Institute of Technology
-
టెక్స్టైల్స్ టెక్నాలజీతో మంచి ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధి రంగం జౌళి పరిశ్రమ. జౌళి రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశంలో 10 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తూ వేగంగా పురోగమిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔళి పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నప్పటికీ నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 300కు పైగా జౌళి మిల్లులు ఉన్నాయి. వీటికి ఏటా వందలాది మంది నిపుణులు అవసరం. అయినా ఏడాదికి 50 మంది కూడా దొరక ట్లేదు. భవిష్యత్తులో జౌళి రంగంలో విద్య, ఉద్యోగ, పారిశ్రామిక, ఎగుమతుల విభాగాల్లో అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులోని గవర్న మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ సంస్థ జౌళి రంగ నిపుణులను తయారు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ కోర్సు టెక్స్టైల్స్ డిప్లొమా కోర్సులు చదివిన వారికి మంచి జీతభత్యాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. సాధారణ డిప్లొమా కోర్సు మూడేళ్లు ఉంటే.. టెక్స్టైల్స్ టెక్నాలజీ కోర్సు మాత్రం మూడున్నరేళ్లు ఉంటుంది. ఈ కోర్సు అభ్యసించిన వారికి స్పిన్నింగ్, వీవింగ్, కెమికల్ ప్రాసెసింగ్, టెస్టింగ్, ఆధునిక టెక్నికల్ టెక్స్టైల్, అపారల్ మాన్యుఫాక్చరింగ్ వంటి విభాగాల్లో మంచి ఉద్యోగాలు వస్తాయి. కోర్సు పూర్తి చేసిన వెంటనే స్థానికంగా ప్రారంభ వేతనం కనీసం రూ.20 వేలు ఉంటుంది. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వం సైతం ఇండస్ట్రీ కనెక్ట్ విధానాన్ని అమలు చేస్తూ సిలబస్‌ను ఆధునీకరించింది.ఇందులో భాగంగా ఏడాది పాటు ప్రత్యేక పారిశ్రామిక శిక్షణనిస్తూ నెలకు రూ.7 వేల వరకు స్టైపెండ్ ఇస్తోంది. ‘పూర్వ విద్యార్థుల ద్వారా ప్రేరణ సదస్సులు, క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ చివరి సెమిస్టర్ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి కి సగటున మూడు సంస్థల్లో రూ.20 వేలకు పైగా జీతభత్యాలతో ఉద్యోగాలు వస్తున్నాయి. 8 నుంచి 10 ఏళ్ల అనుభవంతో కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు’ అని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ శాఖాధిపతి కె.మహమ్మద్ తెలిపారు. గుంటూరులోని టెక్స్టైల్స్ టెక్నాలజీ చదువుకున్న విద్యార్థులు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లోని ప్రముఖ పరిశ్రమల్లో సుమారు రూ.3 లక్షల జీతంతో జనరల్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్, మిల్ మేనేజర్, గ్రూప్ మేనేజర్ హోదాల్లో రాణిస్తుండటం విశేషం. ఇది మంచి అవకాశం గుంటూరులో 1986లో స్థాపించిన ఈ కాలేజీ 1997కి స్వయం ప్రతిపత్తి సాధించింది. 2023 పాలిసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరొచ్చు. డిప్లొమా తర్వాత బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ చేసి ప్రముఖ విద్యా సంస్థల్లోనూ అధ్యాపకులుగా, పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా రాణించవచ్చు. ఇందులో అత్యధిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ అవగాహన లేమితో విద్యార్థులు నష్టపోతున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన, ప్రాక్టికల్స్, ఇండ్రస్టియల్ ట్రైనింగ్, పరిశ్రమ ప్రముఖుల ద్వారా సెమినార్స్ ద్వారా సమగ్ర శిక్షణ అందిస్తున్నాం. విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశాలు, వివరాలకు 9848372886, 8500724006 నంబర్లను సంప్రదించవచ్చు. – కేవీ రమణ బాబు, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ, గుంటూరు -
అంతటి అమెజాన్‌పై.. ఒక్క బ్రిడ్జీ లేదేం?
ఓ చిన్న వాగు.. వెళ్తున్న కొద్దీ ఊరికో బ్రిడ్జి ఉంటుంది. గోదావరి, కృష్ణా వంటి నదులైతే 20, 30 కిలోమీటర్లకో వంతెనలు కట్టి రాకపోకలు నడిపిస్తుంటారు. అలాంటిది 9 దేశాల మీదుగా 6,500 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే అమెజాన్ నదిపై ఎన్ని బ్రిడ్జీ్జలు ఉండాలి? చాలానే ఉండొచ్చు అనిపిస్తోందా..? అయితే తప్పులో కాలేసినట్టే. అంత పెద్ద అమెజాన్ నదిపై ఒక్క బ్రిడ్జీ కూడా లేదు. ఇదేకాదు.. అసలు అమెజాన్ అంటేనే చిత్రవిచిత్రాలకు పుట్టినిల్లు. ఆ విశేషాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ తొమ్మిది దేశాల్లో ప్రవహిస్తున్నా.. అమెజాన్.. ప్రపంచంలోనే రెండో పొడవైన నది. నీటి పరిమాణం పరంగా అయితే అతిపెద్ద నది ఇదే. దక్షిణ అమెరికా ఖండంలో తొమ్మిది దేశాల మీదుగా.. వేల కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తున్నా.. ఈ నదిపై ఎక్కడా ఒక్క వంతెన కూడా కనిపించదు. చిత్రంగా అనిపించే ఈ విషయంపై ఎన్నో సర్వేలు, అధ్యయనాలు జరిగాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యూరిక్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ (బ్రిడ్జీలు, భారీ కాంక్రీట్ నిర్మాణాల) విభాగం ప్రొఫెసర్ వాల్టర్ కౌఫ్మన్ దీనికి కారణాలను వెల్లడించారు. ►అమెజాన్ నది వెడల్పు, లోతు చాలా ఎక్కువ. తక్కువలో తక్కువగా రెండు కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్ల వెడల్పున నది పారుతుంటుంది. వానాకాలంలో అయితే మరింత భారీగా మారుతుంది. కొన్నిచోట్ల అయితే ఏకంగా 40–50 కిలోమీటర్ల వెడల్పున ప్రవహిస్తుంది. అంతేగాక నదికి రెండు వైపులా దట్టమైన అడవి, బురద, చిత్తడి నేలలు ఉంటాయి. అత్యంత పటిష్టంగా, అతిపెద్ద వంతెనలు కట్టాల్సి వస్తుంది. దీనికి వేలు, లక్షల కోట్ల వ్యయం అవుతుంది. ►అమెజాన్ అన్ని వేల కిలోమీటర్లు ప్రవహించినా.. చాలా భాగం దట్టమైన అడవుల నుంచే సాగుతుంది. రవాణా అవసరం తక్కువ. అక్కడక్కడా పట్టణాలు ఉన్నా పడవలు, మరబోట్లు, ఫెర్రీలు, జెట్టీలతో మనుషులు, సరుకు రవాణా సాగుతుంది. ►అమెజాన్‌పై ఎలాంటి బ్రిడ్జి లేకున్నా.. దాని అతిపెద్ద ఉపనది రియో నీగ్రోపై మాత్రం 2011లో ఒక బ్రిడ్జిని కట్టారు. ∙ప్రత్యేకతలు ఇన్నీ అన్నీ కావు.. ►మామూలుగా నదుల్లో చేపలు, పాములు, కొన్నిచోట్ల మొసళ్లూ ఉండటం కామనే. కానీ అమెజాన్‌లో పెద్ద పెద్ద అనకొండలు, కరెంటు షాకిచ్చే ఎలక్ట్రిక్ ఈల్ వంటి చేపలు, మాంసం వాసనొస్తే కొరికిపడేసే 60 రకాల ఫిరానా చేపలూ ఉన్నాయి. మొత్తంగా ఈ నదిలో 5,600 రకాల చేపలు ఉన్నట్టు గుర్తించారు. ►అమెజాన్‌కు 1,100కుపైగా ఉప నదులు ఉన్నాయి. అందులో 17 ఉప నదులు వెయ్యి కిలోమీటర్లకుపైగా పొడవు ఉండటం గమనార్హం. ►భూమ్మీద ఉన్న వేల నదుల నీళ్లన్నింటినీ కలిపి చూస్తే.. ఒక్క అమెజాన్లోనే 20శాతం నీళ్లు ప్రవహిస్తాయని అంచనా. దీని నుంచి సెకనుకు 2 లక్షల క్యూబిక్ మీటర్ల నీళ్లు అట్లాంటిక్ సముద్రంలో కలుస్తుంటాయి. రంగుల్లో అమెజాన్ అమెజాన్‌కు అతిపెద్ద ఉప నది రియో నీగ్రో. వేగంగా ప్రవహించే అమెజాన్‌లో నీళ్లు మట్టి, బురదతో గోధుమ రంగులో ఉంటాయి. దట్టమైన అడవి మధ్య నుంచి మెల్లగా ప్రవహిస్తూ వచ్చే రియో నీగ్రో నీళ్లు నల్లగా ఉంటాయి. నది నీటిలో ఆకులు, కొమ్మలు, చెట్ల అవశేషాలు కుళ్లిపోతూ హ్యూమిక్ యాసిడ్‌ను విడుదలవడం వల్ల ఇలా నలుపు రంగు వస్తుంది. అంతేకాదు.. అమెజాన్ నీళ్లు కాస్త వెచ్చగా ఉంటే, రియోనీగ్రో నీళ్లు బాగా చల్లగా ఉంటాయి. వీటన్నింటి వల్ల ఈ రెండింటి నీళ్లు వెంటనే కలిసిపోవు. కొద్ది కిలోమీటర్లు చెరో పక్క వేర్వేరుగా ప్రవహిస్తున్నట్టే కనిపిస్తాయి. -
బూస్టర్ డోసుపై అధ్యయనం
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో టీకాల బూస్టర్ డోసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బూస్టర్ డోసు సామర్ధ్యాన్ని పరిశీలించేందుకు ఇప్పటికే అన్ని డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న 3వేల మందిపై వైద్య అధ్యయనం నిర్వహించనుంది. హరియాణాకు చెందిన ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ కారణంగా బూస్టర్ డోసులకు అనుమతినిచ్చారు. ఒమిక్రాన్ కారణంగా యూరప్ సహా పలు దేశాల్లో మరో వేవ్ వచ్చే అవకాశాలు పెరిగాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నామని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. టీకాలను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు బూస్టర్ డోసుతో మరింత రక్షణ లభిస్తుందని చెబుతున్నాయి. వీటన్నింటిపై తాజా అధ్యయనంలో చర్చించనున్నారు. -
జేఈఈ–2018 నిర్వహణకు నూతన జేఏబీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది (2018లో) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) పరీక్షల నిర్వహణకు జేఈఈ అపెక్స్ బోర్డును (జేఏబీ) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు ఐఐటీ మద్రాసు మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.ఎస్. అనంత్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని పేర్కొంది. ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో కొనసాగే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం కేంద్రం జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను 2013 నుంచి నిర్వహిస్తోంది. అయితే 2018–19 విద్యా సంవత్సరం నుంచి చేపట్టే ప్రవేశాల కోసం 2018లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల నిర్వహణకు కొత్త అపెక్స్ బోర్డును కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మావన వనరుల అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ జేఈఈ అపెక్స్ బోర్డు గౌరవాధ్యక్షుడు: ప్రొఫెసర్ ఎం.ఎస్. అనంత్, ఐఐటీ మద్రాసు మాజీ డైరెక్టర్, మెంబర్ సెక్రటరీ: సీబీఎస్ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సభ్యులు: ఐఐటీ బాంబే, కాన్పూర్, ఖరగ్‌పూర్, ఎన్ఐటీ వరంగల్, ఎన్ఐటీ సూరత్కల్, ఎన్ఐటీ తిరుచ్చి, ట్రిపుల్ఐటీ ఢిల్లీ డైరెక్టర్లు, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, బిట్, మెస్రా, రాంచీ డీమ్డ్ యూనివర్సిటీల ప్రతినిధులు, సీబీఎస్ఈ చైర్మన్, నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ డైరెక్టర్ జనరల్, సీ–డాక్ డైరెక్టర్ జనరల్, ఎంహెచ్ఆర్డీ అదనపు కార్యదర్శి/సంయుక్త కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. -
‘మిట్’మెచ్చిన మాళవిక
బడికెళ్లి చదివింది ఏడో తరగతే.. అమ్మ పాఠాలతోనే అందలం పైసా ఫీజు లేకుండానే ప్రఖ్యాత యూనివర్సిటీలో ప్రవేశం మేధస్సుతో మన్ననలు అందుకుంటున్న మాళవిక చిట్టి తల్లి బడికెళ్లి చదివింది ఏడో తరగతి వరకే! ఆ తర్వాత ఇల్లే పాఠశాల అయింది!!ఎందుకంటే.. అమ్మ తన పిల్లలకు బడి చదువుల ఒత్తిడి వద్దనుకుంది.. ఇంటి దగ్గరే ఇష్టమైనప్పుడే, నచ్చిందే చదువుకోవాలని భావించింది.పిల్లల కోసం.. చేస్తున్న కొలువు సైతం వదిలి తనే టీచర్‌గా మారింది..ఆ అమ్మ కృషి వృథా కాలేదు. మాళవిక తనకు ఇష్టమైన ఇన్ఫర్మేటిక్స్లో దూసుకెళ్లింది. ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియాడ్స్‌లో వరుసగా మూడేళ్లు పతకాలు సాధించింది. ఆమె మేధస్సును ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్) మెచ్చింది. నాలుగేళ్ల వ్యవధి గల బీఎస్ ప్రోగ్రామ్‌లో చేరమంటూ ఆఫర్ లెటర్ అందించింది. పైసా ఫీజు కట్టకుండా పూర్తిగా స్కాలర్‌షిప్‌తో చదువుకోవాలంటూ ఆహ్వానించింది. మిట్‌ను మెప్పించిన ముంబైకి చెందిన మాళవిక జోషి సక్సెస్ స్టోరీ ఆమె మాటల్లోనే.. అందరూ మిట్ అని పిలిచే ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో చదువుకునే అవకాశం రావడం చాలా సంతోషం కలిగించింది. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో వరుసగా మూడేళ్లు పతకాలు సాధించడం వల్ల మిట్ వాళ్లే నేరుగా సంప్రదించి బీఎస్ కోర్సులో పూర్తి స్కాలర్‌షిప్‌తో సీటు ఆఫర్ చేశారు. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. వాస్తవానికి నేను ఎలాంటి సర్టిఫికెట్లు, కోర్సులు పూర్తిచేయకుండానే.. ఎంఐటీకి ఎంపిక కావడం వెనుక అమ్మ సుప్రియ జోషి కృషి ఎంతో ఉంది. పిల్లలను మూస ధోరణి, ఒత్తిడితో కూడుకున్న బడి చదువులకు బదులు వారికి ఇష్టమైన రీతిలో చదివించాలని అమ్మ తీసుకున్న నిర్ణయమే నా విజయానికి కారణం. ఇష్టమైన రంగంవైపే అడుగులు వేయాలి మనకు నచ్చిన రంగం వైపు అడుగులు వేస్తే.. అందులో ప్రతిభా పాటవాలు చూపడం ఎంతో సులభం. తద్వారా ఏదో ఒకరోజు తమదైన ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే అవకాశం లభిస్తుంది. ఈ విషయంలో అమ్మానాన్న ముఖ్యంగా అమ్మ సుప్రియ నాకు, నా చెల్లెలు రాధకు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిది. ఎంతమంది విమర్శించినా.. చివరకు నాన్న సైతం ఆందోళన చెందినా.. తాను మాత్రం బెదరకుండా మమ్మల్ని పాఠశాల మాన్పించి ఇంట్లోనే మాకు ఇష్టమైన కోర్సులు చదివేలా చేసింది. అందుకు తగ్గ ప్రతిఫలం లభించింది. చెల్లెలు రాధ కూడా ముంబైలోని ప్రతిష్టాత్మక గ్జేవియర్ కాలేజ్‌లో ప్రవేశం సొంతం చేసుకుంది. ఒత్తిడి వద్దనే అమ్మ సుప్రియ జోషి, ఒక స్వచ్ఛంద సంస్థలో ఉద్యోగం చేసేది. నాన్న రాజ్ జోషి ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలోనే సొంత వ్యాపారం చేస్తున్నారు. అమ్మ తాను పనిచేసే స్వచ్ఛంద సంస్థలో ఎనిమిది, తొమ్మిది తరగతులు చదువుతున్న పిల్లలు ఎదుర్కొంటున్న బడి పాఠాల ఒత్తిడిని, దానివల్ల వారికి ఎదురవుతున్న సమస్యలను ప్రత్యక్షంగా చూసింది. తన పిల్లల(నేను, చెల్లెలు రాధ) కు ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని భావించింది. అంతే మమ్మల్ని బడి మాన్పించి ఇంట్లోనే పాఠాలు చెప్పడం ప్రారంభించింది. అందుకోసం అమ్మ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసింది. ఇల్లే పాఠశాల నేను దాదర్ పార్శీ యూత్ అసెంబ్లీ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నప్పుడు మమ్మల్ని బడి మాన్పించేయాలని అమ్మ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి మాకు ఇల్లే పాఠశాల అయింది. చాషక్ గురుకుల్ పేరుతో ఇంట్లోనే ప్రత్యేకంగా హోం స్కూలింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసింది. మా ఆసక్తికి అనుగుణంగా చదువుల్లో రాణించడం కోసం పలు పుస్తకాలు శోధించి ప్రత్యేకంగా సొంత కరిక్యులం రూపొందించింది. ఇలా.. అడుగడుగునా మాకిష్టమైన విధంగా చదివే ఏర్పాట్లు చేసింది అమ్మ. అయితే అమ్మ నిర్ణయాన్ని చాలా మంది విమర్శించారు. సరైన నిర్ణయం కాదనన్నారు. అయినా అమ్మ బెదరలేదు. మాకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది. మీకు ఇష్టమైన చదువు చదవండి.. నేనున్నాను అంటూ భరోసా ఇచ్చింది. ఆ భరోసానే ఇప్పుడు నన్ను మిట్లో అడుగుపెట్టేలా చేసింది. శిక్షణకు సైతం అంగీకరించని ఇన్స్టిట్యూట్లు స్కూల్ మానేసిన వెంటనే నాకు ఇష్టమైన ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటర్ సైన్స్, విండ్ సర్ఫింగ్ విభాగాల్లో రాణించాలని భావించాను. అందుకోసం నిర్వహించే పలు జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌కు హాజరవ్వాలి. అందుకు అవసరమైన శిక్షణ తీసుకోవాలని భావిస్తే.. ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా నాకు అనుమతి ఇవ్వలేదు. ఇందుకు వాళ్లు చెప్పిన కారణం ఒకటే.. చేతిలో కనీసం పదో తరగతి సర్టిఫికెట్ కూడా లేదు, నిబంధనలు అంగీకరించవు. సీఎంఐలో శిక్షణ ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా కనీసం శిక్షణనివ్వడానికి సైతం అంగీకరించని పరిస్థితిలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ) నాకు వరంలా మారింది. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఫర్ ఇన్ఫర్మేటిక్స్ భారత కో-ఆర్డినేటర్ సీఎంఐ ప్రొఫెసర్ మాధవన్ ముకుంద్ సహకారం మరువలేనిది. ఆయన్ను సంప్రదించగా నా ప్రతిభను పరీక్షించి శిక్షణకు అంగీకరించారు. సీఎంఐలో శిక్షణకు చేరిన తొలి ఏడాదిలోనే అంటే 2013లోనే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఫర్ ఇన్ఫర్మేటిక్స్ నేషనల్ ట్రైనింగ్ క్యాంప్‌నకు ఎంపికయ్యాను. దాంతో ప్రొఫెసర్ మాధవన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అల్గారిథమ్స్, మ్యాథమెటిక్స్ మెళకువలు నేర్పించారు. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌కు సర్వం సన్నద్ధం అయ్యేలా శిక్షణనిచ్చారు. ఎంఐటీ నుంచి పిలుపు సీఎంఐలో శిక్షణతో 2014 నుంచి ఇన్ఫర్మేటిక్స్లో ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌కు హాజరవుతున్నాను. తొలి రెండు సంవత్సరాలు (2014, 2015)లలో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియాడ్స్‌లో రజత పతకం; మూడో సంవత్సరం (2016)లో కాంస్య పతకం సొంతమైంది. అల్గారిథమ్స్ వినియోగించి కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ రూపకల్పనలో చూపిన ప్రతిభకు ఈ పతకాలు లభించాయి. దీంతో అమెరికాలోని మిట్ సహా పలు యూనివర్సిటీలు బీఎస్ కోర్సులో డెరైక్ట్ అడ్మిషన్ ఇస్తామంటూ ముందుకొచ్చాయి. ఎంఐటీ నిబంధనల ప్రకారం- వరుసగా మూడు ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో టాప్‌లో నిలిచిన వారికి నేరుగా బీఎస్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. నాకు ఎంఐటీ నుంచి 2015లోనే ఆహ్వానం వచ్చింది. మూడో ఒలింపియాడ్‌లో విజయం సాధిస్తే మేం సీటు ఇవ్వడానికి సిద్ధమంటూ పేర్కొన్నారు. దానికి తగ్గట్లుగానే 2016 ఒలింపియాడ్‌లోనూ విజయం సాధించడంతో మిట్లో సీటు ఖాయం అయింది. బీఎస్‌లో ఫ్రీ ఎడ్యుకేషన్ నాలుగేళ్ల బీఎస్ కంప్యూటర్ సైన్స్‌లో డెరైక్ట్ అడ్మిషన్‌తోపాటు ఎంఐటీ కల్పించిన మరో సదుపాయం.. ఆ నాలుగేళ్ల కోర్సును ఉచితంగా ఎలాంటి ఫీజు చెల్లించే అవసరం లేకుండా పూర్తిగా స్కాలర్షిప్ మంజూరు చేయడం. మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఎంఐటీ ఈ నిర్ణయం తీసుకుంది. పదిహేను రోజుల క్రితమే ఎంఐటీలో అడుగుపెట్టాను. ‘తల్లిదండ్రులు తమ పిల్లల ఇష్టానికి, ఆసక్తికి అనుగుణంగా వ్యవహరించి తోడ్పాటునందిస్తే అందలాలు అందుకుంటారనడానికి ప్రత్యక్ష తార్కాణం.. మాళవిక జోషి. బోర్డ్ పరీక్షలు సైతం పూర్తి చేయకున్నా.. సర్టిఫికెట్లు లేకున్నా.. ఇన్ఫర్మేటిక్స్లో వ్యక్తిగత ఆసక్తితో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి ఎంఐటీలో అడుగుపెట్టింది. తల్లిదండ్రులు తమ పిల్లల్లోని నిజమైన ఆసక్తిని గ్రహించాలి. బడి చదువులతోనే జ్ఞానం వస్తుందనే భావన సరికాదు. కానీ, మన వ్యవస్థలో పదో తరగతి, 12వ తరగతి సర్టిఫికెట్లు లేకుంటే కనీసం దరఖాస్తుకు కూడా అనుమతించని పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయంలో కొంత మార్పు తేవాలి.’ - సుప్రియ జోషి, (మాళవిక జోషి తల్లి) -
తిరుపతి ఐఐటీకి కేబినెట్ ఓకే
- మరో ఐదింటీకీ పచ్చజెండా.. - ఏపీలో ఎన్ఐటీ ఏర్పాటు సవరణలకూ ఆమోదం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ-తిరుపతి), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల ఏర్పాటుకు బుధవారం కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తిరుపతి సహా పాలక్కడ్, ధార్వాడ్, భిలాయ్, గోవా, జమ్మూల్లో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లను ‘ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ చట్టం-1961’లో చేర్చడానికి అనువుగా ఈ చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఐండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్(ఐఎస్ఎమ్) ధన్‌బాద్‌ను ఐఐటీగా స్థాయి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్-2001 ప్రకారం రిజిస్టర్ అయిన ఏపీలోని ఎన్ఐటీ(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఏర్పాటుకు సంబంధించిన(పశ్చిమగోదావరి జిల్లాలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటైంది) సవరణను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు: ► ఐదు రాష్ట్రాల్లో గిరిజనుల జాబితాను సవరించి, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త గిరిజన జాతులను గుర్తించాలనే 2 బిల్లులకు ఆమోదం. ► వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే యూపీ, గుజరాత్‌తోపాటు 5 రాష్ట్రాల్లో రూ.10,736 కోట్ల విలువైన వివిధ రైల్వే అభివృద్ధి పనులకు పచ్చజెండా. ► ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ పునర్నిర్మాణంలో భాగంగా.. ఈ సంస్థ తీసుకున్న రూ. 9వేల కోట్ల రుణ మాఫీ ► తపాలా సేవల ఉద్యోగుల కేడర్ సమీక్షకు ఆమోదం. -
కొంచెం ఖేదం.. కొంచెం మోదం..
జేఈఈ-మెయిన్..నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలు, ఇతర ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆఫ్‌లైన్ (పేపర్-పెన్ బేస్డ్), ఆన్లైన్ (కంప్యూటర్ బేస్డ్) రెండు విధాలుగా ఈ పరీక్షను నిర్వహిస్తుంది.. ఈ క్రమంలో ఆఫ్‌లైన్ పరీక్ష ఈ నెల 6న జరిగింది.. దేశవ్యాప్తంగా దాదాపుగా 14 లక్షల మంది విద్యార్థులు రాసిన ఈ పరీక్షకు మన రాష్ట్రం నుంచి 1,07,046 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆఫ్‌లైన్‌లో జరిగిన జేఈఈ-మెయిన్ పరీక్ష తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి? ఏయే అంశాలకు ఎక్కువ వెయిటేజీ లభించింది? కటాఫ్ ఎంత ఉండొచ్చు? తదితర అంశాలపై సబ్జెక్ట్ నిపుణుల విశ్లేషణ.. జేఈఈ-మెయిన్‌ను మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో నిర్వహించారు. ప్రతి సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇచ్చారు. మొత్తం మార్కులు 360. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉన్నాయి. సరైన సమాధానానికి 4 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పుకు 1 మార్కు కోత విధిస్తారు. ఈ సారి అసెర్షన్ -రీజన్ తరహా ప్రశ్నలు అడగలేదు. అన్నీ సింగిల్ కరెక్ట్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే. గతంతో పోల్చితే ప్రశ్నల సరళి కూడా మారింది. ఒక్కో ప్రశ్నకు జవాబులుగా పేర్కొనే నాలుగు ఆప్షన్లను ఒక్కో సిరీస్ ప్రశ్నపత్రంలో ఒక్కో రకంగా ఇచ్చారు. కెమిస్ట్రీ కెమిస్ట్రీలో ఇచ్చిన 30 ప్రశ్నల్లో 18 ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. మిగిలిన ప్రశ్నల్లో 8 మధ్యస్తంగా ఉంటే.. 4 మాత్రం క్లిష్టమైనవి. కెమిస్ట్రీ.. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అనే మూడు విభాగాలుగా ఉంటుంది. ఈ క్రమంలో విభాగాల వారీగా వచ్చిన ప్రశ్నల శాతాన్ని పరిశీలిస్తే.. ఫిజికల్ కెమిస్ట్రీ: 40 శాతం, ఆర్గానిక్ కెమిస్ట్రీ: 30 శాతం, ఇనార్గానిక్ కెమిస్ట్రీ: 30 శాతం. అధిక శాతం ప్రశ్నలు నిర్దేశించిన సిలబస్ మేరకు ఉండడమే కాకుండా టెక్ట్స్ పుస్తకాల నుంచి నేరుగా ఇవ్వడం జరిగింది. తరగతుల వారీగా ప్రశ్నల విభజనను చూస్తే..11వ తరగతి నుంచి దాదాపుగా 11 ప్రశ్నలు, 12వ తరగతి నుంచి దాదాపుగా 16 ప్రశ్నలు వచ్చాయి.రెండు ప్రశ్నలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా వీటి క్లిష్టత స్థాయి కూడా ఇంటర్మీడియెట్ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తంగా పరిశీలిస్తే కెమిస్ట్రీ పేపర్ సులభంగానే అనిపి స్తుంది. కానీ ఇచ్చిన ఆప్షన్లు రెండు ఒకే విధంగా ఉండడం కారణంగా వాటిని సాధించడానికి సహేతుకమైన ఆలోచన అవసరం. కానీ చాలామంది విద్యార్థులు పేపర్ సులభంగానే ఉందనే ఉద్దేశంతో అన్ని ప్రశ్నలను యత్నించారు. దాంతో తప్పులు చేసే అవకాశమెక్కువ. కాబట్టి ఫలితాల్లో కెమిస్ట్రీ నిర్ణయాత్మకంగా ఉండొచ్చు. ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్ చాప్టర్ల నుంచి (నాలుగు చొప్పున) ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన ప్రశ్నలు ప్రాథమిక అంశాలపైన ఉన్నాయి. వీటిని టెక్ట్స్‌బుక్స్ నుంచి నేరుగా అడగటం జరిగింది. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ప్రశ్నల క్లిష్టత కూడా ఎక్కువగా ఉంది. 70-80 105 యావరేజ్ స్కోర్ బెస్ట్ స్కోర్ -టి.కృష్ణ, (ఆర్ కే క్లాసెస్, హైదరాబాద్) ఫిజిక్స్ ఫిజిక్స్‌లో మొత్తం 30 ప్రశ్నలు ఇచ్చారు. ఇంటర్మీడియెట్ మొదటి, రెండు సంవత్సరాల సిలబస్‌కు సమప్రాధాన్యతనిచ్చారని చెప్పొచ్చు. మొదటి సంవత్సరంలో మెకానిక్స్ నుంచి అత్యధిక ప్రశ్నలు వచ్చాయి. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 16 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 14 ప్రశ్నలు ఇచ్చారు. మొదటి సంవత్సరం నుంచి టాపిక్ల వారీగా వచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తే: మెకానిక్స్-5 ప్రశ్నలు; ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ -3 ప్రశ్నలు; సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ వేవ్స్-2 ప్రశ్నలు; థర్మోడైనమిక్స్-3 ప్రశ్నలు; యూనిట్ డెమైన్షన్స్, ఎర్రర్ మెజర్మెంట్స్-2 ప్రశ్నలు; గ్రావిటేషన్-1 ప్రశ్న. ద్వితీయ సంవత్సరం నుంచి టాపిక్ల వారీగా వచ్చిన ప్రశ్నలు: ఎలక్ట్రిసిటీ అండ్ మాగ్నటిజం-6 ప్రశ్నలు; జియోమెట్రికల్ అండ్ వేవ్ టాపిక్స్, ఈఎం వేవ్స్-5 ప్రశ్నలు; మోడ్రన్ ఫిజిక్స్-2 ప్రశ్నలు; సెమీకండక్టర్ డివెజైస్-1 ప్రశ్న. మొత్తం మీద చూస్తే ఫిజిక్స్ క్లిష్టంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే..కొన్ని ప్రశ్నలు సమస్యాధారితంగా (ప్రాబ్లమ్ బేస్డ్) ఉన్నాయి. కొన్ని ప్రశ్నలను సాధించడానికి సుదీర్ఘమైన కాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం వచ్చింది.పశ్నలను సాధించే పద్ధతిపై అవగాహన ఉన్నప్పటికీ.. సుదీర్ఘ కాలిక్యులేషన్స్ కారణంగా అధిక శాతం సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది.రెండు, మూడు కాన్సెప్ట్‌లు కలిపి మల్టిపుల్ కాన్సెప్ట్‌లుగా ఇచ్చిన ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది.సాధారణంగా విద్యార్థులు నిర్లక్ష్యం చేసే సర్ఫేస్ టెన్షన్, ఎలాస్ట్టిసిటీ, ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్ వంటి అంశాలకు ఈ సారి ప్రాధాన్యత లభించింది. పధాన చాప్టర్లుగా భావించే ఎలక్ట్రో స్టాటిస్టిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన ప్రశ్నలు స్వల్పంగానే ఉన్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుంటే విద్యార్థులు అన్ని టాపిక్‌లకు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉంది. 50 80-90 యావరేజ్ స్కోర్ బెస్ట్ స్కోర్ -రామకృష్ణ, (ఆర్ కేస్ ఫ్రేమ్స్ ఆఫ్ ఫిజిక్స్, హైదరాబాద్) మ్యాథమెటిక్స్ గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మ్యాథమెటిక్స్ పేపర్ సులభంగానే ఉందని చెప్పొచ్చు. ఇంటర్మీడియెట్ మొదటి, రెండు సంవత్సరాలకు సమ ప్రాధాన్యత లభించింది. ఇంటర్మీడియెట్‌లో సబ్జెక్ట్‌పై మంచి అవగాహన ఉన్న విద్యార్థి సులభంగా 18 ప్రశ్నలను సాధించగలడు. అసెర్షన్-రీజన్ టైప్ ప్రశ్నలు లేని కారణంగా విద్యార్థులు ఒత్తిడి లేకుండా సమాధానాలు ఇచ్చారని చెప్పొచ్చు. మొత్తం 30 ప్రశ్నల్లో.. సులభమైనవి-10, సుదీర్ఘ ప్రశ్నలు-7, కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలు-8, క్లిష్టమైనవి-5. గత ప్రశ్నపత్రాల నుంచి 7 ప్రశ్నలు వచ్చాయి. నిర్దేశించిన సిలబస్ నుంచి ప్రత్యేకంగా 4 ప్రశ్నలు ఇచ్చారు. కాలిక్యులస్ నుంచి వచ్చిన 7 ప్రశ్నల్లో 4 సులభమైనవి. ఆల్జీబ్రా నుంచి అడిగిన 10 ప్రశ్నల్లో 6 సులభమైనవి. కోఆర్డినేట్ జ్యామెట్రీ నుంచి వచ్చిన 5 ప్రశ్నల్లో 3 సులభమైనవి. మెట్రీలో రెండు ప్రశ్నలు మాత్రమే సులభంగా ఉన్నాయి. మీన్ వాల్యూ, ట్రిగ్నోమెట్రీ, వెక్టార్స్, డీఆర్ఎస్-డీసీఎస్, ప్రొబబిలిటీ, స్ట్రైట్ లైన్, మ్యాట్రిక్స్, సెట్స్ నుంచి అడిగిన ప్రశ్నలు కాన్సెప్ట్ బేస్డ్గా డెరైక్ట్‌గా ఉన్నాయి. వీటిని సాధించడం సులభం.మిక్స్డ్ కాన్సెప్ట్ ప్రశ్నలు (ఇన్వర్స్+డిఫరెన్షియెషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్+ఇంటీజర్), బైనామిల్ థీరమ్పై వచ్చిన ప్రశ్నలు క్లిష్టంగా ఉండడమే కాకుండా సుదీర్ఘమైనవి. మిగతా చాప్టర్ల నుంచి అడిగిన ప్రశ్నలు ఒక మోస్తరుగా ఉన్నాయి. 60-70 115-120 యావరేజ్ స్కోర్ బెస్ట్ స్కోర్ -ఎం.ఎన్.రావు,(శ్రీ చైతన్య విద్యా సంస్థలు, హైదరాబాద్), బి.వాసు, (డాక్టర్ ఆర్ కే క్లాసెస్, హైదరాబాద్). 310 బెస్ట్ మార్క పైనే ఉండొచ్చు ఫలితాల వెల్లడి: మే 3, 2014 వెబ్సైట్: http://jeemain.nic.in -
ఐటీ రంగానికి ఐదు కోట్ల మంది అవసరం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రపంచ వ్యాప్తంగా 2022 నాటికి 50 కోట్ల మంది నైపుణ్య సిబ్బంది అవసరమవుతారని, ఒక్క ఐటీ రంగానికే అయిదు కోట్ల మంది కావాల్సి వస్తుందని నాస్కామ్ ఉపాధ్యక్షుడు కేఎస్. విశ్వనాథన్ తెలిపారు. సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శనివారం ఆయన 2013-14 సంవత్సరానికి విద్యా కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. దేశంలో అయిదు వేల ఐటీ కంపెనీలున్నాయని, గ్లోబల్ ఐటీ ఎగుమతుల్లో వీటి వాటా 52 శాతమని వెల్లడించారు. చదివే రోజుల్లోనే నైపుణ్యం, సామర్థ్యాన్ని సంతరించుకోవాలని ఇంజనీరింగ్ విద్యార్థులకు సూచించారు. బహుళ జాతి కంపెనీలు సవాళ్లను ఎదుర్కోడానికి, జ్ఞాన సముపార్జనకు సిద్ధం గా ఉన్న అభ్యర్థుల కోసం అన్వేషిస్తూ ఉంటాయని తెలి పారు. నాయకత్వ లక్షణాలను అలవరచుకున్న వారికి మా త్రమే పరిశ్రమలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇదే సందర్భంలో ఆయన ఆటోమొబైల్, నిర్మాణ, ఐటీ రంగాల్లో ఉన్న అవకాశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ విద్యా సంస్థల చైర్మన్ కేసీ. రామమూర్తి, సీఎంఆర్జేటీ అధ్యక్షురాలు డాక్టర్ సబితా రామమూర్తి, వోల్వో ఉపాధ్యక్షుడు సతీశ్ రాజ్ కుమార్ ప్రభృతులు పాల్గొన్నారు.