ముంబై: ప్రతిపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. కూటమి పార్టీలకు పరస్పరం పొసగడం లేదు. ఈ నేపథ్యంలో కూటమి భవిష్యత్తు గురించి కొత్త చర్చ మొదలైంది. కూటమిలో అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ తీరు పట్ల మిత్రపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, కూటమి నాయకత్వం మార్చాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో బెంగాల్ సీఎం మమతపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ సుప్రియా సూలే తాజాగా మాట్లాడుతూ.. ఇండియా కూటమి బాధ్యతలు మమతా బెనర్జీ తీసుకుంటే మంచిదే. మమతా బెనర్జీ ఇండియా కూటమిలోనే ఉన్నారు. శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి పెద్ద పాత్ర ఉంది. అలాగే, బాధ్యత కూడా ఉంది. కాబట్టి మమత.. మరింత బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారు. ఇది మంచి పరిణామం అని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బెంగాల్‌లో బీజేపీకి అధికారం ఇవ్వకుండా మమతా బెనర్జీ పాలన కొనసాగిస్తున్నారు. మంచి సంక్షేమ పథకాలను అమలు చేసిన విజయవంతమైన మోడల్‌ను చూపించారు. ఆమె ఎన్నికల అనుభవం, పోరాట పటిమతో మోదీ సైతం తేలిపోయారు. ఇండియా కూటమి బాధ్యతలు ఆమె తీసుకోవడం మంచి పరిణామమే అవుతుంది. మా సీనియర్ నాయకులు కలిసి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ వరుస పరాజయాలను చవిచూడటం, ఒంటరిగా పోటీ చేయడంపై పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మమత మాట్లాడుతూ..‘ఇండియా కూటమి తీరు సరిగా లేదు. కూటమి సారథ్య బాధ్యతలకు సిద్ధం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, కూటమి అధినేతగా కొనసాగడం కష్టమేమీ కాదు. ఆ సామర్థ్యం నాకుంది. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి కూటమి ఏర్పాటు చేశా. ప్రస్తుత సారథులు దాన్ని సమర్థంగా నడిపించగలరో లేదో వాళ్లే చెప్పాలి. లేదంటే ప్రత్యామ్నాయం చూడాలి. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలన్నదే నా సూచన అని చెప్పారు.
అయితే, ఇండియా కూటమిలో మమతా బెనర్జీకి ఇప్పటికే పలు పార్టీల నేతలు మద్దతుగా నిలిచారు. దీంతో, మమతకే బాధ్యతలు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు.. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు నిలిచి మమత విజయాలు సాధించడం కూడా ఆమె నాయకత్వానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను టార్గెట్ చేసి.. ఇండియా కూటమిలో మమత రాజకీయం ఎలా ఉండనుంది అనేది ఆసక్తికరంగా మారింది. కూటమిలో మెజార్టీ నేతలు ఆమె నాయకత్వాన్ని అంగీకరిస్తారా అనే చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment