రియోడీజనీరో : అమెజాన్ అడవుల సంరక్షణ కోసం విశేష కృషి చేసిన పాలిన్హో పైకాన్(65) కరోనా మహమ్మారితో మృతిచెందారు. బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో నివాసం ఉండే కయాపో తెగకు నాయకుడిగా పైకాన్ వ్యవహరిస్తున్నారు. ఆటవిక తెగల యోధుడుగా పైకాన్‌ని బ్రెజీలియన్ ఇండీజినస్ పీపుల్స్ అసోసియేషన్ కీర్తించింది. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాముల్లో ఒకటైన బ్రెజిల్‌లోని బెలో మొంటో హైడ్రాలిక్ ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా పోరాటం చేసి, 1980 దశకంలో అంతర్జాతీయంగా పైకాన్ గుర్తింపు పొందారు.
పారా స్టేట్‌లోని ఓ ఆసుపత్రిలో బుధవారం పైకాన్ కరోనాతో మృతిచెందారు. బ్రెజిల్‌లోని ఈ ప్రాంతంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆటవిక తెగలవారిపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. బ్రెజిల్‌లో ఆటవిక తెగల్లో దాదాపు 5500 మందికి కరోనా సోకగా, 287 మంది మృతిచెందారు.
అమెజాన్ అడవులను సంరక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా సహకారాన్ని కూడగడుతూ తన జీవితమంతా పైకాన్ కృషి చేశారని ప్లానెట్ అమెజాన్ పర్యావరణ గ్రూపు వ్యవస్థావకుడు గెర్ట్ పీటర్ బ్రూట్ అన్నారు. ఆయన కాలంలో అడవుల సంరక్షణలో అందరికంటే ఎంతో ముందుండేవారని కొనియాడారు. తాము చాలా విలువైన మార్గదర్శిని కోల్పోయామని పేర్కొన్నారు.
కాగా, 1998లో 18 ఏళ్ల బాలికపై పైకాన్ అత్యాచారానికి పాల్పడ్డారని, దీనికి ఆయన భార్య కూడా సహకరించిందని కోర్టు దోషిగా తేల్చడంతో శిక్ష అనుభవించారు. అయితే ఇదంతా కుట్ర చేసి పైకాన్‌ని ఇరికించారని ఆయన అభిమానులు అంటుంటారు.
Comments
Please login to add a commentAdd a comment