Shibu Soren
-
పార్టీనా?.. కోడలు పిల్లనా?.. సంకటంలో శిబు సోరెన్?
జార్ఖండ్ రాజకీయాల్లో గత నాలుగు దశాబ్దాలుగా దుమ్కా పార్లమెంటరీ నియోజకవర్గం కీలకంగా మారింది. జేఎంఎం చీఫ్ శిబు సోరెన్ పురిటి గెడ్డ దుమ్కాకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. వృద్ధుడైన శిబు సోరెన్ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ దుమ్కా గతంలో కంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.తాజాగా దుమ్కా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ ఎన్నికల బరిలోకి దిగారు. ఇది మొదలు ఆమె జేఎంఎంపై మాటల యుద్ధం చేస్తున్నారు. దీనికి ప్రతిగా శిబు సోరెన్ చిన్న కోడలు కల్పనా సోరెన్ తన భర్త, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను జైలుకు పంపినందుకు బీజేపీని కార్నర్ చేస్తున్నారు.ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో శిబు సోరెన్ రాజకీయ ప్రతిష్ట దిగజారుతున్నదనే వాదన వినిపిస్తోంది. ఓ వైపు పార్టీ, మరోవైపు ఇంటి పెద్ద కోడలు.. మధ్యలో శిబు సోరెన్ నలిగిపోతున్నారని వినికిడి. ఇది సోరెన్ కుటుంబానికి మాత్రమే కాకుండా బీజేపీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. 2019లో బీజేపీకి చెందిన సునీల్ సోరెన్ దుమ్కా నుంచి గెలిచి, శిబు సోరెన్ కోటను కూల్చివేశారు. ఈసారి సీతను అభ్యర్థిగా నిలబెట్టి, జేఎంఎం (కూటమి)ని గందరగోళపరిచేందుకు బీజేపీ ప్లాన్ చేసింది.అయితే జేఎంఎం.. బీజేపీ అభ్యర్థి సీతకు వ్యతిరేకంగా కుటుంబం నుండి ఎవరినీ అభ్యర్థిగా నిలబెట్టలేదు. అయితే చిన్న కోడలు కల్పనా సోరెన్‌కు పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించింది. పార్టీ ఈ స్థానం టిక్కెట్‌ను నలిన్ సోరెన్‌కు కేటాయించింది. 1952లో మొదటిసారిగా దుమ్కా స్థానానికి ఎన్నికలు జరిగాయి. నాడు కాంగ్రెస్‌కు చెందిన పాల్ జుజార్ సోరెన్ విజయం సాధించారు. అప్పటి నుండి ఈ లోక్‌సభ స్థానం 19 ఎన్నికల్లో 11 సార్లు సోరెన్ వర్గం చేతికే దక్కింది. శిబు అనారోగ్యంతో బాధపడుతూ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. అయితే ఆయన పార్టీ ఆప్తమిత్రుడు నళిన్ సోరెన్ జెఎంఎం సత్తా చాటేందుకు రంగంలోకి దిగారు.2019 ఎన్నికల డేటా ప్రకారం జార్ఖండ్‌లోని దుమ్కా లోక్‌సభ స్థానంలో మొత్తం ఓటర్ల సంఖ్య 10 లక్షల 25 వేల 968. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా 20 లక్షల 59 వేల 611. ఇక్కడి జనాభాలో 92 శాతం మంది గ్రామాల్లో, మిగిలిన వారు నగరాల్లో నివసిస్తున్నారు. కుల సమీకరణలను పరిశీలిస్తే ఎస్సీ కేటగిరీ జనాభా 7.84 శాతం, ఎస్టీ కేటగిరీ జనాభా 37.39 శాతంగా ఉంది. -
శిబు సోరెన్ రాజకీయ జీవితంలో విజయాలెన్ని?
దేశ రాజకీయాల్లో అత్యంత జనాకర్షణ కలిగిన నేతలు అరుదుగా కనిపిస్తారు. వారిలో ఒకరే జార్ఖండ్ అధికార ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత శిబు సోరెన్. పొడవాటి జుట్టు, మాసిన గడ్డంతో కనిపించే ఈ నేతకు 80 ఏళ్లు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శిబు సోరెన్ అక్కడి బహిరంగ సభల్లో ప్రతీకాత్మకంగా కనిపిస్తుంటారు. అంటే మోర్చా వేదికల్లో పోస్టర్లు, బ్యానర్లలో ఆయన ఫొటో తప్పక కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనప్పటికీ ఆయన పేరు జార్ఖండ్‌లో వాడవాడలా వినిపిస్తుంటుంది. వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మాదక ద్రవ్యాల విముక్తిపై పోరాటంతో శిబు సోరెన్ రాజకీయ ప్రయాణం మొదలైంది. ధన్‌బాద్‌కు ఆనుకుని ఉన్న తుండి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని శిబు తన పోరాటాన్ని ప్రారంభించారు. తొలుత పాఠశాలలో విద్యపై గ్రామీణులకు అవగాహన కల్పించారు.1977లో శిబు సోరెన్ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి విఫలమయ్యారు. అయితే 1980లో లోక్‌సభలో మొదటి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత 1986, 1989, 1991, 1996లలో విజయాన్ని హస్తగతం చేసుకుంటూ వచ్చారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత బాబులాల్ మరాండీ చేతిలో ఓటమి చవిచూశారు. అయితే 2004, 2009, 2014లలో దుమ్కా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తిరిగి విజయాన్ని దక్కించుకున్నారు.శిబూ సోరెన్ మొత్తం ఎనిమిది సార్లు దుమ్కా లో విజయపతాకం ఎగురవేశారు. శిబు సోరెన్ రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1984లో ఒకసారి జామా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ సీటులో ఆయన పెద్ద కోడలు సీతా సోరెన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. శిబు సోరెన్‌పై పలు హత్యారోపణలు ఉన్నాయి. అయితే విచారణ తర్వాత అతనిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. శిబు సోరెన్ వివిధ కాలాల్లో మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. -
Sita Soren: జేఎమ్ఎమ్కు రాజీనామా.. గంటల్లోనే బీజేపీలో చేరిక
జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీత సోరెన్ మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. జేఎంఎం పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఆమె కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు, వచ్చే ఏడాది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీత సోరెన్ పార్టీ మార్పు చర్చనీయాంశంగా మారింది. కాగా జేఎమ్ఎమ్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతా సోరెన్ శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ సతీమణీ. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వదిన అవుతుంది. అనారోగ్యంతో దుర్గా సోరెన్ 2009లో మరణించారు. అప్పుడు ఆయన వయసు 39 ఏళ్లు. అయితే భర్త మరణానంతరం తనను, తన కుటుంబాన్ని సోరెన్ కుటుంబ సభ్యులు పక్కన పెట్టారని ఆరోపిస్తూ మంగళవారం జేమ్ఎమ్ పార్టీకి సీత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీలోని అన్ని పదవులకు, జార్ఖండ్ అసెంబ్లీలోని జామా స్థానానికి కూడా ఆమె రాజీనామా చేశారు. ‘కుటుంబంలోనే కాదు పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదని తాను నిర్లక్ష్యానికి గురవుతున్నానని ఆరోపించారు. తనకు, తన కుతూళ్లకు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు.. ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా పార్టీ నడుస్తోందని విమర్శించారు. అయిష్టంగానే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు మామ శిబు సోరెన్‌కు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యులు, కుటుంబం తమను వేరు చేసే విధంగా వ్యవహరించడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. -
అరెస్టులను ఎదుర్కొన్న ముగ్గురు జార్ఖండ్ సీఎంలు!
జార్ఖండ్ ప్రస్తుతం పెను రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భూ కుంభకోణం కేసులో రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నేపధ్యంలోనే హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి గవర్నర్‌కు తన రాజీనామా పత్రం సమర్పించారు. హేమంత్ రాజీనామా తర్వాత చంపై సోరెన్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. జార్ఖండ్ సీఎం పదవిలో ఉన్న నేత అరెస్ట్ కావడం ఇదేమీ తొలిసారి కాదు. జార్ఖండ్ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు సీఎంలు రాష్ట్రాన్ని పాలించారు. వీరిలో ముగ్గురు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యారు. దీంతోపాటు రాష్ట్రంలో మూడుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ 2005లో 10 రోజులు, 2008 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2010 వరకు జార్ఖండ్ సీఎంగా ఉన్నారు. 1994లో ప్రైవేట్ సెక్రటరీ శశినాథ్ ఝా కిడ్నాప్, హత్య కేసులో 2006లో ఢిల్లీ కోర్టు శిబు సోరెన్‌కు జీవిత ఖైదు విధించింది. అయితే 2007లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టు శిబు సోరెన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. 2018లో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. 2004లో జమ్తారా సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు శిబూ సోరెన్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపధ్యంలో ఆయన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే 2008 మార్చి లో సాక్ష్యాలు లేవని పేర్కొంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోరెన్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. మధు కోడా 2006 నుంచి 2008 మధ్య జార్ఖండ్ సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్న సమయంలో ఆయన మనీలాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టడం వంటి అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. మైనింగ్ కుంభకోణానికి పాల్పడి రూ.4,000 కోట్లకు పైగా సంపాదించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కోడాను 2009లో అరెస్టు చేసి 2013లో విడుదల చేశారు. 2017లో కోడా దోషిగా తేలారు. దీంతో అతనికి మూడేళ్ల జైలు శిక్ష. రూ. 25 లక్షల జరిమానా విధించారు. జార్ఖండ్ రాష్ట్రం 2000, నవంబరు 15న ఏర్పడింది. నేటి వరకు ఆరుగురు నేతలు సీఎంలుగా వ్యవహరించారు. వీరిలో రఘువర్ దాస్ మాత్రమే ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. బాబులాల్ మరాండీ, అర్జున్ ముండా, రఘువర్ దాస్ జార్ఖండ్ సీఎంలుగా పనిచేశారు. -
అనారోగ్యంతో ఆస్పత్రిలో శిబు సోరెన్
రాంచీ: జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్ శిబు సోరెన్(79) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు జరిపి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ను గుర్తించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సోరెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతోందని ఆయన కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. 2005–10 మధ్య సోరెన్ జార్ఖండ్ సీఎంగా పనిచేశారు. లోక్‌సభకు 8 పర్యాయాలు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. -
Hyderabad: బీఆర్ఎస్ 'పరేడ్'!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ బల ప్రదర్శనకు సిద్ధమవుతోంది. 13న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ప్రధాని మోదీతో సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అంతకు మించేలా 17వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి భారీగా జన సమీకరణ చేయడంతోపాటు పలు రాష్ట్రాల సీఎంలు, జాతీయ స్థాయి నేతలను ఆహ్వానించనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ త్వరలోనే నేతలతో భేటీ కానున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు మోదీ సభ కోసం బీజేపీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. మొత్తంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఫిబ్రవరిలో సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా భారీ బహిరంగ సభలతో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాయి. కేసీఆర్ పుట్టినరోజున ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయాన్ని వచ్చే నెల 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం కొత్త సచివాలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం నిర్విరామంగా శ్రమిస్తోంది. వేద పండితుల సూచన మేరకు ఫిబ్రవరి 17వ తేదీ శుక్రవారం ఉదయం వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆహ్వానిత ముఖ్యమంత్రులతో పాటు ఇతర నేతలు పాల్గొంటారు. ఖమ్మం సభ తరహాలో.. కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం, కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలతోపాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్, వామపక్షాల జాతీయ నేతలు పాల్గొన్నారు. అదే తరహాలో సచివాలయ ప్రారంభోత్సవం, పరేడ్‌గ్రౌండ్స్ సభను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తోపాటు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌కుమార్ తరఫున జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు మరికొందరు ముఖ్య నేతలు పాల్గొంటారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. నాలుగు రోజుల తేడాలోనే.. పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ మోదీ సభకు, బీఆర్ఎస్ సభకు మధ్య కేవలం నాలుగు రోజులే గడువు ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే భారీగా జన సమీకరణతో సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ సభకు తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఇతర నేతలు హాజరుకానుండటం బీఆర్ఎస్కు జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత పెరిగేందుకు దోహదం చేస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సభకు జన సమీకరణ, ఏర్పాట్లకు సంబంధించి సీఎం కేసీఆర్.. త్వరలో గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది. -
జేఎంఎం కూటమి జయకేతనం
రాంచీ/న్యూఢిల్లీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి మెజారిటీ సాధించింది. 81 స్థానాలున్న అసెంబ్లీలో 47 సీట్లను కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 25 స్థానాలకే పరిమితమైంది. కూటమిలో జేఎంఎం 30 స్థానాల్లో, కాంగ్రెస్ 16 సీట్లలో, ఆర్జేడీ ఒక స్థానంలో గెలుపొందాయి. ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి, బీజేపీ నేత రఘుబర్ దాస్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ ద్రౌపది ముర్ముకి అందించానని, కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని తనను కోరారని అనంతరం రఘుబర్ తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన జేఎంఎం కూటమికి, కూటమి సీఎం అభ్యర్థి హేమంత్ సోరెన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి విజయం సాధించడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్‌కు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ప్రతిష్టాత్మక జంషెడ్పూర్(ఈస్ట్) స్థానం నుంచి సీఎం రఘుబర్ దాస్ పోటీ చేశారు. ఆయనపై బీజేపీ రెబెల్ అభ్యర్థి సరయు రాయ్ గెలుపొందారు. జంషెడ్పూర్(వెస్ట్) నుంచి టికెట్ నిరాకరించడంతో సరయు రాయ్ ఇండిపెండెంట్‌గా జంషెడ్పూర్(ఈస్ట్) నుంచి బరిలో దిగారు. అసెంబ్లీ స్పీకర్ దినేశ్ ఓరాన్, పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు. విజయం అనంతరం జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ రాష్ట్ర ప్రజలకు, తన తండ్రి శిబూ సోరెన్‌కు, కూటమి పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్(ఏజేఎస్‌యూ) పార్టీ 2 సీట్లలో గెలుపొందింది. ఆ పార్టీ అధ్యక్షుడు సుదేశ్ మహతో 20 వేల మెజారిటీతో సిలీ స్థానం నుంచి గెలుపొందారు. జార్ఖండ్ వికాస్ మోర్చా– ప్రజా తాంత్రిక్(జేవీఎం–పీ) చీఫ్ బాబూలాల్ మరాండి ధన్వార్ స్థానం నుంచి గెలుపొందగా, ఆ పార్టీ మరో రెండు సీట్లనూ గెలుచుకుంది. రాంచి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సీపీ సింగ్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 33.53%, జేఎంఎంకు 19.29%, కాంగ్రెస్‌కు 13.78%, ఆర్జేడీకి 2.82%, ఏజేఎస్‌యూకి 8.15%, ఎంఐఎంకు 1.08% ఓట్లు లభించాయి. ముస్లింల జనాభా గణనీయంగా ఉన్న జార్ఖండ్‌లో సీఏఏ వ్యతిరేకత తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో ముస్లింలపై జరిగిన పలు మూకదాడులపై కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఏజేఎస్‌యూతో పొత్తు కుదుర్చుకోలేకపోవడం కూడా బీజేపీ ఓటమికి కారణంగా భావిస్తున్నారు. పీఎం మోదీ శుభాకాంక్షలు జార్ఖండ్ అసెంబ్లీ విజయం సాధించిన జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన హేమంత్, జేఎంఎం నేతృత్వంలోని కూటమికి అభినందనలు’ అని ట్వీట్ చేశారు. ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు జార్ఖండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఓటమి బీజేపీది కాదని, వ్యక్తిగతంగా తనదని ముఖ్యమంత్రి రఘుబర్ వ్యాఖ్యానించారు. సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజా తీర్పు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపై కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కార్యకర్తలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఉపాధి, నీరు, అడవి, వ్యవసాయం, వాణిజ్యం.. తదితర అంశాల్లో ప్రభుత్వ సాయాన్ని కోరుకుంటోంటే బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మాత్రం విభజన రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. అందుకే ప్రజలు ఈ తీర్పునిచ్చారని ఆమె ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల అహంకారాన్ని జార్ఖండ్ ప్రజలు నాశనం చేశారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. హేమంత్ సోరెన్‌కు టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తాజాగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ @ 7 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో సొంతంగా కానీ, కూటమితో కలిసి కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 7కి చేరింది. పంజాబ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిలో కాంగ్రెస్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకుని అధికారంలో భాగస్వామ్యం సాధించింది. తాజాగా జార్ఖండ్‌లో జేఎంఎం కూటమిలో చేరి విజయం సాధించింది. హేమంత్ నేపథ్యం జార్ఖండ్ ఎన్నికల్లో విజయం సాధించిన జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. గిరిజన పోరాటయోధుడు బిర్సా ముండాయే తనకు స్ఫూర్తి అని చెప్పుకునే హేమంత్.. కేంద్ర మాజీ మంత్రి, మూడుసార్లు జార్ఖండ్ సీఎంగా పనిచేసిన ఆదివాసీ నేత శిబూ సోరెన్ కుమారుడు. ► తల్లిదండ్రులు: రూపి, శిబూ సోరెన్ ► జననం: 1975 ఆగస్ట్ 10. ► స్వస్థలం: రామ్‌గఢ్ జిల్లా నేమ్రా గ్రామం, జార్ఖండ్ ► విద్య: ఇంటర్, ఇంజినీరింగ్ (డిస్కంటిన్యూ) ► హాబీలు: వంట చేయడం, క్రికెట్ ఆడటం ► భార్య: కల్పనా సోరెన్ రాజకీయ ప్రవేశం ► సోదరుడు దుర్గ హఠాన్మరణంతో హేమంత్ 2009లో జేఎంఎం పగ్గాలు చేపట్టారు. ► 2005లో తొలిసారి దుమ్కా స్థానం నుంచి ఎన్నికల బరిలోకి. జేఎంఎం తిరుగుబాటు నేత స్టీఫెన్ మరాండీ చేతిలో ఓటమి. ► 2009– 2010లో రాజ్యసభ సభ్యుడు. ► 2010లో జార్ఖండ్ డెప్యూటీ సీఎంగా బాధ్యతలు. ► 2013 జూలై 13న జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన ఎత్తివేసిన తరువాత కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో 2013 జూలై 15న సుమారు 38 ఏళ్లకే రాష్ట్రానికి అత్యంత చిన్న వయస్కుడైన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 డిసెంబర్ వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ► 2014 డిసెంబర్ 23న బార్‌హైత్ ఎమ్మెల్యేగా ఎన్నిక.. ప్రతిపక్ష నేతగా ఎంపిక. -
ఎగ్జిట్‌పోల్స్: బీజేపీకి ఎదురుదెబ్బ
రాంచీ: దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీకి మరో రాష్ట్రంలో అధికారాన్ని పోగొట్టుకోబోతోందా?. జార్ఖండ్‌లో వరుసగా మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కమలనాథుల కలలు కల్లలు కానున్నాయా?. చిన్నరాష్ట్రం జార్ఖండ్‌లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తరహా రాజకీయ వాతావరణం ఏర్పడబోతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాన్నే వినిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఫలితాలు షాకిచ్చేలా కనిపిస్తున్నాయి. శుక్రవారం పోలింగ్ ముగిసిన అనంతరం పలు సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. జార్ఖండ్‌లో కాంగ్రెస్-జేఎంఎం కూటమి ప్రభుత్వాని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. బీజేపీ 22-32 స్థానాలకే పరిమితం అవుతుందని, కాంగ్రెస్-జేఎంఎం కూటమికి 38-50 సీట్లను సొంత చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని పలు సంస్థలు అంచనా వేశాయి. వీటికి భిన్నంగా హంగ్ వచ్చే అవకాశం కూడా ఉందంటూ పలు సంస్థలు స్పష్టం చేశాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 42 ఎమ్మెల్యే మద్దతు అవసరం కానుంది. ఎగ్జిట్‌పోల్స్ విడుదల సర్వే బీజేపీ నేతలను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రఘువర్ దాస్ విజయంపై ధీమా వ్యక్తంచేశారు. మరోసారి తామే అధికారాన్ని చేపడతామని స్పష్టం చేశారు. కాగా జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ముఖ్యనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు ముమ్మర ప్రచారం చేశారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం జోరుగా ప్రచారం నిర్వహించారు -
ప్రధాని మాటను దాసరి విన్లేదు
బీజేపీ అధికార ప్రతినిధి జవదేకర్ సోనియా చెప్పినట్లే ప్రధాని చేశారు బొగ్గు గనుల కేటాయింపు పక్కా క్విడ్‌ప్రోకో హైదరాబాద్: ‘దాసరి నారాయణరావు. శిబూ సోరెన్‌లు కేంద్ర మంత్రులుగా ఉండగా ప్రధాని మన్మోహన్సింగ్ మాట వినేవారు కాదు. అంతా టెన్ జన్‌పథ్ చెప్పినట్టు చేసేవారు. ఇంత ధైర్యం ఎలా వచ్చింది.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్ల కాదా? చరిత్రలో ఇలాంటి దారుణం గతంలో చూశామా. బొగ్గు బ్లాకుల కేటాయింపు వ్యవహారమంతా టెన్ జన్‌పథ్ సూచనల మేరకు జరగలేదా? ఆయా బ్లాకులు ఎవరికి కేటాయించాలో రాసి ఉన్న చిట్టీలు వచ్చేవి. వాటి ప్రకారమే కేటాయింపులు జరిగాయి. ఆ చిట్టీలు ఎక్కడి నుంచి వచ్చేవో సోనియా, ప్రధాని సమాధానం చెప్పాలి’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు. కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పరేఖ్ రాసిన పుస్తకంలో బొగ్గు కుంభకోణం, ప్రధాని వ్యవహార శైలి తదితరాల ప్రస్తావన నేపథ్యంలో ఆయన సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మన్మోహన్‌ను రబ్బర్ స్టాంపుగా తయారు చేసి సోనియా చక్రం తిప్పారని, ఈ క్రమంలోనే లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం చోటుచేసుకుందన్నారు. క్విడ్‌ప్రోకో ప్రకారం జరిగిన ఈ వ్యవహారంలో సీబీఐ డొల్లతనం ప్రదర్శించిందని విమర్శించారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులకు సంబంధించి పరేఖ్ నివేదికలను నాటి మంత్రి దాసరి నారాయణరావు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారం తెలిసి కూడా ప్రధాని మౌనంగా ఉండటానికి కారణం తెలియాల్సిన అవసరముందన్నారు. ఇంత జరిగినా సోనియా ఎందుకు నోరువిప్పటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రధాని మాజీ సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకం.. సోనియా, మన్మోహన్‌ల వ్యవహారాన్ని బయటపెట్టగా, పరేఖ్ పుస్తకం మరిన్ని వాస్తవాలను వెలుగులోకి తెచ్చిందన్నారు. కాంగ్రెస్ వద్ద సమాధానాలు లేకే బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ ఆర్థిక తోడ్పాటుతోనే ఈ పుస్తకాలు వెలువడ్డాయని బుకాయించి తన నైజాన్ని బయటపెట్టుకుందని జవదేకర్ విమర్శించారు. అభిమానం గల వ్యక్తిత్వం ఉండి ఉంటే మన్మోహన్ ఇప్పటికే రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు. టీడీపీతో సమన్వయం బాగుంది రాష్ట్రంలో మిత్రపక్షం టీడీపీతో తమకు మంచి సమన్వయం ఉందని జవదేకర్ తెలిపారు. ప్రచారంలో ఇరు పార్టీల నేతలు కలిసి సాగుతున్నారని చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణల్లో కలిపి 25 వరకు ఎంపీ సీట్లను కూటమి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఈసారి మూడు సీట్లకే పరిమితమవుతుందన్నారు. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్తో పొత్తు ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు. -
కోల్ స్కామ్ లో దాసరిపై పరేఖ్ సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: బొగ్గుశాఖలో సంస్కరణలు ప్రవేశపట్టాలనుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రులపై నియంత్రణ కోల్పోయారని ఆ శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బొగ్గుశాఖ మంత్రులుగా పనిచేసిన శిబు సోరేన్, దాసరి నారాయణ రావులతోపాటు ఇతర ఎంపీలపై నిప్పులు చెరిగారు. ఎంపీలందరూ బ్లాక్ మెయిలర్స్, డబ్బులు దండుకునే వారేనని పరేఖ్ అన్నారు. బొగ్గు కేటాయింపులను బహిరంగ వేలంలో పెట్టాలని తాను సూచిస్తే మంత్రులు సోరెన్, దాసరి లు వ్యతిరేకించారని పరేఖ్ తెలిపారు. 2004లో తాను చేసిన ప్రతిపాదన వ్యవహారంలో మంత్రులను కట్టడి చేయడంలో ప్రధాని విఫలమయ్యారన్నారు. డైరెక్టర్లు, సీఈఓల నియామాకంలో బహిరంగంగానే లంచం అడిగారని, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారని పరేఖ్ ఆరోపించారు. మంత్రులిద్దరూ అధికారులను, సీఈఓలను బ్లాక్ మెయిల్ చేశారని పరేఖ్ అన్నారు. ప్రధాని నిర్ణయానికి వ్యతిరేకంగా మంత్రులు ఇంటర్నెట్ లో వేలం వేశారని 'క్రుసేడర్ ఆర్ కాన్సిపిరేటర్? కోల్ గేట్ అండ్ అదర్ ట్రూత్ అనే పుస్తకంలో పరేఖ్ వెల్లడించారు. లోకసభ ఎన్నికలకు ముందు పరేఖ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ఇటీవల ప్రధాని మీడియా మాజీ సలహాదారు సంజయ్ బారు కూడా ప్రధానిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.