారు. ఇది పూర్తి కాకముందే ఐక్యరాజ్య సమితి పోలీసు అధికారులు గుర్తించి ఉత్తర కొరియాను హెచ్చరించారట. అయితే తొలుత అసలు ఈ సొరంగాన్ని తవ్వలేదని ఉత్తర కొరియా బుకాయించినా.. చివరకు అది గనుల తవ్వకాల్లో భాగంగా తవ్వామని మాట మార్చిందని అక్కడి పర్యాటకుల సందేశంలో రాసి ఉంది.
డీఎంజెడ్‌తో పాటు ఈ సొరంగాలను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. హిల్ పాయింట్ వ్యూ నుంచి ఉత్తర కొరియాతోపాటు దక్షిణకొరియా గ్రామాలను వీక్షించొచ్చు. కాకపోతే చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. చిన్న ఫొటో కూడా తీసుకోవడానికి అనుమతివ్వరు.
Comments
Please login to add a commentAdd a comment