![Brahmaanandam Pre Release Event](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Brahma-Anandha.jpg.webp?itok=8QyTmimC)
నిఖిల్, నాగ్ అశ్విన్, రాజా గౌతమ్, చిరంజీవి, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, రాహుల్ యాదవ్
‘‘బ్రహ్మానందం(Brahmaanandam)లో స్పార్క్‌ని గమనించి నేను తనని మద్రాసు తీసుకువెళ్లాను. మా ఇద్దరి మధ్య మంచి బంధం, ప్రేమానురాగాలు, గురు–శిష్యుల అనుబంధం ఉన్నాయి. ఓ రోజు బ్రహ్మానందం ఇంటికి వెళితే ఎన్నో అవార్డులు ఉన్నాయి. తన చరిత్ర అంతా ఓ గదిలో కనిపించింది. అలాంటి బ్రహ్మానందం కొడుకు చేసిన రెండు మూడు సినిమాలు అంతంతగా అలరించినా సరే... మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని హీరో చిరంజీవి(Chiranjeevi)అన్నారు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధానపాత్రల్లో, ‘వెన్నెల’ కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలకపాత్రల్లో నటించిన సినిమా ‘బ్రహ్మా ఆనందం’.
ఉమేష్ కుమార్, సావిత్ర సమర్పణలో ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ‘బ్రహ్మా ఆనందం’(Brahmaanandam) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్(pre release event)కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలై, అత్యద్భుతంగా ఆడుతుంది. నీకు (బ్రహ్మానందం) పుత్రోత్సాహం కలుగుతుంది. నువ్వు చక్కగా గర్విస్తావు. నేను ఏ విధంగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానో, అలానే నువ్వూ అనుభవించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘అత్తిలిలో నేను లెక్చరర్‌గా చేస్తున్నప్పుడు భీమవరం వెళ్లి ‘ఖైదీ’ సినిమా చూశాను. చిరంజీవి ట్రెండ్ సెట్టర్. ఆయన చూడని చరిత్రా... చెప్పని చరిత్రా. చిరంజీవి కింగ్ ఆఫ్ వరల్డ్ సినిమా. ఈ వేడుకకు చిరంజీవిగారిని చీఫ్ గెస్ట్‌గా పిలవాలనుకుని కాస్త తటపటాయించాను. 9వ తారీఖు ఒక ఫంక్షన్. మళ్లీ 11న మరొక ఫంక్షన్ కదా అనుకున్నాను. ‘గౌతమ్ నీకు బిడ్డ. నాకూ బిడ్డలాంటి వాడే..’ అన్నారు. నన్ను తొలిసారి చెయ్యి పట్టుకుని విమానం ఎక్కించింది చిరంజీవిగారే. ఇప్పుడు నా బిడ్డ చేయిపట్టుకుని ఈ విమానం ఎక్కిస్తున్నారు.
మంచి సినిమాలు తీయాలనే అభిరుచి ఉన్న కుర్ర నిర్మాతల్లో రాహుల్ ఒకడు. ఇది తాత–మనవడు గురించి చెప్పే కథ. ఈ సినిమా చాలా బాగుంటుంది’’ అన్నారు. ‘‘హీరో అనే పదానికి నాకు మీనింగ్ చిరంజీవిగారే. బ్యూటిపుల్ ఎమోషనల్ మూవీ ఇది. ఫ్యామిలీతో కలిసి థియేటర్స్‌లో అందరూ హాయిగా చూడండి’’ అన్నారు రాజా గౌతమ్. ‘‘బ్రహ్మా ఆనందం’ సినిమా అంటే బ్రహ్మానందంగారే. ఆయనతో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. రాజా గౌతమ్‌గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’’ అన్నారు ఆర్‌వీఎస్ నిఖిల్. చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చినందుకు ఈ వేదికపై ఆయన్ను బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ సన్మానించారు.
అప్పుడు ఒత్తిడిగా ఉండేది
సినిమాల్లో ఉండగా నేను ఎంతో ఉత్సాహంగా ఉండేవాడిని. పొలిటికల్ సైడ్ వెళ్లినప్పుడు కాస్త ఒత్తిడిగా ఉండేది. అన్నవాడిని, అననివాడిని కూడా ఏదో అనాలని తిట్లు రాసుకోవాల్సి వచ్చేది. ఒత్తిడిగా ఫీలయ్యేవాడిని. ఎందుకు స్పందించడం లేదని మా ఆవిడ నన్ను అడిగింది. నాలో హాస్య గ్రంథులు ΄ోయాయేమో అనుకున్నాను. ‘ఖైదీ నెంబరు 150’ తర్వాత మళ్లీ నవ్వడం ప్రారంభించాను. ఇక ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటాను. చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద వాళ్లందరికీ దగ్గరవుతున్నాడు, వాళ్లందరూ దగ్గరకు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా అటు (రాజకీయాలు) వెళ్తాడా అని. కాదు... మరో రకంగా సేవలు అందివ్వడం కోసమే తప్ప పొలిటికల్‌గా వెళ్లడం అనేది లేదు. – చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment