ఢిల్లీలోని చాణక్యపురిలో రోడ్డుపై దుకాణంలో తేనీరు సేవించిన జర్మనీ అధినేత! ఇది, ప్రధాని మోదీతో కలసి సంయుక్త మీడియా ప్రకటన మినహా జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ రెండు రోజుల భారత అధికారిక పర్యటనపై హడావిడి వార్తలు, ప్రకటనలు మీడియాలో కనిపించి ఉండకపోవచ్చు. అంతమాత్రాన షోల్జ్ భారత పర్యటన అప్రధానమనుకుంటే పొరపాటే.
రాష్ట్రపతిని కలసి సంభాషించడం, ప్రధానిని కలసి చర్చించడం, ఔత్సాహిక వ్యాపారవేత్తలతో గోష్ఠి జరపడం – ఇలా ఫిబ్రవరి 25, 26ల్లో షోల్జ్ సుడిగాలిలా చుట్టేశారు. ఇప్పటికే జపాన్, చైనా, ఆసియాన్ దేశాల్లో పర్యటించిన ఆయన తమ దేశ ఇండో–పసిఫిక్ విధానంలో భాగంగా భారత్‌తో బంధం దృఢమైనదని తేల్చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఏడాది నిండిన వేళ ఈ పర్యటన వ్యూహాత్మకంగా కీలకమనేది అందుకే.
పదహారేళ్ళ సుదీర్ఘ ఏంజెలా మెర్కెల్ పాలన తర్వాత 2021 డిసెంబర్‌లో జర్మనీ ప్రభుత్వాధినేత అయిన షోల్జ్ ఆ పైన మన దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఆ మాటకొస్తే, 2011 తర్వాత ఒక జర్మన్ నేత భారత్‌లో ప్రత్యేకంగా పర్యటించడం కూడా ఇదే ప్రథమం. అలా ఈ తాజా పర్యటనకు విశేష ప్రాధాన్యం ఉంది.
జర్మన్ అధినేత వెంట వచ్చిన వ్యాపార ప్రతినిధి బృందంలో సీమెన్స్, శాప్ సంస్థలు ఉన్నాయి. ఐటీ, టెలికామ్ సహా కీలక రంగాల్లో భారత సంస్థలతో ఒప్పందాలు చేసు కున్నాయి. స్వచ్ఛ ఇంధనం, వాణిజ్యం, నవీన సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పటిష్ఠతే లక్ష్యంగా ప్రధాని మోదీతో షోల్జ్ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. మరీ ముఖ్యంగా, యూరప్ తన సరఫరా వ్యవస్థలను చక్కదిద్దుతున్న వేళ షోల్జ్ చర్చలు కీలకమయ్యాయి.
సహజంగానే ఉక్రెయిన్ వ్యవహారం అజెండాలో ముందుంది. అయితే, రష్యా వ్యతిరేక వైఖరి తీసుకొనేలా ఒత్తిడి తెచ్చే కన్నా... అందరికీ కావాల్సిన మనిషిగా, మధ్యవర్తిత్వం నెరిపే వీలున్న దేశంగా భారత్‌తో జర్మనీ జత కడుతోంది. జీ20 సారథిగా భారత్ ఈ యుద్ధానికి త్వరగా తెరపడేలా చేసి, ఆర్థిక పునరుజ్జీవనం జరిపించాలని భావిస్తోంది. అందుకీ పర్యటనను సాధనంగా ఎంచుకుంది. రష్యా రక్షణ ఉత్పత్తుల సరఫరాలపై భారత్ ఆధారపడినందున జలాంతర్గాముల సంయుక్త తయారీ లాంటి అంశాల్లో భారత్‌తో చేయి కలుపుతూ, సరఫరా వ్యవస్థల్లో మార్పుకు చూస్తోంది.
ఈ భౌగోళిక – రాజకీయ సంక్షోభాన్ని కాస్త పక్కనపెడితే, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పటిష్ఠం చేసుకొనేలా ఒక దార్శనిక పత్రాన్ని మోదీతో కలసి షోల్జ్ ఆమోదించారు. స్వచ్ఛ ఇంధన సాంకేతికత నుంచి కృత్రిమ మేధ (ఏఐ) దాకా పలు హామీలు ఇచ్చిపుచ్చుకున్నారు. రెండు అంతర్ ప్రభుత్వ పత్రాలతో పాటు, మూడు వ్యాపార ఒప్పందాల పైనా చేవ్రాలు జరిగింది.
నూతన ఆవిష్కరణల పత్రంలో ప్రధానంగా హరిత ఉదజని సహా ఇంధన, స్వచ్ఛ సాంకేతి కతల్లో భాగస్వామ్యానికి అగ్ర తాంబూలం ఇచ్చారు. హరిత ఉదజని ఆర్థికంగా గిట్టుబాటయ్యేలా చూడడమే ఉమ్మడి దీర్ఘకాలిక లక్ష్యం. కొన్నేళ్ళుగా ఇరుదేశాల మధ్య సంబంధాలు కీలక రంగాల్లో జోరందుకున్నాయి. గత డిసెంబర్‌లో జర్మన్ విదేశాంగ మంత్రి భారత్‌ను సందర్శించారు. షోల్జ్ పర్యటనకు రంగం సిద్ధం చేశారు. గత ఏడాది కాలంలో మూడుసార్లు కలసిన మోదీ, షోల్జ్‌ల మధ్య మంచి స్నేహం నెలకొంది.
నిరుడు మేలో 6వ ఇండియా– జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రతింపులలో (ఐజీసీ) ఇరువురు నేతలూ తొలిసారి సమావేశమయ్యారు. ఆపైన జర్మనీ సారథ్యంలోని ‘జీ7’ సదస్సుకు మోదీని షోల్జ్ ఆహ్వానించారు. జూన్‌లో ఆ వార్షిక సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఇక నవంబర్‌లో ‘జీ20’ సదస్సు వేళ ఇండొనేసియాలో ద్వైపాక్షిక చర్చలతో బంధం బలపడింది.
ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పలు సవాళ్ళను దీటుగా ఎదుర్కొనే విషయంలో భారత, జర్మనీల దృక్పథం చాలావరకు కలుస్తుంది. నియమానుసారమే అంతర్జాతీయ క్రమం సాగాలనీ, ఐరాస నిబంధనావళిలోని అంతర్జాతీయ న్యాయ ఆదేశిక సూత్రాలను గౌరవించాలనీ ఇరుదేశాల వైఖరి. ఈ అభిప్రాయాలతో పాటు ఇండో– పసిఫిక్ విధానంలో భాగంగా అంతర్జాతీయ అవస రాలు, అనివార్యతలు ఉభయ దేశాలనూ మరింత దగ్గర చేశాయి.
యూరోపియన్ యూనియన్ (ఈయూ) – భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ), ఈయూలో భాగం కాని థర్డ్ కంట్రీల్లో అభివృద్ధి పథకాలపై చర్చల్ని త్వరితగతిన ఖరారు చేయాలని జర్మనీ గట్టిగా యత్నిస్తోంది. గతంలో ఆరేళ్ళు చర్చించినా, 2013లో తొలిసారి మన ఎఫ్టీఏ ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు షోల్జ్ సైతం ఎఫ్టీఏకు వ్యక్తిగతంగా కట్టుబడ్డారు. ఇవన్నీ ప్రపంచ వేదికపై పెరుగుతున్న భారత్ పలుకుబడికి నిదర్శనం.
జర్మనీ విదేశాంగ మంత్రి ఆ మధ్య అన్నట్టు, ‘ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా చైనాను అధిగమిస్తున్న భారత్‌ను సందర్శిస్తే, ప్రపంచంలో ఆరోవంతును చూసినట్టే.’ అలాగే, ‘21వ శతాబ్దంలో ఇండో– పసిఫిక్‌లోనూ, అంతకు మించి అంతర్జాతీయ క్రమాన్ని తీర్చిదిద్దడంలో నిర్ణయాత్మక ప్రభావం భారత్‌దే.’ ఇక, మన దేశంలో దాదాపు 1800 జర్మనీ సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయి. భారత్‌లో భారీ విదేశీ పెట్టుబడుల్లోనూ ముందున్న ఆ దేశం వేలల్లో ఉద్యోగ కల్పనకు కారణమవుతోంది.
ఈ పరిస్థితుల్లో షోల్జ్ ఆత్మీయ స్నేహం, అవసరమైన మిత్రుడితో మోదీ అనుబంధం అర్థం చేసుకోదగినవి. 141 కోట్ల జనాభాతో అపరిమిత ఇంధన అవసరాలున్న వేళ, హరిత ఇంధనం సహా అనేక అంశాల్లో జర్మనీతో బంధం భవిష్యత్తుకు కీలకమైనది. ఈ సమయం,సందర్భాలను అందిపుచ్చుకోవడమే భారత్‌కు తెలివైన పని.
సతత హరిత వ్యూహాత్మకం
Published Wed, Mar 1 2023 2:30 AM | Last Updated on Wed, Mar 1 2023 2:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment