తిరుపతి ఐఐటీకి కేబినెట్ ఓకే
- మరో ఐదింటీకీ పచ్చజెండా..
- ఏపీలో ఎన్‌ఐటీ ఏర్పాటు సవరణలకూ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ-తిరుపతి), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)ల ఏర్పాటుకు బుధవారం కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తిరుపతి సహా పాలక్కడ్, ధార్వాడ్, భిలాయ్, గోవా, జమ్మూల్లో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లను ‘ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ చట్టం-1961’లో చేర్చడానికి అనువుగా ఈ చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఐండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్(ఐఎస్‌ఎమ్) ధన్‌బాద్‌ను ఐఐటీగా స్థాయి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్-2001 ప్రకారం రిజిస్టర్ అయిన ఏపీలోని ఎన్‌ఐటీ(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఏర్పాటుకు సంబంధించిన(పశ్చిమగోదావరి జిల్లాలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటైంది) సవరణను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరిన్ని కేబినెట్ నిర్ణయాలు:
► ఐదు రాష్ట్రాల్లో గిరిజనుల జాబితాను సవరించి, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త గిరిజన జాతులను గుర్తించాలనే 2 బిల్లులకు ఆమోదం.
► వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే యూపీ, గుజరాత్‌తోపాటు 5 రాష్ట్రాల్లో రూ.10,736 కోట్ల విలువైన వివిధ రైల్వే అభివృద్ధి పనులకు పచ్చజెండా.
► ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ పునర్నిర్మాణంలో భాగంగా.. ఈ సంస్థ తీసుకున్న రూ. 9వేల కోట్ల రుణ మాఫీ
► తపాలా సేవల ఉద్యోగుల కేడర్ సమీక్షకు ఆమోదం.