
అలుపెరుగని పోరాటం చేసిన ఫ్రెడరిక్ మెర్జ్
పార్టీ పగ్గాలు చేపట్టిన రెండేళ్లలోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన నేత
జర్మనీకి కాబోయే చాన్స్‌లర్ అయిన ఫ్రెడరిక్ మెర్జ్ పేరు జర్మనీ అంతటా మార్మోగిపోతోంది. న్యాయవాదిగా అపార అనుభవం గడించి ఆర్థిక రంగంలో విశేషమైన ప్రతిభ కనబరిచిన మెర్జ్ చివరకు మళ్లీ రాజకీయాల్లో చేరి ఎట్టకేలకు చాన్స్‌లర్ పదవికి తాను సరైన వ్యక్తిని అని నిరూపించుకున్నారు. రాజకీయాల్లో ఆసక్తితో క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ) వైపు అడుగులు వేసిన మెర్జ్ తదనంతరకాలంలో పార్లమెంటు సభ్యుడిగా ఎదిగారు. కానీ సిద్ధాంతపరమైన విభేదాలు ఆయనను పార్టీ వీడేలా చేశాయి.
ఒక దశాబ్దంపాటు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయారు. తర్వాత మళ్లీ రాజకీయ గాలిసోకి రీ ఎంట్రీ ఇచ్చారు. పార్టీ పగ్గాలు సాధించేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేశారు. ఒకానొక సమయంలో విఫల రాజకీయ నాయకుడిగా మీడియా ముద్రవేసింది. అయినాసరే ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అలుపెరుగని పోరాటం చేసి ఎట్టకేలకు పార్టీ పగ్గాలను రెండేళ్ల క్రితం సాధించారు. కేవలం ఈ రెండేళ్లలోనే పార్టీని అధికార పీఠం మీద కూర్చోబెట్టి తన రాజకీయ చతురతను చాటారు. అద్భుతమైన వక్తగా పేరు తెచ్చుకున్న మెర్జ్ రాజకీయ ఆటుపోట్ల ప్రయాణాన్నిఓసారి తరచిచూద్దాం.
మిలియనీర్ కార్పొరేట్ లాయర్
బడా వ్యాపార సంస్థల తరఫున కేసులు వాదించే సీనియర్ న్యాయవాదిగా పేరు తెచ్చుకున్న మెర్జ్ ఆకాలంలో కోట్ల రూపాయలు సంపాదించి మిలియనీర్‌గా అవతరించారు. 70వ దశకంలో సైనికుడిగా ఆ తర్వాత చాన్నాళ్లు న్యాయవాదిగా, ఆ తర్వాత రాజకీయాల్లోనూ రాణించి సైనిక, న్యాయ, శాసన వ్యవస్థల్లో అపార అనుభవం గడించారు. మెర్జ్ 1972 నుంచి సీడీయూ పార్టీకి బలమైన మద్దతుదారుగా ఉన్నారు.
1989లో పూర్తిగా రాజకీయాల్లో మునిగిపోయారు. 1994లో హోచ్ సౌర్లాండ్ క్రీస్ నియోజకవర్గం నుంచి గెలుపొంది తొలిసారిగా పార్లమెంటులో అడుగు పెట్టారు. సీడీయూలో కీలక పదవులు నిర్వహించిన ఆయన 2000 సంవత్సరంలో పార్టీ పార్లమెంటరీ నేతగా ఎదిగారు. 2005 ఏడాది నుంచి ఆయన రాజకీయ పతనం మొదలైంది. సీడీయూ, సీఎస్‌యూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు తనకు సరైన పార్టీలో, ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని గ్రహించారు. పార్టీలో ఆధిపత్యం కోసం ఏంజెలా మెర్కల్‌తో పోటీపడి అలసిపోయారు. దీంతో చివరకు 2009లో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
పునరాగమనం
ఆరున్నర అడుగుల ఎత్తు 69 ఏళ్ల వయస్సున్న మెర్జ్ 2002 ఏడాదిలో ఏంజెలా మెర్కల్ ప్రభుత్వంలో పనిచేశారు. తర్వాత రాజకీయాలు వదిలేసి పలు పెట్టుబడుల బ్యాంకుల బోర్డుల్లో సేవలందించారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత 2018లో రాజకీయాల్లోకి తిరిగి వచ్చారు. ఆ ఏడాది సీడీయూ నేతగా ఏంజెలా మెర్కల్ దిగిపోయారు. దీంతో తనకు రాజకీయ అవకాశాలు బలపడతాయని గ్రహించి మెర్జ్ మళ్లీ పార్టీలో చేరారు. పార్టీ చీఫ్ పదవికి పోటీచేసి 2021లో ఆర్మిన్ లాషెట్ చేతిలో ఓటమిని చవిచూశారు. దీంతో మీడియా ఈయనపై విఫలనేత ముద్రవేసింది.
2021లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో సొంత పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయింది. పార్టీలో కీలకనేతగా ఎదిగి చిట్టచివరకు 2022లో పార్టీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీ మూలాలు దెబ్బకొడతానని ప్రతిజ్ఞ చేశారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ వ్యవహారాల్లో ఉత్తర అమెరికా దేశాలతో యూరప్ దేశాలు కలిసి మెలసి ఉండాలనే ‘అట్లాంటిక్ వాదం’ను మెర్జ్ మొదట్నుంచీ గట్టిగా వినిపంచేవారు. ఈ ఒక్క విషయంలో జర్మనీలో ఎక్కువ మంది మెర్జ్‌ను గతంలో బాగా విమర్శించేవారు. అయినాసరే అమెరికా, కెనడా వంటి దేశాలతో జర్మనీ సత్సంబంధాలు దేశ భవిష్యత్తుకు బాటలు వేస్తాయని బలంగా వాదించారు.
ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే వాగ్ధాటి, కార్పొరేట్ లాయర్‌గా దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో కలిసి పనిచేసిన అనుభవం, లాబీయింగ్ నైపుణ్యం, వివిధ పెట్టుబడుల బ్యాంక్ బోర్డుల్లో సాధించిన అనుభవం.. మెర్జ్‌కు రాజకీయాల్లో బాగా అక్కరకొచ్చాయి. ఈ అర్హతలే మెర్జ్‌ను ఛాన్స్‌లర్ పీఠం వైపు నడిపించాయి. ‘జర్మనీలో ఉన్నందుకు మరోసారి గర్వపడదాం’ వంటి నినాదాలు, ‘దేశ సరిహద్దులను పటిష్టంచేస్తా. వలసలను కట్టడిచేసేలా శరణార్థి నిబంధనలను కఠినతరం చేస్తా. పన్నులు తగ్గిస్తా. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కోసం, సంక్షేమ పథకాల కోసం 50 బిలియన్ యూరోలను ఖర్చుచేస్తా. రష్యాను ఎదుర్కొనేలా ఉక్రెయిన్‌కు సాయపడతా’ వంటి వాగ్దానాలు ఈయనను నయా జర్మనీ నేతగా నిలబెట్టాయి.
రెండు విమానాలకు యజమాని
చాంధసవాదానికి, గ్రామ సమాజాలకు ప్రసిద్ధి చెందిన పశ్చిమ జర్మనీలోని బ్రిలాన్ పట్టణంలో 1955 నవంబర్ 11న మెర్జ్ జన్మించారు. కుటుంబానికి న్యాయవాద వృత్తి నేపథ్యం ఉంది. మెర్జ్ తండ్రి న్యాయమూర్తిగా సేవలందించారు. తర్వాత ఆయన సీడీయూ పార్టీలోనూ కొనసాగారు. మెర్జ్ సైతం న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. అంతకు ముందు 1975లో జర్మన్ సైన్యంలో సైనికుడిగా దేశసేవ చేశారు. 1985లో న్యాయవిద్యను పూర్తి చేసిన తర్వాత న్యాయమూర్తి అయ్యారు.
1986లో జడ్జి పదవికి రాజీనామా చేసి కార్పోరేట్ లాయర్ అవతారం ఎత్తారు. మూడేళ్లపాటు జర్మన్ రసాయనరంగ సంఘానికి ప్రైవేట్ లాయర్‌గా పనిచేశారు. 1981లో తోటి న్యాయవాది, ప్రస్తుతం న్యాయమూర్తిగా ఉన్న షార్లెట్ మెర్జ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. మెర్జ్ రాజకీయాల నుంచి విరామం తీసుకున్న దశాబ్దం పాటు అత్యంత విజయవంతమైన కార్పొరేట్ లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. అట్లాంటిక్ సంబంధాలను సమర్థించే లాబీ అయిన ‘అట్లాంటిక్–బీఆర్ 1/4కే’కు సారథ్యం వహించారు. పైలట్ శిక్షణా తీసుకున్నారు. ఈయనకు ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది. ఈయనకు సొంతంగా రెండు విమానాలు కూడా ఉన్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment