నాలుగు దశాబ్దాలకుపైగా సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. తన డ్యాన్స్, నటనతో కోట్లాదిమంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. తన సినీ జర్నీలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న మెగాస్టార్ తాజాగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 సినిమాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో రికార్డ్ బ్రేక్ చేశారు. దీంతో ఆయనకు ఈ రికార్డు దక్కింది. సెప్టెంబర్ 22న గిన్నిస్ బుక్ ప్రతినిధులు హైదరాబాద్‌కు చేరుకుని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేతులు మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. అయితే, చిరు కంటే ముందే మన టాలీవుడ్ లెజెండ్స్ కొందరు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వారు ఎవరో తెలుసుకుందాం.
దాసరి నారాయణరావు
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి దాసరి నారాయణరావు రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో అత్యధిక చిత్రాల దర్శకుడుగా ఆయనకు గుర్తింపు రావడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడంతో పాటు 53 సినిమాలను స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలకు కథ, మాటల రచయితగా, గీత రచయితగా పనిచేశారు. తెలుగు సినీ దిగ్గజంగా కీర్తిని పొందిన ఆయన 2017 మే 30న మరణించారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. ఆయన్ను ఎస్పీ బాలు అని ఎంతోమంది ప్రేమతో పిలుస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠ,మలయాళం భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు బాలు పాడారు. ఇలా ఎక్కువ సంఖ్యలో పాటలు పాడిన ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. బాలు నేపథ్య గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ , పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. 6 జాతీయ పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు. 2020 సెప్టెంబరు 25న బాలు మరణించగా.. 2021లో కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
దగ్గుబాటి రామానాయుడు
దగ్గుబాటి రామానాయుడు.. మూవీ మోఘల్‌గా ఆయన అందరికీ దగ్గరయ్యారు. ఒకే వ్యక్తి 100 చిత్రాలకు పైగా నిర్మాతగా తెరకెక్కించి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో రామానాయుడు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. పద్మ భూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. బెంగాలీలో ఆయన నిర్మించిన అసుఖ్ (1999) ఉత్తమ జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కించుకుంది. 2015 ఫిబ్రవరి 18న క్యాన్సర్ వ్యాధితో ఆయన మరణించారు.
విజయనిర్మల
తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా సినిమాల్లో నటించిన విజయనిర్మల దర్శకురాలుగా కూడా తన ప్రతిభను చాటారు. డైరెక్టర్‌గా 44 చిత్రాలను తెరకెక్కించి రికార్డ్ సెట్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నీస్ బుక్‌లో ఆమె చోటు సంపాదించారు. 11 ఏళ్ల ప్రాయంలోనే ‘పాండురంగ మహత్యం’ సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ఆమె.. 1971లో 'మీనా' చిత్రంతో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టారు. సూపర్ స్టార్ కృష్ణతో ఆమె సుమారు 50కి పైగా సినిమాల్లో నటించారు. 2019లో విజయనిర్మల మరణించారు.
పి. సుశీల
ఆరు దశాబ్దాల పైగా భారతీయ సినీ పరిశ్రమలో ప్రసిద్ధురాలైన గానకోకిల పి. సుశీల పేరు ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కింది. 12 భాషల్లో (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా, హిందీ, సంస్కృత, సింహళ, పడుగు, తుళు, బెంగాలీ, పంజాబీ) సినీ, ప్రైవేట్ పాటలన్నీ కలిపి దాదాపు 30 వేల పాటలు పాడినట్లు ఒక అంచనా.
అయితే, గిన్నీస్ బుక్ వారు మాత్రం 1960ల నుంచి 6కు పైగా భారతీయ భాషల్లో 17,695 సోలో, డ్యూయట్, కోరస్ సహకారమున్న పాటలను మాత్రమే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేర్చారు. ఈ ఘనత సాధించిన ఏకైక ఫిమేల్ సింగర్‌గా ఈ ‘గాన సరస్వతి’కి దక్కింది. దీంతో ఆమెకు గిన్నీస్ బుక్‌లో చోటు దక్కింది. భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ ఇచ్చి గౌరవించాయి.
బ్రహ్మానందం
కన్నెగంటి బ్రహ్మానందం.. ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఒకే భాషలో 754 చిత్రాలలో నటించినందుకుగాను ఆయన పేరు ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చేరింది. ఒకే భాషలో ఇన్ని సినిమాలు నటించిన నటులు ఇంతవరకు ఎవరూ లేరు. అయితే, వాస్తవంగా బ్రహ్మానందం ఇప్పటి వరకు 1250 సినిమాలకు పైగానే నటించారు.
భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌ను దక్కించుకున్నారు. రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఆహనా పెళ్ళంట సినిమా ద్వారా బ్రహ్మానందం సినీ రంగ ప్రవేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment