
అమెరికా నుంచి మూడు విడతల్లో 332 మంది భారతీయుల రాక
ఏజెంట్లను నమ్మి నిలువునా మోసపోయామని ఆవేదన
దట్టమైన అడవుల్లో రోజుల తరబడి నడిచాం
పాములు, క్రూరమృగాలను తప్పించుకుంటూ ముందుకెళ్లామని వెల్లడి
చండీగఢ్: ఏజెంట్ల మాటలు నమ్మి, రూ.లక్షలు సమర్పించుకొని, అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ కోటి కలలతో అమెరికా దారిపట్టిన యువతకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. ఉత్త చేతులతో, అవమానకర రీతితో స్వదేశానికి చేరుకోవాల్సి వచ్చింది.
చట్టబద్ధంగా అమెరికాకు తీసుకెళ్తామంటూ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు చెప్పిన కల్లబొల్లి కబుర్లు నమ్మినందుకు అష్టకష్టాలు ఎదుర్కోన్నామని, ప్రత్యక్ష నరకం చూశామని అమెరికా నుంచి తిరిగివచ్చిన భారతీయ అక్రమవలసదార్లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
తొలి విడతలో భాగంగా 104 మంది అమెరికా సైనిక విమానంలో ఈ నెల 5వ తేదీన , రెండో విడతలో భాగంగా 116 మంది శనివారం రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మూడో విడతలో భాగంగా మరో 112 మంది ఆదివారం రాత్రి అమృత్‌సర్‌లో అడుగుపెట్టారు. ఇప్పటిదాకా మూడు విడతల్లో 332 మంది ఇండియాకు చేరుకున్నారు. పలువురు యువకులు తమ కన్నీటి గాథను మీడియాతో పంచుకున్నారు.
సరైన తిండి లేదు, నిద్ర లేదు
మన్‌దీప్ సింగ్(38) కుటుంబం అమృత్‌సర్‌లో నివసిస్తోంది. తన కుటుంబానికి చక్కటి జీవితం అందించడానికి అమెరికా వెళ్లి, ఏదైనా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతర యువకుల తరహాలోనే ఏజెంట్ వలలో చిక్కాడు. ఏజెంట్‌కు రెండు విడతల్లో మొత్తం రూ.40 లక్షలు చెల్లించాడు. ఇంకేముంది అమెరికాకు పయనం కావడమే అని ఏజెంట్ ఊరించాడు. అధికారికంగా కాకుండా అడ్డదారిలో(డంకీ రూట్) తీసుకెళ్లాడు. సబ్ ఏజెంట్లకు మణిదీప్‌ను అప్పగించాడు.
మన్‌దీప్‌ను మొదట అమృత్‌సర్ నుంచి విమానంలో ఢిల్లీకి, అక్కడి నుంచి ముంబైకి, తర్వాత ఆఫ్రికాలోని నైరోబీకి, అనంతరం ఆమ్‌స్టర్‌డ్యామ్, సురినామ్‌కు చేర్చారు. అక్కడ సబ్ ఏజెంట్లు రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ద్వారా ఆ డబ్బు చెల్లించక తప్పలేదు. సిక్కు మతస్థుడైన మన్‌దీప్ గడ్డాన్ని తొలగించారు. మన్‌దీప్‌తోపాటు మరికొందరు వలసదార్లను ఒక వాహనంలో గయనాకు తీసుకెళ్లారు. తర్వాత బొలీవియా, ఈక్వెడార్‌కు చేర్చారు. తర్వాత పనామా అడవుల్లో అడుగుపెట్టారు. విష సర్పాలు, మొసళ్లతో సావాసం చేస్తూ రోజుల తరబడి దట్టమైన అడవిలో నడిపించారు.
13 రోజులపాటు అడవిలోనే నడక సాగించారు. కాలువలు దాటుకుంటూ ముందుకెళ్లారు. సరైన తిండి కూడా లేదు. సగం కాల్చిన రొట్టెలు, నూడుల్స్‌తో కడుపు నింపుకున్నారు. కంటి నిండా నిద్రలేదు. రోజుకు 12 గంటలు నడిచారు. పనామా దాటిన తర్వాత కోస్టారికా, తర్వాత హోండూరస్‌కు చేరుకున్నారు. అక్కడ వారికి వరి అన్నం లభించింది. చివరకు నికరాగ్వా, గ్యాటెమాలా నుంచి మెక్సికో చేరారు.
జనవరి 27వ తేదీన మెక్సికోలోని తిజువానా నుంచి అమెరికా భూభాగంలోకి ప్రవేశిస్తుండగా, యూఎస్ సరిహద్దు పెట్రోలింగ్ దళం అదుపులోకి తీసుకుంది. మణిదీప్‌ను అరెస్టు చేసి, డిటెన్షన్ క్యాంప్‌లో నిర్బంధించి, విచారణ ప్రారంభించారు. అక్రమ మార్గంలో అమెరికాలో అడుగుపెట్టేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు మోపారు. అక్రమ వలసదార్లను వారి స్వదేశాలకు బలవంతంగా తిప్పి పంపిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మన్‌దీప్ స్వదేశానికి చేరుకున్నాడు. ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదని మణిదీప్ చెప్పాడు.
తలపాగాను చెత్తబుట్టలో పడేశారు
అమృత్‌సర్‌కు తిరిగొచ్చిన 23 ఏళ్ల జతీందర్ సింగ్‌ది మరో గాధ. ‘‘స్నేహితులు చెప్పడంతో గత నవంబర్‌లో ఏజెంట్ కలిశా. రూ.50 లక్షలిస్తే అమెరికా పంపిస్తానన్నాడు. మాకున్న 1.3 ఎకరాల భూమి అమ్మి ఏజెంట్‌కు అడ్వాన్స్‌గా రూ.22 లక్షలు కట్టా. పెళ్లయిన నా అక్కచెల్లెళ్లు తమ బంగారు నగలమ్మి మరీ చేతికిచ్చిన డబ్బును ఏజెంట్‌కు ఇచ్చేశా. మూడ్రోజులు పనామా అడువులను దాటాకా మెక్సికోకు విమానంలో తీసుకెళ్తానన్నాడు.
మెక్సికో సరిహద్దు నగరం తిజువానా నుంచి అమెరికాలోకి తీసుకెళ్తానన్నాడు. కానీ మధ్యలోనే వదిలేశాడు. పనామా అడవుల్ని దాటడం చాలా కష్టం. మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన తోటివారిని చూస్తూనే అతికష్టంమ్మీద అడవుల్ని దాటా. ఎలాగోలా అమెరికా సరిహద్దు దాటితే వెంటనే బోర్డర్ పోలీసులు బంధించి నిర్బంధ కేంద్రంలో పడేశారు.
సంప్రదాయ తలపాగాను తీయొద్దని బతిమాలినా వినలేదు. తీసి చెత్తబుట్టలో పడేశారు. సరైన తిండి పెట్టలేదు. ఉదయం, రాత్రి ఒక లేస్ చిప్స్ ప్యాకెట్, ప్రూటీ జ్యూస్ చిన్న బాటిల్ ఇచ్చారు. అదే ఆహారం. గదిలో ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రత బాగా పెంచి వేడికి చర్మం ఎండిపోయేలాగా చేశారు. భారత్‌కు తిరిగొచ్చేటప్పుడు సైనిక విమానంలో కాళ్లు కట్టేశారు. తినడానికి, బాత్రూమ్‌కు పోవడానికి కూడా చాలా కష్టమైంది. ఏకధాటిగా 36 గంటలు చేతులకు బేడీలు వేశారు. అమృత్‌సర్‌లో దిగడానికి 10 నిమిషాల ముందు మాత్రమే చేతులకు బేడీలు తీశారు’’అని జతీందర్ సింగ్ చెప్పారు.
ఆహారం, నీరు అడిగితే దాడులే
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన లవ్‌ప్రీత్ సింగ్‌ది మరో దీనగాథ. ఏడాది క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అమెరికా కలతో ఏజెంట్ల చేతికి చిక్కాడు. పనామా అడవుల గుండా ప్రయాణించి, మెక్సికో నుంచి అమెరికా సరిహద్దు దాటేందుకు ప్రయతి్నస్తుండగా, అక్కడి అధికారులు అరెస్టు చేశారు. పనామా అడవులు చాలా ప్రమాదకరంగా ఉంటాయని, అడుగడుగునా పాములు, క్రూరమృగాలు, మొసళ్లు తారసపడుతుంటాయని చెప్పాడు. వాటి నుంచి తప్పించుకొని ముందుకెళ్లడం నిజంగా సాహసం చేయడమేనని అన్నాడు. ఆహారం, మంచినీరు అడిగితే ఏజెంట్లు దారుణంగా కొట్టారని, దూషించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ అన్నీ భరించామని పేర్కొన్నాడు.
ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది
అమృత్‌సర్ జిల్లాకు చెందిన జసూ్నర్ సింగ్‌కు అమెరికాలో ఉద్యోగం సంపాదించుకోవాలన్నది ఒక కల. అందుకోసం ఏజెంట్‌కు రూ.55 లక్షలు చెల్లించాడు. అందుకోసం కొన్ని ఆస్తులు, వాహనాలు, ఇంటి స్థలం అమ్మేయాల్సి వచ్చింది. డంకీ రూట్‌లో అమెరికాకు చేరుకోగానే అక్కడి అధికారులు అరెస్టు చేసి, వెనక్కి పంపించారు. కపుర్తలా జిల్లాకు చెందిన 20 ఏళ్ల నిశాంత్ సింగ్‌కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. దట్టమైన అడవిలో 16 రోజులు నడిచానని అన్నాడు. కేవలం నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నానని పేర్కొన్నాడు. తనను అమెరికా పంపించడానికి తన కుటుంబం రూ.40 లక్షలు ఖర్చు చేసిందని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment