
పాతికేళ్ల క్రితం గ్రహశకలంపై దిగిన నాసా స్పేస్‌క్రాఫ్ట్
ప్రస్తుతం భూమికేసి దూసుకొస్తున్న మరో గ్రహశకలం
‘నియర్’ అనుభవంతో దాన్ని అడ్డుకునే పనిలో నాసా సరిగ్గా 24 ఏళ్ల క్రితం భూమి నుంచి ప్రయోగించిన ఒక అంతరిక్ష నౌక అనూహ్యంగా ఒక గ్రహశకలంపై దిగింది. దానికి ఆ సామర్థ్యం ఏమాత్రమూ లేకపోయినా రాతితో కూడిన నేలపై అతి సున్నితంగా లాండైంది. అన్ని ప్రతికూలతలను తట్టుకుంటూ అక్కడి నుంచి రెండు వారాల నిక్షేపంగా పనిచేసింది. సదరు అస్టరాయిడ్‌కు సంబంధించిన విలువైన డేటాను భూమికి చేరవేసింది. గ్రహంపై కాకుండా ఓ గ్రహశకలంపై కాలుమోపిన తొలి స్పేస్‌క్రాఫ్ట్‌గా చరిత్ర సృష్టించింది.
ఇదంతా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అప్పట్లో ప్రయోగించిన నియర్ ఎర్త్ అస్టరాయిడ్ రెండీవ్ (నియర్) స్పేస్‌క్రాఫ్ట్ గురించే. ‘2024 వైఆర్4’ అనే గ్రహశకలం భూమి వైపుగా శరవేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో నాసా సైంటిస్టులు నాటి నియర్ ఘనతను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. వైఆర్4 భూమిని ఢీకొనే అవకాశాలు 2 శాతం దాకా ఉన్నట్టు వారు అంచనా వేస్తున్నారు. ఇది బహుశా 2032లో జరిగే చాన్సుందట. భూమికేసి రాకుండా దాన్ని దారి మళ్లించాలని భావిస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో నాడు ‘నియర్’ అందించిన వివరాలు ఎంతగానో ఉపయోగపడవచ్చని చెబుతున్నారు.
అలా జరిగింది...
భూమికి 35.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘433 ఏరోస్’ అనే ఎస్–క్లాస్ గ్రహశకలం లక్షణాలు, అందులోని ఖనిజాలు, అయస్కాంత క్షేత్రం తదితరాలను అధ్యయనం చేయాలని నాసా భావించింది. దాని చుట్టూ కక్ష్యలో పరిభ్రమించే లక్ష్యంతో నియర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను 1996 ఫిబ్రవరి 17న ప్రయోగించింది. అంతరిక్షంలో వెళ్లిన ఏడాదికి అది అస్టరాయిడ్ ఉపరితలానికి 1,200 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది.
అక్కణ్నుంచి మరింత ముందుకెళ్లి ఏరోస్ చుట్టూ కక్షలోకి తిరగాల్సి ఉండగా నియర్ జాతకమే తిరగబడింది. 1998 డిసెంబర్ 20న సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజన్ బర్న్ కారణంగా నియర్ అనుకున్నట్లుగా పనిచేయలేని పరిస్థితి! దాంతో బ్యాకప్ ఇంధనం సాయంతో దాన్ని ఏకంగా అస్టరాయిడ్‌పైనే దించాలని నాసా నిర్ణయించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా నియర్ 2001 ఫిబ్రవరి 12న ఏరోస్‌కు అత్యంత సమీపానికి చేరుకుంది. చివరికి నెమ్మదిగా ఏరోస్‌పై దిగి చరిత్ర సృష్టించింది. ఒక అంతరిక్ష నౌక గ్రహశకలాన్ని తాకడం అదే మొదటిసారి. అలా నియర్ కాస్తా సైంటిస్టులకు వెరీ డియర్‌గా మారిపోయింది.
– సాక్షి, నేషనల్ డెస్క్