oval office
-
శరణమా.. రణమేనా?
వాషింగ్టన్: ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. అటు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దేశాధినేతలం అన్న విషయం కూడా మర్చిపోయి మీడియా సాక్షిగా వాగ్వాదానికి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఒకరినొకరు దుయ్యబట్టుకున్నారు. అచ్చం వీధి బాగోతాన్ని తలపించేలా పాత విషయాలన్నీ తిరగదోడుతూ, పరస్పరం దెప్పిపొడుచుకుంటూ రెచ్చిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నడూ కనీవినీ ఎరగని ఈ దృశ్యాలకు వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసు వేదికైంది. ఉక్రెయిన్‌లోని అపార ఖనిజ నిక్షేపాల్లో అమెరికాకు 50 శాతం వాటా ఇవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేయడం, బదులుగా రష్యా నుంచి తమ దేశానికి కచి్చతమైన రక్షణ హామీలు కావాలని జెలెన్స్కీ కోరడం తెలిసిందే. వాటిపై స్పష్టమైన ఒప్పందాల నిమిత్తం అగ్ర రాజ్యం చేరిన ఆయన శుక్రవారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు పాల్గొన్న ఈ భేటీకి మీడియాను అనుమతించడమే గాక ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడం విశేషం. భేటీ చాలాసేపటిదాకా ప్రశాంతంగానే సాగినా చివర్లో పూర్తిగా అదుపు తప్పింది. నేతలిద్దరి మాటల యుద్ధంతో రచ్చ రచ్చగా మారింది. చివరికి ఎటూ తేలకుండానే ముగిసింది. భేటీ అనంతరం జరగాల్సిన ట్రంప్, జెలెన్స్కీ సంయుక్త మీడియా భేటీ కూడా రద్దయింది! అంతేగాక, ‘జెలెన్స్కీ వైట్‌హౌస్ వీడి వెళ్లిపోవచ్చు’ అంటూ మీడియా సమక్షంలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందానికి సిద్ధపడితేనే తిరిగి తమతో చర్చలకు రావాలని సూచించారు. దాంతో ఎన్నో ఆశల నడుమ జెలెన్స్కీ చేపట్టిన అమెరికా యాత్ర ఆశించిన ఫలితం రాబట్టకపోగా వికటించిన్నట్టు కనిపిస్తోంది. అలా మొదలైంది... రష్యా–ఉక్రెయిన్ వివాదం విషయమై దశాబ్ద కాలంగా అమెరికా వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపిస్తున్నట్టుగా జెలెన్స్కీ మాట్లాడటంతో పరిస్థితి వేడెక్కింది. అమెరికా మీడియా అంతా చూస్తుండగా అంత అమర్యాదకరంగా మాట్లాడటం సరికాదంటూ వాన్స్ జోక్యం చేసుకున్నా ఆయన వెనక్కు తగ్గలేదు. తమతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ రష్యా 2014 నుంచీ తుంగలో తొక్కుతూ వస్తున్నా అమెరికా సరైన రీతిలో జోక్యం చేసుకోలేదంటూ ఆక్షేపించారు. అధ్యక్షులు బరాక్ ఒబామా, ట్రంప్, బైడెన్ ఎవరూ తమకు చేయాల్సినంతగా సాయం చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఖనిజ ఒప్పందానికి ప్రతిగా ఉక్రెయిన్ రక్షణకు అమెరికా స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ క్రమంలో, ‘‘యుద్ధంలో అంతులేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తే ఎలా ఉంటుందో అమెరికాకు తెలియదు. బహుశా మున్ముందు తెలిసొస్తుందేమో!’’ అన్న జెలెన్స్కీ వ్యాఖ్యలతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. ట్రంప్ ఒక్కసారిగా తీవ్ర అసహనానికి లోనయ్యారు. జెలెన్స్కీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘అలాంటి పరిస్థితి మాకెప్పుడూ రాదు. ఎప్పటికీ తిరుగులేని శక్తిగానే ఉంటాం’’ అంటూ ఆగ్రహంగా బదులిచ్చారు. ‘‘ఉక్రెయిన్‌కు ఇన్నేళ్లుగా అన్నివిధాలా ఆదుకుంటూ వస్తున్నాం. ఈ యుద్ధంలో ఇప్పటికే 350 బిలియన్ డాలర్ల మేర సాయుధ, ఆర్థిక సాయం అందించాం. లేదంటే రష్యాతో యుద్ధం కొనసాగించడం మీ తరమయ్యేదే కాదు. పోరు రెండే వారాల్లో ముగిసిపోయేది’’ అంటూ దుయ్యబట్టారు. అయినా జెలెన్స్కీకి మాత్రం కనీస కృతజ్ఞత కూడా లేదంటూ విరుచుకుపడ్డారు. మీడియా ముందే తనతో గొడవకు దిగుతూ అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. ‘‘అమెరికా దన్ను లేనిదే మీరెందుకూ కొరగారు! మాకు షరతులు విధించే, మమ్మల్ని డిమాండ్ చేసే పరిస్థితిలో అసలే లేరు. అది గుర్తుంచుకోండి’’ అంటూ వేలు చూపిస్తూ మరీ జెలెన్స్కీని కటువుగా హెచ్చరించారు. ‘‘మీరు లక్షలాది ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చిపెట్టేలా ప్రమాదకర జూదం ఆడుతున్నారు’’ అంటూ జెలెన్స్కీని ఆక్షేపించారు. మధ్యలో పదేపదే ఆయన భుజంపై కొట్టి మరీ ఆగ్రహం వెలిగక్కారు. రష్యాతో ఏ విషయంలోనూ రాజీ పడేదే లేదన్న జెలెన్స్కీ వ్యాఖ్యలను కూడా ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ‘‘పుతిన్ ఒక ఉగ్రవాది. యుద్ధాల్లోనూ నిబంధనలుంటాయి. వాటన్నింటినీ కాలరాసిన పుతిన్ వంటి హంతకునితో ఎలాంటి రాజీ ఉండబోదు’’ అని జెలెన్స్కీ అన్నారు. అలా కుదరదని, యుద్ధానికి తెర దించాలంటే రష్యాతో చాలా విషయాల్లో రాజీ పడాల్సిందేనని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ‘‘ఇలాగైతే మాతో వ్యాపారం కష్టమే. అమెరికాతో ఖనిజ వనరుల ఒప్పందానికి అంగీకరిస్తారా, సరేసరి. లేదంటే మీకూ మాకూ రాంరాం’’ అంటూ తేల్చిపడేశారు. వాగ్వాదం పొడవునా నేతలిరువురూ పదేపదే వాగ్బాణాలు విసురుకున్నారు. కనీసం ఇప్పటికైనా అమెరికా చేస్తున్న దానికి కృతజ్ఞతలు చెప్పండంటూ వాన్స్ కల్పించుకోగా ట్రంప్ వారించారు. ‘‘పర్లేదు. ఈ డ్రామా నాకూ సరదాగానే ఉంది. జరుగుతున్నదేమిటో అమెరికా ప్రజలందరూ చూడాలి’’ అన్నారు.సాయానికి హామీ ఇవ్వలేం: ట్రంప్ జెలెన్స్కీతో భేటీకి ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో సహజ వనరుల ఒప్పందంపై ఆయన, తాను కాసేపట్లో సంతకాలు చేస్తామని ప్రకటించారు. యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే, ‘‘ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సాయం కొనసాగుతుంది. కాకపోతే ఈ విషయంలో మానుంచి మరీ ఎక్కువగా ఆశించకూడదు’’ అని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కృతనిశ్చయంతో ఉన్నారంటూ మరోసారి ప్రశంసించారు. -
శ్వేతసౌధంలో ట్రంప్ మగ్‌షాట్
ఏదైనా కేసులో ఒక నేత అరెస్ట్ అయితే ఆ విషయాన్ని పత్రికా సమావేశంలోనో, మరే సందర్భంలోనో ప్రస్తావిస్తే ఆ నేతకు అస్సలు నచ్చదు. అసలు తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని అంతెత్తున లేచి ఖండిస్తారు. అరెస్ట్నాటి ఫొటోలను ఒకవేళ మళ్లీ ఆయన ముందే పెడితే ఉగ్రరూపం దాల్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అలాంటిది తెంపరితనానికి మారుపేరుగా నిలిచిపోయిన అగ్రరాజ్యానికి అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇంకెలా స్పందిస్తారో అని చాలా మంది భావించడం సహజం. కానీ అలాంటి ఆలోచనలకు పటాపంచలు చేస్తూ, విభిన్నంగా ట్రంప్ తన అరెస్ట్ నాటి ఫొటోను పెద్ద సైజులో తీయించి చక్కగా బంగారు రంగు ఫ్రేమ్ కట్టి ఏకంగా అధ్యక్షభవనంలోనే తగిలించారు. అది కూడా ఎక్కడో కనిపించనట్లు ఓ మూలన కాకుండా నేరుగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసే ఓవల్ ఆఫీస్ గోడకే తగిలించారు. రెండ్రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ వైట్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అక్కడి మీడియా కెమెరామెన్లు ఓవల్ ఆఫీస్ అంతటినీ తమ కెమెరాల్లో బంధించిన వేళ ఈ మగ్‌షాట్ ఫొటోఫ్రేమ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఏమిటీ మగ్‌షాట్ ? 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జార్జియా రాష్ట్రంలో ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై నాటి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌ను అరెస్ట్‌చేశారు. ఆ సందర్భంగా 2023 ఆగస్ట్‌లో జార్జియా రాష్ట్రంలోని పుల్టన్ కౌంటీ జైలుకు వచ్చి ట్రంప్ లొంగిపోయారు. కస్టడీలోకి తీసుకునే ముందు అరెస్ట్ అయిన నిందితుడి ముఖం స్పష్టంగా తెలిసేలా దగ్గరి ఫొటో అంటే మగ్ షాట్‌ను నిబంధనల ప్రకారం తీసుకుంటారు. ట్రంప్ ఫొటో సైతం అలాగే తీశారు. మాజీ అధ్యక్షుడిని ఇలా మగ్‌షాట్ తీయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో ట్రంప్ మగ్‌షాట్ ఆన్లైన్లో విపరీతంగా వైరల్ అయింది. ఆ ఫొటోను ఆనాడు ప్రఖ్యాత న్యూయార్క్ పోస్ట్ సైతం ఫ్రంట్‌పేజీలో ప్రచురించింది. ఆ ఫ్రంట్‌పేజీ కటౌట్నే ట్రంప్ ఫ్రేమ్ కట్టించారు. మగ్షాట్పై నాటి అధికార డెమొక్రాట్లు, నాటి అధ్యక్షుడు జో బైడెన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్‌కు మద్దతుగా ఇదే మగ్‌షాట్ ఫొటోలను ఆన్లైన్లో ప్రచారానికి రిపబ్లికన్ నేతలు వాడుకున్నారు. తాజాగా మగ్‌షాట్‌ను వైట్‌హౌస్‌లో ఫ్రేమ్ కట్టిన విషయం అందరికీ తెలియడంతో వైట్‌హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో ఒక పోస్ట్‌చేశారు. ‘‘హ్యాపీ వేలంటైన్ డే. అందమైన ఓవల్ ఆఫీస్‌లోకి మీకందరికీ స్వాగతం’’అని ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. ఈ ఫొటోఫ్రేమ్‌ను మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌ల ఫొటోల సమీపంలో తగిలించారు. ఆనాడు అరెస్ట్ అయిన వెంటనే పూచీకత్తు మీద ట్రంప్ విడుదలయ్యారు. ఎలాగూ ఫొటో వైరల్‌గా మారడంతో దీనిని వ్యాపారవస్తువుగా ట్రంప్ మార్చేశారు. స్వయంగా ఆయన తన మగ్‌షాట్ ఫొటోల విక్రయం ద్వారా దాదాపు రూ.61 కోట్లు ఆర్జించారు. టీ–షర్ట్లు మొదలు డిజిటల్ ట్రేడింగ్ కార్డుల దాకా అన్నింటిపైనా ఈ మగ్షాట్నే ముద్రించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉగ్రవాదాన్ని పెకలించేస్తా: ట్రంప్
వాషింగ్టన్: తాను ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా పెకలించేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. తొలిసారి ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదితో సమావేశమైన ఆయన ఈమేరకు హామీ ఇచ్చారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను ఓడించి తీరుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేసినట్లు అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌదం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం అబాదికీ డోనాల్డ్ ట్రంప్ ఓవల్ కార్యాలయంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఐసిస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఇరాక్‌కు ట్రంప్ గట్టి మద్దతిచ్చారని, తాము కూడా దానిని తుదముట్టించి తీరుతామని అబాదీకి హామీ ఇచ్చినట్లు శ్వేతసౌదం పేర్కొంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఇరాక్‌కు సైనిక సహాయం కొనసాగించేందుకు ట్రంప్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు కూడా వెల్లడించింది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు కలిసి సాగాలని బలంగా నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతసౌదం పేర్కొంది. రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలతోపాటు పెట్టుబడులకు సంబంధించిన సంప్రదింపులు కూడా జరగనున్నట్లు వెల్లడించింది. -
వైట్‌హౌస్‌లో సభ్యత మరిచిన ట్రంప్ సహాయిని
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రమే కాదు.. ఆయన సహాయకులు, పాలక వర్గం కూడా కాసింత వివాదాలకు తావిచ్చే మనుషులేనని మరోసారి స్పష్టమైంది. అమెరికా శ్వేతసౌదాన్ని అక్కడి వారు ఎంతో పవిత్రంగా చూస్తారు. అలాంటిది సాక్షాత్తు ట్రంప్ ఆయన వర్గమంతా ఓ ఫొటోకు పోజిస్తుండగా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ సీనియర్ సలహాదారురాలు కెల్యానే కాన్వే కాస్తంత అమార్యదకు నడుచుకున్నారు. శ్వేత సౌదంలోని సోఫాపై తన షూ కూడా తీయకుండానే మోకాళ్లపై కూర్చుని సరదాగా నవ్వుతూ కనిపించారు. ఈ విషయాన్ని ఎవరూ గమనించపోయినా ఓ ఫొటో గ్రాఫర్ క్లిక్‌మనిపించారు. ఇప్పుడది బయటకు రావడంతో ఆమెపై ట్విట్టర్లో ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైట్ హౌస్ అంటే కనీసం మర్యాద లేకుండా తన షూ కూడా తొలగించకుండా అతిథులు సేద తీరే సోఫాలో అలా మోకరిల్లి కూర్చోవడంపై మండిపడుతున్నారు. ‘ఓవెల్ ఆఫీసులు కనీసం తన షూ కూడా విప్పకుండా కాన్వే అలా సోఫాలో మోకరిల్లి కూర్చుకోవడం ట్రంప్ టీం పాటించే కనీస గౌరవ మర్యాదల విలువ ఏమిటో తెలియజేస్తోంది’ అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ ఫొటోలో ఎంతోమంది ఉన్నతశ్రేణి నల్లజాతీయులు నిల్చొని ఉండి ట్రంప్‌తో ఫొటో దిగుతున్న సమయంలో కనీసం వారికి గౌరవం కూడా ఇవ్వకుండా అలా నిర్లక్ష్యంగా కూర్చోవడంపై మండిపడుతున్నారు. వేలల్లో కాన్ వే చర్యపై ట్విట్టర్లో ట్వీట్లు పేలాయి. -
నెటిజన్లను ఆకట్టుకుంటున్న వైట్‌హౌస్ వేడుకలు
వాషింగ్టన్ : వైట్‌హోస్ దివాళి వేడుకలతో వెలుగొందుతోంది. ఓవల్ ఆఫీసులో మొదటి దీపాన్ని వెలిగించి, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సంప్రదాయాన్ని తన తర్వాతి వారు కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు ఒబామా పేర్కొన్నారు. కాగ, వైట్‌హోస్‌లో దీపావళి వేడుకలను ప్రారంభించిన తొలి అధ్యక్షుడు బరాక్ ఒబానానే. 2009లో ఆయన ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. కొంతమంది ఇండియన్-అమెరికన్లు తన అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేస్తున్నారని, వారందరి కోసం ఈ వేడుకలను జరుపుతున్నట్టు ఒబామా చెప్పారు. దివాళి సెలబ్రేషన్స్‌ను ప్రారంభించిన తొలి అధ్యక్షుడిని తానే కావడం, చాలా గర్వంగా ఫీలవుతున్నానని ఒబామా చెప్పారు. దివాళి రోజు ముంబాయిలో తమల్ని భారతీయులు ఆహ్వానించిన తీరును, తమతో వారుచేసిన డ్యాన్స్‌లను మిచెల్, తాను ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొన్నారు. చీకటిని వెలుగు ఎలా అధిగమిస్తుందో తెలిపే సంకేతంగా ఈ దీపం నిలుస్తుందన్నారు. తర్వాత వైట్హోస్కు వచ్చే అధ్యక్షులు కూడా ఈ వేడుకలను కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు వైట్‌హోస్ ఫేస్బుక్ పేజ్‌లో తెలిపారు. ఈ మెసేజ్ ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. అర్థరాత్రి ఒబామా చేసిన ఈ పోస్టుకు 1.5 లక్షలమంది లైక్ రాగా.. 33వేలకు పైగా సార్లు షేర్ చేశారు. ఈ దివాళి వేడుకలు తమ ప్రియమైన వారందరికీ శాంతి సౌభాగ్యాలతో ఆనందం చేకూరాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే దివాళి వేడుకలు జరుపుకుంటున్నారో వారందరికీ శుభాకాంక్షలు చెప్పారు.