అంతటి అమెజాన్‌పై.. ఒక్క బ్రిడ్జీ లేదేం? | Amazing Facts About The Amazon River | Sakshi
Sakshi News home page

అంతటి అమెజాన్‌పై.. ఒక్క బ్రిడ్జీ లేదేం?

Published Sat, Jun 11 2022 2:28 AM | Last Updated on Sat, Jun 11 2022 12:16 PM

Amazing Facts About The Amazon River - Sakshi

ఓ చిన్న వాగు.. వెళ్తున్న కొద్దీ ఊరికో బ్రిడ్జి ఉంటుంది. గోదావరి, కృష్ణా వంటి నదులైతే 20, 30 కిలోమీటర్లకో వంతెనలు కట్టి రాకపోకలు నడిపిస్తుంటారు. అలాంటిది 9 దేశాల మీదుగా 6,500 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే అమెజాన్‌ నదిపై ఎన్ని బ్రిడ్జీ్జలు ఉండాలి? చాలానే ఉండొచ్చు అనిపిస్తోందా..? అయితే తప్పులో కాలేసినట్టే. అంత పెద్ద అమెజాన్‌ నదిపై ఒక్క బ్రిడ్జీ కూడా లేదు. ఇదేకాదు.. అసలు అమెజాన్‌ అంటేనే చిత్రవిచిత్రాలకు పుట్టినిల్లు. ఆ విశేషాలేమిటో తెలుసుకుందామా..
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

తొమ్మిది దేశాల్లో ప్రవహిస్తున్నా..
అమెజాన్‌.. ప్రపంచంలోనే రెండో పొడవైన నది. నీటి పరిమాణం పరంగా అయితే అతిపెద్ద నది ఇదే. దక్షిణ అమెరికా ఖండంలో తొమ్మిది దేశాల మీదుగా.. వేల కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తున్నా.. ఈ నదిపై ఎక్కడా ఒక్క వంతెన కూడా కనిపించదు. చిత్రంగా అనిపించే ఈ విషయంపై ఎన్నో సర్వేలు, అధ్యయనాలు జరిగాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యూరిక్‌ ఫెడరల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలోని స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ (బ్రిడ్జీలు, భారీ కాంక్రీట్‌ నిర్మాణాల) విభాగం ప్రొఫెసర్‌ వాల్టర్‌ కౌఫ్‌మన్‌ దీనికి కారణాలను వెల్లడించారు.

అమెజాన్‌ నది వెడల్పు, లోతు చాలా ఎక్కువ. తక్కువలో తక్కువగా రెండు కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్ల వెడల్పున నది పారుతుంటుంది. వానాకాలంలో అయితే మరింత భారీగా మారుతుంది. కొన్నిచోట్ల అయితే ఏకంగా 40–50 కిలోమీటర్ల వెడల్పున ప్రవహిస్తుంది. అంతేగాక నదికి రెండు వైపులా దట్టమైన అడవి, బురద, చిత్తడి నేలలు ఉంటాయి. అత్యంత పటిష్టంగా, అతిపెద్ద వంతెనలు కట్టాల్సి వస్తుంది. దీనికి వేలు, లక్షల కోట్ల వ్యయం అవుతుంది.

అమెజాన్‌ అన్ని వేల కిలోమీటర్లు ప్రవహించినా.. చాలా భాగం దట్టమైన అడవుల నుంచే సాగుతుంది. రవాణా అవసరం తక్కువ. అక్కడక్కడా పట్టణాలు ఉన్నా పడవలు, మరబోట్లు, ఫెర్రీలు, జెట్టీలతో మనుషులు, సరుకు రవాణా సాగుతుంది.

అమెజాన్‌పై ఎలాంటి బ్రిడ్జి లేకున్నా.. దాని అతిపెద్ద ఉపనది రియో నీగ్రోపై మాత్రం 2011లో ఒక బ్రిడ్జిని కట్టారు.

∙ప్రత్యేకతలు ఇన్నీ అన్నీ కావు..
మామూలుగా నదుల్లో చేపలు, పాములు, కొన్నిచోట్ల మొసళ్లూ ఉండటం కామనే. కానీ అమెజాన్‌లో పెద్ద పెద్ద అనకొండలు, కరెంటు షాకిచ్చే ఎలక్ట్రిక్‌ ఈల్‌ వంటి చేపలు, మాంసం వాసనొస్తే కొరికిపడేసే 60 రకాల ఫిరానా చేపలూ ఉన్నాయి. మొత్తంగా ఈ నదిలో 5,600 రకాల చేపలు ఉన్నట్టు గుర్తించారు.

అమెజాన్‌కు 1,100కుపైగా ఉప నదులు ఉన్నాయి. అందులో 17 ఉప నదులు వెయ్యి కిలోమీటర్లకుపైగా పొడవు ఉండటం గమనార్హం.

భూమ్మీద ఉన్న వేల నదుల నీళ్లన్నింటినీ కలిపి చూస్తే.. ఒక్క అమెజాన్‌లోనే 20శాతం నీళ్లు ప్రవహిస్తాయని అంచనా. దీని నుంచి సెకనుకు 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీళ్లు అట్లాంటిక్‌ సముద్రంలో కలుస్తుంటాయి.

రంగుల్లో అమెజాన్‌
అమెజాన్‌కు అతిపెద్ద ఉప నది రియో నీగ్రో. వేగంగా ప్రవహించే అమెజాన్‌లో నీళ్లు మట్టి, బురదతో గోధుమ రంగులో ఉంటాయి. దట్టమైన అడవి మధ్య నుంచి మెల్లగా ప్రవహిస్తూ వచ్చే రియో నీగ్రో నీళ్లు నల్లగా ఉంటాయి. నది నీటిలో ఆకులు, కొమ్మలు, చెట్ల అవశేషాలు కుళ్లిపోతూ హ్యూమిక్‌ యాసిడ్‌ను విడుదలవడం వల్ల ఇలా నలుపు రంగు వస్తుంది.

అంతేకాదు.. అమెజాన్‌ నీళ్లు కాస్త వెచ్చగా ఉంటే, రియోనీగ్రో నీళ్లు బాగా చల్లగా ఉంటాయి. వీటన్నింటి వల్ల ఈ రెండింటి నీళ్లు వెంటనే కలిసిపోవు. కొద్ది కిలోమీటర్లు చెరో పక్క వేర్వేరుగా ప్రవహిస్తున్నట్టే కనిపిస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement