పొత్తుల్లేవ్‌.. అవగాహనే! అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరిగానే బీఆర్‌ఎస్‌! | KCR BRS To Contest Alone In Telangana Assembly Elections | Sakshi
Sakshi News home page

పొత్తుల్లేవ్‌.. అవగాహనే! అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరిగానే బీఆర్‌ఎస్‌!

Published Wed, Feb 15 2023 8:11 AM | Last Updated on Wed, Feb 15 2023 11:50 AM

KCR BRS To Contest Alone In Telangana Assembly Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  భారత్‌ రాష్ట్ర సమితి కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించడంపై దృష్టి సారించిన ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఈ ఏడాది చివరలో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయంతో మూడోసారీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పారీ్టలతో బీఆర్‌ఎస్‌ పొత్తు కుదుర్చుకుని, పోటీ చేస్తుందనే వార్తల నేపథ్యంలో.. సీఎం కేసీఆర్‌ మాత్రం ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు తెలిసింది.

గత ఏడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం, సీపీఐ మద్దతు తీసుకున్న తరహాలోనే.. ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ రెండు పారీ్టలతో అవగాహనతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలతోపాటు మరికొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు కమ్యూనిస్టు పారీ్టలకు ఉన్న సంప్రదాయ ఓట్లు.. వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారుతాయని భావిస్తున్నట్టు సమాచారం. 

లెఫ్ట్‌ పార్టీలు సీట్లు కోరుతాయనే ప్రచారమున్నా.. 
సీపీఐ, సీపీఎం పార్టీలు పొత్తులో భాగంగా కనీసం రెండేసి అసెంబ్లీ స్థానాలను కోరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగిన బీఆర్‌ఎస్‌ (గతంలో టీఆర్‌ఎస్‌).. మూడోసారి కూడా ఒంటరిగానే 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో సీపీఎం, సీపీఐలకు పెద్దల సభలైన శాసన మండలి, రాజ్యసభ పదవులు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని సూత్రప్రాయంగా అవగాహన కుదిరిందని.. పోటీ, పొత్తులు, సీట్లు తదితరాలపై స్పష్టతకు కొంత సమయం పడుతుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. 

పనితీరు.. సర్వేలు.. నివేదికలు 
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలతోపాటు చిన్నాచితకా పారీ్టలు కూడా పాదయాత్రలు, సభలు, సమావేశాల పేరిట హడావుడి చేస్తుండటంతో.. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితులను సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పడు మదింపు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే పలు సంస్థల సర్వేలతోపాటు నిఘా వర్గాల నివేదికలు కూడా తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో విపక్ష నేతల బలాబలాలను అంచనా వేస్తున్నారు. సిట్టింగ్‌లకే పార్టీ టికెట్లు ఇస్తామని కేసీఆర్‌ పలు సందర్భాల్లో ప్రకటించినా.. గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కుతాయని ప్రస్తుతం సంకేతాలు ఇస్తున్నారు.

సుమారు 40కిపైగా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతోపాటు బలమైన నేతలు కూడా ఉండటంతో ఎవరికి టికెట్‌ దక్కుతుందనే అంశంపై స్థానిక కేడర్‌లో ఉత్కంఠ నెలకొంది. ఆయా చోట్ల టికెట్ల కేటాయింపు పార్టీ అధిష్టానానికి కూడా కత్తిమీద సాములా మారే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో గెలిచే సామర్థ్యం ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీ టికెట్‌ ఆశిస్తుండటంతో.. అవసరమైన చోట వారికి పోటీ అవకాశం దక్కనున్నట్టు వివరిస్తున్నాయి. అరడజను నియోజకవర్గాల్లో పూర్తిగా కొత్తవారికి లేదా ఇతర పారీ్టల్లోని బలమైన నేతలను చేర్చుకుని టికెట్‌ కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు పేర్కొంటున్నాయి. 

ఓటర్ల జాబితా వడపోతపై దృష్టి 
పారీ్టలో క్షేత్రస్థాయిలో ప్రతి వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జులను నియమించి, ఆ జాబితాలను పార్టీ కార్యాలయంలో అందజేయాలని సీఎం కేసీఆర్‌ సుమారు నాలుగు నెలల క్రితమే ఆదేశించారు. ఈ ప్రక్రియ ముందుకు సాగని నేపథ్యంలో త్వరలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఇన్‌చార్జుల నియామకానికి గడువు విధించే అవకాశం ఉందని చెప్తున్నారు.

మరోవైపు పార్టీ ఆదేశాల మేరకు కొందరు ఎమ్మెల్యేలు ఓటర్ల జాబితా వడపోతపై దృష్టి సారించారు. కొత్తగా నమోదైన ఓటర్లు, యువత, ఓటరు జాబితాలో పేరుండి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నవారి వివరాలను పోలింగ్‌ బూత్‌ల వారీగా సిద్దం చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నాటి పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని.. పట్టణ ప్రాంతాల్లో కొత్తగా నమోదైన ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు.

మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేందుకు మార్చి మొదటి వారంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
చదవండి: ప్రత్యామ్నాయమా.. ఒంటరిపోరా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement