జాతీయ స్థాయిలో విపక్ష ఇండియా కూటమికి నేతృత్వం వహించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. బెంగాలీ న్యూస్ ఛానల్ న్యూస్ 18 బంగ్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు. అవకాశం వస్తే తాను ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తానని తెలిపారు. అయితే బెంగాల్ సీఎం పదవిని మాత్రం వదులుకోనని ఆమె స్పష్టం చేశారు.
రెండు పాత్రలకు న్యాయం చేస్తా
బెంగాల్ సీఎంగా, విపక్ష కూటమి నాయకురాలిగా రెండు పాత్రలకు న్యాయం చేయగలనని మమతా బెనర్జీ దీమా వ్యక్తం చేశారు. ‘ఇండియా కూటమిని నేనే స్థాపించా. దాన్ని నడిపించాల్సిన బాధ్యత నాయకత్వ స్థానంలో ఉన్నవారిపై ఉంటుంది. వారలా చేయలేకపోతే నేనేం చేయగలను? ప్రతీ ఒక్కరిని కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది’ అని మమత అన్నారు. ‘దీదీ’ ప్రకటన దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అందుకే కూటమికి దూరమయ్యారా?
ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలవకుండా మమత ఒంటరిగా పోటీ చేశారు. మొదటి నుంచి విపక్ష కూటమిలో కీలకపాత్ర పోషించిన ఆమె చివరి నిమిషంలో పక్కకు తప్పుకోవడంపై అప్పట్లో హాట్‌టాపిక్ అయింది. ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలు తనకు అప్పగించడానికి కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఒప్పుకోకపోవడం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఒంటరిగా బరిలోకి దిగారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే సీట్ల పంపకంలో తేడాలు రావడం వల్లే తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు తృణమూల్ కాంగ్రెస్ అప్పట్లో వివరణ ఇచ్చింది. మమతా బెనర్జీని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినప్పటికీ తాను అడిగినన్ని సీట్లు ఇవ్వలేదనే సాకుతో మమత సింగిల్‌గానే పోటీ చేశారు. ఇండియా కూటమి గెలిస్తే కచ్చితంగా మద్దతు ఇస్తానని ప్రకటించి తనదారి తాను చూసుకున్నారు. కాగా, బెంగాల్లో 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
మమతకు పగ్గాలు అప్పగిస్తారా?
ఇండియా కూటమి నడిపించేందుకు సిద్ధమని మమతా బెనర్జీ తాజాగా తనకు తానుగా ప్రకటన చేయడం ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రస్తుతం ఇండియా కూటమి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 101 స్థానాలను దక్కించుకున్న హస్తం పార్టీ ఇండియా కూటమిలో అతి పెద్ద భాగస్వామిగా ఉంది. 37 ఎంపీలను కలిగిన సమాజ్‌వాదీ పార్టీ రెండో పెద్ద భాగస్వామిగా కొనసాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, శివసేన (యూబీటీ) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. హరియాణాలో అనూహ్యంగా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది.
చదవండి: మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్.. యూబీటీ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం
మమతకు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు
ఈ నేపథ్యంలో ఇండియా కూటమిని బలోపేతం చేసే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు మమతా బెనర్జీకి సమాజ్‌వాదీ పార్టీ సూచనప్రాయంగా మద్దతు ప్రకటించింది. ‘ఇండియా కూటమి నాయకురాలిగా మమతా బెనర్జీ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆమెకు మద్దతు ఇవ్వాలి. కూటమి బలోపేతం కావడానికి ఇది దోహదపడుతుంది. బెంగాల్‌లో బీజేపీని నిలువరించడంలో మమత కీలకపాత్ర పోషించారు. ఆమె పట్ల మాకు సానుభూతి ఉంది. చాలా కాలం నుంచి ఆమెతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయ’ని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉదయ్ వీర్ సింగ్ మీడియాతో అన్నారు. కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మమత వారసుడు అతడేనా?
ఇదిలావుంటే తన రాజకీయ వారసుడి ఎంపికపై మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. పార్టీ నాయకత్వం అంతా కలిసి తన రాజకీయ వారసుడిని ఎంపిక చేస్తుందని ఆమె చెప్పారు. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మమత తర్వాత పార్టీ పగ్గాలు ఆయనకే అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఆయననే ఎక్కువగా టార్గెట్ చేయడంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్టయింది.
Comments
Please login to add a commentAdd a comment