‘సంకీర్ణం’లోకి బ్రిటన్‌ | Britain government into 'coalition' | Sakshi
Sakshi News home page

‘సంకీర్ణం’లోకి బ్రిటన్‌

Published Sat, Jun 10 2017 1:06 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

‘సంకీర్ణం’లోకి బ్రిటన్‌

‘సంకీర్ణం’లోకి బ్రిటన్‌

పొదుపు చర్యలు, అస్థిరత, జాత్యహంకార ధోరణులు దేశాన్ని చుట్టుముట్టిన వేళ బ్రిటన్‌ పార్లమెంటుకు గురువారం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ జోస్యం చెప్పినట్టే ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. 650 స్థానాలున్న హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో అధికార కన్సర్వేటివ్‌ పార్టీ 218 స్థానాలకు పరిమితమై పది సీట్లు గెల్చుకున్న డెమొక్రటిక్‌ యూనియనిస్టు పార్టీ(డీయూపీ)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 326 స్థానా లుండాలి. డేవిడ్‌ కామెరాన్‌ నాయకత్వంలో రెండేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో కన్స ర్వేటివ్‌లు కనీస మెజారిటీ కంటే అదనంగా అయిదు స్థానాలను గెల్చుకున్నారని గుర్తుంచుకుంటే వారికున్న ప్రజాదరణ ఎలా దిగజారిందో అర్ధమవుతుంది.

కొమ్ములు తిరిగిన రాజకీయ విశ్లేషకులు, కార్పొరేట్‌ మీడియా సంస్థలు ఖర్చు రాసేసిన లేబర్‌ పార్టీ ఎవరూ ఊహించనివిధంగా ఈ ఎన్నికల్లో 261 స్థానాలు కైవసం చేసుకుంది. 1997 తర్వాత ఆ పార్టీకి ఈ స్థాయిలో సీట్లు లభించడం ఇదే తొలిసారి. కన్సర్వేటివ్‌లకు ఎలాగోలా మళ్లీ అధికారానికి వచ్చి ఉండొచ్చుగానీ ఇది ఏ రకంగా చూసినా గెలుపు కాదు. వారి పాలనపై ప్రజలు ఏమాత్రం సంతృ ప్తికరంగా లేరని ఈ ఫలితాలు రుజువు చేశాయి.

మొన్న ఏప్రిల్‌లో హఠాత్తుగా మధ్యంతర ఎన్నికల నిర్ణయం వెల్లడించినప్పుడు కన్సర్వేటివ్‌ పార్టీ అధినేత, ప్రధాని థెరిస్సా మే చేసిన ప్రకటన ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. యూరప్‌ యూనియన్‌(ఈయూ) నుంచి వెలుపలికొచ్చేందుకు జరిపే చర్చల్లో దృఢంగా వ్యవహరించడానికి తనకు ప్రజల నుంచి ‘నిర్ణయాత్మకమైన మద్దతు’ కావాలని ఆమె కోరారు. ఈయూలో కొనసాగాలా వద్దా అన్న అంశంపై నిరుడు జూన్‌లో నిర్వహించిన రిఫరెండంలో అత్యధికులు వెలుపలికి రావడానికే మద్దతు పలక డంతో అప్పటి ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ తన పదవికి రాజీనామా చేశాక మే ఆ పదవిలోకి వచ్చారు. పార్టీలో ఆమెకు ఒడిదుడుకులున్నాయి. పైగా ప్రత్యర్థి లేబర్‌ పార్టీ అంతఃకలహాలతో సతమతమవుతోంది. ఈ అదునులోనే ఎన్నికలకు వెళ్తే తనకు తిరుగుండదని ఆమె విశ్వసించారు. వాస్తవానికి మూడు నెలలక్రితం ఆమె ప్రజాదరణ గ్రాఫ్‌ దివ్యంగా ఉంది. కన్సర్వేటివ్‌లకు కనీసం 30 నుంచి 70 స్థానాల ఆధిక్యత లభిస్తుందని దాదాపు సర్వేలన్నీ అంచనా వేశాయి. మూడు వారాలక్రితం కూడా ప్రత్యర్థి లేబర్‌ పార్టీ కన్నా 20 పాయింట్ల ఆధిక్యతలో ఉన్నారు. కానీ రోజులు గడుస్తున్నకొద్దీ ఈ ఆదరణ కొడిగట్టడం ప్రారంభమైంది. చివరికొచ్చేసరికి ఇరు పార్టీల మధ్యా ఉన్న తేడా సింగిల్‌ డిజిట్‌కు పడిపోయింది.

ఈయూ నుంచి బ్రిటన్‌ వెలుపలికి రావడానికి వచ్చే ఏడాది మార్చి వరకూ గడువుంది. ఆ ప్రక్రియంతా సజావుగా పూర్తికావడానికి అవసరమైన చర్చలు త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది. అత్తెసరు మెజారిటీతో ఇదంతా సరిగా సాగక పోవచ్చునన్న భావనతోనే థెరిస్సా మే మధ్యంతర ఎన్నికల బాట పడితే... ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాధినేతగా బ్రెగ్జిట్‌ సంభాషణలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిత్రమేమంటే బ్రెగ్జిట్‌లో దృఢంగా ఉండటానికి అవసరమైన రాజ కీయ బలం కోసమే ఎన్నికలకు సిద్ధపడ్డానన్న థెరిస్సా మే తన ప్రచారంలో దాని జోలికి పెద్దగా పోలేదు. అటు బ్రెగ్జిట్‌ ఇక తిరగదోడలేని అంశమంటూనే ఈయూ నుంచి బయటికొచ్చినా దేశం ఉమ్మడి మార్కెట్‌వైపే మొగ్గు చూపాలని ప్రతి పాదించిన లేబర్‌ పార్టీ నేత కోర్బిన్‌ కూడా దాన్ని ఎన్నికల అంశంగా మార్చలేదు. బ్రెగ్జిట్‌ను బలంగా వ్యతిరేకించడమేకాక, తమకు అధికారం అప్పగిస్తే దానిపై మరో రిఫరెండం నిర్వహించి ఈయూలో కొనసాగేలా చూస్తామన్న లిబరల్‌ డెమొ క్రాట్లకు ఘోరపరాభవం జరిగింది. ఆ పార్టీకి నాలుగే స్థానాలు లభించాయి. బ్రెగ్జిట్‌ రిఫరెండంలో కీలకపాత్ర పోషించిన యూకే ఇండిపెండెంట్స్‌ పార్టీ (యూకే ఐపీ) గత ఎన్నికల్లో సంపాదించుకున్న ఒక్క స్థానాన్నీ ఈసారి కోల్పోయింది.

అధికార పీఠం అందుకోలేకపోయినా మళ్లీ గణనీయంగా పుంజుకున్న లేబర్‌ పార్టీ గురించి ప్రస్తావించుకోవాలి. నయా ఉదారవాద విధానాలను నిశితంగా విమర్శించడంలో, సంపన్నులపై అధిక పన్నులు విధించాలనడంలో దూకుడుగా ఉండే ఆ పార్టీ నేత జరిమీ కోర్బిన్‌ను జనం విశ్వసించారు. అయితే ఆ పార్టీకి జనం అధికారం కట్టబెట్టకపోవడానికి కారణముంది. టోనీ బ్లెయిర్, గోర్డాన్‌ బ్రౌన్‌ల పాలనలో ఆ పార్టీ మూటగట్టుకున్న అప్రదిష్ట, దుష్కీర్తి అంతా ఇంతా కాదు.  బ్లెయిర్‌ ప్రధానిగా ఉన్నప్పుడు అమెరికాకు దాసోహమై, దాని ప్రయోజనాలను నెరవేర్చడమే ధ్యేయంగా ఉద్దేశపూర్వకంగా ఇరాక్‌పై కట్టుకథలల్లి దేశాన్ని యుద్ధం లోకి దించారు. పర్యవసానంగా బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. నిరుద్యోగం పెరిగింది.

ధరలు ఆకాశాన్నంటాయి. పలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పర మయ్యాయి. వీటన్నిటినీ బ్రిటన్‌ ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేకపోయారు. అయితే అందరికీ చదువు, ఆవాసం, ఆరోగ్య సేవలు, పింఛన్లకు రక్షణ వంటి లేబర్‌ హామీలు వారిని ఆకట్టుకున్నాయి. మౌలిక సదుపాయాల రంగంలో కీలక విభా గాలను జాతీయం చేస్తామన్న కోర్బిన్‌ వాగ్దానం ప్రజలకు నచ్చింది. ఉగ్రవాదానికి అణచివేత పరిష్కారం కాదనీ, దానికి దారితీస్తున్న మూల కారణాలను సరిచేయా లని కోర్బిన్‌ వాదించాడు. అయితే బ్లెయిర్‌ కాలంనాటి ఉదారవాద విధానాల మత్తులోనే ఉండిపోయిన పార్టీలోని ఇతర నేతలు కోర్బిన్‌ పార్టీని దివాలా తీయి స్తాడని హడలెత్తారు. ఆయనకు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. ఇక కార్పొ రేట్‌ మీడియా సంగతి సరేసరి. ఆయన అధినేత కావడం ఆ పార్టీకి శాపమన్నట్టు ప్రచారం చేశాయి. ఈ ఎన్నికలు ఆయనను ప్రధాని చేయలేకపోవచ్చుగానీ పార్టీలో తిరుగులేని నేతగా మార్చాయి. కోర్బిన్‌కు ఇక ఎదురుండదు. మొత్తంగా చూస్తే బ్రిటన్‌ రాగల కాలంలో మరిన్ని సంక్షోభాలను ఎదుర్కొనవలసి రావొచ్చు. మరో సారి మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యంలేదు. ప్రపంచం రానురాను జాతీయ వాదంవైపు, సంకుచిత ధోరణులవైపు పయనిస్తున్నదని నిరాశపడేవారికి ఈ ఎన్ని కల ఫలితాలు ఊరటనిస్తాయనడంలో సందేహం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement