నా ప్రమేయం లేదు.. అంతా ప్రధానే: దాసరి
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపులో తన ప్రమేయమేదీ లేదని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు చెప్పారు. కేసు విచారణ నిమిత్తం సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను బొగ్గు గనుల శాఖ సహాయమంత్రిగా ఉన్నప్పటికీ క్షేత్రాల కేటాయింపులకు సంబంధించిన అన్ని నిర్ణయాలూ నాటి ప్రధాని మన్మోహన్ సింగే తీసుకునేవారని తెలిపారు. కోర్టులోనూ ఇదే విషయాన్ని చెప్పానన్నారు.
కేటాయింపులపై నిర్ణయం తీసుకొనే 'స్క్రీనింగ్ కమిటీ' ని ప్రభావితం చేసేందుకే బొగ్గుశాఖ సహాయమంత్రి హోదాలో దాసరి జిందాల్ గ్రూపు సంస్థలకు అనుకూలంగా లేఖ రాశారని సీబీఐ తన అభియోగ పత్రంలో పేర్కొంది. 120-బి (నేరపూరిత కుట్ర), 420 (చీటింగ్), అవినీతి నిరోధక చట్టంలోని ఇతర సెక్షన్ల కింద దాసరి సహా కేంద్ర బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్.సి.గుప్తా, జ్ఞాన స్వరూప్ గార్గ్, సురేష్ సింఘాల్, రాజీవ్ జైన్, గిరీష్‌కుమార్ సునేజా, ఆర్.కె.సరాఫ్, కె.రామక్రిష్ణ ప్రసాద్‌లపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే జిందాల్ సంస్థలతో పాటు దాసరికి చెందిన సౌభాగ్య మీడియాపై కూడా చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.