
ప్రపంచంలో అతిపెద్ద అనకొండను సంహరించినట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ సర్పాన్ని అమెజాన్ నదిలో గుర్తించారు.. ఇది 257 మంది మానవులను, 2325 జంతువులను చంపింది. 134 అడుగుల పొడవు, 2067 కిలోల బరువు కల్గిన ఈ సర్పాన్ని ఆఫ్రికా రాయల్ బ్రిటిష్ కమాండోలు చంపడానికి 37 రోజులు పట్టింది’ అంటూ ఫేస్‌బుక్ యూజర్ షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ (AFWA) ఈ వాదన తప్పని తేల్చింది. ఈ వైరల్ ఇమేజ్ ని ఫోటోషాప్‌తో రూపొందించినట్లు తెలిపింది. అదే విధంగా అమెజాన్ నది దక్షిణ అమెరికాలో ఉన్న విషయాన్ని కూడా ఎవరూ గుర్తించకుండా వైరల్ చేశారని పేర్కొంది.
కాగా అమెజాన్ నది ఒడ్డన 134 అడుగుల ఎత్తు, 2067కిలోల బరువు కలిగి ఉన్న ఓ అనకొండ అంటూ ఫేస్‌బుక్ యూజర్ రమాకాంత్ కజారి 2015లో దీనిని పోస్ట్ చేశారు. అయితే ఇప్పటికి ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటం గమనార్హం. కాగా, ఈ సర్పాన్ని చంపినట్లుగా చలామణీ అవుతున్న ఆఫ్రికా రాయల్ బ్రిటిష్ కమాండో అనే సంస్థ ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లభించ లేదు. ఇక నేషనల్ జియోగ్రఫీ వివరాల ప్రకారం... 30 అడుగుల పొడవు ఉండే గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతి పొడవైనది. ఇదిలా ఉండగా ఈ సర్పానికి సంబంధించిన ఫేక్‌పోస్ట్ ఇప్పటి వరకు 1,24,000సార్లు సోషల్ మీడియాలో షేర్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment