జేఎంఎం కూటమి జయకేతనం | JMM-Congress Unseats BJP In Jharkhand | Sakshi
Sakshi News home page

జేఎంఎం కూటమి జయకేతనం

Published Tue, Dec 24 2019 1:46 AM | Last Updated on Tue, Dec 24 2019 10:48 AM

JMM-Congress Unseats BJP In Jharkhand - Sakshi

రాంచీలో విజయోత్సవాలు జరుపుకుంటున్న కాంగ్రెస్, జేఎంఎం మద్దతుదారులు, సోమవారం రాంచీలో సైకిల్‌ తొక్కుతున్న హేమంత్‌ సోరెన్‌

రాంచీ/న్యూఢిల్లీ: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి మెజారిటీ సాధించింది. 81 స్థానాలున్న అసెంబ్లీలో 47 సీట్లను కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 25 స్థానాలకే పరిమితమైంది. కూటమిలో జేఎంఎం 30 స్థానాల్లో, కాంగ్రెస్‌ 16 సీట్లలో, ఆర్జేడీ ఒక స్థానంలో గెలుపొందాయి. ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి, బీజేపీ నేత రఘుబర్‌ దాస్‌ రాజీనామా చేశారు.

రాజీనామా లేఖను గవర్నర్‌ ద్రౌపది ముర్ముకి అందించానని, కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని తనను కోరారని అనంతరం రఘుబర్‌ తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన జేఎంఎం కూటమికి, కూటమి సీఎం అభ్యర్థి హేమంత్‌ సోరెన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్‌ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి విజయం సాధించడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సోరెన్‌కు, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

ఎన్నికల్లో ప్రతిష్టాత్మక జంషెడ్‌పూర్‌(ఈస్ట్‌) స్థానం నుంచి సీఎం రఘుబర్‌ దాస్‌ పోటీ చేశారు. ఆయనపై  బీజేపీ రెబెల్‌ అభ్యర్థి సరయు రాయ్‌ గెలుపొందారు. జంషెడ్‌పూర్‌(వెస్ట్‌) నుంచి టికెట్‌ నిరాకరించడంతో సరయు రాయ్‌ ఇండిపెండెంట్‌గా జంషెడ్‌పూర్‌(ఈస్ట్‌) నుంచి బరిలో దిగారు. అసెంబ్లీ స్పీకర్‌ దినేశ్‌ ఓరాన్, పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు. విజయం అనంతరం జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సోరెన్‌ రాష్ట్ర ప్రజలకు, తన తండ్రి శిబూ సోరెన్‌కు, కూటమి పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌(ఏజేఎస్‌యూ) పార్టీ 2 సీట్లలో గెలుపొందింది. ఆ పార్టీ అధ్యక్షుడు సుదేశ్‌ మహతో 20 వేల మెజారిటీతో సిలీ స్థానం నుంచి గెలుపొందారు.

జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా– ప్రజా తాంత్రిక్‌(జేవీఎం–పీ) చీఫ్‌ బాబూలాల్‌ మరాండి ధన్వార్‌ స్థానం నుంచి గెలుపొందగా, ఆ పార్టీ మరో రెండు సీట్లనూ గెలుచుకుంది. రాంచి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సీపీ సింగ్‌ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 33.53%, జేఎంఎంకు 19.29%, కాంగ్రెస్‌కు 13.78%, ఆర్జేడీకి 2.82%, ఏజేఎస్‌యూకి 8.15%, ఎంఐఎంకు 1.08% ఓట్లు లభించాయి. ముస్లింల జనాభా గణనీయంగా ఉన్న జార్ఖండ్‌లో సీఏఏ వ్యతిరేకత తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో ముస్లింలపై జరిగిన పలు మూకదాడులపై కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఏజేఎస్‌యూతో పొత్తు కుదుర్చుకోలేకపోవడం కూడా బీజేపీ ఓటమికి కారణంగా భావిస్తున్నారు.

పీఎం మోదీ శుభాకాంక్షలు
జార్ఖండ్‌ అసెంబ్లీ విజయం సాధించిన జార్ఖండ్‌ ముక్తి మోర్చా నేత హేమంత్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన హేమంత్, జేఎంఎం నేతృత్వంలోని కూటమికి అభినందనలు’ అని ట్వీట్‌ చేశారు. ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు జార్ఖండ్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఓటమి బీజేపీది కాదని, వ్యక్తిగతంగా తనదని ముఖ్యమంత్రి రఘుబర్‌ వ్యాఖ్యానించారు.   

సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజా తీర్పు
జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపై కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కార్యకర్తలకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఉపాధి, నీరు, అడవి, వ్యవసాయం, వాణిజ్యం.. తదితర అంశాల్లో ప్రభుత్వ సాయాన్ని కోరుకుంటోంటే బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మాత్రం విభజన రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. అందుకే ప్రజలు ఈ తీర్పునిచ్చారని ఆమె ట్వీట్‌ చేశారు.  ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాల అహంకారాన్ని జార్ఖండ్‌ ప్రజలు నాశనం చేశారని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. హేమంత్‌ సోరెన్‌కు టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా తాజాగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ @ 7
జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో సొంతంగా కానీ, కూటమితో కలిసి కానీ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 7కి చేరింది. పంజాబ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకుని అధికారంలో భాగస్వామ్యం సాధించింది. తాజాగా జార్ఖండ్‌లో జేఎంఎం కూటమిలో చేరి విజయం సాధించింది.

హేమంత్‌ నేపథ్యం
జార్ఖండ్‌ ఎన్నికల్లో విజయం సాధించిన జార్ఖండ్‌ ముక్తిమోర్చా(జేఎంఎం) అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. గిరిజన పోరాటయోధుడు బిర్సా ముండాయే తనకు స్ఫూర్తి అని చెప్పుకునే హేమంత్‌.. కేంద్ర మాజీ మంత్రి, మూడుసార్లు జార్ఖండ్‌ సీఎంగా పనిచేసిన ఆదివాసీ నేత శిబూ సోరెన్‌ కుమారుడు.   
► తల్లిదండ్రులు: రూపి, శిబూ సోరెన్‌
► జననం: 1975 ఆగస్ట్‌ 10.  
► స్వస్థలం: రామ్‌గఢ్‌ జిల్లా నేమ్రా గ్రామం, జార్ఖండ్‌
► విద్య: ఇంటర్, ఇంజినీరింగ్‌ (డిస్‌కంటిన్యూ)
► హాబీలు: వంట చేయడం, క్రికెట్‌ ఆడటం  
► భార్య: కల్పనా సోరెన్‌


రాజకీయ ప్రవేశం
►     సోదరుడు దుర్గ హఠాన్మరణంతో హేమంత్‌ 2009లో జేఎంఎం పగ్గాలు చేపట్టారు.   
►     2005లో తొలిసారి దుమ్కా స్థానం నుంచి ఎన్నికల బరిలోకి. జేఎంఎం తిరుగుబాటు నేత స్టీఫెన్‌ మరాండీ చేతిలో ఓటమి.
►    2009– 2010లో రాజ్యసభ సభ్యుడు.
►     2010లో జార్ఖండ్‌ డెప్యూటీ సీఎంగా బాధ్యతలు.  
►     2013 జూలై 13న జార్ఖండ్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన ఎత్తివేసిన తరువాత కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో 2013 జూలై 15న సుమారు 38 ఏళ్లకే రాష్ట్రానికి అత్యంత చిన్న వయస్కుడైన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 డిసెంబర్‌ వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు.
►  2014 డిసెంబర్‌ 23న బార్‌హైత్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక.. ప్రతిపక్ష నేతగా ఎంపిక.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement