
అగ్గి కోసం అభ్యర్థిస్తూ బయటికొచ్చిన వైనం
బ్రెజిల్‌లో అరుదైన ఘటన
వెంటనే అడవిలోకి పంపేసిన అధికారులు
నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవించే ఎన్నో ఆదిమజాతులకు బ్రెజిల్‌లోని అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం ఆవాసంగా ఉంది. ఆ ఆదిమజాతుల కట్టూ»ొట్టూ, ఆచరవ్యవహారాలు, ఆహార నియమాలు ఎవరికీ తెలీదు. బ్రెజిల్ ప్రభుత్వం కూడా ఎవరికీ చెప్పదు. ఆధునిక పోకడల బారిన పడకుండా ఆ జాతులను తమ మానాన వారి బతకనివ్వాలని బ్రెజిల్ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే అలాంటి ఆదిమజాతులు ఆవాసాల వైపు ఎవరినీ వెళ్లనివ్వదు. అయితే అనుకోకుండా ఆ ఆదిమజాతుల్లో ఒక గిరిజనజాతికి చెందిన వ్యక్తి వాళ్ల ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు.
వెంట రెండు చిన్న దుంగలను తెచ్చుకున్నాడు. మంట రాజేయడానికి అగ్గి కావాలని అభ్యర్థించాడు. ఈ అరుదైన ఘటన గత బుధవారం నైరుతి అమెజాన్‌లోని పురూస్ నదీతీరం వెంట బెలారోసా అనే కుగ్రామంలో జరిగింది. బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఒక గిరిజన వ్యక్తి ఒంటిపైభాగంపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా కాళ్లకు చెప్పులు లాంటివి ఏమీ లేకుండా నడుచుకుంటూ కుగ్రామానికి చేరుకున్నాడు. సంబంధిత వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్‌ఏజెన్సీ సంపాదించింది. ఆ వీడియోలో ఆ గిరిజన వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతంగా, నెమ్మదస్తుడిగా కనిపించాడు. గ్రామస్థులను అగ్గి కావాలని అడిగాడు.
దీంతో వాళ్లు ఒక లైటర్‌ను ఇచ్చి దీంతో అగ్గిరాజేసుకోవాలని సూచించారు. అయితే అతనికి లైటర్‌ను ఎలా వెలిగించాలో అర్థంకాలేదు. దానిని ఎలా వాడాలో స్థానికులు ఎంతలా విడమరిచి, వివరించి చూపినా అతనికి అర్థంకాలేదు. ఈలోపు బ్రెజిల్ దేశ ఆటవిక, ఆదివాసీ, గిరిజన సంబంధ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘ఫునాయ్’ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ మనిíÙని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. స్థానికులతో ఉండటంతో స్థానికులకు ఉన్న అంటురోగాలు, ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఏమైనా సోకాయో లేదో అని నిర్ధారించుకుని గురువారం సాయంత్రం కల్లా తిరిగి ఆ ఆదిమజాతి ఆవాసానికి సురక్షితంగా పంపేశారు.
ఆదిమజాతులు శతాబ్దాలుగా బయటి వ్యక్తుతో కలవని కారణంగా వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఆధునిక జీవనశైలికి అలవాటుపడ్డ సాధారణ ప్రజల్లో అన్ని రకాల అంటురోగాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు పోగుబడి ఉంటాయి. ఇవి పొరపాటున ఆదిమజాతులకు సోకినా చాలా ప్రమాదం. గతంలో జరిగిన ఇలాంటి ఉదంతాల్లో కొన్ని జాతులు హఠాత్తుగా రోగాలపాలై సగం జనాభా అంతరించిపోయింది. అందుకే అతడిని ఎవరితోనూ కలవనీయకుండా విడిగా ఉంచి 24 గంటల్లోపు తిరిగి అతని జాతి ఆవాసానికి పంపేశారు. స్థానికులు అతను వచ్చిన మార్గం గుండా వెళ్లి ఆదిమజాతులను కలవకుండా ఉండేందుకు ఫునాయ్ అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఇలా ఎవరైనా గిరిజనులు బాహ్యప్రపంచంలోకి పొరపాటున వస్తే వారిని మెమోరియా గ్రాండే ఆదిమ,పర్యావరణ పరిరక్షణా స్థావరానికి తీసుకెళ్లి సపర్యలు చేసి పంపేస్తారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment