Amazon River
-
ఆదిమ బాలుని ఆగమనం
నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవించే ఎన్నో ఆదిమజాతులకు బ్రెజిల్‌లోని అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం ఆవాసంగా ఉంది. ఆ ఆదిమజాతుల కట్టూ»ొట్టూ, ఆచరవ్యవహారాలు, ఆహార నియమాలు ఎవరికీ తెలీదు. బ్రెజిల్ ప్రభుత్వం కూడా ఎవరికీ చెప్పదు. ఆధునిక పోకడల బారిన పడకుండా ఆ జాతులను తమ మానాన వారి బతకనివ్వాలని బ్రెజిల్ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే అలాంటి ఆదిమజాతులు ఆవాసాల వైపు ఎవరినీ వెళ్లనివ్వదు. అయితే అనుకోకుండా ఆ ఆదిమజాతుల్లో ఒక గిరిజనజాతికి చెందిన వ్యక్తి వాళ్ల ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. వెంట రెండు చిన్న దుంగలను తెచ్చుకున్నాడు. మంట రాజేయడానికి అగ్గి కావాలని అభ్యర్థించాడు. ఈ అరుదైన ఘటన గత బుధవారం నైరుతి అమెజాన్‌లోని పురూస్ నదీతీరం వెంట బెలారోసా అనే కుగ్రామంలో జరిగింది. బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఒక గిరిజన వ్యక్తి ఒంటిపైభాగంపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా కాళ్లకు చెప్పులు లాంటివి ఏమీ లేకుండా నడుచుకుంటూ కుగ్రామానికి చేరుకున్నాడు. సంబంధిత వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ఏజెన్సీ సంపాదించింది. ఆ వీడియోలో ఆ గిరిజన వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతంగా, నెమ్మదస్తుడిగా కనిపించాడు. గ్రామస్థులను అగ్గి కావాలని అడిగాడు. దీంతో వాళ్లు ఒక లైటర్‌ను ఇచ్చి దీంతో అగ్గిరాజేసుకోవాలని సూచించారు. అయితే అతనికి లైటర్‌ను ఎలా వెలిగించాలో అర్థంకాలేదు. దానిని ఎలా వాడాలో స్థానికులు ఎంతలా విడమరిచి, వివరించి చూపినా అతనికి అర్థంకాలేదు. ఈలోపు బ్రెజిల్ దేశ ఆటవిక, ఆదివాసీ, గిరిజన సంబంధ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘ఫునాయ్’ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ మనిíÙని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. స్థానికులతో ఉండటంతో స్థానికులకు ఉన్న అంటురోగాలు, ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఏమైనా సోకాయో లేదో అని నిర్ధారించుకుని గురువారం సాయంత్రం కల్లా తిరిగి ఆ ఆదిమజాతి ఆవాసానికి సురక్షితంగా పంపేశారు. ఆదిమజాతులు శతాబ్దాలుగా బయటి వ్యక్తుతో కలవని కారణంగా వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఆధునిక జీవనశైలికి అలవాటుపడ్డ సాధారణ ప్రజల్లో అన్ని రకాల అంటురోగాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు పోగుబడి ఉంటాయి. ఇవి పొరపాటున ఆదిమజాతులకు సోకినా చాలా ప్రమాదం. గతంలో జరిగిన ఇలాంటి ఉదంతాల్లో కొన్ని జాతులు హఠాత్తుగా రోగాలపాలై సగం జనాభా అంతరించిపోయింది. అందుకే అతడిని ఎవరితోనూ కలవనీయకుండా విడిగా ఉంచి 24 గంటల్లోపు తిరిగి అతని జాతి ఆవాసానికి పంపేశారు. స్థానికులు అతను వచ్చిన మార్గం గుండా వెళ్లి ఆదిమజాతులను కలవకుండా ఉండేందుకు ఫునాయ్ అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఇలా ఎవరైనా గిరిజనులు బాహ్యప్రపంచంలోకి పొరపాటున వస్తే వారిని మెమోరియా గ్రాండే ఆదిమ,పర్యావరణ పరిరక్షణా స్థావరానికి తీసుకెళ్లి సపర్యలు చేసి పంపేస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతటి అమెజాన్‌పై.. ఒక్క బ్రిడ్జీ లేదేం?
ఓ చిన్న వాగు.. వెళ్తున్న కొద్దీ ఊరికో బ్రిడ్జి ఉంటుంది. గోదావరి, కృష్ణా వంటి నదులైతే 20, 30 కిలోమీటర్లకో వంతెనలు కట్టి రాకపోకలు నడిపిస్తుంటారు. అలాంటిది 9 దేశాల మీదుగా 6,500 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే అమెజాన్ నదిపై ఎన్ని బ్రిడ్జీ్జలు ఉండాలి? చాలానే ఉండొచ్చు అనిపిస్తోందా..? అయితే తప్పులో కాలేసినట్టే. అంత పెద్ద అమెజాన్ నదిపై ఒక్క బ్రిడ్జీ కూడా లేదు. ఇదేకాదు.. అసలు అమెజాన్ అంటేనే చిత్రవిచిత్రాలకు పుట్టినిల్లు. ఆ విశేషాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ తొమ్మిది దేశాల్లో ప్రవహిస్తున్నా.. అమెజాన్.. ప్రపంచంలోనే రెండో పొడవైన నది. నీటి పరిమాణం పరంగా అయితే అతిపెద్ద నది ఇదే. దక్షిణ అమెరికా ఖండంలో తొమ్మిది దేశాల మీదుగా.. వేల కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తున్నా.. ఈ నదిపై ఎక్కడా ఒక్క వంతెన కూడా కనిపించదు. చిత్రంగా అనిపించే ఈ విషయంపై ఎన్నో సర్వేలు, అధ్యయనాలు జరిగాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యూరిక్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ (బ్రిడ్జీలు, భారీ కాంక్రీట్ నిర్మాణాల) విభాగం ప్రొఫెసర్ వాల్టర్ కౌఫ్మన్ దీనికి కారణాలను వెల్లడించారు. ►అమెజాన్ నది వెడల్పు, లోతు చాలా ఎక్కువ. తక్కువలో తక్కువగా రెండు కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్ల వెడల్పున నది పారుతుంటుంది. వానాకాలంలో అయితే మరింత భారీగా మారుతుంది. కొన్నిచోట్ల అయితే ఏకంగా 40–50 కిలోమీటర్ల వెడల్పున ప్రవహిస్తుంది. అంతేగాక నదికి రెండు వైపులా దట్టమైన అడవి, బురద, చిత్తడి నేలలు ఉంటాయి. అత్యంత పటిష్టంగా, అతిపెద్ద వంతెనలు కట్టాల్సి వస్తుంది. దీనికి వేలు, లక్షల కోట్ల వ్యయం అవుతుంది. ►అమెజాన్ అన్ని వేల కిలోమీటర్లు ప్రవహించినా.. చాలా భాగం దట్టమైన అడవుల నుంచే సాగుతుంది. రవాణా అవసరం తక్కువ. అక్కడక్కడా పట్టణాలు ఉన్నా పడవలు, మరబోట్లు, ఫెర్రీలు, జెట్టీలతో మనుషులు, సరుకు రవాణా సాగుతుంది. ►అమెజాన్‌పై ఎలాంటి బ్రిడ్జి లేకున్నా.. దాని అతిపెద్ద ఉపనది రియో నీగ్రోపై మాత్రం 2011లో ఒక బ్రిడ్జిని కట్టారు. ∙ప్రత్యేకతలు ఇన్నీ అన్నీ కావు.. ►మామూలుగా నదుల్లో చేపలు, పాములు, కొన్నిచోట్ల మొసళ్లూ ఉండటం కామనే. కానీ అమెజాన్‌లో పెద్ద పెద్ద అనకొండలు, కరెంటు షాకిచ్చే ఎలక్ట్రిక్ ఈల్ వంటి చేపలు, మాంసం వాసనొస్తే కొరికిపడేసే 60 రకాల ఫిరానా చేపలూ ఉన్నాయి. మొత్తంగా ఈ నదిలో 5,600 రకాల చేపలు ఉన్నట్టు గుర్తించారు. ►అమెజాన్‌కు 1,100కుపైగా ఉప నదులు ఉన్నాయి. అందులో 17 ఉప నదులు వెయ్యి కిలోమీటర్లకుపైగా పొడవు ఉండటం గమనార్హం. ►భూమ్మీద ఉన్న వేల నదుల నీళ్లన్నింటినీ కలిపి చూస్తే.. ఒక్క అమెజాన్లోనే 20శాతం నీళ్లు ప్రవహిస్తాయని అంచనా. దీని నుంచి సెకనుకు 2 లక్షల క్యూబిక్ మీటర్ల నీళ్లు అట్లాంటిక్ సముద్రంలో కలుస్తుంటాయి. రంగుల్లో అమెజాన్ అమెజాన్‌కు అతిపెద్ద ఉప నది రియో నీగ్రో. వేగంగా ప్రవహించే అమెజాన్‌లో నీళ్లు మట్టి, బురదతో గోధుమ రంగులో ఉంటాయి. దట్టమైన అడవి మధ్య నుంచి మెల్లగా ప్రవహిస్తూ వచ్చే రియో నీగ్రో నీళ్లు నల్లగా ఉంటాయి. నది నీటిలో ఆకులు, కొమ్మలు, చెట్ల అవశేషాలు కుళ్లిపోతూ హ్యూమిక్ యాసిడ్‌ను విడుదలవడం వల్ల ఇలా నలుపు రంగు వస్తుంది. అంతేకాదు.. అమెజాన్ నీళ్లు కాస్త వెచ్చగా ఉంటే, రియోనీగ్రో నీళ్లు బాగా చల్లగా ఉంటాయి. వీటన్నింటి వల్ల ఈ రెండింటి నీళ్లు వెంటనే కలిసిపోవు. కొద్ది కిలోమీటర్లు చెరో పక్క వేర్వేరుగా ప్రవహిస్తున్నట్టే కనిపిస్తాయి. -
కరోనాతో ఆటవిక తెగల యోధుడి అస్తమయం
రియోడీజనీరో : అమెజాన్ అడవుల సంరక్షణ కోసం విశేష కృషి చేసిన పాలిన్హో పైకాన్(65) కరోనా మహమ్మారితో మృతిచెందారు. బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో నివాసం ఉండే కయాపో తెగకు నాయకుడిగా పైకాన్ వ్యవహరిస్తున్నారు. ఆటవిక తెగల యోధుడుగా పైకాన్ని బ్రెజీలియన్ ఇండీజినస్ పీపుల్స్ అసోసియేషన్ కీర్తించింది. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాముల్లో ఒకటైన బ్రెజిల్‌లోని బెలో మొంటో హైడ్రాలిక్ ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా పోరాటం చేసి, 1980 దశకంలో అంతర్జాతీయంగా పైకాన్ గుర్తింపు పొందారు. పారా స్టేట్‌లోని ఓ ఆసుపత్రిలో బుధవారం పైకాన్ కరోనాతో మృతిచెందారు. బ్రెజిల్‌లోని ఈ ప్రాంతంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆటవిక తెగలవారిపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. బ్రెజిల్లో ఆటవిక తెగల్లో దాదాపు 5500 మందికి కరోనా సోకగా, 287 మంది మృతిచెందారు. అమెజాన్ అడవులను సంరక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా సహకారాన్ని కూడగడుతూ తన జీవితమంతా పైకాన్ కృషి చేశారని ప్లానెట్ అమెజాన్ పర్యావరణ గ్రూపు వ్యవస్థావకుడు గెర్ట్ పీటర్ బ్రూట్ అన్నారు. ఆయన కాలంలో అడవుల సంరక్షణలో అందరికంటే ఎంతో ముందుండేవారని కొనియాడారు. తాము చాలా విలువైన మార్గదర్శిని కోల్పోయామని పేర్కొన్నారు. కాగా, 1998లో 18 ఏళ్ల బాలికపై పైకాన్ అత్యాచారానికి పాల్పడ్డారని, దీనికి ఆయన భార్య కూడా సహకరించిందని కోర్టు దోషిగా తేల్చడంతో శిక్ష అనుభవించారు. అయితే ఇదంతా కుట్ర చేసి పైకాన్ని ఇరికించారని ఆయన అభిమానులు అంటుంటారు. -
బ్రెజిల్లో పడవ ప్రమాదం: ‘టైటానిక్’ను తలపించేలా..
బ్రెజిల్: అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రాంతంలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. అమెజాన్ ఉపనది జారి నది గుండా వెళ్తున్న రెండస్తుల ఫెర్రి రివర్ బోట్ మునిగి 18 మందికి పైగా మృతి చెందగా.. 30 మంది కనిపించకుండా పోయినట్లు బ్రెజిల్ అధికారులు సోమవారం వెల్లడించారు. అమెజాన్ ఉపనది అయినా జారి నదిపై వెళ్తున్న ఫెర్రి శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదానికి గురైందని, ఈ ఘటనలో 18 మందికి పైగా మరణించగా, 46 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఘటన సమయంలో మరో 30 మంది ప్రయాణికులు ఉన్నారని వారు కనిపించడం లేదని అధికారులు ఆలస్యంగా ప్రకటించారు. ఇక వారి కోసం విమానాలు, హెలికాప్టర్ల, రక్షణ దళాల ద్వారా గాలింపులు చర్యలు చేపట్టినట్లు కూడా చెప్పారు. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బ్రెజిల్ నావికాదళం తెలిపింది. అమెజాన్ దాని ఉపనదులలో ఫెర్రి బోట్లు తరచూ ప్రయాణిస్తుంటాయని, ఈశాన్య బ్రెజిల్‌లోని అమాపా రాజధాని మకాపా నగరం నుండి ‘అన్నా కరోలిన్ 3’ అనే ఫెర్రీ పడవ శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరినా ఈ పడవ పారాలోని టారెంకు ప్రయాణిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ‘అన్నా కరోలిన్ 3’ పడవను మరో పడవను తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా ఈ ఘటన నుంచి బయట పడిన వండర్లియా మోంటెరియో అనే మహిళా మీడియాతో మాట్లాడుతూ.. ‘పడవ మునిగిపోతున్నట్లు గమనించి అందరూ భయంతో కేకలు వేశారు. దీంలో అటువైపు వస్తున్న మరొ పడవలో మా అరుపులను గమనించి ఘటన స్థలానికి వచ్చింది. కాగా అప్పటికే పడవ దాదాపుగా మునిగిపోయే స్థితి చేరుకుంది’ అని చెప్పింది. పుట్టగానే ఆ బిడ్డ చేసిన పనికి డాక్టర్లే షాక్ ఈ క్రమంలో తన భర్త, కుమారుడితో కలిసి తాను పడవ కిటికి గుండా తప్పించుకుని మరో పడవలోకి ఎక్కి ప్రాణాలను రక్షించుకున్నామని పేర్కొంది. ఇక కొంతదూరం వెళ్లి వెనక్కి చూసే సరికి పడవ పూర్తిగా నీటిలో మునిగిపోయిందని ఆమె వివరించింది. కాగా కళ్లేదుటే రెప్పాపాటులో జరిగిన ఈ ఘటన నుంచి తాను ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నానని. ఈ పడవ ప్రమాదం.. ‘టైటానిక్’ సినిమాను తలపించేలా ఉందని చెప్పింది. కాగా ప్రమాదానికి గురైనా ఈ ప్రాంతం చాలా మారుమూలలో ఉన్నందున రెస్క్యూ హెలికాప్టర్లు రావడానికి తొమ్మిది గంటలు సమయం పట్టిందని అధికారలు తెలిపారు. -
‘అది ఫొటోషాప్ ఇమేజ్.. నిజం కాదు’
ప్రపంచంలో అతిపెద్ద అనకొండను సంహరించినట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ సర్పాన్ని అమెజాన్ నదిలో గుర్తించారు.. ఇది 257 మంది మానవులను, 2325 జంతువులను చంపింది. 134 అడుగుల పొడవు, 2067 కిలోల బరువు కల్గిన ఈ సర్పాన్ని ఆఫ్రికా రాయల్ బ్రిటిష్ కమాండోలు చంపడానికి 37 రోజులు పట్టింది’ అంటూ ఫేస్బుక్ యూజర్ షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ (AFWA) ఈ వాదన తప్పని తేల్చింది. ఈ వైరల్ ఇమేజ్ ని ఫోటోషాప్తో రూపొందించినట్లు తెలిపింది. అదే విధంగా అమెజాన్ నది దక్షిణ అమెరికాలో ఉన్న విషయాన్ని కూడా ఎవరూ గుర్తించకుండా వైరల్ చేశారని పేర్కొంది. కాగా అమెజాన్ నది ఒడ్డన 134 అడుగుల ఎత్తు, 2067కిలోల బరువు కలిగి ఉన్న ఓ అనకొండ అంటూ ఫేస్బుక్ యూజర్ రమాకాంత్ కజారి 2015లో దీనిని పోస్ట్ చేశారు. అయితే ఇప్పటికి ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటం గమనార్హం. కాగా, ఈ సర్పాన్ని చంపినట్లుగా చలామణీ అవుతున్న ఆఫ్రికా రాయల్ బ్రిటిష్ కమాండో అనే సంస్థ ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లభించ లేదు. ఇక నేషనల్ జియోగ్రఫీ వివరాల ప్రకారం... 30 అడుగుల పొడవు ఉండే గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతి పొడవైనది. ఇదిలా ఉండగా ఈ సర్పానికి సంబంధించిన ఫేక్పోస్ట్ ఇప్పటి వరకు 1,24,000సార్లు సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. -
అడవిలో భారీ తిమింగలం మృతదేహం
రియో డి జనీరో : అమెజాన్ అడవుల్లో ఓ భారీ తిమింగలం మృతదేహం లభ్యమైంది. 36 అడుగుల పొడవున్న ఈ తిమింగలాన్ని హంప్‌బ్యాక్ జాతికి చెందిందిగా గుర్తించారు. బ్రెజిల్‌లోని మరాజో ఐలాండ్‌లో తిమింగలం మృతదేహం లభ్యమైంది. సముద్రం నుంచి తిమింగలం మృతదేహం ఉన్న ప్రాంతం 15 మీటర్ల దూరంలో ఉంది. సముద్రంలో చనిపోయిన తర్వాత భారీ అలలకు తిమింగలం ఇక్కడికి కొట్టుకొని వచ్చి ఉంటుందేమో అన్న కోణంలో బయాలజిస్టులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వయసు సంవత్సరం కూడా లేదని, దీని మృతిపై దర్యాప్తు చేస్తున్న బిచో డాగువా ఇన్స్టిట్యూట్ సభ్యులు చెబుతున్నారు. ఏడాది వయసు కూడా లేని ఈ భారీ సైజు తిమింగలం ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
భూమ్మీదున్న చెట్లు.. మూడు లక్షల కోట్లు!
భూమ్మీదున్నమనుషులెందరు (సుమారు 720 కోట్లు)? కార్లెన్ని (120 కోట్లు)? తిమింగలాలెన్ని (17 లక్షలు)? ... ఈ ప్రశ్నలకు వాస్తవానికి దగ్గరగా సమాధానాలు వెదకొచ్చు. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెట్లెన్ని? అంటే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే! అయితే, తొట్టతొలిగా సేకరించిన చెట్ల గణాంకాల ప్రకారం.. మూడు లక్షల కోట్లు! ప్రపంచవ్యాప్తంగా చెట్ల సంఖ్య 40 వేల కోట్ల వరకు ఉండొచ్చన్నది ఇప్పటి వరకు ఉన్న అంచనా. అయితే, ఒక్క అమెజాన్ నదీ పరీవాహక ప్రాంతంలోనే సుమారు 40 వేల కోట్ల చెట్లున్నాయని తాజాగా తేలింది. యేల్ స్కూల్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ (అమెరికా) తాజాగా వృక్ష గణన ప్రక్రియ నిర్వహించి, దరిదాపుగా మూడు లక్షల కోట్ల చెట్లున్నట్లు తేల్చింది. చెట్లు లేని మంచు ఖండం అంటార్కిటికా మినహా అన్ని ఖండాల నుంచి సేకరించిన వివరాలను క్రోడీకరించి ఈ లెక్క తేల్చారు. చిన్నా, పెద్దా, ఆడా, మగా అన్న తేడా లేకుండా తలసరిన 429 చెట్లున్నాయట. ఇంతకీ ఇవన్నీ మనం కొట్టేయగా మిగిలిన చెట్ల సంఖ్య మాత్రమే సుమా! 12 వేల ఏళ్ల క్రితం మనుషులు స్థిర నివాసం ఏర్పరచుకున్న కొత్తల్లో.. ఆరున్నర లక్షల కోట్ల చెట్లుండేవట. కాలక్రమంలో 46 % వరకు చెట్లను నరికేయగా.. ఇప్పుడు 3 లక్షల కోట్ల చెట్లు మిగిలాయన్న మాట. ప్రతి ఏటా 1500 కోట్ల చెట్లను నరికేస్తున్నట్లు యేల్స్ స్కూల్ లెక్కగట్టింది! జన సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుంటే చెట్ల సంఖ్య అంత వేగంగా తగ్గిపోతోంది. అంటే.. మనం లేకపోతే చెట్లు హాయిగా బతుకుతాయి. కానీ, చెట్లు లేకపోతే మాత్రం మనం బతికి బట్ట కట్టలేం!