Coalition
-
Jharkhand: ‘గవర్నర్‌గారూ.. మా మెజార్టీ ఇది!’
రాంచీ: హేమంత్ సొరెన్ అరెస్ట్ వెంటనే జార్ఖండ్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఆలస్యం చేయకుండా జేఎంఎం సీనియర్ నేత చంపయ్ రాయ్‌ను లెజిస్టేటివ్ లీడర్‌గా ప్రకటించారు. కానీ, గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటునకు వెంటనే ఆహ్వానించలేదు. దీంతో తీవ్ర సస్పెన్స్ తర్వాత.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను చంపయ్ సొరెన్ కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు మెజారిటీ ఉందని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలిపారు. అంతేకాదు.. అప్పటికే తీసిన మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల వీడియోను గవర్నర్‌కు చూపించడం గమనార్హం. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్జేడీ)ల అధికార కూటమి చంపయ్ సొరెన్‌కు మద్దతు తెలుపుతున్న 43 మంది ఎమ్మెల్యేల వీడియోను విడుదల చేసింది. గవర్నర్‌ను చంపయ్ సొరెన్ కలవడానికి వెళ్లే ముందు ఎమ్మెల్యేలు వీడియో రికార్డింగ్ ద్వారా మద్దతు చెప్పించారు. महामहिम राज्यपाल जी बहुमत यंहा साफ-साफ बिना चश्मा को देखा जा सकता है। फिर भी नया सरकार का गठन में देरी किस बात का? जब विद्यायकों का समर्थन का लेटर आपके पास पहुंचा हुआ है, तो किस शुभ घड़ी का इंतज़ार कर रहे है आप? जनता को जवाब दे महामहिम @jhar_governor जी।#JharkhandCM pic.twitter.com/BNuc8jaHu2 — Md Furkan Ahmad (@Furkanjmm) February 1, 2024 ఆ వీడియోలో చంపయ్ సొరెన్‌తో పాటు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా, సీపీఐ (ఎంఎల్) ఎల్ ఎమ్మెల్యే వినోద్ సింగ్, ప్రదీప్ యాదవ్‌లు ఉన్నారు. సమావేశానంతరం చంపయ్ సొరెన్ మాట్లాడుతూ.. 'ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ సాధించి 22 గంటలైంది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారు.' అని అన్నారు. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో హేమంత్ సొరెన్ అరెస్టు కావడంతో చంపయ్ సొరెన్ వెంటనే సీఎంగా ప్రమాణం చేస్తారని అంతా భావించారు. కానీ, రాజ్‌భవన్ వద్ద నాటకీయ పరిణామాల నేపథ్యంలో అది వాయిదా పడుతూ వస్తోంది. ఇదీ చదవండి: Jarkhand Crisis: కొత్త సీఎంగా చంపయ్ సొరెన్ ఎంపికకు అసలు కారణం ఇదే? -
‘ఇండియా’ భేటీ వాయిదా
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్ర నేతల సమావేశం డిసెంబర్ మూడో వారానికి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలతో బిజీగా ఉన్నందున బుధవారం జరగాల్సిన భేటీకి రాలేకపో తున్నట్లు కూటమిలోని కొన్ని పార్టీల నేతలు అశక్తత వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇండియా కూటమి పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన నివాసంలో బుధవారం సాయంత్రం తలపెట్టిన సమావేశం మాత్రం కొనసాగనుంది. కూటమి అగ్ర నేతల సమావేశం డిసెంబర్ మూడో వారంలో అందరికీ అనుకూలమైన తేదీలో జరగనుందని ‘ఇండియా’ ప్రచార కమిటీ సభ్యుడు గుర్దీప్ సప్పాల్ తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో చర్చించనున్నారు. బుధవారం జరగాల్సిన భేటీకి తాము రాలేకపోతున్నట్లు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. బిహార్ సీఎం, జేడీయూ నితీశ్ కుమార్ అనారోగ్య కారణాలతో, తమిళనాడు సీఎం స్టాలిన్ తమ రాష్ట్రంపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో రాలేకపోతున్నట్లు తెలిపారని సప్పాల్ వివరించారు. -
కాంగ్రెస్ కూటమి ఒక దోపిడీ ముఠా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ కూటమి ఒక దోపిడీ ముఠా అని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. పార్లమెంటులో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా విపక్షా లు వ్యవహరించాయని, మణిపూర్ అంశంపై చర్చలు జరపాలని కాంగ్రెస్ గొడవ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కాంగ్రెస్‌కు తోకపార్టీల్లా వ్యవహరిస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని, ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు పొందడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రధాని సమాధానం కోసం పట్టుబట్టిన విపక్షాల నేతలు ఆయన మాట్లాడుతుంటే లోక్‌సభ నుంచి ఎందుకు పారిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. యోధుల త్యాగాలను స్మరించేలా విగ్రహాలు ఎంఐఎం పార్టీ ఒత్తిడికి లోబడి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బత్తిని మొగిలయ్య గౌడ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర మరుగున పడేలా చేశాయని డాక్టర్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నెహ్రూ, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాలవే చరిత్ర అన్నట్లు ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని కానిస్టిట్యూ షన్ క్లబ్లో బీజేపీ నాయకుడు తూళ్ల వీరేందర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన బత్తిని మొగిలయ్యగౌడ్ వర్ధంతి సభలో కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్, ఎంపీ లక్ష్మణ్ పాల్గొని ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి యోధుల విగ్రహాలు పెట్టడమేకాకుండా, వారి త్యాగాలను స్మరిస్తూ కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. రజాకార్ల పోకడలను కళ్లకు కట్టేలా సినిమా తీస్తున్న రజాకర్ సినిమా బృందాన్ని ఎంపీ లక్ష్మణ్ అభినందించారు. -
టీడీపీతో పొత్తు జనసేనకు నష్టం..సీట్లు చెరిసగం ఉండాలి:హరిరామజోగయ్య
సాక్షి, పశ్చిమగోదావరి: గత 14 ఏళ్ల టీడీపీ పాలనలో అవినీతి ఆరోపణలు, కుల ముద్ర, రంగా హత్య ఉదంతం వంటి నీలినీడలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీకి గత 14 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పథకాలు, మీడియా మద్దతు, చంద్రబాబు అనుభవం వంటి అంశాలు జనసేనకు లాభించినా.. అవినీతి ఆరోపణలు, రంగా హత్య వంటి ఉదంతాలను ప్రజలు మరచిపోలేదని పేర్కొన్నారు. బాబుకు వయోభారం, లోకేశ్‌కు అనుభవరాహిత్యం, కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో చిత్తశుద్ధి లోపించడం, బీసీలకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌కు స్పందించకపోవడం, ప్రధాని మోదీకి బాబు బద్ధశత్రువు కావడం వల్ల టీడీపీతో జత కలిస్తే జనసేనకు నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే సీట్ల సర్దుబాటులో చెరిసగంగా ఉండాలని తెలిపారు. లేకుంటే అసంతృప్తివాదులు పెరిగి ఓటింగ్ సమయంలో ఓట్లు చీలిపోయి మధ్యలో వైఎస్సార్సీపీ లబ్ధి పొందుతుందని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకొస్తే ముఖ్యమంత్రి పదవి పూర్తికాలం చంద్రబాబుకు కట్టబెడితే.. బాబు వద్ద పవన్ ప్యాకేజీ తీసుకున్నాడని, కాపు కులాన్ని టీడీపీకి తాకట్టు పెట్టాడంటూ వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుందని స్పష్టం చేశారు. అధికారం ఇద్దరూ చెరిసగం తీసుకోవాలని తెలిపారు. చదవండి: ఎస్.. వైనాట్ 175.. ఏపీలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ -
పొత్తుల్లేవ్.. అవగాహనే! అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరిగానే బీఆర్ఎస్!
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించడంపై దృష్టి సారించిన ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఈ ఏడాది చివరలో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో మూడోసారీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పారీ్టలతో బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకుని, పోటీ చేస్తుందనే వార్తల నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ మాత్రం ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు తెలిసింది. గత ఏడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం, సీపీఐ మద్దతు తీసుకున్న తరహాలోనే.. ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ రెండు పారీ్టలతో అవగాహనతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలతోపాటు మరికొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు కమ్యూనిస్టు పారీ్టలకు ఉన్న సంప్రదాయ ఓట్లు.. వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారుతాయని భావిస్తున్నట్టు సమాచారం. లెఫ్ట్ పార్టీలు సీట్లు కోరుతాయనే ప్రచారమున్నా.. సీపీఐ, సీపీఎం పార్టీలు పొత్తులో భాగంగా కనీసం రెండేసి అసెంబ్లీ స్థానాలను కోరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగిన బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్).. మూడోసారి కూడా ఒంటరిగానే 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో సీపీఎం, సీపీఐలకు పెద్దల సభలైన శాసన మండలి, రాజ్యసభ పదవులు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని సూత్రప్రాయంగా అవగాహన కుదిరిందని.. పోటీ, పొత్తులు, సీట్లు తదితరాలపై స్పష్టతకు కొంత సమయం పడుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. పనితీరు.. సర్వేలు.. నివేదికలు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలతోపాటు చిన్నాచితకా పారీ్టలు కూడా పాదయాత్రలు, సభలు, సమావేశాల పేరిట హడావుడి చేస్తుండటంతో.. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితులను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పడు మదింపు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే పలు సంస్థల సర్వేలతోపాటు నిఘా వర్గాల నివేదికలు కూడా తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో విపక్ష నేతల బలాబలాలను అంచనా వేస్తున్నారు. సిట్టింగ్‌లకే పార్టీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించినా.. గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కుతాయని ప్రస్తుతం సంకేతాలు ఇస్తున్నారు. సుమారు 40కిపైగా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు బలమైన నేతలు కూడా ఉండటంతో ఎవరికి టికెట్ దక్కుతుందనే అంశంపై స్థానిక కేడర్‌లో ఉత్కంఠ నెలకొంది. ఆయా చోట్ల టికెట్ల కేటాయింపు పార్టీ అధిష్టానానికి కూడా కత్తిమీద సాములా మారే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో గెలిచే సామర్థ్యం ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీ టికెట్ ఆశిస్తుండటంతో.. అవసరమైన చోట వారికి పోటీ అవకాశం దక్కనున్నట్టు వివరిస్తున్నాయి. అరడజను నియోజకవర్గాల్లో పూర్తిగా కొత్తవారికి లేదా ఇతర పారీ్టల్లోని బలమైన నేతలను చేర్చుకుని టికెట్ కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు పేర్కొంటున్నాయి. ఓటర్ల జాబితా వడపోతపై దృష్టి పారీ్టలో క్షేత్రస్థాయిలో ప్రతి వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్చార్జులను నియమించి, ఆ జాబితాలను పార్టీ కార్యాలయంలో అందజేయాలని సీఎం కేసీఆర్ సుమారు నాలుగు నెలల క్రితమే ఆదేశించారు. ఈ ప్రక్రియ ముందుకు సాగని నేపథ్యంలో త్వరలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఇన్చార్జుల నియామకానికి గడువు విధించే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు పార్టీ ఆదేశాల మేరకు కొందరు ఎమ్మెల్యేలు ఓటర్ల జాబితా వడపోతపై దృష్టి సారించారు. కొత్తగా నమోదైన ఓటర్లు, యువత, ఓటరు జాబితాలో పేరుండి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నవారి వివరాలను పోలింగ్ బూత్‌ల వారీగా సిద్దం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నాటి పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని.. పట్టణ ప్రాంతాల్లో కొత్తగా నమోదైన ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేందుకు మార్చి మొదటి వారంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చదవండి: ప్రత్యామ్నాయమా.. ఒంటరిపోరా! -
రష్యా ఆయిల్‌పై నియంత్రణకు మా కూటమిలో చేరండి: అమెరికా
న్యూఢిల్లీ: రష్యన్ ముడిచమురు రేటును నియంత్రించడం ద్వారా ఆ దేశ ఆదాయ మార్గాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న కూటమిలో చేరాలంటూ భారత్‌పై అమెరికా ఒత్తిడి మరింత పెంచుతోంది. భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన అమెరికా ఆర్థిక శాఖ సహాయ మంత్రి వాలీ అడెయెమో.. ప్రభుత్వ వర్గాలతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలతో పాటు ఈ అంశంపైనా చర్చించారు. రష్యా చమురు రేట్లకు చెక్ పెట్టడమనేది, దేశీయంగా ఇంధన ధరలను తగ్గించుకోవాలన్న భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని వాలీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు తత్సంబంధ వివరాలు అందిస్తున్నామని, దీనిపై చర్చలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను ఆర్థికంగా దిగ్బంధం చేసేందుకు .. అమెరికా తదితర దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రష్యాకు కీలక ఆదాయ వనరైన చమురు రేట్లను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు, అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా ఎగిసినప్పటికీ భారత్‌కు రష్యా డిస్కౌంటు రేటుకే చమురును అందిస్తోంది. దీంతో రష్యా నుంచి భారత్ చౌకగా చమురును కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు అమెరికా యత్నిస్తోంది. -
జేఎంఎం కూటమి జయకేతనం
రాంచీ/న్యూఢిల్లీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి మెజారిటీ సాధించింది. 81 స్థానాలున్న అసెంబ్లీలో 47 సీట్లను కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 25 స్థానాలకే పరిమితమైంది. కూటమిలో జేఎంఎం 30 స్థానాల్లో, కాంగ్రెస్ 16 సీట్లలో, ఆర్జేడీ ఒక స్థానంలో గెలుపొందాయి. ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి, బీజేపీ నేత రఘుబర్ దాస్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ ద్రౌపది ముర్ముకి అందించానని, కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని తనను కోరారని అనంతరం రఘుబర్ తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన జేఎంఎం కూటమికి, కూటమి సీఎం అభ్యర్థి హేమంత్ సోరెన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి విజయం సాధించడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్‌కు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ప్రతిష్టాత్మక జంషెడ్పూర్(ఈస్ట్) స్థానం నుంచి సీఎం రఘుబర్ దాస్ పోటీ చేశారు. ఆయనపై బీజేపీ రెబెల్ అభ్యర్థి సరయు రాయ్ గెలుపొందారు. జంషెడ్పూర్(వెస్ట్) నుంచి టికెట్ నిరాకరించడంతో సరయు రాయ్ ఇండిపెండెంట్‌గా జంషెడ్పూర్(ఈస్ట్) నుంచి బరిలో దిగారు. అసెంబ్లీ స్పీకర్ దినేశ్ ఓరాన్, పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు. విజయం అనంతరం జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ రాష్ట్ర ప్రజలకు, తన తండ్రి శిబూ సోరెన్‌కు, కూటమి పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్(ఏజేఎస్‌యూ) పార్టీ 2 సీట్లలో గెలుపొందింది. ఆ పార్టీ అధ్యక్షుడు సుదేశ్ మహతో 20 వేల మెజారిటీతో సిలీ స్థానం నుంచి గెలుపొందారు. జార్ఖండ్ వికాస్ మోర్చా– ప్రజా తాంత్రిక్(జేవీఎం–పీ) చీఫ్ బాబూలాల్ మరాండి ధన్వార్ స్థానం నుంచి గెలుపొందగా, ఆ పార్టీ మరో రెండు సీట్లనూ గెలుచుకుంది. రాంచి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సీపీ సింగ్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 33.53%, జేఎంఎంకు 19.29%, కాంగ్రెస్‌కు 13.78%, ఆర్జేడీకి 2.82%, ఏజేఎస్‌యూకి 8.15%, ఎంఐఎంకు 1.08% ఓట్లు లభించాయి. ముస్లింల జనాభా గణనీయంగా ఉన్న జార్ఖండ్‌లో సీఏఏ వ్యతిరేకత తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో ముస్లింలపై జరిగిన పలు మూకదాడులపై కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఏజేఎస్‌యూతో పొత్తు కుదుర్చుకోలేకపోవడం కూడా బీజేపీ ఓటమికి కారణంగా భావిస్తున్నారు. పీఎం మోదీ శుభాకాంక్షలు జార్ఖండ్ అసెంబ్లీ విజయం సాధించిన జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన హేమంత్, జేఎంఎం నేతృత్వంలోని కూటమికి అభినందనలు’ అని ట్వీట్ చేశారు. ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు జార్ఖండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఓటమి బీజేపీది కాదని, వ్యక్తిగతంగా తనదని ముఖ్యమంత్రి రఘుబర్ వ్యాఖ్యానించారు. సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజా తీర్పు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపై కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కార్యకర్తలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఉపాధి, నీరు, అడవి, వ్యవసాయం, వాణిజ్యం.. తదితర అంశాల్లో ప్రభుత్వ సాయాన్ని కోరుకుంటోంటే బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మాత్రం విభజన రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. అందుకే ప్రజలు ఈ తీర్పునిచ్చారని ఆమె ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల అహంకారాన్ని జార్ఖండ్ ప్రజలు నాశనం చేశారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. హేమంత్ సోరెన్‌కు టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తాజాగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ @ 7 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో సొంతంగా కానీ, కూటమితో కలిసి కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 7కి చేరింది. పంజాబ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిలో కాంగ్రెస్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకుని అధికారంలో భాగస్వామ్యం సాధించింది. తాజాగా జార్ఖండ్‌లో జేఎంఎం కూటమిలో చేరి విజయం సాధించింది. హేమంత్ నేపథ్యం జార్ఖండ్ ఎన్నికల్లో విజయం సాధించిన జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. గిరిజన పోరాటయోధుడు బిర్సా ముండాయే తనకు స్ఫూర్తి అని చెప్పుకునే హేమంత్.. కేంద్ర మాజీ మంత్రి, మూడుసార్లు జార్ఖండ్ సీఎంగా పనిచేసిన ఆదివాసీ నేత శిబూ సోరెన్ కుమారుడు. ► తల్లిదండ్రులు: రూపి, శిబూ సోరెన్ ► జననం: 1975 ఆగస్ట్ 10. ► స్వస్థలం: రామ్‌గఢ్ జిల్లా నేమ్రా గ్రామం, జార్ఖండ్ ► విద్య: ఇంటర్, ఇంజినీరింగ్ (డిస్కంటిన్యూ) ► హాబీలు: వంట చేయడం, క్రికెట్ ఆడటం ► భార్య: కల్పనా సోరెన్ రాజకీయ ప్రవేశం ► సోదరుడు దుర్గ హఠాన్మరణంతో హేమంత్ 2009లో జేఎంఎం పగ్గాలు చేపట్టారు. ► 2005లో తొలిసారి దుమ్కా స్థానం నుంచి ఎన్నికల బరిలోకి. జేఎంఎం తిరుగుబాటు నేత స్టీఫెన్ మరాండీ చేతిలో ఓటమి. ► 2009– 2010లో రాజ్యసభ సభ్యుడు. ► 2010లో జార్ఖండ్ డెప్యూటీ సీఎంగా బాధ్యతలు. ► 2013 జూలై 13న జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన ఎత్తివేసిన తరువాత కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో 2013 జూలై 15న సుమారు 38 ఏళ్లకే రాష్ట్రానికి అత్యంత చిన్న వయస్కుడైన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 డిసెంబర్ వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ► 2014 డిసెంబర్ 23న బార్‌హైత్ ఎమ్మెల్యేగా ఎన్నిక.. ప్రతిపక్ష నేతగా ఎంపిక. -
కాషాయ కూటమిదే మహారాష్ట్ర
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి విజయం సాధించింది. అయితే, బీజేపీ నేతలు ఆశించినంత, ఎగ్జిట్ పోల్స్ తేల్చినంత స్థాయిలో మెజారిటీ రాలేదు. ముఖ్యంగా సొంతంగానే మెజారిటీ సాధిస్తామనుకున్న బీజేపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి 161 సీట్లు, కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి 103 సీట్లు గెలుచుకున్నాయి. ఇతరులు 24 సీట్లలో విజయం సాధించారు. కాషాయ కూటమిలో బీజేపీ 105, శివసేన 56 స్థానాల్లో గెలుపు సాధించాయి. కాంగ్రెస్ 45, శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 54 సీట్లు గెలుచుకున్నాయి. 2014 ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేసిన బీజేపీ 122, శివసేన 63 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. ఫలితాల అనంతరం మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంచలన వ్యాఖ్య చేశారు. ‘ఈ ఫలితాలు ఒక ఆసక్తికర సంకీర్ణ అవకాశానికి తెరతీశాయి’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. శివసేనతో కలిసి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై ఆయన అలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మాత్రం వచ్చే ఐదేళ్లు బీజేపీ, శివసేన కూటమే అధికారంలో ఉంటుందని ప్రకటించారు. మరోవైపు, అధికారాన్ని సమానంగా పంచుకోవాలన్న 50: 50 ఫార్మూలాను శివసేన తెరపైకి తెచ్చింది. ఏ పార్టీ నేత ముఖ్యమంత్రి కానున్నారని గురువారం ఫలితాల అనంతరం సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను మీడియా ప్రశ్నించగా.. ‘కూటమి ఏర్పాటు సమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మా ఇంటికి వచ్చారు. అప్పుడు జరిగిన చర్చల్లో అధికారం సమానంగా పంచుకోవాలనే 50–50 ఫార్ములాకు ఆయన అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. ‘సీట్ల సర్దుబాటు సమయంలో బీజేపీ కన్నా తక్కువ సీట్లలో పోటీ చేసేందుకు అంగీకరించాం. కానీ ప్రతీసారీ అలా బీజేపీకి అవకాశం ఇవ్వలేం. మా పార్టీ కూడా విస్తరించాలి కదా’ అన్నారు. ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఫడణవీస్ మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2014 ఎన్నికల్లో 260 స్థానాల్లో పోటీ చేసి 122 సీట్లు గెలుపొందాం. ఈ సారి ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీ చేసి 105 సీట్లు గెలుచుకున్నాం. మా స్ట్రైక్‌రేట్ 2014లో 47% కాగా, ఈ సారి అది 70% అని ఫడణవీస్ వివరించారు. శివసేనతో అధికార పంపిణీకి సంబంధించి ఎన్నికల ముందు చర్చల సందర్భంగా ఏం నిర్ణయించామో.. అలాగే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా లాభపడిన పార్టీగా ఎన్సీపీ నిలిచింది. ఆ పార్టీ గతంలో కన్నా దాదాపు 13 సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. ఈ ఎన్నికలతో పాటే జరిగిన సతారా లోక్‌సభ ఉప ఎన్నికలో ఎన్సీపీ అభ్యర్థి, సిక్కిం మాజీ గవర్నర్ శ్రీనివాస్ పాటిల్ బీజేపీ అభ్యర్థి ఉదయన్‌రాజె భోసాలేపై విజయం సాధించారు. ఉదయన్‌రాజె ఎన్నికల ముందే ఎన్సీపీ నుంచి బీజేపీలోకి వెళ్లారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం సతారాలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రముఖుల్లో సీఎం ఫడణవీస్, శివసేన నేత ఆదిత్య ఠాక్రే, మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, మండలిలో విపక్ష నేత ధనుంజయ ముండే తదితరులున్నారు. ధనుంజయ తన కజిన్, బీజేపీ అభ్యర్థి, మంత్రి అయిన పంకజ ముండేపై విజయం సాధించారు. ఫడణవీస్ ప్రభుత్వంలోని దాదాపు ఐదుగురు మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముందు బీజేపీ, శివసేనల్లో చేరి టికెట్ సంపాదించిన వారిలో 19 మంది ఓడిపోయారు. ఫలితాల అనంతరం ఎన్సీపీ నేత శరద్ పవార్ మాట్లాడుతూ.. అధికార అహంకారాన్ని ప్రజలు సహించరని మరోసారి రుజువైందన్నారు. ప్రజలు తమను విపక్షంలోనే ఉండమన్నారని, అందువల్ల ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నించబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు ఆలోచనను శివసేన నేత సంజయ్ రౌత్ తోసిపుచ్చారు. బీజేపీ శివసేన కూటమి సునాయాసంగా డబుల్ సెంచరీ చేస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనా కూడా తప్పింది. -
కుమార స్వామి సర్కార్‌ను కూలదోయం : యడ్యూరప్ప
సాక్షి, బెంగళూర్ : కుమార స్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్‌ను కూలదోసేందుకు తమ పార్టీ సభ్యులెవరూ ప్రయత్నించడం లేదని బీజేపీ కర్ణాటక చీఫ్ బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. కర్ణాటకలో పాలక సంకీర్ణం, బీజేపీల మధ్య అధికారం కోసం పోరు జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతున్నారని ఇరు పక్షాలు పరస్పరం ఆరోపణలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఉన్న పాలక సంకీర్ణ ఎమ్మెల్యేలను బీజేపీ ఎలాంటి ప్రలోభాలకు గురిచేయడంలేదని మాజీ సీఎం యడ్యూరప్ప పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో విఫలమైన కాంగ్రెస్-జేడీఎస్ తమపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు తమ పార్టీ నేతలెవరూ ఎలాంటి ఆపరేషన్‌నూ చేపట్టడం లేదని పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒక చోట చేరితే వారెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, జేడీఎస్‌లో అంతర్గత పోరు అదుపుతప్పిందని, వారి అంతర్గత వైఫల్యాలకు బీజేపీని నిందించడం తగదని యడ్యూరప్ప హితవు పలికారు. -
సోనియాతో మమత భేటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు బలమైన కూటమి అవసరమని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ పేర్కొన్నారు. ఈ కూటమితో కాంగ్రెస్ కలిసి పనిచేయాలని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని కోరినట్లు ఆమె తెలిపారు. బుధవారం ఢిల్లీలో సోనియా గాంధీతో 20 నిమిషాలపాటు మమత సమావేశమయ్యారు. విపక్షాల ఐక్యకూటమిలో కాంగ్రెస్ చేరాలని సోనియాను కోరినట్లు ఆమె తెలిపారు. అందరూ ఏకమై పోరాడితే బీజేపీ కనుమరుగవటం ఖాయమని.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘దేశ రాజకీయాల్లో బీజేపీని లేకుండా చేయటమే మా తొలి అజెండా. ఇందుకోసం అన్ని శక్తులూ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ ప్రాంతీయ పార్టీ అయినా బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్తపడాలి. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ సహకరించుకోవాల’న్నారు. కాంగ్రెస్‌తో కలసి పనిచేసేందుకు తనకు ఇబ్బందుల్లే వని.. కానీ రాహుల్ గాంధీతోనే కొన్ని సమస్యలున్నట్లు సోనియాతో మమత పేర్కొన్నట్లు తెలిసింది. త్రిపుర ఎన్నికల్లో తృణమూల్‌తో కలసి పనిచేసేందుకు రాహుల్ నిరాకరించిన విషయాన్ని మమత గుర్తుచేశారు. బీజేపీ అసంతృప్త నేతలు యశ్వంత్ సిన్హా, శతృఘ్న సిన్హా, అరుణ్ శౌరీలనూ మమత కలిశారు. -
‘సంకీర్ణం’లోకి బ్రిటన్
పొదుపు చర్యలు, అస్థిరత, జాత్యహంకార ధోరణులు దేశాన్ని చుట్టుముట్టిన వేళ బ్రిటన్ పార్లమెంటుకు గురువారం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పినట్టే ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. 650 స్థానాలున్న హౌస్ ఆఫ్ కామన్స్‌లో అధికార కన్సర్వేటివ్ పార్టీ 218 స్థానాలకు పరిమితమై పది సీట్లు గెల్చుకున్న డెమొక్రటిక్ యూనియనిస్టు పార్టీ(డీయూపీ)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 326 స్థానా లుండాలి. డేవిడ్ కామెరాన్ నాయకత్వంలో రెండేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో కన్స ర్వేటివ్లు కనీస మెజారిటీ కంటే అదనంగా అయిదు స్థానాలను గెల్చుకున్నారని గుర్తుంచుకుంటే వారికున్న ప్రజాదరణ ఎలా దిగజారిందో అర్ధమవుతుంది. కొమ్ములు తిరిగిన రాజకీయ విశ్లేషకులు, కార్పొరేట్ మీడియా సంస్థలు ఖర్చు రాసేసిన లేబర్ పార్టీ ఎవరూ ఊహించనివిధంగా ఈ ఎన్నికల్లో 261 స్థానాలు కైవసం చేసుకుంది. 1997 తర్వాత ఆ పార్టీకి ఈ స్థాయిలో సీట్లు లభించడం ఇదే తొలిసారి. కన్సర్వేటివ్‌లకు ఎలాగోలా మళ్లీ అధికారానికి వచ్చి ఉండొచ్చుగానీ ఇది ఏ రకంగా చూసినా గెలుపు కాదు. వారి పాలనపై ప్రజలు ఏమాత్రం సంతృ ప్తికరంగా లేరని ఈ ఫలితాలు రుజువు చేశాయి. మొన్న ఏప్రిల్‌లో హఠాత్తుగా మధ్యంతర ఎన్నికల నిర్ణయం వెల్లడించినప్పుడు కన్సర్వేటివ్ పార్టీ అధినేత, ప్రధాని థెరిస్సా మే చేసిన ప్రకటన ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. యూరప్ యూనియన్(ఈయూ) నుంచి వెలుపలికొచ్చేందుకు జరిపే చర్చల్లో దృఢంగా వ్యవహరించడానికి తనకు ప్రజల నుంచి ‘నిర్ణయాత్మకమైన మద్దతు’ కావాలని ఆమె కోరారు. ఈయూలో కొనసాగాలా వద్దా అన్న అంశంపై నిరుడు జూన్‌లో నిర్వహించిన రిఫరెండంలో అత్యధికులు వెలుపలికి రావడానికే మద్దతు పలక డంతో అప్పటి ప్రధాని డేవిడ్ కామెరాన్ తన పదవికి రాజీనామా చేశాక మే ఆ పదవిలోకి వచ్చారు. పార్టీలో ఆమెకు ఒడిదుడుకులున్నాయి. పైగా ప్రత్యర్థి లేబర్ పార్టీ అంతఃకలహాలతో సతమతమవుతోంది. ఈ అదునులోనే ఎన్నికలకు వెళ్తే తనకు తిరుగుండదని ఆమె విశ్వసించారు. వాస్తవానికి మూడు నెలలక్రితం ఆమె ప్రజాదరణ గ్రాఫ్ దివ్యంగా ఉంది. కన్సర్వేటివ్‌లకు కనీసం 30 నుంచి 70 స్థానాల ఆధిక్యత లభిస్తుందని దాదాపు సర్వేలన్నీ అంచనా వేశాయి. మూడు వారాలక్రితం కూడా ప్రత్యర్థి లేబర్ పార్టీ కన్నా 20 పాయింట్ల ఆధిక్యతలో ఉన్నారు. కానీ రోజులు గడుస్తున్నకొద్దీ ఈ ఆదరణ కొడిగట్టడం ప్రారంభమైంది. చివరికొచ్చేసరికి ఇరు పార్టీల మధ్యా ఉన్న తేడా సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. ఈయూ నుంచి బ్రిటన్ వెలుపలికి రావడానికి వచ్చే ఏడాది మార్చి వరకూ గడువుంది. ఆ ప్రక్రియంతా సజావుగా పూర్తికావడానికి అవసరమైన చర్చలు త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది. అత్తెసరు మెజారిటీతో ఇదంతా సరిగా సాగక పోవచ్చునన్న భావనతోనే థెరిస్సా మే మధ్యంతర ఎన్నికల బాట పడితే... ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాధినేతగా బ్రెగ్జిట్ సంభాషణలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిత్రమేమంటే బ్రెగ్జిట్‌లో దృఢంగా ఉండటానికి అవసరమైన రాజ కీయ బలం కోసమే ఎన్నికలకు సిద్ధపడ్డానన్న థెరిస్సా మే తన ప్రచారంలో దాని జోలికి పెద్దగా పోలేదు. అటు బ్రెగ్జిట్ ఇక తిరగదోడలేని అంశమంటూనే ఈయూ నుంచి బయటికొచ్చినా దేశం ఉమ్మడి మార్కెట్వైపే మొగ్గు చూపాలని ప్రతి పాదించిన లేబర్ పార్టీ నేత కోర్బిన్ కూడా దాన్ని ఎన్నికల అంశంగా మార్చలేదు. బ్రెగ్జిట్‌ను బలంగా వ్యతిరేకించడమేకాక, తమకు అధికారం అప్పగిస్తే దానిపై మరో రిఫరెండం నిర్వహించి ఈయూలో కొనసాగేలా చూస్తామన్న లిబరల్ డెమొ క్రాట్లకు ఘోరపరాభవం జరిగింది. ఆ పార్టీకి నాలుగే స్థానాలు లభించాయి. బ్రెగ్జిట్ రిఫరెండంలో కీలకపాత్ర పోషించిన యూకే ఇండిపెండెంట్స్ పార్టీ (యూకే ఐపీ) గత ఎన్నికల్లో సంపాదించుకున్న ఒక్క స్థానాన్నీ ఈసారి కోల్పోయింది. అధికార పీఠం అందుకోలేకపోయినా మళ్లీ గణనీయంగా పుంజుకున్న లేబర్ పార్టీ గురించి ప్రస్తావించుకోవాలి. నయా ఉదారవాద విధానాలను నిశితంగా విమర్శించడంలో, సంపన్నులపై అధిక పన్నులు విధించాలనడంలో దూకుడుగా ఉండే ఆ పార్టీ నేత జరిమీ కోర్బిన్‌ను జనం విశ్వసించారు. అయితే ఆ పార్టీకి జనం అధికారం కట్టబెట్టకపోవడానికి కారణముంది. టోనీ బ్లెయిర్, గోర్డాన్ బ్రౌన్ల పాలనలో ఆ పార్టీ మూటగట్టుకున్న అప్రదిష్ట, దుష్కీర్తి అంతా ఇంతా కాదు. బ్లెయిర్ ప్రధానిగా ఉన్నప్పుడు అమెరికాకు దాసోహమై, దాని ప్రయోజనాలను నెరవేర్చడమే ధ్యేయంగా ఉద్దేశపూర్వకంగా ఇరాక్‌పై కట్టుకథలల్లి దేశాన్ని యుద్ధం లోకి దించారు. పర్యవసానంగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. నిరుద్యోగం పెరిగింది. ధరలు ఆకాశాన్నంటాయి. పలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పర మయ్యాయి. వీటన్నిటినీ బ్రిటన్ ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేకపోయారు. అయితే అందరికీ చదువు, ఆవాసం, ఆరోగ్య సేవలు, పింఛన్లకు రక్షణ వంటి లేబర్ హామీలు వారిని ఆకట్టుకున్నాయి. మౌలిక సదుపాయాల రంగంలో కీలక విభా గాలను జాతీయం చేస్తామన్న కోర్బిన్ వాగ్దానం ప్రజలకు నచ్చింది. ఉగ్రవాదానికి అణచివేత పరిష్కారం కాదనీ, దానికి దారితీస్తున్న మూల కారణాలను సరిచేయా లని కోర్బిన్ వాదించాడు. అయితే బ్లెయిర్ కాలంనాటి ఉదారవాద విధానాల మత్తులోనే ఉండిపోయిన పార్టీలోని ఇతర నేతలు కోర్బిన్ పార్టీని దివాలా తీయి స్తాడని హడలెత్తారు. ఆయనకు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. ఇక కార్పొ రేట్ మీడియా సంగతి సరేసరి. ఆయన అధినేత కావడం ఆ పార్టీకి శాపమన్నట్టు ప్రచారం చేశాయి. ఈ ఎన్నికలు ఆయనను ప్రధాని చేయలేకపోవచ్చుగానీ పార్టీలో తిరుగులేని నేతగా మార్చాయి. కోర్బిన్‌కు ఇక ఎదురుండదు. మొత్తంగా చూస్తే బ్రిటన్ రాగల కాలంలో మరిన్ని సంక్షోభాలను ఎదుర్కొనవలసి రావొచ్చు. మరో సారి మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యంలేదు. ప్రపంచం రానురాను జాతీయ వాదంవైపు, సంకుచిత ధోరణులవైపు పయనిస్తున్నదని నిరాశపడేవారికి ఈ ఎన్ని కల ఫలితాలు ఊరటనిస్తాయనడంలో సందేహం లేదు. -
గూగుల్, ఉబర్ ల మధ్య ఒప్పందం
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రమోట్ చేయడానికి గూగుల్, ఉబర్ ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ రెండు కంపెనీలు సంకీర్ణంగా పనిచేయనున్నట్టు మంగళవారం ప్రకటించాయి. దీంతోపాటు ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఫోర్డ్, వోల్వో లు కూడా ఈ సేప్టీ డ్రైవింగ్ కార్ల టెక్నాలజీ ప్రమోషన్ లో భాగస్వాములు కానున్నాయి. ఈ ఒప్పందానికి మాజీ అమెరికా నేషనల్ జాతీయరహదారుల ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ అధికారి డేవిడ్ స్ట్రిక్ ల్యాండ్ అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో అమెరికన్ రహదారులు సురక్షితంగా, తక్కువ రద్దీగా మారుతాయని స్ట్రిక్ ల్యాండ్ చెప్పారు. ఫెడరల్ స్టాండర్డ్స్ కు అనుకూలంగా టెక్నాలజీ ప్రమోట్ ఆవిష్కరణను తీసుకొచ్చామని, విధాన నిర్ణేతలతో కలిసి సెల్ఫ్ డ్రైవింగ్ వెహికిల్స్ ను విస్తరించేందుకు తోడ్పడాలని పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికిల్స్ చెక్ పెడతాయని, ప్రమాదాలు చాలా తగ్గుతాయని చెప్పారు. -
మహారాష్ట్రలో సంకీర్ణం!
ముంబై: మహారాష్ట్రలో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశంలేదు. బీజేపీ ఎక్కువ స్థానాలలో మెజార్టీలో ఉంది. అయితే ఆ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడంలేదు. శివసేన రెండవ స్థానంలో ఉంది. మూడవ స్థానం కోసం కాంగ్రెస్, ఎన్సీపి పోటీ పడుతున్నాయి. రాజ్ ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ సమితి(ఎంఎన్ఎస్) 4 స్థానాలలో మాత్రమే ఆధిక్యతలో ఉంది. హర్యానాలో బీజేపీ 51 స్థానాలలో లీడింగ్‌తో మెజార్టీ స్థానాలు గెలుచుకునే దిశగా వెళుతోంది. ఇక్కడ బీజేపి ఎవరి మద్దతులేకుండా ప్రభుత్వాన్ని ఏర్పరిచే స్థాయికి ఎందిగింది. ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఆ పార్టీకి పరాభవమే మిగిలింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆధిక్యతలో ఉన్న పార్టీల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం: మహారాష్ట్రలో మొత్తం స్థానాలు - 288 బీజేపీ ఆధిక్యం - 108 శివసేన - 65 కాంగ్రెస్ - 50 ఎన్సీపి- 43 ఎంఎన్ఎస్ 4 ఇతరులు - 18 హర్యానాలో మొత్తం స్థానాలు - 90 బీజేపీ ఆధిక్యం - 48 కాంగ్రెస్ - 14 ఐఎన్ఎల్డీ- 20 హెచ్జేసీ - 03 ఇతరులు - 5 **