కోల్ స్కామ్ లో దాసరిపై పరేఖ్ సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: బొగ్గుశాఖలో సంస్కరణలు ప్రవేశపట్టాలనుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రులపై నియంత్రణ కోల్పోయారని ఆ శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బొగ్గుశాఖ మంత్రులుగా పనిచేసిన శిబు సోరేన్, దాసరి నారాయణ రావులతోపాటు ఇతర ఎంపీలపై నిప్పులు చెరిగారు. ఎంపీలందరూ బ్లాక్ మెయిలర్స్, డబ్బులు దండుకునే వారేనని పరేఖ్ అన్నారు.
బొగ్గు కేటాయింపులను బహిరంగ వేలంలో పెట్టాలని తాను సూచిస్తే మంత్రులు సోరెన్, దాసరి లు వ్యతిరేకించారని పరేఖ్ తెలిపారు. 2004లో తాను చేసిన ప్రతిపాదన వ్యవహారంలో మంత్రులను కట్టడి చేయడంలో ప్రధాని విఫలమయ్యారన్నారు. డైరెక్టర్లు, సీఈఓల నియామాకంలో బహిరంగంగానే లంచం అడిగారని, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారని పరేఖ్ ఆరోపించారు.
మంత్రులిద్దరూ అధికారులను, సీఈఓలను బ్లాక్ మెయిల్ చేశారని పరేఖ్ అన్నారు. ప్రధాని నిర్ణయానికి వ్యతిరేకంగా మంత్రులు ఇంటర్నెట్ లో వేలం వేశారని 'క్రుసేడర్ ఆర్ కాన్సిపిరేటర్? కోల్ గేట్ అండ్ అదర్ ట్రూత్ అనే పుస్తకంలో పరేఖ్ వెల్లడించారు. లోకసభ ఎన్నికలకు ముందు పరేఖ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ఇటీవల ప్రధాని మీడియా మాజీ సలహాదారు సంజయ్ బారు కూడా ప్రధానిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.