గుట్టపై ఉన్న భారీ వృత్తాన్ని పరిశీలిస్తున్న పరిశోధక బృందం
అది ఏడున్నర మీటర్ల వ్యాసంతో ఉన్న భారీ వృత్తం.. ఎక్కడా వంకరటింకరగా లేకుండా వృత్తలేఖినితో గీసినట్టు కచ్చితమైన రూపం.. పెద్ద బండరాయి మీద 30 అంగుళాల మందంతో చెక్కటంతో అది ఏర్పడింది.. కానీ అది ఇప్పటిది కాదు, దాదాపు 3 వేల ఏళ్ల నాటిది కావడం విశేషం.
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర శివారు ప్రాంతాల్లో కొన్ని గుట్టల్లో ఆదిమానవులు గీసిన రంగుల చిత్రాలు నేటికీ కనిపిస్తాయి. కానీ వాటికి భిన్నంగా ఇప్పుడు గుట్ట పరుపుబండ మీద ఆదిమానవులు చెక్కిన పెద్ద వృత్తం (జియోగ్లిఫ్) చరిత్ర పరిశోధకులను ఆకర్షిస్తోంది. మేడ్చల్ సమీపంలోని మూడు చింతలపల్లి శివారులోని గుట్ట మీద ఇది వెలుగు చూసింది.
కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కె.గోపాల్, మహ్మద్ నజీరుద్దీన్, అన్వర్ బాష, అహోబిలం కరుణాకర్‌లు ఇచ్చిన సమాచారం మేరకు చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆ బృందంతో కలసి దాన్ని పరిశీలించారు. ‘తక్కువ ఎత్తున్న గుట్ట పరుపుబండపై ఈ వృత్తం చెక్కి ఉంది. ఏడున్నర మీటర్ల వ్యాసంతో భారీగా ఉన్న ఈ వృత్తం మధ్యలో రెండు త్రిభుజాకార రేఖా చిత్రాలను కూడా చెక్కారు.
అంత పెద్దగా ఉన్నప్పటీకీ వంకరటింకరలు లేకుండా ఉండటం విశేషం. దీనికి సమీపంలో కొత్త రాతియుగం రాతి గొడ్డళ్లు నూరిన గాడులు (గ్రూవ్స్) ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో ఈ తరహా చెక్కిన రేఖా చిత్రం వెలుగుచూడకపోవటంతో దీనిపై మరింతగా పరిశోధించాల్సి ఉంది’అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.
సమాధి నమూనా అయ్యుండొచ్చు..
ఈ చిత్రం ఇనుప యుగానికి చెందిందిగా భావిస్తున్నాం. అప్పట్లో మానవుల సమాధుల చుట్టూ వృత్తాకారంలో పెద్ద రాళ్ల వరుసను ఏర్పాటు చేసేవారు. ఆ సమాధి నిర్మాణానికి నమూనాగా ఈ వృత్తాన్ని గీసి ఉంటారన్నది మా ప్రాథమిక అంచనా. గతంలో కర్ణాటకలో ఇలాంటి చిత్రం కనపించింది. దాని మధ్యలో చనిపోయిన మనిషి ఉన్నట్లు చిత్రించి ఉంది. ఈ చిత్రాన్ని మరింత పరిశోధిస్తే కొత్త విషయాలు తెలుస్తాయి. – రవి కొరిశెట్టార్, పురావస్తు నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment