బ్రిటన్‌కు అగ్ని పరీక్ష! | Bad Time To Britain Over Brexit | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌కు అగ్ని పరీక్ష!

Published Thu, Jan 17 2019 12:57 AM | Last Updated on Thu, Jan 17 2019 12:57 AM

Bad Time To Britain Over Brexit - Sakshi

యూరప్‌ యూనియన్‌(ఈయూ) నుంచి బ్రిటన్‌ నిష్క్రమించాల్సిన గడువు ముంచుకొస్తుండగా ఆ దేశ ప్రధాని థెరిస్సా మే ఈయూతో కుదుర్చుకొచ్చిన ముసాయిదా ఒప్పందం వీగిపోయింది. బ్రిటన్‌ దిగువ సభ కామన్స్‌లో మంగళవారం దానికి చుక్కెదురైంది. ఆ ప్రతిపాదనకు అనుకూ లంగా కేవలం 202 ఓట్లు మాత్రమే లభించగా, 432మంది వ్యతిరేకించారు. దేశ ప్రధాని ప్రతిపాద నకు ఈ స్థాయిలో ప్రతిఘటన ఎదురుకావడం బ్రిటన్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. దీనికి కొనసాగిం పుగా ఆమె ప్రభుత్వంపై విపక్ష లేబర్‌ పార్టీ నాయకుడు జెరిమీ కోర్బిన్‌ తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైంది. అందులో సైతం థెరిస్సా ఓడితే ఆమె ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈయూ నుంచి బ్రిటన్‌ తప్పుకొనేందుకు గడువు తేదీ మార్చి 29. అంటే... ఇక కేవలం 72 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆలోగా ఈయూతో అది ఒప్పందానికి రాలేకపోతే బ్రిటన్‌ తెగదెంపులు పూర్తయినట్టే భావిస్తారు.

సంస్థనుంచి బయటికొచ్చాక అనుసరించాల్సిన విధి విధానాలపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా ఈ ప్రక్రియ ముగిసిపోతే బ్రిటన్‌ను అది తీవ్ర సంక్షోభంలో పడేస్తుంది. దాని పర్యవసానంగా ఏర్పడే ఆర్థిక, రాజకీయ పరిణామాలు పెను విపత్తుకు దారి తీస్తాయి. ఆహారం, మందులు వగైరాల కొరతతో మొదలుపెట్టి విమాన రాకపోకలు స్తంభించిపోవ డంతోసహా ఎన్నో సంక్లిష్ట సమస్యలు తలెత్తుతాయి. ఆ తర్వాత దేశంలో బద్దలయ్యే అశాంతిని అదుపు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారమవుతుంది. అయితే ఇదంతా సజావుగా పూర్త వుతుందని, సమస్యలేమీ ఎదురుకావన్న భావనతోనే మార్కెట్లున్నాయి. అందుకే బ్రిటన్‌లోని తాజా పరిణామాల ప్రభావం వాటిపై పెద్దగా పడలేదు.

థెరిస్సా మే గత కొన్ని నెలలుగా ఈయూ బాధ్యులతో బ్రెగ్జిట్‌పై చర్చోపచర్చలు సాగిస్తున్నారు. వాటి పర్యవసానంగా గత నవంబర్‌లో ముసాయిదా ఒప్పందం ఖరారైంది. దీనికి కన్సర్వేటివ్‌ పార్టీలోనేకాక, తమకు మద్దతునిస్తున్న ఉత్తర ఐర్లాండ్‌ పార్టీ డీయూపీనుంచి సైతం అసమ్మతి స్వరాలు వినిపించాయి. రోజులు గడుస్తున్నకొద్దీ అవి పెరిగాయి. అటు విపక్ష లేబర్‌ పార్టీ, స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ(ఎస్‌ఎన్‌పీ)లు సరేసరి. ఆ ముసాయిదా ఒప్పందం తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాయి. ఈ స్థితిలో డిసెంబర్‌లో జరగాల్సిన ఓటింగ్‌ను ఆమె వాయిదా వేశారు. ఆ తర్వాత మరిన్ని రాయితీలివ్వాలని ఈయూను ప్రాధేయపడ్డారు. కానీ ఆ సంస్థను నడిపిస్తున్న జర్మనీ ఏంజెలా మెర్కల్‌ అందుకు సిద్ధంగా లేరు.

అందుకే యూరొపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జుంకర్, యూరొపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు డోనాల్డ్‌ టస్క్‌లు అందుకు తిరస్కరించారు. ఇదే బ్రిటన్‌ పౌరులను కలవరపరిచింది. 2016 జూన్‌లో బ్రెగ్జిట్‌పై  రిఫరెండం జరిగినప్పుడు అత్యధి కులు స్వాగతించిన విషయాన్ని గుర్తుంచుకుంటే ప్రస్తుత వ్యతిరేకత తీవ్రతేమిటో అర్థమవుతుంది. అప్పట్లో 51.9 శాతంమంది రిఫరెండానికి అనుకూలత వ్యక్తం చేశారు. 48.1 శాతంమంది ఈయూ లోనే కొనసాగాలని కోరారు. రెండున్నరేళ్లు గడిచేసరికల్లా బ్రెగ్జిట్‌ అనుకూలురు, దాని వ్యతిరేకులు కూడా ఒకే దోవకొచ్చారు. ఫలితంగా ముసాయిదాకు కేవలం 20 శాతంమంది మాత్రమే అనుకూల మని సర్వేలు తేల్చిచెప్పాయి. ఒప్పందం మరీ కఠినంగా ఉండరాదని అనేకులు ఆశించారు.

కానీ దానికి భిన్నంగా జరగడమేకాక ముసాయిదా బ్రిటన్‌ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నదని దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశాన్ని ఇది శాశ్వతంగా అప్రజాస్వామిక ఈయూకు బానిసను చేస్తుందన్నది వారి విశ్లేషణ. ఈ ముసాయిదా ఒప్పందం ఖరారైతే ఈయూ ఆమోదం లేకుండా అమెరికాతో సహా ఏ దేశంతోనూ భవిష్యత్తులో బ్రిటన్‌ వాణిజ్య ఒప్పందాలకు రావడం సాధ్యపడ దని వారంటున్నారు. తమనుంచి దూరమైతే ఎలాంటి దుర్గతి పడుతుందో సంస్థలోని ఇతర సభ్య దేశాలకు చూపడమే ఈయూ అధినేతల ఆంతర్యంగా కనబడుతున్నదన్న విమర్శలున్నాయి. అందుకే థెరిస్సా మే తీరును నిరసిస్తూ ఈమధ్యకాలంలో పలువురు మంత్రులు, డిప్యూటీలు ఆమె ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పారు. బ్రెగ్జిట్‌ చర్చల్లో మొదటినుంచీ కీలకపాత్ర పోషిస్తున్న డొమినిక్‌ రాబ్‌ కూడా వారిలో ఉన్నారు.

ఒక దేశం సంస్థలో సభ్యత్వం తీసుకున్ననాటికి ఎలా ఉందో, విడిపోయాక కూడా అలా కొనసాగుతామంటే ఈయూ పెద్దలకు అభ్యంతరం ఎందుకుండాలి? సంస్థ ఆలంబనతో అన్నివి ధాలా ఎదిగాక మధ్యలో విడిచిపోతానంటే ఈయూ సంకటస్థితిలో పడుతుందన్నది జర్మన్‌ కార్పొ రేట్ల వాదన. అయితే యూరప్‌పై తమ ఆర్థిక పెత్తనాన్ని కొనసాగించడానికే జర్మన్లు ఇలాంటి అర్ధర హిత వాదనలు చేస్తున్నారని బ్రిటన్‌ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఒప్పందం ఖరారు కాకపోతే అటు బ్రిటన్‌కు మాత్రమే కాదు...ఇటు ఈయూ దేశాలకూ బోలెడు సమస్యలు ఎదురవుతాయి. ఈయూ సభ్యదేశాల పౌరులు ఇన్నాళ్లూ యూరప్‌లోఎక్కడైనా స్వేచ్ఛగా వెళ్లొచ్చు.

ఉపాధి వెదుక్కోవచ్చు. కానీ ఏ ఒప్పందమూ లేకుండా బ్రిటన్‌ విడిపోయే పరిస్థితి ఏర్పడితే వేరే దేశాల్లో ఉండే బ్రిటన్‌ పౌరులు అక్కడ నివసించేందుకు పర్మిట్లకు దరఖాస్తు చేయాలి. ఫిన్‌లాండ్‌లో ఉన్న 5,000మంది బ్రిటన్‌ పౌరులకు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అలాగే బ్రిటన్‌లో ఉండే వేరే దేశాల పౌరులు సైతం ఆ పనే చేయాల్సి ఉంటుంది. ఫ్రాన్స్‌ నుంచి బ్రిటన్‌కు వైన్‌ ఎగుమతులు... బ్రిటన్‌నుంచి ఫ్రాన్స్‌కు మద్యం ఎగుమతులు నిలిచిపోతాయి. ఆ రెండు దేశాలూ ఆర్థిక సంక్షో భంలో పడతాయి. ఏదేమైనా బ్రిటన్‌ పరిస్థితి ‘ముందు నుయ్యి–వెనక గొయ్యి’ అన్నట్టుంది. పాత ముసాయిదాలో మార్పులు కావాలని బ్రిటన్‌ సంప్రదిస్తే కొత్త ఒప్పందానికి ఆమోదం పొందుతా మన్న ముందస్తు హామీ ఇచ్చే షరతు విధిస్తామని ఈయూ బాధ్యులు అంటున్నారు. ఒకప్పుడు ‘రవి అస్తమించని సామ్రాజ్యానికి’ అధిపతిగా ఉన్న బ్రిటన్‌కు ఈ బ్రెగ్జిట్‌ వ్యవహారం అగ్నిపరీక్షగా మారింది. దీన్నుంచి అది గౌరవంగా ఎలా బయటపడగలదో మున్ముందు చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement