విజయ సంకేతం చూపుతున్న సీఎం ఫడ్నవీస్, ఆఠవలే, చంద్రకాంత్ పాటిల్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి విజయం సాధించింది. అయితే, బీజేపీ నేతలు ఆశించినంత, ఎగ్జిట్ పోల్స్ తేల్చినంత స్థాయిలో మెజారిటీ రాలేదు. ముఖ్యంగా సొంతంగానే మెజారిటీ సాధిస్తామనుకున్న బీజేపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి 161 సీట్లు, కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి 103 సీట్లు గెలుచుకున్నాయి. ఇతరులు 24 సీట్లలో విజయం సాధించారు. కాషాయ కూటమిలో బీజేపీ 105, శివసేన 56 స్థానాల్లో గెలుపు సాధించాయి.
కాంగ్రెస్ 45, శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 54 సీట్లు గెలుచుకున్నాయి. 2014 ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేసిన బీజేపీ 122, శివసేన 63 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. ఫలితాల అనంతరం మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంచలన వ్యాఖ్య చేశారు. ‘ఈ ఫలితాలు ఒక ఆసక్తికర సంకీర్ణ అవకాశానికి తెరతీశాయి’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. శివసేనతో కలిసి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై ఆయన అలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మాత్రం వచ్చే ఐదేళ్లు బీజేపీ, శివసేన కూటమే అధికారంలో ఉంటుందని ప్రకటించారు. మరోవైపు, అధికారాన్ని సమానంగా పంచుకోవాలన్న 50: 50 ఫార్మూలాను శివసేన తెరపైకి తెచ్చింది. ఏ పార్టీ నేత ముఖ్యమంత్రి కానున్నారని గురువారం ఫలితాల అనంతరం సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను మీడియా ప్రశ్నించగా.. ‘కూటమి ఏర్పాటు సమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మా ఇంటికి వచ్చారు. అప్పుడు జరిగిన చర్చల్లో అధికారం సమానంగా పంచుకోవాలనే 50–50 ఫార్ములాకు ఆయన అంగీకారం తెలిపారు.
ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. ‘సీట్ల సర్దుబాటు సమయంలో బీజేపీ కన్నా తక్కువ సీట్లలో పోటీ చేసేందుకు అంగీకరించాం. కానీ ప్రతీసారీ అలా బీజేపీకి అవకాశం ఇవ్వలేం. మా పార్టీ కూడా విస్తరించాలి కదా’ అన్నారు. ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఫడణవీస్ మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2014 ఎన్నికల్లో 260 స్థానాల్లో పోటీ చేసి 122 సీట్లు గెలుపొందాం. ఈ సారి ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీ చేసి 105 సీట్లు గెలుచుకున్నాం. మా స్ట్రైక్‌రేట్ 2014లో 47% కాగా, ఈ సారి అది 70% అని ఫడణవీస్ వివరించారు.
శివసేనతో అధికార పంపిణీకి సంబంధించి ఎన్నికల ముందు చర్చల సందర్భంగా ఏం నిర్ణయించామో.. అలాగే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా లాభపడిన పార్టీగా ఎన్సీపీ నిలిచింది. ఆ పార్టీ గతంలో కన్నా దాదాపు 13 సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. ఈ ఎన్నికలతో పాటే జరిగిన సతారా లోక్‌సభ ఉప ఎన్నికలో ఎన్సీపీ అభ్యర్థి, సిక్కిం మాజీ గవర్నర్ శ్రీనివాస్ పాటిల్ బీజేపీ అభ్యర్థి ఉదయన్‌రాజె భోసాలేపై విజయం సాధించారు. ఉదయన్‌రాజె ఎన్నికల ముందే ఎన్సీపీ నుంచి బీజేపీలోకి వెళ్లారు.
ప్రధాని నరేంద్రమోదీ సైతం సతారాలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రముఖుల్లో సీఎం ఫడణవీస్, శివసేన నేత ఆదిత్య ఠాక్రే, మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, మండలిలో విపక్ష నేత ధనుంజయ ముండే తదితరులున్నారు. ధనుంజయ తన కజిన్, బీజేపీ అభ్యర్థి, మంత్రి అయిన పంకజ ముండేపై విజయం సాధించారు. ఫడణవీస్ ప్రభుత్వంలోని దాదాపు ఐదుగురు మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు.
ఎన్నికల ముందు బీజేపీ, శివసేనల్లో చేరి టికెట్ సంపాదించిన వారిలో 19 మంది ఓడిపోయారు. ఫలితాల అనంతరం ఎన్సీపీ నేత శరద్ పవార్ మాట్లాడుతూ.. అధికార అహంకారాన్ని ప్రజలు సహించరని మరోసారి రుజువైందన్నారు. ప్రజలు తమను విపక్షంలోనే ఉండమన్నారని, అందువల్ల ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నించబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు ఆలోచనను శివసేన నేత సంజయ్ రౌత్ తోసిపుచ్చారు. బీజేపీ శివసేన కూటమి సునాయాసంగా డబుల్ సెంచరీ చేస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనా కూడా తప్పింది.
Comments
Please login to add a commentAdd a comment