కోల్‌గేట్‌లో దాసరిపై అభియోగాలు
♦ మరో 14 మందిపైనా నమోదుకు సీబీఐ కోర్టు ఆదేశం
♦ ఈ అక్రమాలకు నవీన్ జిందాల్ సూత్రధారి అని వ్యాఖ్య
న్యూఢిల్లీ: బొగ్గు స్కాంలో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా సహా 15 మందిపై నేరాభియోగాలు నమోదు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జార్ఖండ్‌లోని అమర్‌కొండ ముర్గదంగల్ గని కేటాయింపులో అవకతవకల కేసులో శుక్రవారం విచారణ కొనసాగింది. కేటాయింపులో అక్రమాలు జరిగాయని, జిందాల్, గగన్ ఇన్‌ఫ్రా ఎనర్జీ సంస్థలకు మేలు చేసేలా మాజీ సీఎం కోడా వ్యవహరించారని కోర్టుకు సీబీఐ విన్నవించింది. ఇరు వర్గాలు కుమ్మక్కయ్యాయని ఆరోపించింది. బ్లాకు కేటాయింపు మెరిట్ ప్రకారమే జరిగిందని, సీబీఐ ఆరోపణలన్నీ వాస్తవ దూరమని దాసరి, జిందాల్, కోడా న్యాయవాదులు పేర్కొన్నారు.
వాదనలు విన్న జడ్జి భరత్ పరాశర్.. ప్రాథమిక ఆధారాలు, సాక్ష్యాల ఆధారంగా ఈ అవకతవకల వ్యవహారంలో నవీన్ జిందాల్ సూత్రధారి అని తేల్చారు. అప్పటి కేంద్ర మంత్రి దాసరికి రూ.2కోట్లు ఇచ్చినవిషయాన్ని కప్పి పుచ్చేందుకు జిందాల్ కంపెనీలను అడ్డుపెట్టుకున్నారన్నారు. ఈ వ్యవహారంలో అంతిమంగా ప్రయోజనం పొందే అవకాశమున్నదీ ఆయనకేనన్నారు. దాసరి, జిందాల్ సహా 15 మంది నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120బీ (నేరపూరిత కుట్ర), 409, 420లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(1సీ), 13(1డీ) సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ... 136 పేజీల ఉత్తర్వులు ఇచ్చారు.
అయితే ఈ కేసులో న్యూఢిల్లీ ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్ సురేశ్ సింఘాల్ అఫ్రూవర్‌గా మారుతూ.. తనకు క్షమాభిక్ష కోసం పిటిషన్ వేశారు. దీనిని ఇప్పటికే కోర్టు ఇప్పటికే వాంగ్మూలం కూడా నమోదు చేసింది. ఆ వాంగ్మూలాన్ని పరిశీలించి, పిటిషన్‌ను పరిష్కరించిన తర్వాత... ప్రధాన కేసులో విచారణ చేపడతామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మిగతా 14 మంది నిందితులతోపాటు సీబీఐకి నోటీసులు జారీ చేశారు. మే 11వ తేదీలోగా అభిప్రాయాలను వెల్లడించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. తమపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని జిందాల్ స్టీల్, విద్యుత్ లిమిటెడ్ తెలిపింది.