
శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలతో మమత
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు బలమైన కూటమి అవసరమని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ పేర్కొన్నారు. ఈ కూటమితో కాంగ్రెస్ కలిసి పనిచేయాలని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని కోరినట్లు ఆమె తెలిపారు. బుధవారం ఢిల్లీలో సోనియా గాంధీతో 20 నిమిషాలపాటు మమత సమావేశమయ్యారు. విపక్షాల ఐక్యకూటమిలో కాంగ్రెస్ చేరాలని సోనియాను కోరినట్లు ఆమె తెలిపారు. అందరూ ఏకమై పోరాడితే బీజేపీ కనుమరుగవటం ఖాయమని.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
‘దేశ రాజకీయాల్లో బీజేపీని లేకుండా చేయటమే మా తొలి అజెండా. ఇందుకోసం అన్ని శక్తులూ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ ప్రాంతీయ పార్టీ అయినా బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్తపడాలి. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ సహకరించుకోవాల’న్నారు. కాంగ్రెస్‌తో కలసి పనిచేసేందుకు తనకు ఇబ్బందుల్లే వని.. కానీ రాహుల్ గాంధీతోనే కొన్ని సమస్యలున్నట్లు సోనియాతో మమత పేర్కొన్నట్లు తెలిసింది. త్రిపుర ఎన్నికల్లో తృణమూల్‌తో కలసి పనిచేసేందుకు రాహుల్ నిరాకరించిన విషయాన్ని మమత గుర్తుచేశారు. బీజేపీ అసంతృప్త నేతలు యశ్వంత్ సిన్హా, శతృఘ్న సిన్హా, అరుణ్ శౌరీలనూ మమత కలిశారు.