ఒలాఫ్ షోల్జ్
బెర్లిన్: జర్మనీ ఎన్నికల్లో చాన్సెలర్ ఏంజెలా మెర్కెల్‌కు చెందిన యూనియన్ కూటమి ఓట్ల వేటలో వెనుకబడింది. సోషల్ డెమోక్రాట్ పార్టీ స్వల్ప మెజారిటీ సాధించింది. మొత్తం 735 నియోజకవర్గాల్లో సోమవారం ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి సోషల్ డెమోక్రాట్లకు 25.7% ఓట్లు(206 సీట్లు), యూనియన్ కూటమికి 24.1%ఓట్లు(196 సీట్లు) పడ్డాయని ఎన్నికల అధికారులు చెప్పారు. తర్వాతి స్థానాల్లో ఉన్న గ్రీన్ పార్టీ 14.8%(118 సీట్లు), ఫ్రీ డెమోక్రాట్లు 11.5% ఓట్లు(92 సీట్లు)సాధించాయి.
వైస్ చాన్సెలర్, ఆర్థిక మంత్రి సోషల్ డెమోక్రాట్ పార్టీ చాన్సెలర్ అభ్యర్థి ఒలాఫ్ షోల్జ్ ‘జర్మనీలో తాము ఒక మంచి, ఆచరణాత్మక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇది ప్రజలిచ్చిన తీర్పు’అని అన్నారు. అయితే, చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము కూడా ప్రయత్నిస్తామని యూనియన్ కూటమి పేర్కొంది. సోషల్ డెమోక్రాట్లు, యూనియన్ కూటమి కూటమి నేతలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు గ్రీన్ పార్టీ, ఫ్రీ డెమోక్రాట్లతో చర్చలు జరుపుతున్నారు. అయితే, గ్రీన్ పార్టీ సోషల్ డెమోక్రాట్లవైపు, ఫ్రీ డెమోక్రాట్లు యూనియన్ కూటమి వైపు మొగ్గు చూపడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో మాదిరిగా యూనియన్, సోషల్ డెమోక్రాట్లు కలిసి ‘గ్రాండ్ కూటమి’ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గతంలో మెర్కెల్ పాలనలో 12 ఏళ్లపాటు ఈ కూటమి ప్రభుత్వమే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment